పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జులై 2012, శనివారం

ప్రొ.పులికొండ సుబ్బాచారి॥ ఆ శవం ఈ దారిలోనే పోవాలి..॥


గడ్డపలుగు చెలకపార మాట్లాడుకుంటున్నాయి
తమను పట్టుకునే చేతుల కేమైందని
వరి దుబ్బులు అనుకుంటున్నాయి
కలుపు తీసి ప్రేమతో తమ వేళ్ళు చక్కవొత్తిన చేతుల కేమైందని
నాగలి మేడి కన్నీరు పెట్టుకుంటూంది
తన సోగను పట్టుకున్న చేతుల కేమైందని
ఇంటి వసారాలో మూలకున్న తలపగ్గం ముల్లుగర్రా
గుసగుసలాడుతున్నాయి
ఆ చేతులు తమను ప్రేమతో పొదువుకోవడం లేదేమని
మెట్ట చేలో కోండ్ర తిరిగిన దుక్కి సాళ్ళు
తమ వెంట నడిచిన పాదాల కేమైందని బుగులుకున్నాయి
ఇంటిదారి అరక, కోటేరు వెనుక గీసిన ఏడికర్ర గీత
తనను ప్రేమతో తొక్కిన పాదాల కేమైందని దిక్కులు చూస్తూంది
ఎండిన మబ్బులు చూస్తున్నాయి అతని కళ్ళకేసి
నుదిటి చేత్తో తల పైకెత్తే ఆ నింగిచూపులెక్కడా అని
దమ్ము చేయని వరి మడి..
తన బురద గంధాన్ని అలదుకునే ఆ దేహం ఎక్కడా అనీ...
ఎండిన కృష్ణా గోదావరులు నిండుగా ఎడ్ల జత కళ్ళల్లో.....

బి.టి, మొన్ సాంటో ఏదైతేనేం
ఇక్కడ వేసిన గ్లోబల్ పత్తి విత్తనం
ఏదేశంలో డబ్బుకురిసిందో ఇక్కడ కళ్ళల్లో నీళ్లు విత్తింది
రెండు వేల అడుగులు దిగిన బోరుబావి
గొడ్డు గేదైంది, వడ్డీ సేటయింది
ఇంట్లో నగలను కంట్లో నీళ్ళనీ కాజేసింది
అది ఏరువాక పున్నమి కాదు
నిండు అమాస.. ఎవరు దోచారు ఇక్కడి వెలుగు వసంతాలను
గొర్రుకు పెట్టిన నొగలు పాడెకట్టె లయినాయి
అరకకు కట్టే పగ్గం పాడెకు దేహాన్ని కట్టింది.

ఓ స్వతంత్ర భారత దేశమా ఒక రోజు సెలవు పెడతావా
నీ వెన్నెముకని ఆర్ధో పెడిక్ హాస్పిటల్ లో చూపించాలి
యువతరమా నీ క్రికెట్ ఛానల్ కాసేపు ఆపుతావా
రైతు శవం దగ్గరి పెళ్ళాం బిడ్డల ఏడుపులు
నేను కాసేపు గుండె నిండా వినాలి
ఓ పార్టీల నాయకులారా మీ రోడ్ షో కాస్త ఆపుతారా
ఒక రైతు శవం ఈ దారిలోనే పోవాలి....
*13.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి