దీము - కాసుల ప్రతాపరెడ్డి బాపూ! కావలి ప్రాణంతకమే కావచ్చు కానీ బాయికొక దీము బాయి అమ్మ దేహంలోని గుండె కదా! కోడి కూత యాల్లనో గోరుకొయ్యల పొద్దునో మీ ముచ్చట్లే చెవులను తాకుండేవి రెప్పల బరువు కన్నులు తేరుచుకునేవి కావు ఎవుసం సుద్దులేవో సుడులు సుడులు మగతమత్తులో నాకు అర్థమైనట్టూ కానట్టూ.... ఒలపటికుంటే దాపటికుండదు దాపటికుంటే ఒలపటికుండదు చాలీచాలనీ ఎవుసం ఎల్లీయెల్లని సంసారం దొడ్డెడు ఆవులు, ల్యాగలూ ఒక్కటొక్కటే కుప్పకూలుతుంటే గుండెను చిక్కబట్టుకుంటూ తోకలు పట్టి లేపుతూ మనం పడిన యాతన... ఒక్కో పసురం ఇంట్ల నుంచి శవం వెళ్తున్నట్లే.... అమ్మ అంటుండేది నువ్వు ముడసమానమేస్తవని దుఃఖాన్ని తాడులా పేనుతుంటే విషాదమూ ఆనందమూ ఏదీ లేదు నీకు బుగులేది, భయమేది? పురుగూ బుస్సీ నీ నేస్తాలు కదా! దొడ్డి దొంగలు, వడ్ల కుప్పల దొంగలు ఇద్దుమో ముత్తుమో రెక్కల కష్టం పోయేది విషమంటే నీకెంతో బుగులో పాడుకాలమేదో దాపురించింది విషాన్ని తేనెలో కలిపే పెట్టే కాలమిది కాలు మర్లబడితేనో, చేతులు పట్లు తప్పితేనో మన బాయి మీది నల్లాలం ఆకుపసరే మందు ఇప్పుడెంత నాశనగాలం ముక్కు కారితే ముసురు పడితే ఒంటినీ ఇంటినీ గుల్ల చేసే మంత్రగాళ్లు ఒక్కటేమిటి, ఏది తక్కువని... అందుకేనేమో అందరూ నిద్ర పోయే యాల్ల బొట్లు బొట్లుగా చీకటి రాలిపడుతుంటే నువ్వు ఇంటి గల్మకడ్డం కూర్చొని గుస గుస పెడుతున్నట్లు ఈ లోకానికి కావలి కావాలంటవు నువ్వు అప్పుడప్పుడు రామయ్య పటేలువు అందరికీ వొరస పెట్టి పిలిచే చుట్టానివి దొరలకూ, దొంగలకూ తప్ప రెక్కలు ముక్కలు చేసుకున్నవు కదా! నీ ఒంటికి కులమంటిందా? 'బావా! నీదేం అదృష్టమో గానీ నీ కొడుకులు పొలాలను, వొయ్యిలను కలె దున్నుతరు' అన్నప్పుడు నీ ఛాతీ పెరిగిన గుర్తులేవీ లేవు మడ్లల్ల పొర్లాడిన పోరు వీరుడివి కదా! ఇప్పటిలా ఆశలు లొంగదీయలేదు అప్పులూ లొంగదీయలేదు ఆకలొక్కటే.. ఆత్మ ఒక్కటే.... కడుపులోని ఆకలి మంటలు నెత్తురు ముద్దలై నోరు నుంచి పడుతుంటే అర్థమైపోయి గుండె మీద రాయి పడింది ఏ పాలకులకూ ఏ ప్రపంచ బేపారికి లొంగని తెగువ ఆత్మగౌరవమే ఊపిరైన రైతువు కదా! నాకూ, ఈ దేశానికీ దీమువి కదా!
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vXtG0M
Posted by Katta
by Pratapreddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vXtG0M
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి