పొద్దున్నే మేమా జలపాతం దారిపట్టాం. ఊరువదిలి
అడివిబాట.వానకు తడిసిన కొండలు.రెండు మలుపులు
తిరిగామో లేదో గుప్పున తాటిపళ్ళసువాసన.ఊపిరితిత్తులు
దొన్నెచేసి నా అదృశ్యబాల్యాన్ని ఆబగా ఆఘ్రాణించాను
'నిన్న చూసామే మబ్బులు, అవి ఇక్కడివే' అన్నారొకరు
నిన్నరాత్రే మేఘమాల నేలకి దిగివచ్చినట్టు కొండవాగు-
జపనీయ సాధుకవిశ్రేష్టుడు సైగ్యొ ఇక్కడికి వచ్చివుంటే
ఈ సెలఏటితో చెలిమి చేసి ఒక కవిత చెప్పివుండేవాడు.
జలపాతం కూడా ఈ మాటే చెప్పింది: చుట్టూ పచ్చదనం
పరుచుకున్నప్పుడు రాళ్ళు కూడా కావ్యగానం చేస్తాయని.
అంతటా ఆవరించిన నిశ్శబ్దం మధ్య ఉరికే నీటి చప్పుడు
నా హృదయధ్వనిని నాకు మరింత స్పష్టంగా వినిపించింది.
లేఎండవేళ పచ్చికదారులమీద పూలుచల్లినట్టు వేనవేల
సీతాకోకచిలుకలు.ఏ చిరుగాలికో ఒక కాంతికోశం
పగిలినట్టుంది.వెలుతురుపోగులు నన్ను కమ్ముకోగానే
అందాకా నా చుట్టూ అట్టకట్టిన ఒక పెంకు చిట్లిపోయింది.
*10.7.2012
If you have been blessed to listen to all those sensible whisperings of your serene heart it would rather be certain that the shield of rugged rustlings crack open to invite the beams of beauty within you.
రిప్లయితొలగించండిRegards,
Narasimham Mantrala