పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, సెప్టెంబర్ 2012, శనివారం

కట్టా. శ్రీనివాస్ || నడక


ఆవిష్కరణాత్మక ప్రగతిశీల ఆలోచనలు
నీ విశాల నిశీధి గదులలో
పరుచుకుంటూ వెలగాలి.
అక్కడితో చాలదు.

ఆ వెలుతురు దారిలో
నీ ధ్రుఢమైన అడుగులు
తడబడకుండా కదలాలి


లకుముకి పిట్టా
అప్పుడే నూతన ద్వారం నిన్నాహ్వానిస్తూ
తెరుచుకుంటుంది.
నీక్కావలసిన నిధికూడా
అక్కడే దొరకొచ్చు.

http://antharlochana.blogspot.in/2012/09/blog-post_27.html

మూర్తిరాజు అడ్లూరి // నీవు ఏది పొందలేవు


అది నాదె
ఇదినాదె
అన్ని నీ ఇంట్లొ
వుండాలని
ఆశపడ్డావు
ఏది కాకుండా
నీవు వీధినపడ్డావు

స్వార్థం మూసీ కంపు
నీదేహమంత ప్రవహిస్తుంది

నీఅవాగ్దానాలే
నీగొంతులో అబద్దపు
పుండ్లు గా పుడుతాయి

స్వార్థమా నీవు ఏదిపొందలేవు

26/09/2012

కాసుల లింగారెడ్డి // వర్గశత్రువు

కాలం ఎవని కనుసన్నల్లో
నడవదు
ప్రాణం ఎవడి సేఫ్టీలాకర్లలో
నిలువదు
అక్క
పెద్దోడు
చిన్నోడు
అచ్చంగా అబ్డామినల్‌ పెయినే అంటరు
హఠాత్తుగా
జీవం అలుగు దుంకుతది
ఒక్క కాటు
మూడు పసి పిట్టలు
'సేవ్‌ స్నేక్‌' మహోద్యమకారులారా!
చంపండి ఇప్పుడైనా-

ఉగ్రవాదం
ఏ మట్టిపొయ్యిమీద ఉడుకదు
సామూహిక హనన చర్య
ఎవడో మీటనొక్కందే ప్రాణాలు ఎగురేసుకపోదు
దారిద్య్రం దారి దోపిడికి లైసెన్సు కాదు
కసబ్‌ వేలి అంచులమీది కాలిన శవాల కమురు
కడిగేస్తే పోదు
183 మాత్రమే కాదు
సమస్తం నిషేధం విధించుకున్నా
పిల్లి మెడలో నేనే గంట కడతా
ప్రాణదాతను కదా నేను
కసాయిలను ఉరితీసే తలారినైతా

పంచభూతాలు
ఎవడి పాదాక్రాంతమూ కావు
ఎవడి పడకెక్కే
పసిడి కాంతలూ కావు
'బాంచెన్‌, కాల్మొక్కవు'
ఒరేయ్‌ మూర్ఖుడా!
చుట్టబెట్టుకొని
ఉక్కు లాకర్లలో భద్రపరుచుకునేది
ఉట్టి కాగితపు ఉండలే
జీవకోటి ప్రాణాధారపు భూమి కాదు

నాగలి భుజాన మోస్తున్న రైతా!
సర్రున కర్రు లాగి
నా దేశ భూస్వామ్యం గుండెల్లో గుచ్చు
చెమట నెత్తుర్లు పోసి
చక్రాన్ని తిప&్పుతున్న శ్రామికా!
నేలతల్లి కడుపు చీల్చి
బంగరు వనరుల దోస్తున్న బడాచోరుల పాతరెయ్‌

వర్గశత్రు నిర్మూలన
ఒక అనివార్య చర్య.

(వరంగల్లు జిల్లా బచ్చన్నపేటలో2-9-12నాడు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు ఒకే రాత్రి, ఒకే పాము కాటుకు మరణించిన విషాద సందర్భంగా)

సురేష్ వంగూరీ || ఏకాంతం


నాకెవరూ లేరనుకోకండి
నాతో నేను స్నేహించడానికే ఈ ఏకాంతం

ఏకాంతంలో
కొన్ని జ్ఞాపకాల పలకలూ, బలపాలూ
నన్ను నేను దిద్దుకుంటూ, చెరుపుకుంటూ

ఏకాంతంలో
కొన్ని అనుభవాల అద్దాలూ, అర్ధాలూ
నన్ను నేను చూసుకుంటూ, తెలుసుకుంటూ

ఏకాంతంలో
కొన్ని అవకాశాల తలుపులూ కిటికీలూ
నన్ను నేను తెరుచుకుంటూ, తొంగిచూస్తూ

ఏకాంతంలో
నన్ను ఉతుక్కుని ఆరబెట్టుకుంటాను
నన్ను వెతుక్కుని కూడగట్టుకుంటాను
నాకు నేనే భుజం తట్టుకుంటాను

నాకెవరూ లేరనుకోకండి...
హృదయాన్ని పైకి లాగి బిగించి కట్టుకుని
మళ్లీ మనుషుల్లో కలవడానికే ఈ ఏకాంతం

27. 9. 2012

చేపూరి వినాయకప్రసాద్ || రాయాలి...


రాయాలి..
రాళ్ళని మార్చాలి...
మనసుని కవ్వించాలి..

హృదయాన్ని రంజించాలి...
తనువుని తుళ్ళించాలి...

గమ్యం వైపు మళ్ళించాలి..
కర్తవ్యం భొధించాలి..

అదే కవితల్లొని మూలమంత్రం...


27SEP2012

--శ్రీవిప్ర--

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ || ప్రేమవతారుడు

మొదటిసారి అతడి రక్తం చిందించబడింది
అతడికి ముళ్ళకిరీటం అలంకరించబడ్డప్పుడు

అతడు శిలువను మోసాడు
దానితోటే అందరి పాపాలను మోస్తున్నానని భావించాడు
ఆ బరువుతో శరీరమొంగినా..
తనలో కరుణ మాత్రం నిఠారుగా ఉందని చాటాడు

అతడి రక్తం స్రవించి ఇంకుతూనే ఉంది
వంటిపై కొరడా పేల్తున్నప్పుడూ
శిలువకు మేకులు మోదుతున్నప్పుడూ

రక్తమింకిన ప్రతిసారీ..
అతడి ప్రేమద్విగుణీకృతమయ్యిందనుకున్నాడు
అతడు నోరు తెరిచి అడగడడమే తరువాయి..
దైవం తరఫు లక్షల సైనికులు
అతడి పక్షాన నిలబడే అవకాశముండీ
ప్రేమించే బలహీనత వల్ల
అతడు మిన్నకున్నాడు

సరిగ్గా మూడ్రోజుల తర్వాత
అతడు పునరుజ్జీవితుడయ్యాడు
కానీ..
ఇంకా భూమిపై ఎన్నో
సంపూర్ణ ప్రేమోద్భవ హృదయగర్భాల ద్వారా
అతడు నిత్యం
పునరుజ్జీవితుడవుతూనే ఉన్నాడు!! 
25SEP12

ఆదూరి ఇన్నారెడ్డి || నా చుట్టూ నీడలు నీ ఆకారంలోనే ఉన్నాయి


నేను నేనుగా
నిన్ను చూసినప్పుడే
నీ నువ్వుగా మారాను
నీకు నువ్వుగా
నన్ను పలకరించినప్పుడే
నా నవ్వుగా మారావు
నీకు నాకు నడుమ
అక్షరం ఆలంబన అయితే
నా గుండెలో భావాలు
విరిసే పుష్పాలుగా మారాయి
కదులుతున్న కాలంలో
నీ కలం కమనీయమయితే
నీ కోసం నిరీక్షించే నా కన్నులు
రమణీయతను చాటుతున్నాయి
అద్దంలో మనిషి ముఖం కనిపిస్తే
ప్రేమించే హృదయంలో
మనసు రూపం కనిపిస్తుంది
ఒకచోట నిలబడని ఊహ
ఒకనాటికి అంతమవని అజ్ఞానం
ఒకేసారి పలకరించే అనురాగం
ఒకే క్షణంలో పోయే ప్రాణం
ఇలా ఒక్కొక్కసారి జరిగే కదలిక
ఎక్కడికక్కడ తలుపులు తెరుచుకుని
తలపులే వేదికగా ఎప్పటికప్పుడు
మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి..
జీవితం నుండి, హృదయ స్పందన వరకు
వదలలేక వదిలి తిరుగుతున్న గుండె చప్పుడు
మరింత వేగాన్ని పెంచినా
కించిత్ మెరుపు వేగంతో
చీకట్లను చీల్చుతూ వెలుగుల్ని చిత్రిస్తూ
నా చుట్టూ నీడలు నీ ఆకారంలోనే ఉన్నాయి
అవును
ఇపుడు
నాలో కనిపించేది నేను కాదు
నాలో వినిపించేది నా స్వరం కానే కాదు
నా స్తంభించిన గుండెను నడిపిస్తున్న ఒక తరంగం
అదే నాకంటూ మిగిలిన..ఓ చిన్ని అశాతరంగం..

నీ కళ్ళలో కాంతులే నా ఊపిరి..
పెదాల మద్య మెరిసే చిరునవ్వుల కాంతే నా జీవం..
అలా జీవిస్తున్న ఇద్దరిమద్యి కాలం కఠినంగా ఉంది..
కాలం కఠిన మైంది కాబట్టే ఇదరినీదూరం చేసి వెర్రినవ్వులు నవ్వుతోంది

పీచు శ్రీనివాస్ రెడ్డి || పార్టీ వార్తలు


ఒద్దికగా ఒదిగి
ఆకాశమంత ఎదిగి
ఆయుధమై కదిలే అక్షరాన్ని
రాజకీయ పక్షపాతం
కబ్జా చేసుకుంటోంది

అక్షరాలు సిగ్గు పడుతున్నాయి
అసత్య వార్తల్లో
తమకు అంగీ లాగు తొడిగినందుకు

ప్రతిపక్షానికొకటి
మిత్రపక్షానికొకటి
అధికారపక్షానికొకటి
ప్రజాపక్షానికే
దినపత్రిక కరువయ్యింది

ఎవడి పత్రికల్లో వాడు
గొప్పగానే కనిపిస్తున్నాడు
ఎవడి ఛానల్లో వాడు
మేమే గొప్పని
అరుపులు పెడబొబ్బలు

ఇది
శబ్దం నోరు పారేసుకుంటున్న
మహానగరం
ఇక్కడ
గట్టిగా నోరున్న వాడిదే రాజ్యం

అక్షరానికి పక్షపాతం పులుముతున్న
పత్రికలు, చానళ్ళు
వ్యాపారం రాజకీయంలో భాగమై
రాజకీయమే వ్యాపారమై
పార్టి ట్రేడ్ మార్క్ వార్తలు
చిలకపలుకులై కూత పెడుతున్నాయి

భయపెట్టే అక్షరం
భయపడుతోంది
ఎవడి సొంతానికి వాడు
వాడుకుంటుంటే

పార్టీలకు అమ్ముడు పోయిన పత్రికలను
నడి బజార్లో తగలబెడుదాం
పోనీలే అని కూర్చుంటే
నిజం నిశ్శబ్దంలోకి జారుకుంటుంది మరి !
26-09-2012

కరణం లుగేంద్ర పిళ్ళై // సేవానిరతి


చేసిన సేవకు
ప్రచారం అవసరమా
ఎప్పుడు చెప్పుకోవాలో
ఎప్పుడు కూడదో తెలుసా

ఎన్నడయినా
రెప్పల చప్పుడు విన్నావా
నిశ్శబ్దంతోనే
విధిని నిర్వరిస్తుంది

గుండె లయలు విన్నావా
ఎప్పుడయినా
అవి శబ్ధం చేస్తూనే
విధిని నిర్వరిస్తుంది 
26.9.12

కట్టా శ్రీనివాస్ || నీ రంగేమిటి ?


పారదర్శకమైన మనసు పట్టకం గుండా.
ప్రపంచపు తెలుపు ప్రతిఫలిస్తే విరిసే హరివిల్లు.
అదే నేను, అదేనేమో మనమంతా.
అసలు రంగులే లేవు
తరంగధైర్ఘ వ్యత్యాసమే లేనపుడు అంటాడు రామన్.
అలాగే నేనూ లేను.
వేరు వేరు భావోద్వేగాల స్పందనలు ప్రతిఫలించనపుడు.

వంటికో రంగు,వృ త్తి హంగుకో రంగు,
ప్ర వృ త్తికో రంగు,
ప్రపంచం ఏ రంగుల అద్దం గుండా చూసినా,


లకుముకి పిట్టా,
లోపలున్న ఆ ఒక్కటే నేను.

http://antharlochana.blogspot.in/2012/09/blog-post_25.html

కర్లపాలెం హనుమంత రావు ॥ కొన్ని చురకలు


1
ప్రతి ఏడాదీ పోలింగ్ చుక్కలే
ఐనా పోలియో
మన ప్రజాసామ్యానికి!

2
బెల్టుబాంబుకు కొందరే
బెల్టుషాపుకు
ఎందరో!

3
క్విడ్ ప్రో కో
పెద్దల
నగదు బదిలీ

4
గద్దె మీది
'గోవింద'రాజులకు
స్విస్ బ్యాంక్ లాకర్లే
ఆరో గది

5
యూరియా మెతుకు లేదు
యురేనియం సంపెంగ నూనె
దేశం మీసాలకి!

6
చిన్న చినుక్కి ఎంత శక్తో!
చిటికెలో నగరం
హిందూమహాసాగరం

7
ముళ్ళెక్కువా
పూలు తక్కువ
మన్మోహను సర్కారు
బ్రహ్మజెముడు సంస్కరణలకు

8
మీడియా మేధావులు
మరీ ఎక్కువై పోయారు
తెనాలి రామలింగులూ
తెలారంగానే
జుట్టుకు తెల్లరంగుతో తయారు!

9
రాజులు డొక్కు బస్సుల్లో
బంట్లు బుగ్గ కార్లల్లో
భలే ప్రజాస్వామ్యం!

10
వేలు పట్టుకు నడిపించిన అమ్మా నాన్న
వేలు విడిచిన చుట్టాలయారా కన్నా!
వేలు సంపాదిస్తునావనా..హన్నన్నా!

11
పిడుగు ముందూ
మెరుపు తరువాతా
ప్రియురాలి చెంప దెబ్బ

కొసరుగాః
12
ఆక్రో శాక్రోశ ఘోషంబై
వికట కఠోరాట్టహా సోద్భటం బై
వక్రభూవల్లరీ సంవలన భయదంబై
స్ఫార నిశ్వాస ధారా చక్రంబై
కంగారొద్దు
మా అటక మీది తాళ పత్రాల
వట్టి తాటాకు చప్పుళ్ళ గోల

జగద్ధాత్రి || అవసరమా?


దాపరికం అవసరమా నేస్తం?
అడిగాను సందేహంగా
అవసరమే ... ఖచ్చితమైన జవాబు
సూటిగా తాకింది చెవిని

కొన్ని మాటలు , కొన్నివిషయాలు
కొన్ని సంఘటనలు కొందరితో చెప్పకూడనివి
చెప్పకూడదు ...అందుకు అవసరమే దాపరికం
నిష్కర్ష స్వరం లో పలుకు సోకింది కర్ణ భేరిని

ఏమో మరి ...పెదవి విరిచాను
ఏది దాయాలో ఏది దాయ కూడదో
నిజంగా నాకు తెలీదు సుమా
అన్నా భుజాలెగరేసి

మనసు , మమత జంట కట్టిన
అనుభూతుల రసావిష్కరణ
మది లో చెలరేగే మధుర తుఫాను
అక్షరాలుగా ఒలికి పోతాను

హృదిని వేధించే బాధలను
మాటలలో పంచుకుంటాను
చుట్టూ ఉన్న సమస్యలకు
కవితావేదన గా ఎక్కడన్నా
పరిష్కారాలు దొరుకుతాయేమో నని
వెదుకులాడుకుంటాను

ఘనీభవించిన భావ ప్రకంపనలను
ఉద్విగ్నతతో ఉల్లేఖిస్తాను
అన్యాయపు వక్ర వర్గాలను
తూర్పార బట్టకుండా ఉండలేను

మనుషుల మది మేధలలో
అలుముకున్న విష మేఘాలను
అనురాగ వర్షమై అలికి వేస్తాను

అనుభవాల , అనుభూతుల సారాన్ని
మరు తరం వారికి పంచి
జీవితమేమిటని ఎరుక కల్గిస్తాను

అందుకే నాకు దాపరికాలు లేవు
తప్పులో ఒప్పులో మెప్పులో దేప్పులో అయినా
మనసు చెప్పిన మాట
మేధ గాంచిన బాట
పదిమందికీ పంచి పరవశిస్తాను
కొందరి హృదినైనా కవితా దివిటీనై
వెలుగుతూ, వెలిగిస్తూ సాగిపోతాను

ఇక ఇప్పుడు చెప్పు దాపరికం అవసరమా?
జీవితానుభవాల సారాన్ని
దాచుకోవడం అవసరమా నేస్తం ??
దాచకుండా చెప్పు !!!

అనిల్ డ్యాని // ఎడబాటు


ఎడబాటు తేలికేం కాదు
నువ్వు
పలికినంత
చిన్న పలుకేం కాదు

లేత గులాబిని రేగు ముళ్ళు తో
చీల్చినట్టు చేసిందా మాట నా
గుండెను చూడు ఎంత ప్రేమ
స్రవిస్తుందో నెత్తురులాగా

మన చూపులే భయం నిండిన
కనులతో భారంగా కిందకి
దిగుతున్నాయి సంధ్య సమయాన
సూర్యునిలా

నా ఊహలో అందే కట్టని నీ
నీ పాదం నిష్క్రమణ అడుగుల సవ్వడి
వందల సైన్యం కవాతు చేస్తున్న
శబ్దాలతో కంపిస్తుంది నా గుండె

ప్రాణం పోవడం అంటే ఇదా
నువ్వెళ్ళి పోతున్నావనే ఊహ తో
నాకు తెలిసొస్తుంది
కన్నీళ్ళు పోసి పెంచలేను
మన ప్రేమ మొక్కని నీ ఎడబాటుతో

నువ్వు లేకపోయినా
నీ ఉహ ఉంది నా దగ్గర
ఊపిరి భారమైన
నీ తలపులనే శ్వాసిస్తూ
ఎడబాటు కారణాలను
అన్వేషిస్తూ సాగుతున్నా
ఎడబాటు దూరం ని దగ్గర చేసేందుకు
అది జరుగని క్షణాన .............................

సందేహమే లేదు సమిధను అవుతాను
నీకోసం ఎడబాటు తట్టుకోలేక
నీ ప్రేమను ప్రేమిస్తూ నిరంతరం

26SEP12

చింతం ప్రవీణ్ || వాడు...


నేను నడుస్తున్నానన్నా మాటే గాని
నా అడుగులు హైజాక్ చేయబడ్డాయ్

నేను బిగించిన పిడికిలిలో
నా ఆవేశం హైజాక్ చేయబడ్డది

నేను నినదిస్తున్న గొంతులో
నా నినాదం హైజాక్ చేయబడ్డది

చివరికి
నా అన్నదమ్ముల బలిదానాల్లో
త్యాగం హైజాక్ చేయబడ్డది

కాంగ్రేసోల్లు...
పచ్చంగోల్లు...
ఒక్కన్ని మించిన దొంగలు ఒకలని
వాన్ని నమ్మినం
వాని జెండాలు మోసినం...

ఆ జెండా వెనకాలే
నడిచినం...
పరిగెత్తినం...
నినదించినం...

ఇప్పుడు
ఆ రంగులమారి జెండా వెనక దాగున్న
నెత్తుటి అజెండా తేటతెల్లమైంది...

నాకేం ఎరుక వాడు

చేతులు కట్టేసి
పిడికిలి బిగించమన్నడని
గొంతు నొక్కేస్తూ
నినాదమివ్వమన్నడని
నడుస్తున్న దారిని తవ్వేసి
పరిగెత్తమన్నడని

నాకేం ఎరుక వాడు
ఆకాంక్షను అంగడి చేసి
ఉద్యమించమంటున్నడని
వేదికలన్నీ కూల్చేసి
ప్రసంగించమంటున్నడని
నిలువెల్లా గాయం చేసి
మందు పూస్తున్నడని...

నిజానికి
వాడెప్పుడూ అంతే...
జనాలు నెత్తురోడుతుంటే
మౌనమే వ్యూహమంటడు
ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే
వూరౌతల వుంటడు
పోరాటానికంతటికి
పేటెంట్ దారున్నంటడు...

26.09.2012

నీ || "నిలువెత్తు హృదయాన్నై"


"దేహానికి-మనసుకి మధ్య
సరిహద్దు రేఖలే లేక పోతే..

దేహాన్ని ఆత్మలో విలీనం చేసే
విద్యలె వస్తే..

దేహం నుంచి ప్రాణాన్ని విడగొట్టి
మనగలిగే మహిమలే తెలిస్తే,

"చొక్కా" విడిచి హాంగర్ కి
తగిలించినట్టు,

ఎంచక్కా శరీరాన్ని మడిచి
శ్మశానం లో విడిచి
నిలువెత్తు హృదయాన్నై కదలాడేవాణ్ణి..!

"బ్రతకటానికి శరీరం మీద
ఆధారపడ్డ అధముణ్ణి....!"

నాలోపల లోలోపల
అంతర్వర్షం తపిస్తే

నన్నెందుకో..
భూమ్యాకాశాలు మరిస్తే

హ్రుదయాన్ని తడిపి ముద్దెయ్యలేని మాటలు
ఈప్రపంచాన్ని జయిస్తే

అనామకంగా అంతరంతరాలలొ
అదేపనిగా అంతరిస్తా..!!

........నీ
(నాకు తాత్విక స్పర్స అంటే చెప్పిన మనిషికి..)

26సెప్టెంబర్2012

ప్రియ కారుమంచి // మహల్లో కో యిల

ఆకాశాన్ని తాకాలని
ఆశ పడ్డావ్ కానీ
నా మనసు లో ఎగిసే
భావాల్ని కుడా చేరలేక పోయావ్ !!

బ్రతుకు సంద్రాన్ని గొప్పగా
ఈదాలని ఆరాట పడ్డావ్ కానీ
నీ విరహం తో తడిచిన
నా గుండె తడి ని చూడలేక పోయావ్ !!

నక్షత్రాల మెరుపుని చూసి
మురిసి పోయావు కానీ
నా మనసు విరబూసిన వెన్నెలైనా
నీ కోసమే అని తెలుసుకోలేక పోయావ్ !!

అయినా ఇది నీ తప్పు కాదులే
నేను నీ మహల్లో కోయిల నే కానీ
నీ నిశీధి గుండెను చేరే
తీయని గానం చేయలేక పోయానేమో !!

మోహన్ రుషి // డ్యుయల్ సిం

వైరుధ్యాలను పెంచి పోషించినవాడే
వైవిధ్యాల గురించి మాట్లాడ్తాడు!

విధ్వంసానికి మూలంగా నిల్చినవాడే
విలయంపై విలపిస్తాడు!

నిలువ నీడ లేకుండా చేసినవాడే
నీ జీవనానికై నినదిస్తాడు!

పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించినవాడే
బ్రాండ్ బాజా బారాత్ అంటూ వూదరగొట్టేస్తాడు!

****

సహనానికి ప్రతీకలుగా నిల్చిన మనమే
సాగర హారమై పోటెత్తితే...
ఆచూకీ దొరకని శవంలా
కొట్టుకుపోతాడు వాడు!

26.9.12

శిలాఫలకం || కావ్యశ్రీ

జీవితం
ఒక్కసారిగా
కళ్ళముందు
సాక్షాత్కరించింది
అనుకోనివి
అనుకున్నట్టుగా
జరుగుతున్నట్టు,
అనుకున్నవి
అనుకోనట్టుగా
దూరమౌతున్నట్టు,
గుండె
తనువు నుండి
విడవడినట్టు,
మనసు మృతమైనట్టు
ప్రేమ శూన్యమైనట్టు

కళ్ళు
ఒక్కసారిగా
బలహీనపడ్డాయి
ఉదృతమైన సంద్రం
ఉప్పొంగినందుకేమో?
కొట్టుకుపోతున్న
వరదలో
జీవిత చిత్రాలు
ప్రదర్శింపబడుతున్నాయి
అస్పష్టంగా

ప్రేమ
శాశ్వతమనే
శిలాఫలకం
చిధ్రమైనట్టుంది

రక్తపుటేరుల
ప్రవాహమును
తగ్గించటానికని
మొండిచేతులతో
విఫలయత్నం చేస్తుంది

ఒక్కసారిగా
భూమి కంపించినట్లయింది
కలువకున్న
కలిసున్నట్టు
కనిపించే
సంద్యా -సంద్రాలకి
చేరువయింది
ఒంటరితనం
చీకటైంది .

తనువు
ఒక్కసారిగా
పులకించింది
చేయి పట్టుకుని
దారిచూపుతానన్నట్టు
నిమురుతుంటే
చూసాను
ఒక్కసారిగా
గుండెల్లో
చిల్లుపడుంది
బొట్లు బొట్లుగా
రక్తపు చుక్కలు
ఘోషిస్తున్నాయి
పాదాలు మాయమై
గాయాలు నడుస్తున్నాయి
రక్తవర్ణములో
పాదాలు రెండు
దారంతో
ముడివేసినట్టున్నారు ఎవరో
వేల్లు లేని
చేతులు
విలవిల్లాడుతున్నాయి
దించకుమని
అదృశ్యంగా

ఒక్కసారిగా
తనువులు
ఏకమైనాయి
ఒక్కసారిగా
అగ్నికెరటం
ఎగసిపడింది
ఒక్కసారిగా
వెలుగు
విరజిమ్మింది

శిలాఫలకం
శాసనమై

గుండెకున్న
చిల్లులను
పూడుస్తుంది

వెలుగులో
గాయాలు
మాయమైనవి

||కావ్యశ్రీ ||
25/09/2012

కపిల రాం కుమార్ // ఏడవకు ఏడవకు వెర్రి నా తల్లి

ఏడవకు ఏడవకు వెర్రి నా తల్లి
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు !
ఈ నాఅటి లోకాం మోసాలు ఎన్నో
తెలవకుండ నీవు కాలిడకు తల్లి !

ఎర్రాని ఎండల్లో చెమటోడ్చు నీ తల్లి
వచ్చేను యిచ్చేను మురిపాల లాలి !
ఆందాక ఉయ్యాల నీకు తోడమ్మ
ఊగేటి కొమ్మల్ల గాలి నీదమ్మ !

పొట్టకూటికి మట్టి తవ్వే
పలుగు పారలె నేస్తగాళ్ళు !
గుడిసె బతుకున మట్టిపరుపులు
గుట్టుచెప్పీ గుజ్జన గూళ్ళు !

ఇంటిలోనివారు యినుమువంటివారు
కార్ఖాన గుట్టల్లొ కరిగిపోతున్నారు !
రేపటి నీ బతుకు వెన్నెలా కాయాల
మాపిటేలా దాక సద్దుచేయకనుండు !

గుక్కపెట్టి నీవు రోదించకమ్మ
అమ్మ నీకిపుడు పాలివ్వకున్నాది !
కమ్మటి ముద్దిచ్చి కదిలిపోనుంది
ఎండిన రొమ్మున పిండినారావు !

గంజి కరువైన కడుపున పుట్టావు ! పాలు రాని రొమ్ములో
రక్తమైనా మిగలనీ ! కన్నీళ్ళు దాచేసి బోసి నవ్వులు రువ్వు!

25-09-2012

రామాచారి బంగారు // నామది నీతీరున సాగునది

నా అనుమతి
లేకుండానే జొరబడి

నామది గది తలుపులు
తెరచి మూసినది
నీ తలపుల ముచ్చట ఒక్కటి.

మదిగది ఒక్కటైనా
అరలలో కోటి ఆశలుంటాయి
శతకోటి తలంపులు
వసంతంతో అనుపల్లవులు పాడతాయి.

అనంతకోటి
మధుర భావనలు
సుధా మధుభాండాగారంలో
అంపక,పంపకాలతో
సాగిలబడి మొక్కుతుంటాయి.

మాగిన పుట్టతేనేలను
మూగమది మురిపెంగా ముద్దాడేను.

మాటవినని మారాం చేసి
మూగనోముతో చెలిమికట్టి
ఎటో వెళ్ళిపోయిన వలపుపవనం
భూగోళమంతా తనదేనని మురిసి
పులకరించి మేఘం ను పలకరించినది.

చూపులు కలసిన శుభవేళా
అభిరుచి శశితో
వలచిన అభిమానికి
మాయాబజారు ముంగిట
మోగేను పెళ్ళి బాజాలు.
ముందున్నదీ వివాహ భోజనమే మరి.
25/09/2012.