పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, అక్టోబర్ 2012, సోమవారం

కాసుల లింగారెడ్డి||వెన్నెలా! వెన్నెలా! ||

వెన్నెలా!
నా కనుకొలనుల కోనల్లో స్నానమాడుతున్న వెన్నెలా!

నా రక్తపంకిల పాదాలకు వెన్నెల మెట్లేసిన వెన్నెలా!
నా మాటనీ, పాటనీ నీలో పారించుకొని
నను నిర్వీర్యం చేసివెళ్ళిన నా వెన్నెలా!
వెన్నెలా!వెన్నెలా!
ఎక్కడున్నావమ్మా?

నా నిశీధసౌధంలోకి నీవుగా నడిచివచ్చి
వెలుగు సౌరభాల వెదజల్లిన వెన్నెలా!
నాకు ఆశల జీవం పోసి,జీవన గమనాల్ని నిర్దేశించి
రేపటి ప్రొద్దుకోసం నన్ను ఒడిచేర్చుకున్న వెన్నెలా!
ప్రభాత వాకిట నన్ను అర్ధాంతరంగా పారేసి వెళ్ళిన వెన్నెలా!
వెన్నెలా!వెన్నెలా!
దోషం నీదని నేనెట్లా దూషించనమ్మా?

ఎక్కడో ఓ స్థలాన్ని కౌగలించుకుంటున్నప్పుడో
ఏ పరిచయాన్నో పరోక్షంగా స్పర్శిస్తున్నప్పుడో
మరుపు మేఘాలు విడిపోతుంటాయి
వెన్నెలా!వెన్నెలా!
నువ్వు మబ్బుల మాటునుంచి గెండెల్లో గుచ్చుకుంటావు

నీ అడుగుల కింద చీకటి మబ్బులు నలుగుతున్న సవ్వడి వింటూనో
గోడచాటు చేసుకొని రాత్రి వెక్కిళ్లు పెడ్తున్న దృశ్యం చూస్తూనో
హృదయ కెరటాలు నిన్ను చేరుకోవాలని ఎగిసెగసి పడ్తుంటాయి
తీరానికేసి తలబాదుకొని జాలిగా రోదిస్తుంటాయి
వెన్నెలా!వెన్నెలా!
నువ్వు అమావాస్య తోబుట్టువని మరిచితి కదమ్మా!

కె.కె.//ఆనందం//


సృష్టిలో నిర్వచనాల్లేని పదాలున్నాయ్,
కొలమానం లేని ప్రమాణాలున్నాయ్,
అవధుల్లేని అనుభూతులున్నాయ్,

అందులోని ఆనందం ఒకటి.

ఎవడిపిచ్చి వాడికానందం,
అన్నాడొక మహా పిచ్చోడు.
కాని అది పరమ సత్యం.
నిజంగా ఎవడి ఆనందానికి వాడే కర్త.

మునిపంటితో గాటు చేస్తూ,
చనుబాలుని తాగుతుంటే,తల్లి పడే ఆనందం.
తప్పటడుగులేస్తూ తానొస్తుంటే,
వినిపించే చప్పెట్లమోతకి,బిడ్డపడే ఆనందం.
చెమటోడ్చి పెంచిన కొడుకు,
తోడొచ్చి కాసేటప్పుడు,రెక్కలొంగిన తండ్రి పడే ఆనందం.
మనసిచ్చిన లలనామణి,
మురిపిస్తూ చెంతచేరితే,ఆ ప్రియుడి ఆనందం.
పుట్టినరోజుకి,పట్టుచీరతో
అభినందిస్తే,భార్యపడే ఆనందం.

అలుపులేని శోధనతో,
అంతుచిక్కని రహస్యమేదో భేదించిన,శాస్త్రవేత్త ఆనందం.
ఏడాది కష్టం,ఏపుగా పెరిగి,
గాలికి తలలూపుతుంటే,రైతుపడే ఆనందం.
కలెక్టరైన కుర్రోడు,కాళ్ళకు దండంపెట్టి
మీ ఓనమాల భిక్షే అంటే,మాస్టారి ఆనందం.

ఎన్నో ఆనందాలు,ఎన్నెన్నో ఆనందాలు...
ఆనందానికి కొలమానం మరో ఆనందమే.

Date:14/10/2012

కెక్యూబ్ వర్మ ॥ నిర్జన వంతెన ॥

ఈ నిర్జన వంతెన అంచున
ఒక్కో దారప్పోగునూ పేనుతూ
అక్షరాల అల్లికలల్లుతూ

పదాల మధ్య బందపు కండెను జార్చుతూ
ఒలికి పోకుండా పట్టుకొనే ఒడుపు కోసం నిలబడి వున్నా....

ఏదీ అంటనితనమేదో యిలా ఒంటరిగా
మిగిల్చి పాదాలను రాతి తాళ్ళతో బంధించి
దేహాన్ని ఇలా వదిలేసి పోయింది....

మనసు మూగతనాన్ని నింపుకొని
గ్లాసు నిండుగా ఒంపినా గొంతుదిగని మత్తు....

యుద్ధానంతర నిశ్శబ్ధపు నీరవం
చుట్టూరా పొగల సుళ్ళుగా అల్లుకొని
అస్తమయ వెలుగులో కాసింత రంగునిచ్చి
కనులలోయలో ఒరిగిపోతు....

దూరంగా జరుగుతున్న మేఘాల రాపిడికి
అక్కడక్కడా మెరుస్తూ ఓ వాన చినుకు
కన్రెప్పపై జారిపడి వెచ్చగా గొంతులో దిగుతూ
గుండె మూలల ఖాళీని కాసింత కప్పే కఫనవుతూ....

దేనికదే ఒక అసంపూర్ణత్వం కలగలిసి
నలుపు తెలుపుల చిత్రంగా గోడనతుక్కొని
కలవని గీతల వలయంలా మారుతూ
వెక్కిరిస్తూ ఎదురుగా అలా నిలబడుతూ....

ఎక్కడో ఓ సన్నని నాదం విరిగిన వెదురు పొద మీంచి
గాలిని కోస్తూ శబ్ధావరణాన్ని సృష్టిస్తూన్న
వాతావరణంలో గాయాన్ని సలపరమెట్టిస్తూ.....
(18-10-2012)

నరేష్ కుమార్ //ఎక్కడని బందించ గలరు నిన్ను//

ఎందుకా వెర్రి ప్రేమ కామ్రేడ్
సాటి మనిషిమీద నీకు

స్వేచ్చ ని
బందించటం
మనకి కొత్త
కాదు కదా...!
ఐనా...
కాళ్ళూ చేతులు
కట్టేసుకొని
చేవ చచ్చిన
మాలాగా
ఇంట్లో కూర్చోక
మనిషి కోసం
గొంతుని నినాదంగా
మడిచి
గాళ్ళొకి విసిరావ్
వినిపించినంతమేరా
సామాన్యుడి
గుండెలో
ధైర్యమై నిలబడిందిప్పుడు

కుహనా ప్రజాస్వామ్యపు పునాదులు
యూరిక్ ఆసిడ్ తో నిండిపోయాయ్

కామ్రేడ్...!కామ్రేడ్...!
ఎక్కడని బందించ గలరు నిన్ను
ఇపుడెవడూ
పగిలిన వ్రణాలై
కన్నీటి రసి ని
స్రవిస్తూ
ఎవడి శిలువని వాడే మోసుకుంటూ
తిర్గటం లేదు....
అంకుల్ శాం గాడి .....కొడుకులంతా
విరగ బడి నవ్వే
నవ్వుల్నీ
ఉరితీసెందుకు
ఊపిరి
దారాలతో ఉరితాళ్ళు
పేనుతున్నారు

నిన్ను బంధించిన
చేతుల్ని
తెగ నరికేందుకు
ఒక్కొక్కడూ
ఒక్కో నినాదమై
పేలుతున్నాడు.......

పీచు శ్రీనివాస్ రెడ్డి || ప్రవాహం ||


మెదడు మొద్దు నిద్దుర పోతే 
మనసు మౌనంగా ఉంటే
మనిషి ప్రవహించడు

బురద గుంటగా మారతాడు
పరాన్న జీవులకు ఆశ్రయమిచ్చి తను ప్రశ్నార్థకం అవుతాడు

కదిలే ప్రవాహంలో కాలుష్యం బ్రతుకుతుందా
ఇసుక రాళ్ళు కొరికి చంపేస్తాయి
సర్వ సన్నిద్దుడై శ్రమిస్తే అపజయము౦టుందా

మెదడులో
ఆలోచనల విత్తనాలు చల్లి చూడు
మనసుకు
చీకటిని ప్రశ్నించే అక్షర గళాన్ని తొడిగి చూడు

నిశ్శబ్దపు బెదిరింపులకు
అబద్ధపు ఉరుములకు
నిజం భయపడదెప్పుడు
కపటపు రంగుల ముసుగును కడిగేస్తుంది
తన జడి వానలో

నువ్వు లేని నాడు
కనిపించగలిగితే
నువ్వు లేని నాడు
వినిపించగలిగితే
నువ్వొక ప్రవాహమే

పారే ప్రవాహం పచ్చదనానికి విత్తనాలు నాటుతుంది
జీవాన్ని సర్వ వ్యాప్తం చేస్తుంది

మనిషి ప్రవాహమౌతే
మౌనాన్ని చీల్చే పోరాటం అవుతాడు
చీకటిని కాల్చే వెల్గుల రాజవుతాడు










09-10-2012

కిరణ్ గాలి || భ్రష్టమేవ జయతే ||

1) లేదు లేదు!
ఆశయాలు అవినీతిగా ఫొర్జరి చెయ్యబడలేదు
అనుమతులకు అధికారికంగా సర్జరి చెయ్యబడలేదు

శిక్షలేనిచోట అసలు నేరమనే పదానికి ఆస్కారమే లేదు...

నిజం నిజం!

నిధులు నజరానాలుగ నేతల ఖజానాలకు తరలలేదు
నిస్సందేహంగా అవి వికలాంగులకే చేరాయి
అవిటి చట్టాన్ని "విచారించమని" ఆదేశించనవసరం లేదు

తప్పు తప్పు!
కోట్లుమింగే కొలువులో వున్నవాడు
లక్షలకు సొంగ కార్చాడంటే నమ్మరాదు

***

2)

అవును అవును!
నిటారుగ నిలబడ్డ నిజాయితి వెన్ను విరవడం
అంత సులభం కాదు.
నిజాన్ని చాటుగ మరొక చోటుకు బదిలి చేసెయ్యి


భలె భలే!

మామిడి రసం పీల్చి
టెంకె మిగిల్చే గారడి తెలిసిన వాడు
అరటిపండును ఘన-తంత్రంతో వలిచి
పండు తనకి తొక్క ప్రజలకి పంచుతున్నాడు

చూడు చూడు !
వేటకుక్కలు తోడెల్ల గుంపుకు తోడుగా ఊలవేస్తున్నాయి
లేళ్ళూ, కుందేళ్ళు తిరగబడకుందా కాపలా కాస్తున్నాయి

***

3)

తప్పు తప్పు!

ఆడవారిదే అంతా తప్పు
మగవాడికంట పడడమే అసలు తప్పు
గడప దాటితే ఇంకెముంది చెప్పు


భేష్ భేష్!

చెరచ బడ్డ అసహాయతపై నింద వేసి
నిజాన్ని నిర్భయంగా బలాత్కరిస్తున్నారు
బాల్య వివాహాలె పరిష్కారమంటు
బహిరంగంగానే ఉపన్యాసాలతో ఉపదేశిస్తున్నారు

***

విను వినూ! బాగా వినూ!

కలంతొ శాసనాలను రాయడమే కాదు
కత్తులతో నెత్తురుని చిందించగలమూ ఖబర్దార్ అంటున్నారు

లేదు లేదు! మనకిక దిగులు లేదు

దేశంలో ధర్మమేకాదు
న్యాయమూ నాలుగు పాదాలా నడుస్తున్నది.
దాని మెడకు కట్టిన గొలుసు వాళ్ళ చేతిలో
మరింతగా బిగుసుకుని ఒరుసుకుంటుంది...

సత్యం స్వఛ్ఛందంగానే ఉరి పోసుకుంటుంది

Date: 20-10-2012

ప్రవీణ కొల్లి ||స్థితి ||

ఆనందమూ కాదు, విషాదమూ కాదు
అదో స్థితి
మాటలన్నీ మూటకట్టుకుని పారిపోతే

ఎద మొత్తం మౌనంలో ఒదిగిపోతే
ఆ నిశ్శబ్దపు ఒడిలో ఏర్పడే స్థితి.....స్తబ్దత!
శూన్యత కాదు స్తబ్దత!

ఈ స్తబ్దతలో
శ్వాసే ప్రశ్నలను సంధిస్తుంది..
సమాధానాల అన్వేషణలో
మనసును తవ్వి
పొరలను చీల్చుతూ
హృదయాంతరాలకు చేరాక
అక్కడ
ఎన్నాళ్ళుగానో నిక్షిప్తమైన మణులు
వెలికి వచ్చి నిలదీస్తాయి !
ఆ మాణిక్యాలలో ఏమి వుండదు ....ఒక్క స్వచ్ఛత తప్ప!

ఒక్కోసారి
ఈ ఏకాంతపు నదిలో ఈదటం
ఈ ఒంటరితనపు వారధిలో నడవటం
అత్యవసరం...
18. Oct. 2012

కర్లపాలెం హనుమంత రావు॥అలోచనా శకలాలు॥


1
కోకిల పాట
ఎంత కమ్మన

కాకెంగిలి కదా!

2
ముసురు మేలిముసుగు నుంచీ
ఆకాశం మిసిమిసి నవ్వు
-మెరుపు

3
అడుక్కుంటూ గ్యాపులో
ఆడుకునే వీధిబాలలు
-ఆర్టాఫ్ లివింగ్

4
మెలికలు తిరగడంలేదే పాపం
ఆరొగ్యంగా ఉందా
పాము!

5
ఈ గొంగళి పురుగేనా
రేపటి రంగుల సీతాకోకచిలుక!
కాలం గొప్ప కాస్త్యూమ్ డిజైనర్

6
నరపురుగు లేదు
అడవికెంతానందమో!

7
మనసుతో నడివకే
బతుక్కు
అలసట

8
ఎంత ప్రశాంతంగా ఉందీ!
గుండె
శవాసనమేసినట్లుంది

9
స్నేహం
మనిషి
-మనిషివ్యసనం

10
పొగడ్త అగడ్త
దూకడం తేలిక
తేలేది లేదిక

11
ఎప్పుడు వెలిగించిందో
వెలుగులు విరజిమ్ముతోంది
-గీత

12
రెండో తరగతి రైలు బోగీ
చదివేవాడికి అదే
కదిలే తరగతి గది









20-10-2012

క్రాంతి శ్రీనివాసరావు ||నేటి నిజం ||

రాజకీయ రాకాసి బల్లులు
పుడమి తల్లి గర్భం చీల్చి
రక్త మాంసాలు తోడుకుంటుంటే


సమస్త సహజ వనరులూ
వట్టిపోయు
ఉడిగిపోతున్నాయు

యు
నా
అసలైన సహజవనరు
ఏ దేశానికయునా,
వారి పిల్లల మెదళ్ళేకదా
కా
నీ
కార్పోరేటు కాలేజీల
కాలుష్యం పీల్చలేక
చదువులమ్మ
పలాయన మయ్యుంది

ఎదురీది
చదువబ్బిన విద్యార్ధులంతా
జారుతున్న
రూపాయు విలువ చూసి
వలసపక్షులై ఎగిరిపోతున్నారు

వేల పని గంటలు
ద్వంసం చేసే నీరోలయ్యారు
మూడు గంటల
సినిమా హీరోలు

చిట్లిన పాళీ తో
రాస్తున్న రెండర్దాల
సినిమా పాటలు వింటూ

జీవన ఎడారుల్లో
సంచరిస్తున్న
జనాల బొమ్మలు
బారుల గోడలపై
సేదదీరిస్తూ

హీరోల్లా వుండాల్సిన యువకులు
వట్టి జీరోలుగా మిగిలిపోతున్నారు

కుహనా మేధావులు
ప్రపంచ గాలి దుమ్ముకు
అనుకూలంగా
తలుపులు బార్లా తెరవాలని
తీర్మానాలు చేస్తూనే వున్నారు

పొద్దున్నే సూరీడు మాత్రం
ఎప్పటిలానే
ఎర్రదారులెంటే
వస్తున్నాడు




14-10-2012

పీచు శ్రీనివాస్ రెడ్డి || నా కలం ||


నేను 
ఎన్ని అక్షరాల ఇటుకలను పేర్చాలో
ఎన్ని అక్షరాల సుమాలను అల్లాలో

ఎన్ని ఘటనల భావాన్ని పంచాలో
ఎన్ని టన్నుల భారాన్ని మోయాలో
ఓ కవితని రాయాలంటే

నన్ను తనలో నింపుకున్న ' నా కలానికి ' ఎంత ఆరాటమో
దానికెప్పుడు అక్షరాల ఆకలే
దానికెప్పుడు కవితా దాహమే
దాని ఆకలి , ఆకలి తీర్చడమే
దాని దాహం , దాహం తీర్చడమే

ఊహా లోకంలో విహరిస్తుంటే ఎదుటే వచ్చి వాలుతుంది
ఎన్నో బ్రతుకుల ఆరాటాలు
ఎలా శ్వాసిస్తున్నాయో చూడమంటోంది
ఎన్నో బ్రతుకుల పోరాటాలు
ఎలా గాయ పడ్డాయో రాయమంటోంది

అక్షరాలకు తను ప్రాణం పోస్తుందట
భావం నన్ను పంచమంది










16-10-2012

క్రాంతి శ్రీనివాసరావు ||జారిపోయున క్షణాలు ||

వికృత రూపాలయునా
సరే

వేల సంఖ్య లో
ఒకే దగ్గరున్నప్పుడు
కళ్ళకు అందాన్ని
ఆనందాన్నిఅద్దుతుంటాయు

సమూహ శక్తి కున్న
సమ్మోహనరూపం
చెరిపేసుకొని
వేరు పడ్డ
ఒంటరి పక్షుల్లా
వైరాగ్యం ముసుగేసుకొని
బతికేస్తున్నాం

కురుస్తున్న క్షణాల్లొ
తడవకుండా తప్పుకొని

ప్రవహించే నదిలో నీళ్ళలా
కాల ప్రవాహం లో
జరిగిపోయునవి
తిరిగిరావని తెలిసినా
మనసుకు కాళ్ళు తొడిగి
వెనక్కి పరుగెత్తిస్తూనే వుంటాం

ముందున్న కళ్ళను
వెనుకవైపు
అతికించుకోవాలిప్పుడు
అప్పుడన్నా
ముందుచూపులు
మొలుస్తాయేమొ

సతీష్ చందర్ ||నిద్దురే నిజం||

(అవును. నాకు నేనే దొరకను. నాలాగా వున్ననేనుతో నాకు పనివుండదు. ఉత్తినే వానలో తడవాలనీ,

ఇసుకలో ఆడాలనీ, దొంగచాటుగా చెట్టునుంచి పచ్చి మామిడికాయ కొట్టుకొచ్చి, పచ్చికారం, ఉప్పూ కలుపుకుని
తినాలనీ ఉంటుందా? సరిగా అప్పడే, మెక్ డొనాల్డ్స్ల్ లో దూరి బర్గర్ తిని, నేను కాని నేనుగా తిరిగి వస్తా. ఎవర్నయినా
గాఢంగా కౌగలించుకోవాలని, కేవలం కరచాలనంతో తిరిగి వచ్చినప్పడు, నా ముఖం నాకే నచ్చదు. మీకేం చూపను? )




ఊయల్లాంటి పడవా,

ఊపే నదీ,

పిట్టల జోలా-

చాలవూ ..

నిద్దుర వంకతో

నిజమైన మెలకువలోకి వెళ్ళటానికి!?

నేనెప్పుడో కానీ దొరకను.

నీక్కావలసింది నా వంటి నేను కదా!

అందుకే మరి..

నన్ను కలలోనికి వెళ్ళ నివ్వు.

నన్ను నన్నుగా రానివ్వు.

మనం అవసరాలతో కాకుండా,

ఆప్యాయతలతో మాట్లాడుకునేది

కేవలం స్వప్నంలోనే కదా!!

వాసుదేవ్ II కన్ఫెషన్స్-1 II

రాత్రిపై నుంచి నడిచొచ్చానా
గుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!
కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో

కదులుతూ
కథలుగా మారలేకపోయాయి

ఓ అక్షరంలో కూర్చుని మరొకదాంతో
చెప్పుకుంటూ ఉంటాను
ప్రతీపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరి...

దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలు
ఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..
సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!
తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లా
ఈ జ్ఞాపకాలు....

అర్ధంకాని బంధాలేవో
పేపర్ వెయిట్‌‌లా జీవితావేశాన్ని
అదిమిపెడుతుంటాయి
తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు
ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె

సమాధిలో శవానికి మిత్రుల్లేరన్న
'గాలి' ఊళల్లోని మాటలు కొన్ని చెవిదాటిపోవు
అవును
పిరమిడ్లలోని రాళ్ళేవీ
జీవితతంలోని డొల్లతనాన్నీ నింపలేవు
నా దృష్టినీ అడ్డుపెట్టలేవు
అయినా ఏం చూస్తున్నానని?

రాత్రికట్టుకున్న నల్లచీరలాంటి చీకటీ
సంద్రాన్నంతా కప్పేసుకున్న అలలనురగల్లోని తెలుపూ
రంగులన్నింటినీ తమలోకి లాగేసుకుంటే
ఇక నాకేం మిగిలిందని....?
కన్నీటి రంగుతప్ప!

అరువుతెచ్చుకున్న మేధోతనమేదీ నిలబడదు
చిన్న ఒంటికి పెద్ద అంగీలా
అసహజంగా, అసమానంగా....

అటో ఇటో ఎటో
ఎటూకానీ అవస్థాంతరం
ఈ నడివయసు!
విస్తరించుకుంటున్న శూన్యత
ఆఖరికి ఈ పాపనివేదన గదిలోనూ...

20, అక్టోబర్ 2012, శనివారం

బూర్ల వెంకటేశ్వర్లు//నాకొక మనిషి కావాలి//

నల్ల ఆకాశాన్ని చూసి
నల్ల రేగడిని వలచి
మనుషుల నోటి బువ్వ కోసమే కదా

నేను కారు నలుపయ్యింది

సాటి మనుషులనే కదా!
అడవి జంతువుల్లాంటి మీకు
జుట్లు కత్తిరించి, గడ్డాలు గీసి,
బట్టలునేసి, బట్టలుతికింది.

నోరెత్తని చెప్పునైనా
లబలబలాడే డప్పునైనా
నేపడ్డ తపనంతా
తోటి మనిషి కోసమే కదా!
నేనెప్పుడేపనిచేసినా
రక్తమాంసాలున్న సాటి మనిషి కోసమే కదా!

నన్ను చూసి బీళ్ళు భయపడ్డాయి
నా కండలకెదురై రాళ్ళుపగిలాయి
నన్ను చూసి మోళ్ళు నవ్వాయి
నా కాళ్ళకింద ముళ్ళు తలదాచుకున్నాయి

ఆదిమ యంత్ర నాగరికతకన్నా ముందట్నుంచి
నేను చూపిన పనితనం కదా
మిమ్మల్నిట్లా సౌధాల్లో నిలిపింది

మీ కుర్చీల్లో కులాసాల్లో
విల్లాల్లో విలాసాల్లో
నా జాతి శ్రమ చెమట నీరైతే కదా
మీరిట్లా ఉయ్యాలలూగుతున్నారు
నేను కర్రపెత్తనమిస్తే కదా!
మీరు నేడిట్లా రారాజులై ఊరేగుతున్నారు

నా పాదపూలు ముద్రించబడని నేల
నా వేలిముద్రలు లిఖించబడని వస్తువు
నా చెమట తడి అద్దని భోగం
మీలో ఈ నేలమీద ఒక్కటుందా!

ఎందుకురా మరి!
కులం గీతగీస్తారు, కులం కూత కూస్తారు.
అందుకే అంటున్నా!
నాకొక కులమంటని మనిషి కావాలి.
నాకొక మనిషి కావాలి
అచ్చమైన మనిషి
కులం పేరెత్తని స్వఛ్ఛమైన మనిషి కావాలి.
*19-10-2012

16, అక్టోబర్ 2012, మంగళవారం

నందకిషోర్ । చక్రవ్యూహం


1

ప్రతీ అనుభవం నేర్పేదే.
ఎంతో కొంత.
కొంచెం జ్ఞానం.
అంతే అజ్ఞానం.

ప్రతీ మనిషిదీ స్వార్ధమే.
ఎంతో కొంత.
కొంచెం నీకోసం.
మిగతా తనకోసం.

2

అవకాశం ఉన్నన్ని రోజులు
నియమాలమీద సావాసం.

తీరికలేక,ఓపికలేక ఒకరోజు-
అన్నీ మలిపి ఆనందిస్తాం.
ఒకే జీవితమని గుర్తించేస్తాం.

ఒక్కరోజన్న గడుస్తుందో లేదో-
ముందే చేస్తే బాగుండని ఎవడో
భుజాలుపట్టి ఊపేస్తాడు.
తలలోకి దూరి గోలచేస్తాడు.

ఇంకేం!
ఓ కొత్త పత్రం తయారవుతుంది.
నువ్వెప్పుడు ఆనందించవు.

3

అభిమానం దొరికినన్ని రోజులు
మనసుల మీద వీరంగం.

పొడిబారి,పొగరు తగ్గి ఒకరోజు
ఎవరూ లేరని ఏడ్చేస్తుంటాం.
బతుకిదికాదని తేల్చేస్తుంటాం.

కన్నీటి చుక్కైనా రాల్తుందో లేదో-
హత్తుకొని తిరుగుదాం రమ్మంటు ఎవరో
తెగిపడిన చేత్తో పిలుస్తుంటారు.
పగిలిన గుండెతో పాటకడతారు.

ఇంకేం!
ఓ కొత్త భయం పరుగుతీస్తుంది.
నువ్వెప్పుడు కలిసిపోలేవు.

4

సంజాయిషీ ఇవ్వాల్సిన నిమిషాలు
ఎప్పటిలాగానే మిగిలేఉంటాయ్.
వినాల్సిన మనుషులుండరు.

ఎక్కడున్నారో తెలిసీ-
నడిచే ధైర్యం నీకూ ఉండదు.

సందేహాలు తీర్చాల్సిన మనుషులు
ఎప్పటిలాగానే మిగిలేఉంటారు.
చెప్పాల్సిన నిమిషం మిగలదు.

ఎక్కడికిపోయిందో తెలిసీ-
వెతికే కోరిక నీకూ ఉండదు.

5

ఒప్పుకుంటానంటే నిజం చెప్తా!

రోజోసారి రోజుల్ని లెక్కేస్తామేగాని
నీకు,నాకు,మనలాంటి అందరికీ-
సుఖానికి,సంతోషానికి తేడా తెలీదు.
అవసరానికి,ఆశకి గిరిగీయడం తెలీదు.

ఋతువుకోతీరుగా దుప్పట్లు మారుస్తాంగాని
నీలో,నాలో,మనలాంటి అందరిలో-
ఊహల కొత్తదనం- ప్రయత్నాలకు అంటదు.
నవ్వుల తడితనం-గుండెలకు తాకదు.

15-10-12

వంశీ | క్షుద్రం


రమించు.. రమించు,
శవాల్నీ, గాయాల్నీ, అశుభాల్ని, అస్ఖలితాల్నీ,
పగలుచూడని రాత్రులతో, పదాలు చెప్పలేని విన్యాసాలతో..
ఇంకా.. ఇంకా..
రక్తమంతా చెమటలు కక్కేవరకూ
రిక్తమంతా గావుకేకలు పెట్టేవరకు,
ఎవరది..చంపెయ్.. చంపెయ్ వాడిని,
నీతిభోదలుచేస్తూ నిన్నాపుతున్నాడెవడో,
మనస్సాక్షా...
ముక్కలు ముక్కలుగా నరికెయ్, వీలైతే తినెయ్,
ఏ మీమాంసలెందుకు
నీ మాంసపు రుచి అలవాటేగా..

శరీరం బుధ్దినోడించి
రోజురోజుకూ అతిక్షూద్రుడివైపోయి
నీకు నువ్వే శత్రువై
దారితెలీని లోయల్లో గమిస్తూ
నోరుతిరగని మంత్రాలేవో జపిస్తూ
సున్నితత్వాన్నీ మనిషిమూలాల్నీ సమాధిన తోసి..

పువ్వులన్నీ ఫలాలవకమునుపే చిదిమేసి కార్చిన తేనెలో
విషాలోచనలని ముంచుకు తిని కాలకూటభాష్పాల్ని త్రేన్చు,
రజస్వలించలేక ద్రవించిన స్రావాల తావితో
నాసికను తాటించి వికృతాకారిడివై భ్రమించు..

తొందరగా.. తొందరగా...
ఔషధాల్లేని జాడ్యాన్ని వెంటేసుకుని ధర్మాల్ని వినిర్మించు,
ఉపాసించని దైవత్వాన్ని పురాణాల్లోకి విసిరి
నిర్వేదాలకు భాష్యం రాయి,

నీదైన రసాతలానికి
నీదవని భూతలాన్ని ప్రక్షేపించి ఆఙ్నాపించు..
నువ్వే రాజువి

రమించు.. రమించు..
భూతగణాలతో, దైత్య కణాలతో,
నీలాంటి మరో అష్టావక్రుడు భవించేట్టు
అంధయుగపు రేతస్సు జ్వాజ్వలించేట్టు...

13.10.12

3, అక్టోబర్ 2012, బుధవారం

Naresh Mandagondi POEM / TRANSLATIONS


మేధో మూర్తి
_________

విశాల ద్రవిడ భాషాశాస్త్ర ప్రపంచానికి
మకుటం లేని మహారాజు,
పండితుల మహా పండితుడు!
గోవర్ధన గిరినెత్తిన శ్రీకృష్ణుడివై
మహోన్నత జ్న్యానపర్వతాన్ని అలవోగ్గా ఎత్తినవాడా,
భద్రిరాజు కృష్ణమూర్తీ!!

అంతేలేని సువిశాల మహా వ్యాకరణం నీ దోసిటిలో ఒక చుక్క!
ఈ అనంత జ్న్యాన సాగరాన్ని ఒక్క గుక్కలో ఖాళీ చేసినవాడా!
శోధనా తపస్వీ!
అన్వేషణే జీవన రుధిరంగా దేహాన్ని నడిపించినవాడా!
తెలుగు, ద్రావిడ భాషా విగ్న్యానాలు
నీ దీవెనతోనే కదా పునీతమయ్యాయి!

తెలుగు శబ్ద మూలధాతు శోధనం,
వృత్తిగత మాండలిక పదకోశ సంకలనం
నీ కీర్తి పర్వతాలపై మెరిసే రెండు మహా శిఖరాలు...
విగ్న్యాన కేంద్రాలూ, విశ్వవిద్యాలయాలూ
కేవలం నీ స్పర్శతో, బోధనతో
ఎంత గౌరవాన్ని పొందాయి!!
నీలాంటి మేధో మూర్తులు సదా ఖ్యాతిలో సజీవులు
అసమానం నీ ప్రదానం!
లోలోతుల్లో వేళ్ళూనుకుంది కదా నీ ప్రభావం!!
కాలపురుషుడొక విధివంచిత చోరుడు
వేరు దారి లేక నిను మన లోకం లోంచి అపహరిచుకెళ్ళినా
అమరుడవు నీవు!
అమూల్యమైన కాలపు ఖజానాలో
నువ్వు జీవించేవుంటావు అనంతంగా ....

(ప్రఖ్యాత ద్రావిడ భాషావేత్త ప్రొ.భద్రిరాజు కృష్ణమూర్తి గారి దివ్యస్మృతికి...)

ఆంగ్ల మూలం : శ్రీ నరేష్ మందగొండి
రచనా కాలం : ఆగస్ట్‌, 2012

తెలుగు సేత : కరిముల్లా ఘంటసాల
అనువాదకాలం : 01.10.2012

(For those interested here follows the original Text...
----------------------------------------------------------------------------------------------------------
Naresh Mandagondi :
August 12.
The scholarship embodied:
-----------------------------------
A king and scholar's scholar in Dravidian lingistics
Like the Krishna's lifting of mountain Govardhan
You did lift the lofty knowledge mountain with ease
We bow to your feet, Bhadriraju Krishnamurthy sir!

The vast and endless classical grammar was the drink
In just one cupped hand, you emptied the ocean large
Research was your tapasya, research is your life blood
...You blessed Telugu and the great Dravidian linguistics.

Telugu verbal bases, Bank of Dialects of professions
The twin peaks in your bigger mountainous fame
Universities and seats of learning are honoured
Your gracious presence and lectures are the worth.

Learned men of your status live in the body of name
The contributions unrivalled, the impact deeprooted
Time the dutiful thief, has stolen you from our world
But you live eternally in the precious volts of Time!!

(A homage to Prof. Bhadriraju Krishna Murthy sir-
the eminent Dravidian Linguist)
— with Naresh Mandagondi.

29, సెప్టెంబర్ 2012, శనివారం

యాకూబ్ ॥ లోలోపలి గాధ


ప్రేమకోసమే ప్రేమిస్తున్నానా నిన్ను?
కాదు,
నా సహజస్వభావమే ప్రేమ !
గడ్డిపువ్వు శిరస్సుమీద
తళతళలాడుతున్న మంచుబిందువుల్లా
సందేహాలమధ్య, జీవనభయాలమధ్య ప్రేమికుడిలా ప్రకాశిస్తుంటాను.
ప్రేమ - పూలు వికసించినట్లు
నాలో వికసిస్తుంది.

1
ఎవరో మనసులో ఉన్నారు.గుబగుబలాడే గుండె, అలిసిన వదనం, నిరంతర ఖేదం.!

2
రేవులో బిందె ముంచాను
నీళ్ళకు ప్రేమభాష తెలుసని అపుడే తెలిసింది.
ఆత్మనంతా కూడదీసుకుని అది పలికే బుడబుడలభాష
గులకరాళ్ళపై కదిలి
ఆకుపచ్హ తుంగలతో సంభాషించే
సజలగాత్ర ప్రణయ సంగీతభరిత భాష !

3
బాధను ప్రేమించాను
విషాదంలోని ఆనందాన్ని ప్రేమించాను
ప్రేమలోపలి దుఃఖాన్ని,సంతోషాన్నీ ప్రేమించాను

నన్ను నేను దాచుకునేందుకు
ఇంత పెద్దవెలుగులో కొద్దిపాటి చీకటికోసం
వెతుక్కుంటున్నాను

ప్రేమకోసమే ఇలా ఒంటరినయ్యాను

4
జీవితపు ఆవలితీరాన్ని చూడ్డంకోసమే
నిజానికి
నేను ప్రేమపైన అధారపడ్డాను.!!

---------------------------
*Old text,'సరిహద్దు రేఖ'
28-9-2012

http://www.facebook.com/groups/kavisangamam/permalink/450461978339893/

కిరణ్ గాలి || ఒక్కొసారి ||


1. ఒక్కొసారి

సమూహాలకి సాధ్యమైనంత దూరంగా
ఒంటరితనం నడిమధ్యలోకి నడవాలి
నిన్ను నువ్వుగా కలవాలి, పలకరించాలి, పరామర్శించాలి

ఎమో అలా చేస్తె
సమూహాలలొ లేని స్నేహం, స్వాంతన, కోలాహలం
నీకు నీలోనే దొరుకుతుందేమొ

2. ఒక్కొసారి

శబ్ధాలను బహిష్కరించి నిశ్శభ్దాన్ని ఆహ్వానించాలి
కాలం అడుగుల చప్పుడు వినపడని ఖామొషి తేవాలి

ఎమో అలా చేస్తె
నిశ్శభ్దం మౌనం వీడి నీతో మట్లాడవచ్చు,
నువ్వు ఇదివరకెరుగని నిజాలను చెప్పవచ్చు
నువ్వు నిజమనుకున్న అబద్దాలను చెరపవచ్చు


3.ఒక్కొసారి

అలొచనలన్నిటిని ఆర్పేసి శున్యాన్ని వెలిగించి ధ్యానించాలి
స్తబ్ధతలోని చైతన్యాన్ని, చైతన్యంలోని నిశ్చలతను అన్వేషించాలి

ఎమో అలా చేస్తె
ఆ ధ్యానంలోనే సర్వసత్యాలు సాత్కక్షరించవచ్చు
సమస్త సంశయాలు ధ్వంసం కావచ్చు

***


1. ఒక్కొసారి

స్నేహితులని కాకుండా శత్రువనుకున్న వాడినీ సంప్రదించాలి
అహాలు అపోహలు అడ్డురాకుండా అడగవలసినవి అడగాలి

ఎమో అలా చేస్తె
స్నేహితుడిలా సలహాలతో సరిపెట్టకుండా సహాయం కుడా చేస్తాడెమో


2. ఒక్కొసారి

మనిషితో కాకుండా మనసుతో పరిచయించాలి
తనువుతో కాకుండా ఆత్మతో సహచరించాలి

ఎమో అలా చేస్తె
పరిణయంగానె మిగిలిన ప్రహసనం,
రసవత్తర ప్రణయంగా తర్జుమా కావచ్చు


3. ఒక్కొసారి

కూడ బెడుతున్న సంపాదన కాకుండా
దాచి పెడుతున్న కాలాన్ని కుడా ఆత్మీయులకు ఖర్చు పెట్టాలి

ఎమో అలా చేస్తె
కొని తెచ్చిన వస్తువులు ముడివెయ్యలేని అనుభందాన్ని
కలిసి గడిపిన క్షణాలు కడవరకు తోడు తేవచ్చు


***

1. ఒక్కొసారి

పొందవలసిన సుఖాల జాబితా పక్కన పెట్టి
పోగొట్టుకున్న సంతోషాల చిట్టా విప్పి చూసుకోవాలి

ఎమో అలా చేస్తె

లేని వాటిలో వున్న సౌఖ్యం కన్న
వున్నవాటిలో లేని ఆనందంమేముందని తెలుస్తుంది


2. ఒక్కొసారి

పరిగెత్తటం మానెసి
ఆయాస పడుతున్న కాలాన్ని కుదురుగ కూర్చొని చూడాలి
రాలి పడిన క్షణాలని, నిమిషాలని, రోజులని దులుపుకోని జేబులో దాచుకొవాలి

ఎమో అలా చేస్తె
గమ్యంలో వుందనుకున్న గెలుపు గమనంలో దొరకచ్చు


3. ఒక్కోసారి
ప్రశ్నలడగడం, జవాబులు వెతకటం మానెయ్యాలి
పరీక్ష అనుకొని జీవితాన్ని చదవడం ఆపెయ్యాలి

ఎమో అలా చేస్తె
ఫలితం గురించిన బెంగ లేకుండ
స్వేచ్చగా జీవించవచ్చు సంత్రుప్తిగా మరణించనువచ్చు

Date: 29-09-2012

http://www.facebook.com/groups/kavisangamam/permalink/450458578340233

నరేష్ కుమార్ ‎//డబల్ రొట్టె//


రాత్రి ఆకాశంలో
కాసిన చంద్రున్ని
పొద్దున్నే
చేతిలో పట్టుకున్నట్టుండేది
...
డబల్ రొట్టె తింటుంటే

చీ...మా బాపు
నీన్న ఒక్కటే తాగిండ్రా..
గందుకే
ఒక్కటే కొనుక్కుంటా...!
చేతిలో
పవ్వ కీసలు
వట్టుకొనచ్చిన రాజిగాని బాద,
తాతా
మా అవ్వ
పైసల్ రేపిత్తనన్నది
ఒకటియ్యవా..
సత్తిగాని అభ్యర్తన

అమృతాన్ని పంచె
మోహిని
మగవెషమేస్కున్నట్టు
కనవడేటోడు మా డబల్ రొట్టెల హుసేన్ తాత,

సార దాగని మా బాపు
అవసరాల బరువునీ
మా మీద ప్రేమనీ
బడ్జెట్ తరాజు ల జోకి
రూపాయ్ బండి
చేతుళ్ళో
డబల్ రొట్టె గా
తర్జుమా అవగానే
సంబురం
నాతో సావాసానికి
ఉరికచ్చేటిది

గిలాసల పాలు
రొట్టెకి తాగించినాక
మా చిన్నక్కకు కనబడకుండా
నోటి సరిహద్దులు
దాటించేటోన్ని ....

పట్నంలడుగు వెట్టినంక
డబల్ రొట్టె ముచ్చటే
మర్శిపోయినం.
మొన్న
ఊరికి వోతె తెల్సింది
మా పొద్దటాకలికి
ఆనందాన్ని మోస్కచ్చిన
హెరో సైకిలి
ఉరికిన పదారేంద్ల కాలపు
మారథాన్ ల
ఓడిపొయిందాట
గాడెవడో అంగ్రేజొని
పిజ్జా బండి
తాత సైకిలికి
టక్కరిచ్చిందాట

గిప్పుడు
మా హుసేన్ తాత
బెల్టు షాపు కాడ
కీసలేరుకుంటుండు
ఐనా ఆడేం నిరుపేద కాదులే
రొజుకి థీస్ రుపాయ్
ఖర్చు వెడ్తాండు.