పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఆగస్టు 2012, బుధవారం

నంద కిశోర్ || గమనం ||

కాలేగచ్చుపై కుంకుడు గింజలు గీకి
నాకు తెలీకుండా నువ్వు, చురుగ్గా అంటించినపుడూ-


పరికిపొదల్లో గుచ్చిన ముళ్ళని
నొప్పి తెలీకుండా నేను, సుతారంగ తీసినపుడూ-

ఎరుకే తెలీనంతగా ఎగురుకుంటుపోయి
పంటకాల్వలపై మనం పరుగెత్తినపుడు..

ఎర్రటిమధ్యాహ్నం మనం భూతద్దపుచేతుల్తో
రెండు పచ్చి అగ్గిపుల్లల్ని వెలిగింపజూసినపుడు..

కళ్ళకి తెలీని కాంతి భాషతో,
కాళ్ళకి తెలీని స్పర్శ భాషతో,
ఇద్దరం నిశ్శబ్ధంగా మాట్లాడుకున్నప్పుడు,
మాట్లాడ్తూ మరిచిపోయినప్పుడు,
మాట్లాడి మాట్లాడి కరిగిపోయినప్పుడు..

ఓహ్!
ఒక పసికాలం పరిసమాప్తమయ్యేలోపు
ఒక ఎండ మనల్ని పరిపూర్ణుల్ని చేసింది.

***
తెల్లటి మేఘాల పరిమితుల్ని దాటి
నీ హృదయాలు నాపై వర్షించినపుడూ-

కాగితప్పడవలో కదలకుండా కూర్చొని
ప్రవాహల్నిదాట నే ప్రయత్నించినపుడూ-

ముసురుపట్టిన రాత్రి, ముద్దులనిద్రలో
మురిసిపోతు నిన్ను కలగన్నపుడు..

కలగంటు,కవ్వించుకుంటు కౌగిళ్ళవాగులో
కనపడకుండానే మునిగిపోయినపుడు..

చేతులకి చెందని సంజ్ఞలసవ్వడితో,
చేతలకి అందని సందేశాలసంగీతంలో,
ఇద్దరం మధురంగా పాట పాడినపుడు,
పాడుతూ పరవశించినపుడు,
పాడి పాడి గొంతు మూగబోయినపుడు..

ఆహ్!
ఒక యవ్వనం పూర్తిగా తడపకముందే
ఒక వాన మనల్ని ఆకాశాల్ని చేసింది.

***

మంచు దారుల్లో అరచేతులు రుద్దుతు
వెచ్చటి జ్ఞాపకాలపై అడుగేసుకుంటూ-

చల్లటి శీతగాలికి దేహాల్ని అడ్డేస్తూ
మనల్ని మనంగా కాపాడుకుంటూ-

బాసలు,బాధ్యతలు లేని కొత్త లోకం ఒకటి
నాకోసం నువ్వు, నీకోసం నేను సృష్టించుకుంటూ..

మనసు హృదయం తెలియని మార్మికజ్ఞానంతో
మనల్ని మాత్రమే మిగుల్చుకుంటూ..

చరిత్రలడగని ఆలోచనల పరంపరలో,
గణితాలెరగని చీకటి మైదానాల్లో,
ఇద్దరం హాయిగా ఆడుకుంటూ,
ఆడుతూ అలసిపోతూ,
ఆడుతూ ఆడుతూ అంతమయిపోతూ..

__!
ఆశ్చర్యానికి పదాలు లేని చలిలో
ఈ జీవితం గుట్టుగా ముగించాలని ఉంది.

Prav Veen || "ప్లాస్టిక్ దునియా" ||

రోజు ఎంతమందిని అనివార్యంగా మోస్తున్నామొకదా
నిజంగా ఎంతమందిని ప్రేమిస్తున్నాం
ఎంత ప్రేమిస్తున్నావన్నది కాదిప్పుడు పాయింట్

నువ్వెంత కోల్పోతున్నవనేదె సెంటర్ పాయింట్
ప్రేమించమని నిన్నెవరు అడగరు
ప్రేమించడం మొదలుపెడితె
అన్నిటిని ప్రేమించగలగాలి వరుసపెట్టి
పైత్యాన్ని బలాన్ని బలహీనతల్ని
ఏక్ష్నంలోనైన ఎస్కేపిజం ప్రదర్శించా.వొ
అంతే ఒ స్టాంపు
వాడు ఎవడిని ప్రేమించలెడని
నిజంగా ఎవడినిప్రేమించొద్దు గుండెలనిండా
బాగా నటించడం నేర్చుకొ
ఈజనాలకి ప్రెమంటె బహిర్ ద్రుశ్యమె
అంతర్గతాన్ని ఎవరు విశ్వసించరు
కరచాలనాలు కౌగిలింతలు చిరునవ్వులు మాటలు
చివరికిబతుకులు
అంతా ఆర్టిఫిశియల్ అంతా ప్లాస్టిక్ జమాన
నిజంగా నువ్వు బతకాలంటె
అర్జెంట్ గా నీగుండెను పీకి అవతలపారెయ్
నిజంగా నువ్వు బతకాలంటె
ప్లాస్టిక్ పెదవులు తగిలించుకొ
ప్లాస్టిక్ గుండెను అమర్చుకొ
ప్లాస్టిక్ ని నిశేదించినట్టు
ప్లాస్టిక్ జిందగిలను నిశేదించేదాక.

*07-08-2012

మెర్సి మార్గరెట్ ॥ప్రశ్నార్ధకాల రెక్కలు॥

ఆలోచనలన్నీ
నీటి బుడగల్లా
పట్టుకునేంతలో పగిలిపోతూ

నన్ను చూసి నవ్వుతూ

ఊహలొ ఊసులో
ఊపిరినే
మనసు
ఆలోచనల్లో నింపి
ఊదుతుంటే

నీ జ్ఞాపకాల కిరణాలు
వాటిలోంచి పరావర్తనం చెందుతూ
ఎన్నెన్ని రంగులో
నా కనులకు
విందు చేస్తూ కవ్విస్తుంటే

పసిపిల్లాడిలా
ఆ బుడగలను పట్టుకునేందుకు
పరుగెడుతూ ,
పడుతూ లేస్తూ
నాకు తెలియని నన్ను
గెలిపించాలని
గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటే

నన్ను చూసి నవ్వకు
ప్రశ్నార్ధకాల రెక్కలు కట్టుకుని
ఎగురుతున్నా
సమాధానాన్ని గెలవాలని
నీ మీదే నాకు జాలి
నీ మీదే నాకు జాలి
నీకు ఆ రెక్కలు కూడా లేవని ....
*07-08-2012

డాక్టర్ వేంపల్లి గంగాధర్ || ఈ రాత్రి నక్షత్ర్ర పూల చెట్టు కింద .... ||

మొదట ఇక్కడేది లేదు .

ఎటు చూసినా సముద్ర వదనం ఫై దట్టంగా ఆవరించి , విస్తరించిన - చీకటి .
పన్నెండు భాగాల రాశి చక్రం లోనో , ఇరవయి ఏడు నక్షత్ర వలయాల్లోనో నిన్ను నీవు అన్వేషించుకోవాలి . కాలచక్రం లోకి చొరబడి చొచ్చుకొని వెళ్ళి భగ్గున మండి భస్మం కాకుండా ఆరు వాక్యాలు రాసుకోవాలి .

1

రాత్రి వృక్షం నుంచి
నక్షత్రాల్ని రాల్చుకుంటున్నాను!

2

విశ్వ సృష్టి కి ఆరు రోజులు పట్టింది .
ఏడవ రోజున విధాత విశ్రాంతి తీసుకున్నాడు .
ఆ సమయం లోనే నీవు అంకురించావు .
చరిత్ర మొదలైంది !

3

అస్తమించగానే రాత్రి , ఉదయించ గానే పగలు ఏర్పడి ఒక రోజు ఎప్పటి లాగే కనుమరుగయి పోతుంది . ఆకాశం కింది ఋతువులు నీకు నీడ పడుతున్నాయి. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని కోపర్నికస్ చెప్పడానికి ముందే నువ్వు పట్టపగలు , మిట్ట మధ్య్హాన్నమూ ,నట్ట నడి రాత్రి ... త్రికాలాల్లో కూడా సంపెంగ పూల తోటలోంచి పరిమళిస్తూ ఆవహించే నీ సహచరి నీ గూర్చి , గురించి ఒక పరిశోధన పత్రం సమర్పించిన వాడివి . దేహాన్ని పొరలు పొరలుగా వొల్చుకొని నీ హృదయాన్ని ఆమె పాదాల చెంత పాతి పెట్టి పరిసమాప్తి పొందిన ఒక పురాతన అవశేషానివి .అలసి పోయిన ఆరంభ ప్రేమికుడివి .యిక జన్మజన్మలుగా ఇదే కొనసాగింపు .
భూమి ఒక ఆపిల్ పండు .

4

ఆకాశం లోని కుంకుమ వర్ణపు మబ్బులు కురవడానికి సిద్ధ పడుతున్నాయి .నువ్వు ఇంతవరకు ఏడు రంగుల కాంతులనే చూశావు. ఇప్పుడు ఎనిమిదవ వర్ణం చూడడానికి సాయంత్రం నీరెండలో మైదానం చివర భూరుగు చెట్టు వద్దకు చేరుకుంటున్నప్పుడు ఒక దృశ్యం .తెల్లని సూర్య కాంతి నుంచి పుట్టుకొచ్చిన రంగురంగుల సీతాకోక చిలుకల గుంపులు నీకు రంగులద్దుతాయి . నీకంటూ సొంత శరీరం లేనప్పుడు దేనిలో నైన ప్రవేశించి జీవించాలి. వీలు కాకపోతే అంధ కార బంధురమైన పాతాళలోకానికి గ్రీకు పురాణ కథలా సాగిపోవాలి . స్వల్పాతిస్వల్పంగా కాంతి మత్వం లభిస్తే మినుకు మినుకు మంటూ మిణుగురు పురుగై ఫైకి ఎగరాలి .

5

కక్ష్య లోకి ప్రయోగించిన రోదసి నౌక ఫై కి పోదు .కింద పడదు . సమస్త విశ్వం మృత్యు ముఖం గా పయనిస్తున్నప్పుడు చివరాఖరికి సూర్యుడుండడు .గ్రహలుండవు .నక్షత్రలుండవు.జీవ పదార్థం ఉండదు .కాంతి ఉండదు .కాలం ఉండదు .శూన్య మై పోయిన రోదసిలో నువ్వెక్కడ ? గగన చక్రం లో నువ్వు నడి రాత్రి రాలిపోయే నక్షత్రానివి.

6

నాకిప్పుడు ఏ దిగులూ లేదు . మృతువు గురించో ,అమరత్వం గురించో ,కలలూ ,కల్పనలూ ఏవీ లేవు నా చుట్టూ .రాత్రి ఎక్కడైనా వృధా అవుతుందా ?ఈ రాత్రి ఇలా గడిచిపోతే చాలు.బయటికెళ్ళి చూడు .అనంత ఆకాశం లో అసంఖ్యాకంగా , గుత్తులు గుత్తులు గా మెరుస్తున్న నక్షత్రాలు . ఇప్పుడు రాత్రి వృక్షం నుంచి నక్షత్రాల్ని రాల్చుకుంటున్నాను.
మొదట ఇక్కడేది లేదు . ఎటు చూసినా సముద్ర వదనం ఫై దట్టంగా ఆవరించి , విస్తరించిన - చీకటి . నీకు బయటా ,లోపలా ఎప్పుడూ తోడుగా ఉండేది అదే . ఈ రాత్రి నక్షత్ర్ర పూల చెట్టు కింద ఉంటాను . సంభాషణ రహస్యం .

ఇక ఈ రాత్రి తెల్ల వారదు !
*07-08-2012

బాబి నీ || "జ్ఞాపకం" ..... "నీ" 9848548871 ||


నిన్న నేను స్ప్రుశించింది
నేడు నశించింది!

లొపలినుంచి వెలుపల దూరానికే
పొద్దు వాలిపొయింది

దేన్ని వెంటబెట్టుకుంటే సంతొషం???

అర్ధరహిత ప్రశ్నల్ని ఎప్పుడైనా
కాలమే సమాధానపర్చాలి!!
దారులు వెతుకుతున్న చూపుల్ని
లొలొపల ముద్దుపెట్టుకొవాలి

నేడు.. రేపటికొక ప్రశ్నకావొచ్చు
రేపొక జవాబు వెతుక్కునే సరికి
ఇంకొన్ని ప్రశ్నలు ఎదురై తిరిగి ప్రశ్నించొచ్చు !!
ఎటుతిరిగి సమస్య జవాబు వెతుక్కోటం కాదు
"నన్ను నాలొ వెతుక్కొవటం"

దగ్గర ఉన్నదాన్ని దూరంచేసి చూట్టం విషాదం
విషాదం విషాదంగానే మిగిలిపొవటం జీవితం

ఇక్కడే
నిలబడితే..
గాయం అక్కడక్కడే తగులుతుంది!
వెచ్చవెచ్చని ఆ జ్ఞాపకం
మెత్తమెత్తగా నిద్రపుచ్చుతుంది !

కొన్ని సార్లు...
"చావటమంటే బ్రతకటం
బ్రతకటమంటే చావటం"

................................."నీ"

(కొన్నింటిని గుర్తుచేసుకుంటూ)

*07-08-2012

పులిపాటి గురుస్వామి || గడియారం గుంజుకు పోతుంది ||

పగలుకున్న అన్ని ముఖాలు
ఇంకా తెలుసుకోక ముందే

రాత్రికున్న అన్ని కోణాలు
ఇంకా స్పర్శ లోకి మలుచుకోక ముందే

నిజానికి చుట్టుకున్న కొత్త జీవితం
అడుగుల్ని తడపక ముందే

దృష్టికి ఉన్న స్వచ్చత
మనసుని ఇంకా కడగక ముందే

ప్రేమ కి ఉన్న ఓదార్పు
ఇంకా తల నిమరక ముందే.....

.....ప్రతి రోజు పాతదై పోతుంది
పదును వయసు ముడతలౌతుంది.
*06-07-2012

వంశీదర్ రెడ్డి || * ఫోర్త్ డైమెన్షన్ * ||

ప్లాస్టిక్ ప్రపంచం పళ్ళికిలిస్తోంది
నిజమేనా, నిగూఢమా,
కాంపస్లో అర్ధమవని మెటీరియలిసమ్
కాళ్ళు బైటపెట్టాకే కళ్ళు పొడుస్తూ,
రేపు మీదెన్నో ఆశలు పెట్టుకుంటే
గడియారం నిమిషానికరవై కత్తులు
దింపి రక్తం తాగుతూ,

అవసరానికి చేయందించాల్సిన చదువు
చేతులెత్తి కర్ణుని డెత్ ఆనివర్సరీ రిమైండ్ చేస్తూ,
ధర్మార్ధ కామాల్లో,తోడుంటానన్న వారు
"అర్ధ"మే ప్రధానమని
అర్ధమవని లోయల్లో నెట్టేసి పోతూ,
గున్నమావి గూటి స్నేహాలు
ఏ దోస్తీ హమ్ నహీ చోడేంగేలు,
ప్రాణం మీద కొచ్చినపుడే గుర్తొస్తూ,

నెత్తి మీద రూపాయి పెడ్తే
ఎంతకమ్ముడౌతాడనారాల్తీసే బంధువులు,
నెత్తి పగిల్చస్తే మనకెంత
మిగుల్తుందనాలోచించే పేగు తెంచుకున్న జీవాలు,

ఇక్కడింకా కృత్రిమం
కానిదేదైనా ఉందంటే అది
కృత్రిమత్వమేనేమో,
కాదంటారా,
అదిగో, మళ్ళీ,
-ప్లాస్టిక్ నవ్వుతో మీరే,
06-08-2012

7, ఆగస్టు 2012, మంగళవారం

క్రాంతి శ్రీనివాసరావు॥అర్ధశాత్రం లో ఇరుక్కుపోయున ఆర్థనాదం ॥


చిన్నప్పుడు ఎప్పుడు నాకో కల వస్తుండేది
బహుశా మీకు వచ్చే వుంటుందేమో
బూచోడు నావెంట పడుతుంటే

ఎంత ప్రయత్నించినా కాళ్ళు మొరాయుస్తుండేవి
తప్పదిక దొరికిపోతున్నామన్నప్పుడు, హఠాత్తుగా
మేల్కువ వస్తే మొహానికి పట్టిన చెమట తుడుచుకొని
హాయుగా నవ్వుకొనే వాడిని

ఇప్పుడు కల రివర్సయ్యుంది
మెల్కోనే వున్న నేను
వస్తువుల్లో ఇరుక్కుపోయున నా జీవితాన్ని
పట్టుకొందామని పరుగెత్తుతున్నా
పక్కనే వున్నట్లనిపించినా చటుక్కున మాయమై
అందీ అందనంత దూరం జరిగి
దొరక్కుండా దోబూచులాడుతుంది

వస్తువుల్ని ప్రేమిస్తూ
మనుషుల్ని వాడుకొంటున్న
సమాజంలో సగటు మనిషిగా వున్న నేను

భాగ్యనగరం బజార్లలో నడుస్తున్నప్పుడు
అంతెందుకు
ఏ పట్టణ ప్రధాన రహదార్లలో పోతున్నా
గ్లాసు అద్దాల వెనుక అందంగా ముస్తాబై
అగుపిస్తున్నా అందనంత ఎత్తులో
ఆకాశ చుక్కల్లా ఆశ పెడుతున్నాయు


చెప్పుల షాపొచ్చినప్పుడు కాళ్ళాగితే
అప్పిచ్చిన షావుకారు అదిలిస్తూ వున్నాడు

బట్టలకొట్టులు దాటుతున్నప్పుడు
చందనాలూ బొమ్మనాలు కన్ను గీటి పిలుస్తుంటే
చవటలా చక చకా సాగిపోయా

కార్ల షోరూం కానవచ్చినప్పుడు
కళ్ళు మూగబోతే
నోరెళ్ళబెట్టుకొని చూస్తూ నాకెందుకులే అనుకొన్నా

వగలు పోతున్న నగల దుకాణాలు దర్శనమిచ్చినప్పుడు
ఎదిగిన ఆడపిల్ల బోసిపోయున మెడ బావురుమన్న శబ్దం
మనసును బద్దలు చేస్తుంటే మౌనం గా భరిస్తూ వుండిపోయా

అన్నపూర్ణ పేరు తగిలించుకొని
పంక్షభక్ష్య పరమాన్నాలు పక్కనే వున్నా
నిత్యం పస్తులు పాటిస్తున్నా

వాటికేం అద్దాల వెనుకవన్ని బద్రంగానే వున్నాయు
రోడ్డుపై నడుస్తున్న నేనే చిద్రమై పోతున్నాను

అర్దం కాని గ్లాసు కర్టెన్ ఎకానమీలో
పద్మవ్యుహం లొ అభిమన్యునిలా
నాలాంటి జీవితాలు వ్యర్ధం అవుతూనే వున్నాయు

ప్రపంచ మార్కెట్ మాయాజాలం
ప్రాణాల్ని వొడిసి పట్టుకొని
క్రమక్రమంగా వస్తువుల్లోకి బదలాయుస్తే
జీవితానికే అవసరం లేనివి
కొంటున్నాం తింటున్నాం వింటున్నాం
చూస్తున్నాం చేస్తున్నాం

వద్దని హద్దులు గీద్దామనుకొంటే
పగటికలలు పరుగులు తీస్తూ
సరిహద్దులు దాటిస్తున్నాయు

మార్కెట్ సృస్టించిన వస్తు వే
జీవిత కవితా వస్తువైయ్యుంది
అందుకే సగటు జీవితం వెగటై పోయ్యుంది

భయ పడ్డా బంగపడ్డా
చిన్నప్పటి కలే బావుంది
ఇప్పుడు మేల్కొని కంటున్న కల మళ్ళీ రివర్సయుతే బాగు

*07-08-2012

కర్లపాలెం హనుమంత రావు॥ఛీకటి ఇచ్చిన సందేశం॥

వెలుతురంటే చీకటి బంగారాన్ని పోగొట్టుకోవడం

లోలోపలి చూపు మసక బారడం


నువ్వొచ్చిన చోటును మర్చి పోవడం


పోయే చాటు గుర్తుకు రాకపోవడం.




అస్తమానం నువ్వు వెదుకులాడే ఆ వెలుతురు


చీకటి స్వర్ణానికి పూసిన పైపై మెరుగు పూత మాత్రమే మిత్రమా!


వెలుతురు అంటే శూన్యసౌధానికి వేసిన వెల్ల…వెలవెలా పోవాల్సిందే కాలం ధాటికి.


వెలుతురు కోసం వెంపర్లాడతావు గానీ ఏనాటికైనా చివరికి నీకు తోడుగా మిగిలేది కటిక చీకటే సుమా!


చీకటిని కన్నతల్లి గర్భంలా ప్రేమించడం నేర్చుకోవాలి!




చీకటి అంటే కంటి రెప్పల కింద మనం దాచుకున్న నల్ల సముద్రం.


జీవితం ఎంత డొల్లో వెతికి చూపించేది వెలుతురు


బతుకు ఎంత లోతో కొలిచి చూపించేది కటిక చీకటి.




నడి సముద్రం మీద అమావాస్య ఆకాశం కింద మన ప్రయాణం


ఒంటరిదయినప్పుడు వెన్ను తట్టి దారి చూపేది లోపలి చీకటి దీపమే సుమా!




పదే పదే మెరుపు కలలను కోరుకుంటావు గానీ


మనసుకు శాంతినిచ్చేది కంటి రెప్పల మాటున


కన్నతల్లిలా దాగున్న చీకటమ్మ జోల పాటే కదా!




చీకటంటే భయమెందుకు?…


నిజానికి నువ్వు బెదిరిపోవాల్సింది


కాంతిరేఖల బూచాడిని చూసిరా కన్నా!




మనసుతీరా మనసైన మనసుతో నువు కలగలసి పోయిన ఆ మదుర సుఖానుభవానికి సరైన టీకా తాత్పర్యాలు చెప్పగలిగేది వెర్రి వెలుతురా?…కాటుక చీకటా? వెర్రికుర్రాడా!




ప్రేమను పంచే చీకటి నుంచీ పారిపోవడానికి ఎన్ని విలువయిన క్షణాలను వృథా చెస్తున్నావో..అమాయకుడా!




వెలిగి వెలిగి కొండెక్కిన బుడ్డిదీపం బోధించే చివరి సత్యం అర్థం కావడం లేదానీకు?…


ఏనాటికైనా చివరికి మిగిలేది చిటికెడు చిక్కటి చీకటి ముద్దే సుమా!




చీకటంటే అమావాస్య చందమామ


అందమైన భామ నాగుబాము కురుల మధ్య చిక్కుబడ్డ సౌందర్య సీమ.


చీకటంటే నిన్ను చూసి సిగ్గుతొ తలొంచుకున్నసఖి చెదిరిన కంటికాటుక రేఖ కూడా రసమిత్రమా!




ఆస్వాదించాలేగానీ…అంధకారాన్ని మించిన అందమైన లోకం సృష్టి మొత్తంలో ఎక్కడుందో..చూపించగలమా!


అది…సర్వాంతర్వ్యామి శాశ్వత అంతిమ భవంతిరా భక్తా!


చీకటంటే అంబరం.


చీకటంటే దిగంబరం


పగటి వెలుగు చేసే గాయాలకు


రాత్రి పడకలో నువ్వు పూసుకునే చీకటి మలామే మంచి మందు.


పాపిష్టి లోకం కళ్ళు పడకుండా అమ్మ పెట్టే దిష్టి చుక్కరా చిట్టీ... చీకటి!


దాగుడుమూతలాటలో


వెదుకులాట నేర్పేందుకు అక్క ప్రేమగా నీకు కట్టిన కళ్ళగంతరా చిన్నా...చీకటి!


మహాప్రస్థానపు చివరి మజిలీ చీకటి


మరో ప్రస్థానపు మొదటి మెట్టూ …


మరేదో కాదు…


ఆది మధ్యాంతాలు అంతుబట్టని అమర తమస్ వాహిని


నువు పడి చచ్చే ఆ వెలుతురు బొరుసుకు అవతలి వైపున మెరిసే బొమ్మ-చీకటి!

*07-08-2012

మోహన్ రుషి॥ఏనాటికి?!॥

నిర్ణయాలను వాయిదా వెయ్యడం
నిజాలను తప్పించుకు తిరగడం
నీ గొంతు పరధర్మాలను పలకడం

నీ చూపును నీలోకి తప్ప
అందరిపైనా నిలపడం!

జీవితంతో దాగుడుమూతలు
అనుభవాలకు చెల్లుచీటీలు
వూహలకు వురి వెయ్యడాలు
స్వప్నాలకు భయపడడాలు!

ప్రశ్నలోనే సమాధానముంది
సమస్యలోనే పరిష్కారముంది
మొదలులోనే తుది ఉంది
ఆనందంలోని విషాదం
నిన్ను నువ్వు కనుగొనడానికే ఉంది!

తెలివి అనుకుంటావు కానీ,
నువు జీవితాన్ని ఎలా చూసుకుంటావో
జీవితమూ నిన్ను అలాగే చూసుకుంటుందని
ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో?!

*06-08-2012

క్రాంతి శ్రీనివాసరావు॥దొరసానుడు ॥

గడీలకు బీడాలేస్తే
గంగలో కలసిపోయాయనుకున్నా
మారు వేషాలేసుకొని మనమద్యే తిరుగుతున్నాయని
ఈ మద్యే తెలిసింది
రంగుమార్చిన గడీ,
రాజకీయ గారడీ గాడై రహశ్య ఎజెండాతో
రోజా పువ్వడుగు ముల్లై,
రాజ దర్బార్ల్లు రోజూ చేస్తూనే వుంది

అమావాశ్యకో, పౌర్ణమికో,జనానికో గ్లాసెడు ఆవేశం పోసి
మళ్ళీ అదే,
రగుల్తున్న మంటల్న్ని అదుపులో వుంచేందుకు
చుట్టూచేరి శుశ్క వాగ్దానాలు చేస్తున్నది

మాటలకు మంత్రాలు పూసి
వయాగ్రాను వాగ్దానాల్లో నింపి
ఉద్యమాన్ని ఉయ్యాలగా మార్చి వూగుతూనే వుంటుందది

అక్కడ ఓ గడీ గాంధీగిరి చేస్తూ
హఠాత్తుగా బుద్దికి రెక్కలు మొలిపించుకొని
భుద్దుడనని చెప్పుకొంటూ
శాంతి కపోతం రెక్కలు విరిచేస్తుంది

నిన్న కారంచేడు చుండూరు గుండెలు గాయం చేసి
ఆగడీ నేడు లక్సెట్టి పేటలో కన్ను తెరిచింది
వీధి బడి నుండి విశ్వవిద్యాలయం వరకు పాగావేసి
తలపాగా చుట్టుకొనివికటాట్టహాసం చేస్తూనే వుంది

అగడీ ఈగడీ గదిలో గడియ పెట్టుకోని
మంతనాలడుతూనే వుంటాయు
చెరికొన్నీ గొంతులను కూలీచ్చి కొనుక్కొనీ టీవీల అడ్డాల్లో
తగువులాడిస్తుంటాయు
బిగువుగా వున్నట్లు కానవస్తుంటాయు

అప్పటి గడీల ఆగడాలు కనిపిస్తుండేవి
ఇప్పటి గడీలు కాగడాలై మండుతు వుంటే
దీపపు పురుగులమై మనకు మనమే వెళ్ళి కాల్చుకు చస్తున్నాం
ఉద్యమకారులు సిసిఫస్ సంతానాలుగా దొర్లిన రాయుని ఎత్తుతూనే వున్నారు

కాల పురుషుని కౌగిట్లో
సమాజం గర్భం దాల్చి
ఘడియ ఘడియ కో గడీని కంటూనేవున్నది

కొన్ని, సినీమాతల్లి గుండెలపై
గడీలకు పునాదులు వేసుకొంటే
మరి కొన్ని, పరిశ్రమల్ని పట్టు వస్త్రాలుగా
కట్టుకు తిరుగుతున్నాయు

నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావటం లేదు
మరీ విచిత్రమేమంటే
ఒక గడీ అయుతే
జైలుగదిలో వున్నా
బేడీలు పడతాయనుకుంటున్నా
జనం మది గదిలో అది గడీలు కట్టుకుంతుంది

రావణాసురుని తలల్లా ఎన్ని రాల్చినా
మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్నాయు
తప్పదిక
పెట్టుబడీదారీ సమాజపు గర్బంలో
మరో మహా ప్రజోధ్యమాన్ని బాణంలా నాటాలిప్పుడు

*06-08-2012

6, ఆగస్టు 2012, సోమవారం

డా . సింహాచలం లక్ష్మణ్ స్వామి || ‎*** పల్లె ***||

కల్మషమేరగని...పల్లెలో
పచ్చనిలోగిళ్ళలో
గడ్డివాము, జోడెడ్లు...

మేకపిల్లలు గొల్ల భామలు.

ఆకుపచ్చని కొబ్బరాకు చాటున
అలవోకగా సాగుతున్న నాపాటకు....
తలలూపుతున్న పైరగాలి, పైరు.

నాపాత జ్ఞాపకాలని నేమరువేస్తున్న
ఎడ్లు, గుడిసె,వడిసెల ,గువ్వలు.

ఎర్రని ఎండకు మఱ్ఱి నీడలో సేదదీరే బాటసారికి
చల్ల పోసే అవ్వ మానవత్వపు రవ్వ.

మనిషి యంత్రమై కుత౦త్రమై పోతున్నవేళ
మానవత్వాన్ని గుర్తు చేస్తుంది పల్లె 

*06-08-2012

బాబీ నీ॥"ఒక ఇద్దరి కథ" ...."నీ"॥

"మన ఇద్దరికి మధ్య తెలీని ఖాళీ నది"
నువ్వు ఆ ఒడ్డునే వుండు
నేనీ ఒడ్డున కూర్చుంట..!

అప్పుడప్పుడూ...
కొన్ని మాటల పడవలేసుకుని
అనూహ్యంగా నిన్ను చేరుకుంటా...!

ఒకప్పుడు...
సంభాషనల చలి మంటల దగ్గర,
నవ్వుల కౌగిలింతల్లొ కలుసుకున్న మనం
ఇప్పుడు...
"మా ఊళ్ళో మోరీ అరుగుల్లా
ఎదురెదురు నిలబడి
మాటలు రాని రెండు వస్తువులమైపొవటం నిజమైన విషాదం..!

"అప్పటి నువ్వు ఇప్పటినీలో కనిపిస్తావేమో అని తడుముకుంటున్న ",
నా కవిత్వాన్ని స్ప్రుశించిన వేళ్ళకొసం నిరీక్షిస్తున్న

ఒకప్పుడు మనం కలసి నడిచిన దారి పొడుగూతనా
నీ మాటల పుస్తకాలు రాలిపడ్డాయేమోనని వెతుక్కుంటున్న
అమావాస్యల్ని నరుక్కెళ్ళే నీ రేదీపపు చూపుకొసం
నిసీదిలొ కలవరించా,
నీకొసం పరితపించా..!

"నిన్ను నీలొ కోల్పొయా,
నువ్వు నాతోనే ఉంటూ నాకెక్కడా కనబడవు"

నువ్వొక పరిగెత్తే ప్రవాహానివి
నేనొక కాళ్ళు నరుక్కొని కూలబడ్డ కవిత్వాన్ని..!

*05-08-2012

మోహన్ రుషి॥ఆఖరి వాక్యం!॥

మిగల్లేదు
ఏ ఒక్క ఆశా...!
హృదయం లయ తప్పడం
ఇక్కడొక శాపం -
తీపి కలలకు వశమవ్వడం
నిజంగానే నేరం -
అశ్రువొక్కటి రాలిపడ్డం
చెలామణిలో ఉన్న చేతగానితనం!
ఇక నువ్వు ఏ ధైర్యంతో బతుకుతావు
ఏ నమ్మకంతో నడుస్తావు?!
ఏ దేహంతో?! ఏ దాహంతో?!
విరిగిన ఏ మనసు ముక్కతో?!
చావుకీ, బతుక్కీ పెద్దగా తేడాలేని
సందిగ్ధ సందర్భాలను మోసుకుంటూ
ఇక నువ్వు ఎటువేపుగా ప్రయాణిస్తావ్?!

*06-08-2012

రియాజ్ || స్పందించకున్నా! ||

నీలో స్పందనలకు
సరైన ప్రతిస్పందన ఇవ్వనంత మాత్రాన
నీవు నొచ్చుకొని

నన్ను నొప్పించకు నేస్తం!

నిన్ను నొప్పించివుంటానేమో
ఏదో ఒక సందర్భంలో..
కావాలని చేసివుండను
తప్పు ఎత్తిచూపినా
నువ్వు కసురుకున్నా
నీకిష్టంలేకున్నా నువు మాట్లాడకున్నా
పరవాలేదు...!

నేను నీకు గొప్ప స్నేహితుడిని కాకపోవచ్చు
కానీ...కానీ..!
నువ్వు మాత్రం ఎప్పటికీ నా నేస్తమే!!

అలకలు అహాలు తాత్కాలికమే!
నాకోసం నువ్వు పోగొట్టుకున్న క్షణాలు
నన్ను వెంటాడుతుంటాయ్ !!

క్షమించెయ్ నన్ను !!
నువ్వు స్పందించకున్నా!
నేను స్పందిస్తుంటా....నీలో స్పందనలకు జీవమొచ్చేంత వరకు!!
గుండె కాఠిన్యం వదిలేంత వరకు!!

మాట్లాడేందుకు ప్రయత్నిస్తా
ఆవేశం చల్లారి మౌనం కరిగి మాటలయ్యేంతవరకు
అలకలు మొలకెత్తి నవ్వు అందుకునే వరకు
నే కోల్పోతా నా అహాన్ని!! ఎన్నిసార్లయినా.. నీ స్నేహం కోసం!!!

*05-08-2012

సతీష్ చందర్ ||మెత్తని సంభాషణ! ||


పువ్వు వికసిస్తుంది

మెత్తగా.

కొవ్వొతి వెలుగుతుంది

మెత్తగా.

నవ్వు గుబాళిస్తుంది

మెత్తగా.

మెత్తనయిన

ప్రతి మాటా

కవిత్వమే

*06-082012

జయశ్రీ నాయుడు || నెప్పి.. నాకు కావాలి ||

అందం లేదు
ఆహ్లాదం కాదు
విలవిలలే తప్ప

వయారమెరుగవు

ఆహ్వానం ఎప్పుడూ వుండదు..
కానీ అవసరానివి
తెరలు తెరలు గా వస్తావొ
తుఫానులా కమ్మేస్తావో

ఉలిక్కి పడి చూసుకున్నా
ఎటో తేలిపోతున్నట్టుంది.. నీతో
నీ చిటికెన వేలే కాదు..
నీ విశ్వరూపంలా..

గోరంత మొదలై
కొండంతగా..
ఇంతై.. పెయిన్ అంతై
శరీరాంతర్వర్తియై..

కొనగోటి నుంచి
తలకొస వెంట్రుక దాకా
జర జరా పాకేశావు

నా ముక్కు పట్టి
నిన్ను చూపిస్తావు
నిన్ను నువ్వు పట్టించుకో అంటావు
మొండికేస్తే.. జగమొండివి అవుతావు
సర్వ శరీరాల ప్రాణ సఖివి
అందరినీ రగిలించే చెకుముకివి

నువ్వుండాలి..
అప్పుడే నేనుంటా
ఓ అద్భుతమైననెససరీ ఈవిల్ వి
నన్ను నాకు గుర్తు చేసే ఏంజిల్వి

*06-08-2012

కిరణ్ గాలి॥మరో ప్రస్థానం॥

మనసుకు పట్టిన
సాలె గూడు ఛేదించూకొని
మరో శ్రీ శ్రీ లా

మళ్లీ రా

ఇక నీ కలం

ఒక ఖడ్గమై
పదాల పదాతి దళాల్ని
కవితా కదనరంగంలో
కవాతు చేయించాలి
అక్షరాలతో అవిరామరమైన
అశ్వమేధం జరిపించాలి

ఒక పాంచజన్యమై
దిక్కులు పిక్కటిల్లెలా
మరొక్క సారి
సామ్యవాద శంకారావాన్ని
దద్దరించాలి

దాని "సమానతా" ప్రకంపణలు
సుశప్తావస్తలొవున్న
భావ సారూప్య హృదయాలలో
ఆత్మశొదన అనుకంపణలు
సృష్టించి జాగృతం చెయ్యాలి

ఒక సమాజ గళమై
సామాన్యుడి స్వరాన్ని
ఈ కాంక్రీటు కీకారణ్యం లో
అసమర్ధ ప్రభుత్వాల
కర్ణ భేరీలు వ్రయ్యలయ్యేలా
ప్రతిధ్వనించాలి

గురి పెట్టిన గాండీవంలా
అంతరంగపు అంబుల
పొదిలోని ఆలోచనాస్త్రాలను
విప్లవపు వింటిపై
ఆశయాలుగా సంధించి
అభ్యుధయ బ్రహ్మాస్త్రాలుగా మార్చాలి

మాటల అంకుశమై
నిరసించిన
నిస్సత్తు వ నిండిన
నిర్జీవ, నిర్ 'లక్ష్య'
అస్థిత్వ లోపిత
బాధ్యతా రహిత
వ్యక్తిత్వ దిగంబర

దిశా హీన యువతరాన్ని
మావటిలా
గుచ్చి గుచ్చి
నవ చైతన్యం వైపు
నడిపించాలి

గాండ్రించే బెబ్బులై
వెలలేని
"స్వ" భాష
వలువలు విడిచి
ఆంగ్ల ఉచ్చారణల
అచ్ఛాదనల వెనుక
నక్కిన నిజ నగ్న శరీరాలను
వెంటాడి వేటాడీ ఛిద్రమ్ చెయ్యాలి

భావ రాహిత్యంతో
భాషా విహీనతతో
శిల్ప,శబ్ధ
శైలి శూన్యతతో
బీల్ళు వాడి, బీటలు పడి
నిస్సారమైన
సమకాలీన సాహిత్య
క్షామ ధాత్రిని

ఇక నీ కలం

చలం హలం లా
పెకిలించి
కృష్ణ శాస్త్రి భాష్ప జలంతో
తడిపి
శ్రీ శ్రీ రక్త భీజా లను నాటి
హరిత "తిలకా"న్ని
దిద్ది స-ఫలం చేయాలి

పరిణితి పరిపక్వతల
పంట చెల్లుగా పచ్చిక బయల్లుగా
మార్చాలి

...........

ఇక నీ కలం

పట్టాలపై పొగ బండిలా
ధడ ధడ లాడాలి
ఒక సుధీర్గ సాహితీ
ప్రయాణానికి సిద్దం కావాలి

జన జాగృతి గీతంలా
గణ గణ లాడాలి
కర్షక, కార్మిక, శ్రమైక
శక్తులన్నిటిని సంఘటితం చెయ్యాలి

కొలిమి లోంచి ఎగిరి పడిన నిప్పు కనికలా
కణ కణ లాడాలి
సమస్త సమాజ అసమానతలను
దావానలమై దగ్ధం చెయ్యాలి

తలారి చేతిలో మెరిసే గండ్ర గొడ్డలిలా
తళ తళ లాడాలి
నీ ఆశయ సాధనకు అడ్డొచ్చే ప్రతి
అవాంతరాన్ని అడ్డంగా తెగ నరకాలి

ఇక నీ కలం
కాష్టంలో కాలే కపాలంలా
కఠెల్ కఠెల్ మనాలి
నీ చేతి వ్రాతల
చితి జ్వాల లతో
సగం చచ్చిన
సగటు మనిషిని
ఆవాహనం చేసి
అగ్ని పునీతం చెయ్యాలి
పునర్జన్మ నివ్వాలి

*06-08-2012

డా . సింహాచలం లక్ష్మణ్ స్వామి || బహుశా..ఇదేనా కవిత్వం.!!? ||

ఆకలిమంటల ఆర్ద్ర
ఆర్తి గీతాల అరణ్య రోదపు
అక్షరాశృవులేనా....కవిత్వం !


పొక్కిలైన గుండె వాకిలి
ను౦డి పొంగే అక్షరమే ....కవిత్వం..!


అంతస్సాగరాల్లో బద్దలయ్యే
అగ్నిపర్వతమే కవిత్వం..!


చితుల చీకటికి
చితిని పేర్చే చిన్మయ దీపమే ..కవిత్వం


దుఃఖిత దుక్కిలో
లెక్కలేనన్ని భాష్పంకురాలేనా కవిత్వం ..!


అశృ వాహినికి తెగిన
ఆనకట్ట వరదే ..కవిత్వం ..!


యద యదల్లో మధురంగా
సాగే యలదేటి గీతమేనా కవిత్వం..!


ఎడతెగని విధి వంచిత
కారుణ్య స్పందన నాదమే ..కవిత్వం..!


పాంచభౌతిక సృష్టి విలాస
విలక్షణ విరచితమేనా కవిత్వం..!


ప్రకృతిని గుండెల్లో కూర్చి
అక్షరాలుగా మార్చి సమర్పించటమేనా ....కవిత్వం..!


భగ్న హృదయ దగ్ధ మానస
గీత మాలికల అక్షరాల మాలయేనా...కవిత్వం..!


ద్వయ దేహా వాంఛల వెచ్చని
ఊపిర్ల విరహ వేదనేనా...? కవిత్వం..!


అక్షరాలకు ఆస్థి మా౦సాలిచ్చి చేసిన
జాగృత స్వేచ్ఛా జీవన విహంగమే..కవిత్వం..!


కవిత్వం ...కవిత్వం..కవిత్వం..!
నాకు జన్మ జన్మలకు అమరత్వాన్ని
అందించే అమృతాక్షరి...........


*05-08-2012

బి వి వి ప్రసాద్ || గమనించముగానీ ||

గమనించము కానీ
 ఒక దీర్ఘ ప్రవాసం తరువాత ఇల్లు చేరినపుడు
 ఇల్లు కూడా కాసేపు మనని అతిథిలానే చూస్తుంది

ఇంటి గోడలూ, వాటి వెలిసిన రంగులూ

సామానూ, అవి సర్దుకొని ఉన్న విధానమూ

మన మనుషుల మాటలూ, ప్రవర్తనా

వాకిట్లో ఇవాళ పూసిన పూలు కూడా

ఎవరీ మనిషి అని చూస్తున్నట్లూ, ఎవరినో పలకరిస్తున్నట్లూ ఉంటాయి

మనని మనకు కొత్తమనిషిని చేస్తాయి


గమనించము కానీ

గాఢమైన నిద్రనుండి మేల్కొన్నపుడు కూడా

కొంత సమయం, మనచుట్టూ ఉన్న ప్రపంచం అప్పుడే పుట్టినట్లుంటుంది

ఆక్షణమే, ఎవరో ఎక్కడినుండో ప్రపంచాన్ని తెచ్చి మన చుట్టూ పరిచినట్లుంటుంది

అపుడు మనం

మొదటిసారి శ్వాసిస్తున్నట్లు కొత్త ఊపిరి గుండెలనిండా నింపుకొంటాము


మేలుకొన్నపుడూ,

ఇంటికి వచ్చినపుడూ

కాసేపు మనలో పసిపిల్లల అమాయకత్వమేదో గోడమీది నీరెండలా పారాడుతుంది


తామేమి చేస్తున్నాయో తమకు తెలియకుండానే

కఠినమైన ప్రపంచాన్ని కోమలమైన రంగులతో నింపుతున్న

పూలలోని మృదు సౌందర్యస్పృహలాంటిది ఏదో

మనలో లీలగా, దూరం నుండి వినవస్తున్న పాటలా

వాగు ఇసుకపై మెరుస్తున్న పలుచని నీటిపొరలా చలిస్తూ ఉంటుంది


గమనించము కానీ

మన ఇల్లూ, మెలకువా పాతబడే కొద్దీ

కొంచెం కొంచెంగా మనవాళ్ళూ, ప్రపంచమూ మనలో నిండే కొద్దీ

దేనినో కోల్పోతున్న దిగులు ఒకటి

ఇసుకపొరలు దాటుకొంటూ వాననీరు పాతాళంలోకి ఇంకుతున్నట్లు

మన లోపలికి ఇంకుతూ ఉంటుంది.

*05-08-2012