ఈ రోజు ఉర్దూ కవిత్వ నజరానాలో గాలిబ్ కవితా సంకలనంలోని పదహారవ గజల్లో మిగిలిన షేర్లు చూద్దాం. పదహారవ గజల్ 4వ షేర్ కుఛ్ న కీ, అప్నే జునూనె నార్సానె, వర్నా యాం జర్రా జర్రా రోకషె ఖుర్షీదె ఆలమ్ తాబ్ థా నా విఫలప్రేమ ఏమీ చేయలేక పోయింది, లేకుంటే లోకంలో కణకణం సూర్యతేజానికి సవాలు అయ్యేదే ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. కుఛ్ న కీ అంటే ఏమీ చేయలేదు అని అర్ధం. దీనికి భావం నిరాశగా పడి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. జునూన్ అంటే ఉన్మాదం కాని ఇక్కడ పిచ్చి ప్రేమ అని అర్ధం. నా రసాం అంటే అర్ధం విఫలమైన అని. జునూనె నా రిసాం అంటే లక్ష్యం సాధించలేని పిచ్చి ప్రేమ లేదా విఫల ప్రేమ అని భావం. రోకష్ అంటే సవాలు చేసేది. ఖుర్షీద్ అంటే సూర్యుడు. జర్ర జర్ర అంటే కణ కణం. ఆలమ్ తాబ్ అంటే యావత్తు ప్రపంచం మెరిసిపోవడం. ఇప్పుడు ఈ కవితకు భావం చూద్దాం. ఈ కవితలో కూడా గాలిబ్ విఫలప్రేమనే వర్ణించాడు. ప్రేయసి నిరాసక్తతనే పేర్కొన్నాడు. తన ప్రేమ విఫలం కావడం వల్ల తాను సాధించదలిచింది సాధించలేకపోయాడు. విఫల ప్రేమ వల్లనే అతను అనుకున్నది చేయలేకపోయాడు. లేకపోతే ఈ ప్రపంచంలో మామూలు ధూళి కణం కూడా ప్రపంచానికి వెలుగునిస్తున్న సూర్యతేజాన్ని కూడా సవాలు చేసేదే. మరో మాటలో చెప్పాలంటే, ప్రేమ విఫలం కావడం వల్ల అతను ధూళి కణం కన్నా దిగజారిపోయాడు. ప్రపంచంలో ధూళికణం కూడా సూర్యతేజాన్ని సవాలు చేసే శక్తి కలిగి ఉంది. అలాంటిది గాలిబ్ ఆ ధూళి కణం కన్నా దిగజారిపోయి ఎందుకు కొరగానిస్థితికి చేరుకున్నాడు. ప్రేమ సఫలమై ఉంటే లేదా అతను ప్రాణాలు పోగొట్టుకుని దుమ్ములో కలిసిపోయి ఉన్నా, ఆ దుమ్ములోని ప్రతి కణం కూడా తన ఉనికి ప్రత్యేకతను చాటేది. సూర్యుడిని కూడా సవాలు చేసే వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేది. ప్రతి కణానికి సూర్యుడి స్ధాయిలో ప్రకాశించే సామర్థ్యం ఉంది. ప్రతి కణం సూర్యుడిగా మారాలన్న సహజ కోరిక కలిగి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఒక లక్ష్యంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తాడు. కాని లక్ష్యం లేకుండా విఫలప్రేమతో వగచే వ్యక్తి ఏమీ సాధించలేడన్న భావం ఈ కవితలో అంతర్లీనంగా ఉంది. తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలో పదహారవ గజల్ 5వ షేర్ ఆజ్ క్యుం పరవాహ్ నహీ, అప్నే అసీరోంకి తుఝే కల్ తలక్ తేరా భి దిల్ మహరు వఫా కా బాబ్ థా ప్రేమ బంధాలను నేడెందుకు లక్ష్యపెట్టడం లేదు నువ్వు నిన్నటి వరకు నీ హృదయం కరుణార్ధ్రతలకు నిలయం ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. పర్వా అంటే లక్ష్యపెట్టడం. పర్వాలేదు అని తెలుగులో వాడే పదం కూడా ఇదే. పర్వాలేదు అంటే పట్టించుకోనక్కర్లేదని. ఇదే అర్ధం ఇక్కడ కూడా వర్తిస్తుంది. అసీర్ అంటే సంకెళ్ళు లేదా బంధనం అని అర్ధం. మెహర్ అంటే దయ, కారుణ్యం. వఫా అంటే విశ్వాసం అని అర్ధం. ప్రేమ అన్న భావం కూడా వర్తిస్తుంది. బాబ్ అంటే అధ్యాయం, తలుపు, ఫౌంటేన్ అన్న అర్ధాలున్నాయి. ఈ కవితకు భావం చూద్దాం... ఈ కవితలో ప్రేయసి నిరాసక్తత, ఆమెలో వచ్చిన మార్పును ప్రశ్నిస్తున్నాడు. నీకేమయ్యిందో అర్ధం కావడం లేదు. మనం ప్రేమ బంధనాల్లో బంధీలుగా ఉన్నాం. కాని ఈ ప్రేమ బంధనాలను నువ్వు లక్ష్యపెట్టడం లేదు. ఇంతకు ముందు నువ్విలా లేవు. మునుపు నీ హృదయంలోను ప్రేమ పొంగిపొరిలేది. నీ ప్రేమసంకెళ్ళలో బందీగా ఉన్న నా పట్ల దయచూపేదానివి అంటూ వాపోతున్నాడు. ఈ కవితలో ప్రత్యక్షంగా ప్రేయసి అన్న సంబోధన లేదు. అలాగే అసీరీ అన్న పదం కేవలం ప్రేమ బంధాలను సూచించే పదం కాదు. ఇది మామూలుగా ఖైదును, సంకెళ్ళను సూచించే పదం. మనం చాలా ప్రేమించే వ్యక్తి ఎవరైనా కావచ్చు. ప్రేమలు అనేక రకాలు. ప్రేయసి పట్ల ప్రేమ, సంతానం పట్ల ప్రేమ, మిత్రుల మధ్య ప్రేమ. సాధారణంగా మనం ప్రేమించే వ్యక్తి మనకు దూరంగా ఉంటే, మన పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇలాంటి భావాలే కలుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వర్తించే కవిత ఇది. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే శుక్రవారం గాలిబ్ 17వ గజల్ చదువుదాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRnmhk
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRnmhk
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి