చిన్నప్పుడు ఎప్పుడు నాకో కల వస్తుండేది
బహుశా మీకు వచ్చే వుంటుందేమో
బూచోడు నావెంట పడుతుంటే
ఎంత ప్రయత్నించినా కాళ్ళు మొరాయుస్తుండేవి
తప్పదిక దొరికిపోతున్నామన్నప్పుడు, హఠాత్తుగా
మేల్కువ వస్తే మొహానికి పట్టిన చెమట తుడుచుకొని
హాయుగా నవ్వుకొనే వాడిని
ఇప్పుడు కల రివర్సయ్యుంది
మెల్కోనే వున్న నేను
వస్తువుల్లో ఇరుక్కుపోయున నా జీవితాన్ని
పట్టుకొందామని పరుగెత్తుతున్నా
పక్కనే వున్నట్లనిపించినా చటుక్కున మాయమై
అందీ అందనంత దూరం జరిగి
దొరక్కుండా దోబూచులాడుతుంది
వస్తువుల్ని ప్రేమిస్తూ
మనుషుల్ని వాడుకొంటున్న
సమాజంలో సగటు మనిషిగా వున్న నేను
భాగ్యనగరం బజార్లలో నడుస్తున్నప్పుడు
అంతెందుకు
ఏ పట్టణ ప్రధాన రహదార్లలో పోతున్నా
గ్లాసు అద్దాల వెనుక అందంగా ముస్తాబై
అగుపిస్తున్నా అందనంత ఎత్తులో
ఆకాశ చుక్కల్లా ఆశ పెడుతున్నాయు
చెప్పుల షాపొచ్చినప్పుడు కాళ్ళాగితే
అప్పిచ్చిన షావుకారు అదిలిస్తూ వున్నాడు
బట్టలకొట్టులు దాటుతున్నప్పుడు
చందనాలూ బొమ్మనాలు కన్ను గీటి పిలుస్తుంటే
చవటలా చక చకా సాగిపోయా
కార్ల షోరూం కానవచ్చినప్పుడు
కళ్ళు మూగబోతే
నోరెళ్ళబెట్టుకొని చూస్తూ నాకెందుకులే అనుకొన్నా
వగలు పోతున్న నగల దుకాణాలు దర్శనమిచ్చినప్పుడు
ఎదిగిన ఆడపిల్ల బోసిపోయున మెడ బావురుమన్న శబ్దం
మనసును బద్దలు చేస్తుంటే మౌనం గా భరిస్తూ వుండిపోయా
అన్నపూర్ణ పేరు తగిలించుకొని
పంక్షభక్ష్య పరమాన్నాలు పక్కనే వున్నా
నిత్యం పస్తులు పాటిస్తున్నా
వాటికేం అద్దాల వెనుకవన్ని బద్రంగానే వున్నాయు
రోడ్డుపై నడుస్తున్న నేనే చిద్రమై పోతున్నాను
అర్దం కాని గ్లాసు కర్టెన్ ఎకానమీలో
పద్మవ్యుహం లొ అభిమన్యునిలా
నాలాంటి జీవితాలు వ్యర్ధం అవుతూనే వున్నాయు
ప్రపంచ మార్కెట్ మాయాజాలం
ప్రాణాల్ని వొడిసి పట్టుకొని
క్రమక్రమంగా వస్తువుల్లోకి బదలాయుస్తే
జీవితానికే అవసరం లేనివి
కొంటున్నాం తింటున్నాం వింటున్నాం
చూస్తున్నాం చేస్తున్నాం
వద్దని హద్దులు గీద్దామనుకొంటే
పగటికలలు పరుగులు తీస్తూ
సరిహద్దులు దాటిస్తున్నాయు
మార్కెట్ సృస్టించిన వస్తు వే
జీవిత కవితా వస్తువైయ్యుంది
అందుకే సగటు జీవితం వెగటై పోయ్యుంది
భయ పడ్డా బంగపడ్డా
చిన్నప్పటి కలే బావుంది
ఇప్పుడు మేల్కొని కంటున్న కల మళ్ళీ రివర్సయుతే బాగు
*07-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి