స్వచ్చమైన నేతిమిఠాయొకటి
సుడీదార్ కట్టుకొని
స్వీట్ షాప్ నుండి బయటకొస్తావుంటే
ఆ తియ్యనైన అందాన్ని తినాలో పంచిపెట్టాలో తెలియక చూస్తున్ననన్ను
తొక్కతీసేసిన మొక్క జొన్నపొత్తొకటి
తప్పుకొమ్మని తోసేస్తే
కోకసుట్టిన కాజా ఒకటి కాపాడేందుకు ప్రయత్నించింది.
అటుసూసి,ఇటుసూసేలోపే
ఆ నేతిమఠాయి కాస్తా,
పీసుమిఠాయి పేసేసుకుని,ఎవడికోసమో ఎదురుసూత్తావుంది.
వెదవది పోతేపోయింది
గులాబీరంగు జిలేబీ మంచిబలేగా వుంటాదని
దానికోసం రోడ్డుదాటుతుంటే,హడావుడిగా పోతున్న హలీమొకటి అడ్డుపడింది
ఒక సలాం కొట్టి సాగనంపేసాను.
పక్కబండికాడ సగం తడుస్తూ నుంచుంది పానీపోరొకటి.
కొంచెం కారంగా,గారంగా తినుకుంటూ తాగుదామని
పోయి పక్కన్నిల్చున్నాను.
తాగుతుంది మినరల్ వాటరు కాదేమో, జనరల్ వాటరైతే జలుబు సేత్తాదని
ఇదొద్దురాబాబూ అని అక్కడనుండి కూడా వచ్చేసాను
కాస్త పొడుగ్గా,నాజూగ్గా మసాలాసల్లిన బజ్జీలు కనిపించేసరికి మరోబండి దగ్గరాగిపోయాను
కొన్ని పొట్టిమిరగాయలు,కొన్ని గట్టిమిరగాయలు కనబడ్డాయక్కడ.
సూడ్డానికే కారంగా కనిపిస్తున్నాయ్, తింటే దిమ్మతిరిగిపోద్దని బయపడి.
సల్లగా మెల్లగా షోడాహబ్ దగ్గరకొచ్చాను.
అక్కడ ఏరంగుదాన్ని సూసినా బుస బుసలూ, రుస రుసలే.........పొంగుతూ,తొంగిచూస్తూ!
ఇక లాభంలేదు ఈ పూటకి నా ఆకలి దప్పులు తీరెట్టులేవని
రైట్ క్లిక్ చేసి
రీఫ్రెష్ అయ్యి
షడౌన్ అవడానికి సిద్దమయ్యాను.
.....
*25.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి