నిస్సత్తువగా దాక్కోకు
నిజాయితీగా ముందుకురా
నిర్మొహమాటం నీలోఉంటే
నింగికి ఎగసే అలవైరా
నిస్సహాయంగా నిలుచోకు
మబ్బును తరిమే ఉరుమైరా
నిబద్ధతంటూ నీలోఉంటే
నియంతలాగా నిలబడురా
చావు బ్రతుకులు రెండే రెండు
చస్తూ బ్రతుకడమెందుకురా
సవ్వాల్ చేసే సత్తా ఉంటే
విజేతలాగా ముందుకురా
సమరానికి తెరలను తీసేలోపే
సహనం కత్తులు దూసే లోపే
నీలో తెలివికి మెలుకువ తేరా
భారత జాతికి ఖ్యాతిని తేరా
కోపం నిద్దుర లేయకముందే
ద్వేషం హద్దులు దాటక ముందే
నిటలాక్షుడిలా తపస్సు చేసి
కరుణను చిలికే కవ్వం తేరా
తనకై తానుగా బ్రతికే జనాల
స్వార్ధ గుణాలను దహనం చెయ్ రా
మనలో మనమై మమతల వనమై
పెరిగే పచ్చని ఒరవడి తేరా
మేఘం ఎందుకు పరుగెడుతుందో
నింగికి కుడా తెలియదురా
నెలకి దాహం తీర్చడానికని
చివరకి చినుకే చెప్పెనురా
చూపుకు చుక్కలు రాలవని
రెప్పలు మూయడం ఎందుకు రా
అవి రేపటి ఆశల గుర్తులని
గుర్తు పెట్టుకుని అడుగెయ్ రా
ఎందుకు నిజమే నిలదీస్తుందో
నీలో నీతికి ఎరుకే రా
అందుకు బయపడి జడిసేవాడు
వానపాముకి సమానము రా
మతాలు లేని రాజ్యం మనదని
కులాలు లేని జనాలు మనమని
అనాధలంటూ ఎవరూ లేరని
నినాద ధ్వనిలా ధనించి రా రా
*12-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి