పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఆగస్టు 2012, గురువారం

ఆర్.దమయంతి. || అతడొక గాయం ||

నీమీద రమ్మంటే వచ్చిందనా, వలపు
పొమ్మంటే తప్పుకు పోయేందుకు!


నీ సొగసొక సూదంటు రాయి
నా గుండెను గుట్టుగా చుట్టుకెళ్ళిపోయింది.

నువ్వెళ్ళిన వైపే నా చూపు పరుగందుకుంది
నిలవని దేహమూ ఆ వెనకే అడుగేయమంది.

నువ్ దూరమైన కొలదీ వేగమైన నడకలతో
దరి చేరాను సుమా, నీ వూరు!
గాలి అలల వీచు మేని పరిమళాలు
నీ పేరుని దాచాయి.
ఇక చాలు. వెనుదిరిగి - పొమ్మన్నాయి.

అయినా, చెలీ! ఆశ!
నిజం చెప్పు!
ఏ చీకటి రాత్రో ..
ఓ వెన్నెల వోలే
నా విషాద వీధిలోకి నాకై నడిచొస్తావ్. కదూ?!
గాయమైన గజలై, గుండె నిండుతావ్ కాదూ?

సఖీ!
నన్నా - నిమిషం కోసం ఆశ పడనీ..

యేరు వంపు తిరిగిన ఆ వంక
వసి పోని వెలుగు పూలు పెట్టుకుని
రాకుండునా నా నెలవంక?!

ఇచటనే..నన్నెదురుచూడనీ
నువ్వొస్తే అలనై
రాకుంటే శిలనై!

*08-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి