ఒక నది వెంట నడుస్తున్నపుడు
వయ్యారపు చిలిపి చిన్ని అలలు
నిన్నే గుర్తుకు తెస్తాయి
నీతో మాట్లాడిన వన్నీ
ఆ నీటి గాలుల పరవశంతో
చెప్పుకొని తడిసిపోతాను
పరవళ్ళు తనకు తెలిసినంతగా
మనకు తెలియవు తెలుసా
నీతో ఒంటరి సంభాషణల వెంట
నడుస్తున్నపుడు నది వాసన నిండిపోతుంది
ప్రవాహం ప్రయాణం ప్రణయం
ఎలా వెంబడిస్తాయో !
ఒక నిశ్శబ్ధం లాంటి శబ్ధం
మన చుట్టూ పచ్చికలా పరుచుకుంటుంది
ఎగిరిపోయే పక్షులు కూడా
నీటి గల గల లతో కలిసి కచేరీ చేస్తాయి
ఆలాపనకి స్వేచ్ఛ కావాలి , ఈ నది లాగే
నిర్భందం లో జీవితం
సరాగాలు పాడలేనిది
ఒంపు దగ్గర ఓ కొత్త రాగం అందుకోవాలి
కొంచెం సర్దుకోవాలి ,స్వచ్ఛ పడాలి
సూర్యుడికి చంద్రుడికి తడవాలి,మెరవాలి
ఒక మబ్బుల రాశికి
అద్దమవ్వాలి
శబ్దాల ఘర్జనకి కొద్దిగా జడవాలి
ఐనా...
పారాలి
నీ కాటన్ అలల తాకిడి
నీ తగిలీ తగలని స్పర్శ
ఒడ్డున ఇసుక తిన్నెల తడి ముద్రలతో
జీవితపు అందాల జలపాతం దాకా....
.....
2-9-2012.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి