పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఆగస్టు 2012, గురువారం

వర్ణలేఖ || అబద్దపు గోడల్లో ||


నేనూ నీతో
ఉన్నాననుకుంటున్నావు

కాని నీవు నన్ను
నన్నులా చూడనప్పుడు
నేనీతోనే ఉన్నా
నా మనసు నను విడిచి
పరిగెడుతుంది

ఈ గల్లి ఆ గల్లి దాటి
ఊరిబయట
బస్సెక్కి, రైలెక్కి
మద్యలో దిగి

కొండల్లో సంచరిస్తూ
నెమళ్ళ నాట్యానికి
పరవశిస్తూ
కుందేలు పరుగులో
లేడిపిల్ల గెంతుల్లో
చురుకుదనం
అరువు తీస్కొని
కొండ బంతిపూల
వాసన చూస్తూ

పురాతన బావిలో
మునకలేసి ఇది
ఇంకా సజీవంగానే
ఉంది దాని సొంత
అస్థిత్వం వల్లనా
అని ఆశ్చర్యపోతూ

మళ్ళీ అడవిబాటపట్టి
చెంచుల చుంచు బట్టలు
చూసి నేను
బాగానే ఉన్నాననుకుని
చెట్టెక్కి వడ్రంగి
పిట్టతో ముచ్చటెట్టి
అడవిపూల పరిమళానికి

ఆకలి దంచేస్తే
దుంపలతో పొట్టనింపుకుని
చింత చెట్టుకింద
చిరు కునుకుదీసాక
ఎత్తైన శికరమెక్కి
ఆవలివైపు దిగి
అచ్చెరువొందించే
జలపాతంలో
జలకాలాడి
చేపపిల్లలా ఈది

సముద్రంలోపడి
ఆల్చిప్పల్లో
ముత్యాలేరుకున్నా
కాని ఇవి నాకెందుకని
సాగరానికే వదిలి
ఆవలి తీరం చేరా

గడ్డకట్టుకుపోతున్న
నీటి అంచుల్లో
మంచుతో నిండిన
కొండచరియల్లో
మనుషులెవరూ లేరని
నిర్దారించుకుని
వెక్కి వెక్కి ఏడ్చి

ఒకే ఉదుటున మళ్ళీ
నీ కళ్ళముందుకొచ్చి పడ్డా
కన్నీటి జాడను వెతికా
అది అక్కడే
గడ్డకట్టుకుపోయిందని
చాలా సంతోషించా

నీతో మామూలుగా
మసులుతూనే
నా మనో విహారపు
తీపి జ్ఞాపకాలను
నెమరెసుకుంటూ
అస్థిత్వం లేకున్నా
ఆనందాన్ని
నిర్మించుకుంటున్నా
అబద్దపు గోడల్లో

* 8Aug12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి