పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, అక్టోబర్ 2012, సోమవారం

కిరణ్ గాలి || భ్రష్టమేవ జయతే ||

1) లేదు లేదు!
ఆశయాలు అవినీతిగా ఫొర్జరి చెయ్యబడలేదు
అనుమతులకు అధికారికంగా సర్జరి చెయ్యబడలేదు

శిక్షలేనిచోట అసలు నేరమనే పదానికి ఆస్కారమే లేదు...

నిజం నిజం!

నిధులు నజరానాలుగ నేతల ఖజానాలకు తరలలేదు
నిస్సందేహంగా అవి వికలాంగులకే చేరాయి
అవిటి చట్టాన్ని "విచారించమని" ఆదేశించనవసరం లేదు

తప్పు తప్పు!
కోట్లుమింగే కొలువులో వున్నవాడు
లక్షలకు సొంగ కార్చాడంటే నమ్మరాదు

***

2)

అవును అవును!
నిటారుగ నిలబడ్డ నిజాయితి వెన్ను విరవడం
అంత సులభం కాదు.
నిజాన్ని చాటుగ మరొక చోటుకు బదిలి చేసెయ్యి


భలె భలే!

మామిడి రసం పీల్చి
టెంకె మిగిల్చే గారడి తెలిసిన వాడు
అరటిపండును ఘన-తంత్రంతో వలిచి
పండు తనకి తొక్క ప్రజలకి పంచుతున్నాడు

చూడు చూడు !
వేటకుక్కలు తోడెల్ల గుంపుకు తోడుగా ఊలవేస్తున్నాయి
లేళ్ళూ, కుందేళ్ళు తిరగబడకుందా కాపలా కాస్తున్నాయి

***

3)

తప్పు తప్పు!

ఆడవారిదే అంతా తప్పు
మగవాడికంట పడడమే అసలు తప్పు
గడప దాటితే ఇంకెముంది చెప్పు


భేష్ భేష్!

చెరచ బడ్డ అసహాయతపై నింద వేసి
నిజాన్ని నిర్భయంగా బలాత్కరిస్తున్నారు
బాల్య వివాహాలె పరిష్కారమంటు
బహిరంగంగానే ఉపన్యాసాలతో ఉపదేశిస్తున్నారు

***

విను వినూ! బాగా వినూ!

కలంతొ శాసనాలను రాయడమే కాదు
కత్తులతో నెత్తురుని చిందించగలమూ ఖబర్దార్ అంటున్నారు

లేదు లేదు! మనకిక దిగులు లేదు

దేశంలో ధర్మమేకాదు
న్యాయమూ నాలుగు పాదాలా నడుస్తున్నది.
దాని మెడకు కట్టిన గొలుసు వాళ్ళ చేతిలో
మరింతగా బిగుసుకుని ఒరుసుకుంటుంది...

సత్యం స్వఛ్ఛందంగానే ఉరి పోసుకుంటుంది

Date: 20-10-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి