పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఆగస్టు 2012, గురువారం

స్వాతీ శ్రీపాద||కలల సాగు ||

మొహం మీద రాసుకున్న పల్చని పసుపు తెరలా
నువ్వో కాంతి వలయం వలలా
మాటల సూదంటు రాళ్ళు నా ఉక్కు మనసు పైకి విసిరి విసిరి

ఓ చిన్న బిందువులా నాలోలోని నాలోకి తొంగి చూసి
చూస్తూ చూస్తూండగానే పెరిగి పెరిగి నీలి అనంతాకాశంలా మారి
హద్దులు చెరిపేసుకు వెయ్యి చేతుల సింధువులా
చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే
మాటలు మర్చిపోయిన పెంపుడు చిలకనై
నీ జీవితం నెలవంకపై వాలి
నీ రాగాలాపనల సమ్మోహనంలో
నా ఉనికిని చెరిపేసుకు నీ చూపుల ప్రవాహంలో నేనూ ఓ వెలుగు వీచికనై
ఎన్ని జన్మల తాదాత్మ్యం ?
వేళ్ళ సందుల్లోంచి జారిపోయే చూపుల జలపాతాల మధ్య
ఎప్పుడు జారిపోయావు నా కళ్ళు గప్పి?
ఈ చీకటి విస్పోటించిన ప్రేతాల మధ్య
తలపోతల వెలుగు పూల భ్రమల్లో తచ్చాడుతూ
దాపుడు చీర దాగుడు మూతల్లో తొంగి చూసే
కలలను
ఇక్కడ నాటుతున్నాను
రేపటికి ఏ పంట పండిస్తాయో మరి

*08-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి