\\బ్లెయిర్ ఇక లేడు\\ కారు రేడియో స్పీకర్ ఆ రోజు నా చెంపమీద ఛెళ్ళున చరిచింది. బ్లెయిర్ ఇక లేడు. మా నగరపు మహాకవి ఇక లేడు. మైకు ముందు గొంతు విప్పితే ఎలుగెత్తిన శాక్సొఫోన్‌లా ధ్వనించే బ్లెయిర్ ఇక లేడు. కడలి తరగలా, ఝంఝామరుతంలా మహోత్సాహంతో మహాశక్తితో సంచలించే బ్లెయిర్ ఇక లేడు. రోడ్డు పక్కన ఒక ఖాళీ పార్కింగ్ లాట్‌లోకి కారుని ఆపి అలా కూర్చుండి పోయాను. రేడియో ఆపేశాను. చుట్టూ నిశ్శబ్దం. నిశ్శబ్దమే మిగిలింది. బ్లెయిర్ ఇక లేడు మరి. బ్లెయిర్ అనే ఒక్క పేరుతో ప్రఖ్యాతుడైన డెట్రాయిట్ ముద్దు బిడ్డ, డేవిడ్ బ్లెయిర్, విశేషణాలకి అతీతుడు. ముద్రల చట్రాల్లో ఒదగనివాడు. కవి, గాయకుడు, కళాకారుడు, సంగీతదర్శకుడు, శిక్షణ ఇచ్చే గురువు, ఉద్యమనాయకుడు, ఇంకా ఫలానా అని పేరు పెట్టలేని ఎన్నో కార్యకలాపాల్లో మునిగితేలేవాడు. అన్నిటినీ మించి గొప్ప మనిషి. తోటి మానవుల్ని నిర్ద్వంద్వంగా ప్రేమించ గలిగిన మానవత్వం ఉన్న మనిషి. బ్లెయిర్ 1967 లో న్యూజెర్సీ రాష్ట్రంలో పుట్టాడు. కానీ డెట్రాయిట్‌ని తన నివాసం చేసుకుని ఈ నగరంతో మమేకమయ్యాడు. తన కార్యకలాపాలకోసం అమెరికా దేశమంతా, ప్రపంచమంతా తరచూ పర్యటిస్తూ ఉన్నా, అతని గుండె చప్పుడు మాత్రం డెట్రాయిట్‌నే పలవరించి కలవరించింది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఎన్నో రికార్డులు రిలీజ్ చేశాడు. తన పాటలు తనే రాసుకునేవాడు. అతని పాటలకి లెక్క లేనన్ని ఎవార్డులు పొందాడు. కానీ ఏనాడూ ఎవార్డులకోసం అతను పనిచెయ్యలేదు. ఎన్నో ప్రక్రియల్లో నిష్ణాతుడైనా, ఎప్పటికప్పుడు ఆ క్షణాన చేస్తున్న పనిలోనే సర్వశక్తులూ కేంద్రీకరించి పూర్తిగా దానిలోనే లీనమై ఆ పనిని అత్యంత ప్రతిభావంతంగా పూర్తిచెయ్యడం బ్లెయిర్‌కి మజ్జాగతమైన లక్షణం. కవిత్వంలోనూ అనేక ఎవార్డులు గెలిచాడు. 2010లో ప్రతిష్ఠాత్మకమైన కెలలో ఫెలోషిప్‌కి ఎంపికయ్యాడు. అతను కవిత్వాన్ని పైకి చదవడానికి బాగా ఇష్టపడేవాడు. అనేక సార్లు Poetry Slam అనే కవితాపఠన పోటీలో విజేతగా నిలిచాడు. అతని కవిత్వం కూడా బాలడ్ అనే ప్రక్రియలో, గేయాలకి దగ్గరగా ఉంటూ వచ్చింది. పైకి చదవడానికి, ప్రదర్శించడానికి అనువుగా ఉంటుంది. బ్లెయిర్‌ది కొద్దిగా జీరతో కూడిన బలమైన గొంతు, స్పష్టమైన ఉచ్చారణ. పైగా భావస్ఫోరకంగా కవిత చదవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అందుకని అతనే ఆ కవిత్వాన్ని చదివి వినిపించినప్పుడు గొప్ప శక్తితో శ్రోతలని కుదిపేస్తుంది. రెండు సార్లు ప్రత్య్క్షంలో అతను కవిత్వం చదవడం విన్నాను. గొప్ప అనుభూతికి లోనైనాను. ఒకసారి అతను డెట్రాయిట్ గురించి రాసిన కవిత While I was away చదివినప్పుడు నా పక్కన కూర్చున్నామె వెక్కి వెక్కి ఏడవసాగింది. "మీరు బానే ఉన్నారా?" అని ప్రశ్నించాను. ఆ కన్నీళ్ళలోనుంచే చిన్న నవ్వు నవ్వి, It is so beautiful అన్నారామె. నాకు ఎప్పుడో పదేళ్ళ కిందట ఒక సాయంత్రం పూట హైదరాబాదులో ఒక మేడ పై అంతస్తులో డాబా పైన ఆరుబయట కూర్చుని గోరేటి వెంకన్న పాట విన్న అనుభూతి గుర్తొచ్చింది. బ్లెయిర్ చాలా ప్రతిభావంతుడైన అధ్యాపకుడు కూడా. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది - ఏదైనా పని చెయ్యడం బాగా తెలిసిన వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఆ పని ఎలా చెయ్యాలో ఇతరులకి నేర్పే అధ్యాపకులవుతారు అని. కానీ ఏదైనా కళారూపాన్ని నేర్చుకోవడానికో నేర్పడానికో ప్రయత్నించిన ఎవరికైనా ఇది నిజంకాదని అనుభవం చెబుతుంది. ఎంతో గొప్ప కళాకారులైనా అందరూ గురువులు కాలేరు. ప్రతిభావంతులైన గురువులు చాలా కొద్దిమందే ఉంటారు. బ్లెయిర్ అట్లాంటి అధ్యాపకుడు. ఏదో ఒక బడికో, సంస్థకో అంకితం కాలేదు. అంకితం కావడమంటే కట్టుబడి ఉండడం, పరిధులకి లొంగి పోవడం - అది అతని స్వభావానికే విరుద్ధం. ప్రాథమిక పాఠశాలల దగ్గర్నించీ మహా విశ్వవిద్యాలయాల దాకా, చర్చిలలో, కమ్యూనిటీ కేంద్రాలలో, సమ్మర్ కేంపులలో - ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడ ప్రత్యక్షం. ఎదురుగా ఉన్నది పదిమందైనా, వందమందైనా బ్లెయిర్ బోధనలో పెల్లుబికే శక్తితరంగం ఒకటే. నేర్పేది ఒకే ఒక్క పాట అయినా, లేక ఒక సెమెస్టర్ అంతా బోధన చెయ్యబోతున్నా ఆ బోధనకి అతని కమిట్‌మెంట్ ఒకటే. అసలే మనుషుల్ని బాగా ఆకట్టుకునే వ్యక్తిత్వం. అందులోనూ పిల్లల్ని బాగా ప్రేమించే వాడు. ఏ వయసు పిల్లల్తో అయినా చాలా సులభంగా కబుర్లు కలిపేసి, కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ అభిమానం చూరగొనేవాడు. నగరంలోని ఒక పేద పేటలో ఒక చర్చి నిర్వహిస్తున్న సమ్మర్ కేంప్‌లో ఈ వేసవి ఒక మగపిల్లల బృందానికి పాడడం నేర్పుతూ ఉన్నాడు. అతను వాళ్ళకి పరిచయం చేసి నేర్పుతున్న పాట పూర్తికాక ముందే అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. బ్లెయిర్ సంస్మరణ సభలో ఆ పిల్లల బృందం అతనికి నివాళిగా ఆ అసంపూర్తి పాటనే పాడారు - అద్భుతంగా. ఒక బ్లెయిర్, ఒక బాలగోపాల్ - ఇలాంటి వ్యక్తుల్ని మరణం గెలిచిందంటే నమ్మడం కష్టం. ఎందుకంటే వాళ్ళలో ఎప్పటికప్పుడు పెల్లుబుకుతూ ఉన్న జీవశక్తి అంత గొప్పది. వాళ్ళ జీవితాన్ని, ఆ జీవితంలో గొప్పదనాన్ని తల్చుకుని ఉత్తేజితులమవుతూ మనకి చేతనైన పద్ధతిలో, చేతనైన మేరకి వాళ్ళని అనుసరించడమే మనమివ్వగలిగిన నివాళి. తాజాకలం: బ్లెయిర్ కవిత చదువుతున్న దృశ్యాన్ని ఈ కింది యూట్యూబు లంకెలో చూడవచ్చు. http://ift.tt/1oEeftf POSTED BY NARAYANASWAMY S. 8-4-2014. :
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEeftf
Posted by Katta
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEeftf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి