పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఆగస్టు 2012, ఆదివారం

కిరణ్ గాలి || యువరానర్ ||


మి లార్డ్

అర్దనగ్న న్యాయదేవత
ఆఖరి అఛ్ఛాదనాన్ని తీసేసి
పలుకుబడి పక్కలొ దూరి
పచ్చిగా కులుకుతుంది
పతనానికి పరాకాష్ట లేదని
పక్కాగా రుజువయ్యింది

నల్ల గౌను, తెల్ల కోటు
ఎర్ర టోపి, గంజి ఖద్దరు
తక్కెటలో తీర్పుకి వెలకడుతున్నాయి
కోర్టులు వ్యభిచార గుహాలయ్యాయి

పచ్చ నోటు కనబడితె
న్యాయమిప్పుడు
పల్లికిలిస్తుంది
పెదవి కొరికి
పైట సవరిస్తుంది

***********************

అబ్జక్షన్ మి లార్డ్

నేరం నిర్లజ్జగా చేసె నైతిక హక్కుని
వ్యవస్తే మనకిచ్చింది
ఏ ఘొరం చేసినా శిక్ష పడని
స్వేచ్చను రాజకీయం తెచ్చింది

నిజానికిప్పుడు
అవిభాజ్య భారతావనిలో
వ్యాజ్యం వాణిజ్యమయ్యింది

అన్నీ మూసుకొని
నీతి
బల్లమీద కోతైనప్పుడు
ధర్మస్థానాలలో
న్యాయం స్థనాలతో
రమించినా
తప్పు లేదు

శిక్ష వున్నా, సాక్షం వుండదు
సాక్షమున్నా శిక్ష లేదు

(అబ్జక్షన్ సస్టైండ్)

***********************

కవీ,

ఈ దేశ న్యాయ వ్య(అ)వస్తని
చూసి విస్మయించకు
వివస్త్రని చేసినా సరె విమర్శించకు
కోర్టు దిక్కారణా నేరం అమలులో వుందని
విస్మరించకు

ప్రొసీడ్ ఫర్దర్

***********************

మిస్టర్ జస్టిస్

నింద పడ్డ నిజం తలదించుకొని
బోనులో నిలబడింది
బరితెగించిన అబద్దం
బల్ల గుద్ది మరీ వాదిస్తుంది
అసత్యమే సత్యమై ప్రతిధ్వనిస్తుంది

కోర్టు కోర్టుకి
న్యాయం నిర్వచనం మారుతుంది
నీతికి మూలశంకమై ముక్కుతుంది
అవినీతికి విరొచనమై అసహ్యాం కారుతుంది

***********************

అబ్జక్షన్ మి లార్డ్

నిజనిర్ధారణకాని నిందితులు
నిరీక్షించే బాధితులెందరుంటెనేం
వంద దోషులు తప్పించుకునెలా
ఒక్క నిర్దొషినీ పట్టకోండని
మన రాజ్యాంగమె చెప్పింది

ఆర్ధికనేరాలకేగాని
ఆకలి తప్పుకు ఇమ్మ్యూనిటీ లేదని
స్వరాజ్యం తేల్చి చూపింది

చుట్టాలకెగా చట్టంలో సవరణలు
తదనుగునంగ వివరణలు
పదవి విరమణలు
ఎఫైయార్ రాసెలోగ
బైల్ మంజురయ్యె
ముందొస్తు బందొబస్తులు

(అబ్జక్షన్ సస్టైండ్)

***********************
కవీ,

వ్యర్ధ వాదాలతొ
విలువైన పాఠకుల కాలాన్ని
వృధా చెయ్యకు

ప్లీజ్ కం టు ద పాయింట్
క్విక్లి

***********************
యువరానర్

కన్న కూతురి శీలాన్ని కాపాడక పోగా
పడుపు వృత్తిలోకి దింపిన
ఈ దేశాన్ని ఉరితీయండి

ఉరంటె అలాంటిలాంటి ఉరికాదు

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై, ఉపిరితిత్తులు బద్దలయ్యెదాక
మెడ ఎముక విరిగి, మెదడు చిట్లె దాక
కనుగుడ్లు ఉబ్బి పగిలి, నాలుక బయట పడెదాక
కాళ్ళు గిలగిలా కొట్టుకొని కళేబరం అయ్యెదాక
ఉరితీయండి

దయచేసి
నిజాన్ని నిజంగా రక్షించండి

ప్లీజ్ యువరానర్
నా కన్నిళ్ళని చిలికి చిలికి
కవిత్వంగా
కాగితం మీదకు ఒలికించి
మరీ వేడుకుంటున్నాను

దేశాన్ని ఉరితీయండి
దాని శవంపై బట్టతొ
న్యాయం మానాన్ని కాపాడండి

***********************

ఆర్డర్ ఆర్డర్, వెర్డిక్ట్ మర్డర్
ధర్మాసనం శిర్షాసనం వేసింది

కేసు పుర్వాపరాలూ పరిశీలించిన పిమ్మట
SexSin 101, 420, 786 ల కింద

విక్టింస్ ఆర్ కన్విక్టెడ్, క్రిమినల్స్ అక్విటెడ్
లెట్ ట్రూత్ బి బూరిడ్ & జుస్టిస్ డేడ్

***********************

కవిగాడి మీద

సెడిషన్ చార్జెస్ ఫైల్ చెయ్యండి
ఎముకల్లొ సున్నంలేకుండ కొట్టండి
మళ్ళి న్యాయం ధర్మం అని అరవకుండా
వాడి కలంతోనె వాడి కంఠనరాలు తెంపండి

సత్యం వధ
ధర్మం చెర
సర్వే జనా సుఖినొభవంతు

కేస్ డిస్మిస్.


*12-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి