పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఆగస్టు 2012, ఆదివారం

అఫ్సర్ || An Empty Episode-2 ||

రెండో సన్నివేశం: నిశ్శబ్దాలు ఎలా పుట్టుకొస్తాయో ఎప్పుడూ పరీక్షించి చూసుకోలేదు, నువ్వు నిశ్శబ్దం అని గుండెకి అడ్డంగా చూపుడు వేలు వూపే దాకా! మౌనాన్ని క్షణాల్తో ఎందుకు కొలవకూడదో ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తోంది, నువ్వు తెర వెనక నిస్సత్తువగా జారుకున్నాక. మౌనం సెలయేరు ఎందుకు కాదో కూడా కాస్త తెలుస్తోంది, దాని అశాంత నేత్రాల్లో నేను సమాధి అయ్యాక.

నీలోపల ఈదుతూ ఈదుతూ నేనెక్కడికి చేరానో ఇంకా చూసుకోలేదు గాని, నన్నూ నా వొంటిని నువ్వు వెయ్యి జలహస్తాల్తో చుట్టేశావని మాత్రం ఇప్పుడిప్పుడే ఇంకొంచెం తెలుస్తోంది.

1
అతి భారమయిన వొకే వొక్క వానచుక్కని మోస్తూ నీ ఆకుపచ్చ దేహం.
లోపలి దిగులు ఏదో మెరుస్తోంది దాని వొంటి మీద-నువ్వు చెప్పకపోయినా.

రాలిన ఆ క్షణాల అంచులలో
ఎన్ని మాటల ప్రవాహాల్ని నామీంచి పొంగించావో గుర్తే కానీ,
అవన్నీ కరిగిపోయాయ్ ఎటో
నాలో పరుచుకున్న ఎడారిలో -

ఈ మౌనం కాసేపే, తెలుసులే నాకు,

కానీ,
ఈ కాసేపటి మౌనాన్నే నేను మోయలేకపోయానే!?

2
ఏడుపునెవ్వరూ నయాగరాతో పోల్చలేదు, ఎందుకో?
కెరటకెరటాలుగా కేరింతలు కొట్టే దాని ముందు ప్రతిసారీ వోడిపోతాన్నేను.
అంతకంటే అమ్మ వొడి ఇంకేమీ లేదుగా!

ఈ క్షణాన కుండపోతగా కురవాలని వుంది
నువ్వు పంపిన కొన్ని మబ్బుల్ని నా తల చుట్టూ చుట్టుకొని-
వొక్క క్షణమైనా నిలిచి చూడు,
నీ చర్మం కిందనే నేనొక నెమ్మదించలేని తుపానుని.

కాసేపే అయినా నా హోరుని వినలేకపోయావే?

3
ఆ తరవాతనే కదా,
ఇద్దరి మధ్యా

4
ఈ నిశ్శబ్దం!


*12-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి