పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జులై 2012, ఆదివారం

మెర్సీ మార్గరెట్ ॥ఎవరికైనా మరణం కనిపిస్తే॥

ఎవరికైనా మరణం కనిపిస్తే 
కబురుపెడ్తారా 
ఊపిరి ఆవిరై కొండెక్కేలోపు బంధించి 
చెంప చెల్లు మనిపించాలని ఉంది 
ఒక్కొక్కరినిగా తన కాళ్ళతో
గద్దలా "నా " అనే బంధాలను తన్నుకు పోతూ
ఎక్కడ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుందో
అడిగి ,
దాని కళ్ళను పీక్కొని వెళ్లి "నా" వాళ్ళని
చూడాలని ఉంది

కడుపు కోతలోంచి పుట్టే కన్నీళ్ళ నదులు
గుండె బ్రద్దలయి ఉసురు తీస్తూ ఎగిసే లావా
వేడి శెగలు
ఎండిపోతున్న గొంతులు అవిసిపోయెంత
వినవస్తున్న ఆక్రందనలన్నీ
ఉప్పెనై ముంచి ఉతికేయాలని కసిగా చూస్తుంటే

శబ్దం నుంచి నిశబ్ధానికి అది ప్రయాణించే
జాడలు కనిపెట్టి ఉరితీయాలనుంది

తిరిగొస్తాయా ?
జ్ఞాపకాలుగా మిగిలిన జీవచ్చవాలు ఊపిరిపోసుకొని
చేతులు కలిపిన స్నేహాలు ,
పారాణి ఆరని పాదాలు
గోరుముద్ధలతో అమ్మ ముచ్చట్లు
నాన్నతో ఉప్పు బస్తాల ఆటలు
వర్షంతో నన్ను చుట్టుకు పోయే మట్టివాసనలు
నుదుటిపై వెచ్చగా నా వాళ్ళు పెట్టిన ఆత్మీయ ముద్దులు
కాలపు భూమిలో పాతిపెట్టిన ప్రతి జ్ఞాపకాన్ని
త్రవ్వుకుని ప్రాణం పోస్తూ వెళ్ళేదెలాగు

మరణపు గొంతు నులిమి ,ఊపిరి లాగి
నా జ్ఞాపకాల పాదాల క్రింద పాతేయాలనుంది

ఎవరికైనా మరణం కనిపిస్తే
కబురుపెడ్తారా ?
ఊపిరి ఆవిరై కొండెక్కేలోపు బంధించి
చెంప చెల్లు మనిపించాలని ఉంది 


*08-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి