పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జులై 2012, ఆదివారం

కె.కె -కవిత || పురోగమనం ||

మనిషి జీవితం అంటే 
సమస్యల సంపుటే అనుకుంటా!!!
ఎప్పుడూ ఏదో ఒక సమస్య
ఒకదానికి పరిష్కారం వెదికే లోగా
ఇంకొకటి.. రావణుడి తలకాయల్లా

ఊహించని మలుపులెన్నో
ప్రతీ మలుపులోని ప్రశ్నించుకుంటాను
నా జీవితం సూటిగా సాగదెందుకని???
ప్రశ్నించేవరకే... జవాబు ఏమిటో
వినే సమయం కూడా లేదు.

వాతావరణం బాగాలేదని ప్రయాణం మానూంటామా?
అది అనివార్యమైతే...
జారుడుమెట్లని ఎక్కడం మానుకుంటామా?
అది అవసరం అయితే...
అలా కాకపోతే అది పరాజయం అవుతుంది.

అప్పుడప్పుడు కొన్ని,కొన్ని సమస్యలు
రొద పెడతాయ్, సర్దుబాటు చేసుకోమని... తప్పదుగా
కానీ ప్రతీ సమస్యకి సర్దుబాటంటే అది
సర్దుబాటు కాదు, లొంగుబాటే అవుతుంది.
జాగృతి చెందాల్సినప్పుడు
జోలపాటలు వింటే
వచ్చేది మగతేకాని..ప్రగతి కాదు.

నీరు పరిగెత్తకపోతే ఊతమిచ్చే
రాతికి కూడా నాచుపడుతుంది.
అందుకే బతుకుబండి ఎప్పుడూ
ఏకదిశనే కలిగి ఉండాలి
అది పురోగమనమే అయివుండాలి.

* 08-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి