తెల్లారేసరికి
చుట్టూ గిరిగీసినట్టు పరచుకున్న పారిజాతాల
మధ్య బోసి పోయిన వదనంతో ఏకాంతాన్ని పాడుతున్న నిశ్శబ్దపు చెట్టునై
వడలి వాడి సోలిన క్షణాలు విత్తనాలుగా
ఇంకా పదునుకు రాని సమయానికై
అసందిగ్ధ స్వప్నావస్థలో ...
ఒక వాస్తవం
నిన్నటి కలలకూ రేపటి భ్రమలకూ మధ్య
కుంగి కృశించిపోతూ మొగ్గ గానే రాలిపోతూ ...
ప్పుస్తకాల మధ్య దాచుకున్న సంపంగి పూరెక్కల పరిమళంలా
అప్పుడప్పుడు పెదవులకు అద్దుకున్న తీపి తేనెలో దొర్లిన అక్షరాలు
అచ్చర కన్నెల్లా లోకం కళ్ళకు రంగుటద్దాలు తగిలిస్తాయి
కళ్ళల్లో కలికం వేసుకున్న రాత్రి
అణువణువునా రగిలే జ్ఞాపకాల నెలవులకు
క్షణ క్షణం ఉలికిపడే కంటి రెప్పలను బలి ఇస్తూ
రక్త సిక్త వదనంతో ఉదయన్ని ఆవహిస్తుంది
నిద్ర లేమిలో కాగికాగి ఆవిరులు వెదజల్లే అసహనం
మళ్ళీ ఓ పురిటి కందులా కేర్ కేర్ మంటూ
సహకారనిరాకరణ ఘోషిస్తుంది
అయినా
బేతాళుడి శవంలా మళ్ళీ జీవితం చెట్టెక్కుతుంది
*10.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి