పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఆగస్టు 2012, బుధవారం

కాశీరాజు || సొంతడబ్బా కొంతమానకు ||

పొద్దున్నే లెగిసి
ఓ ముద్దు ముడుపిచ్చి.
మద్దేలకు తిరిగొచ్చి
మళ్ళీ మూతి బిగించి

సాయం’కాలానికి’ గేలమేసి
నీ సూపులన్ని పట్టేసి.
ఆ కాలాన్ని నిలవేసి
కవితలెన్నోరాసి.
చుక్కలొన్నో తెచ్చి
నీ పక్కన పడేసి
రాత్రులెన్నో రాసిచ్చే
నాలాటి వస్తాదు మొగుడొస్తాడని
ముస్తాబైన బుల్లెమ్మా
నీ దస్తావేజులు పట్రా!
ఓ సంతకం సేసేత్తాను.

*07-08-2012

కె క్యూబ్ వర్మ || ఈ ఊరు విడిచి వెళ్ళ బుద్ది కాదెందుకో.. ||

అవును పురిటి వాసనేసినప్పటినుండీ
అలవాటైన ఈ నేల ఈ గాలి ప్రతి శ్వాశలోను
ఇంకి దేహమంతా పరిమళిస్తూంది....

ఇవే ముఖాలు ఇవే మాటలు
అవే యాస అవే జీవితాలు
అవే అనుబంధాలు అవే స్నేహాలు
అవే కోపాలు అవే తాపాలు
అవే కొమ్మలు అవే కొండలు
అవే నదులు అవే రహదారులు
అదే రుచి అదే కమ్మదనం
అదే అమ్మతనం
అలా అంటుకు పోయిందెందుకో...

తెగని ఈ బంధం
ఎడబాటుకు ఓర్వలేదెందుకో
ఈ నెమ్మదితనం ఈ అమాయకత్వం
అలా గుండె చుట్టూ గూడు కట్టుకున్నది...

ఏదో వలస పక్షిలా అలా ఎగిరి
ఆ నగరపు జనారణ్యంలో ఒక్కసారి
ఎగిరి వచ్చినా ఇమడలేనితనం...

ఏదో పరాయితనం వెంటాడుతూ
పరుగులు పెట్టిస్తున్న ఆ పయనం
నిలవనీయదు ఆ కాంక్రీటు జంగల్ మధ్యన....

ఈ కాకి పిలుపు లేని ఉదయం తెల్లారనీయదు..
ఇక్కడి ఆవు అంబా అని ఆప్యాయంగా
నాలుక చాపుతూ లేగ దూడను సాకేతనం
అగుపడక పాకెట్లలో బందీకానితనం పరుగులు పెట్టిస్తుంది....

ఇక్కడి వేప పుల్ల తీయదనం
పెదవుల చివరంటా రుచిస్తూ స్పృశిస్తూంది...

ఆకలి దప్పు;లు సహజంగా స్వీకరించే గుణం
ఎందుకో అడుగు బయటపడనీయదు...

ఈ నేలతో పేగు బంధం విడదీయరానిదిగా
ఏదో ఋషిత్వాన్ని ఆపాదిస్తూ
ముందరి కాళ్ళకు బంధం వేస్తూంది....

ఈ అమ్మతనం దూరం కానీయకు...
*07-08-2012

అవ్వారి నాగరాజు || మమ్చి వాడి బాధ ||

రాయడం సమస్య కాదు రాయాల్నకున్నది రాయడం­-
చిరిగిన నిక్కరులోంచి కదిలే

కర్రి పిర్రల వాడిననుకొని
తలుపులు తెరుస్తూ వచ్చీ పోయే చినుకుల మృత్యు శీతల స్పర్శ

కదలాడుతున్నది ఇక్కడ
అతిశయానికి బదులు కాళ్ళంట సుర్రుమనే భయముచ్చ

మొదలెట్టి ఒక్కటే కడదాకా లాగలేకపోవటం
అహో ఆటలో నారి సారిస్తూ నారి పొంగిన ఆ-
నా బలమో బలహీనతో- మళ్ళీ అదే ఈ సారీ, తెలియడం లేదు

కుదురుగా పారే ప్రవాహనికి ఒక్కటే జాలు
చెదిరే జల్లుల తడిఉనికికి
స్పృశించి పలవరించే వేన వేల ముఖాలు

కవిత్వమని కూర్చోని
చివరాఖరుదాకా రాయలేక పోవడం
మమ్చి వాళ్ళ బాధ చెడ్డ వాళ్ళ గాథ

నిజంగా చెప్పాలంటే
నిజం నిజంగా కవి సూక్తి ముక్తావళి కర్త కాదేమో
మనుషుల గురించి రాయబోయే అమనుజుడతను కానే కాదేమో

*07-08-2012

అవ్వారి నాగరాజు || చరిత్రలు ||

ఈ రోజు నేనొక గాథను విన్నాను

తొణకిసలాడే ఒక స్త్రీ ఒక్కో పూసను కూర్చుతూ

మూడూ తరాల మనుషులు
స్త్రీలు పురుషులు పిల్లల పిల్లలను అల్లడం విన్నాను

మాటల నడుమ
గడచిన కాలపు దుఃఖపు మూలల వెంట
ఆయత్తమై లయాన్విత అశ్ర్రు ఖేద ధూళిగా రాలి కలిసాను

తెలియని ఆగ్రహపు కొనల కొక్కేనికి
శిడి వేలాడి ఉన్మాదపు శాంతినై నన్ను నేను గాయ పరుచుకున్నాను

ఉద్వేగపు ప్రవాహ ఉరవడిలో
రాలిపడిన పువ్వునై రేకులు విరిగి గింగిర్లు కొట్టి
తెలియని దిగంతాల అంచులకు ఈడ్చుక పోయాను

తెలిసిన మాటలు తెలియని కోణాలు
విడి విడి కథనాల నడుమ మనుషులు చీలిపోవడం చూసి
ఒక పరిశోధక విద్యార్థినై నన్ను నేను చూసుకున్నాను

వినడమొక పూరణగ మారి
కాలపు రేఖల అవధులు దాటి అనేక చరిత్రల ఆలవాలమై
ఒక నేను అనేక నేనులుగా
ఆమె నేనుగా నేను ఆమెగా
*07-08-2012

హెచ్చర్కే || చూశా(వా)!? ||

పద పద
పద పదమున ఒక పయనమే కదా

వెళదాం సరే, ఎక్కడికి
కొంచెం సుఖంగా ఉన్న ఈ శిబిరం వదిలి

వెనుదీయకు, లే, నడు
ఎక్కడికెళ్తున్నామో తెలుసుకోడానికి

ఎప్పుడైనా ట్రాట్స్కీని చూశావా
నడుస్తున్న ట్రాట్స్కీని

నేను చూశాను
నడుస్తున్న, పరిగెడుతున్న, ఎగురుతున్న ట్రాట్స్కీని

అదొక సీతాకోక చిలుక పేరు

ఆకాశమంత సీతాకోక చిలుక
ఆకాశమంతా ఒకే ఒక్క సీతాకోక చిలుక

భూగోళం ఒక పువ్వు
వేనవేల క్షణిక రూపాల ఒకే ఒక్క పువ్వు

లక్షల నిర్లక్ష్యపు కత్తుల కోలాటం
కొన్ని కోట్ల పదును వత్తుల కొవ్వొత్తి

పద పద
పద పదమున ఒక కదనమే కదా

ఎక్కడికక్కడ
శిబిరాలు కట్టు, పక్కకు నెట్టు

కలుసుకుంటాం కలిసి తింటాం
నువ్వూ నేనూ ట్రాట్స్కీ వ్లాదిమీర్ ఇల్యీచ్ లెనినూ
(నోట్‍: పేర్ల దగ్గర పేచీలొద్దు. అవి తీసేసి నీ కిష్టమైనవి పెట్టుకో)
* 07-08-2012

హెచ్హార్కే॥ స్థలానికి సలాం॥

దూరం నుంచి, చాల దూరం నుంచి చూస్తున్నాను
సిల్కు ఉదయాలను, వెండి సాయంత్రాలను, ఇంకా
కూలక మిగిలిన మెత్తని నీడల ఆకుపచ్చ మధ్యాన్నాలను,

మత్తుగా మత్తుగా మంద్ర మంద్రంగా వెలిగే రాత్రులను,
ఫోన్ చేయకుండా వెళ్లినా ఎదురొచ్చి కావిలించుకునే,
బాధను పంచుకునే ఊరిని

పరాయి పగటిలో నా రాత్రి, పరాయి రాత్రిలో నా పగలు
నా గడియారం దూరాన్ని కొలుస్తోంది, క్షణ క్షణాలుగా
నా ఆకాశం నేలను పిలుస్తోంది, అటు వైపు దాన్ని

ఎక్కడైనా ఉంటుంది చీకటి పెట్టుబడిగా వాణిజ్య రాజకీయం
ఎక్కడైనా ఉంటాయి మెత్తని నాల్కల వెనుక విషం కోరలు
పుట్టలను ముట్టడించి సవాలు చేస్తుంటుందొక సౌందర్యం

ఎంత అందం నా ఊరు
దాని అందం నా ప్రాణం

ఎప్పుడో ఎవరో ఏవో కట్టించినందుకు కాదు, వాటి
పునాదుల్లో బడుగు బతుకులను పూడ్చినందుక్కాదు
కత్తుల పహరాలలో కొన్ని పాటలు పండినందుకు కాదు
ఉలుల కింద శరీరాలు రాలి తయారైన శిల్పాల కోసం కాదు
అందుకోసం కూలగొట్టినవి, పూడ్చి పెట్టినవి, రాలగొట్టినవి
కూలిపోగా, పూడిపోగా, రాలిపోగా‍ మిగిలిన కొండలు, చెట్ల
నీడలు, పువ్వుల వంటి నీడల్లో తారాడే ఊపిరులు చాలు, ఇంకా
మిగిలిన ఒకట్రెండు చోట్ల తేనీటి చెమట మాటల తేటదనం చాలు

రగులుతూ ఉంటుంది, నన్నొక జ్వాలగా‍ బతికించుకుంటుంది
కుంపటి అట్టడుగున దాగిన నిప్పు కణిక... నా హైదరాబాదు

* 6-8-2012

పరమేశ్వరి పులిపాటి || జీవితం ||


మనసును అల్లకల్లోలం
చేసిన మర్మాలెన్నో.....

హృదయం కుదిపిన
కానరాని కలతలెన్నో.....

ఆనందాలను ఆర్పేసిన
బాదా తప్త వీచికలెన్నో.....

కనుకొలికి దాటి
రాలేకపోయిన దుఃఖాలెన్నో.....

కన్నీటి రెక్కలతో
ఎగిరిపోయిన కష్టాలెన్నో.....

వలపు బాటలో
వడలింపచేసిన వైనాలెన్నో.....

ప్రేమ భాషలో
గాయం చేసిన గేయాలెన్నో.....

వెతలను కవితీకరించిన
కదిలించిన కన్నీళ్ళెన్నో.....

తర్కంతో తరిపంపచేసిన
తలంపులెన్నో.....

మార్గాన్ని మరుగు చేసిన
మాయాజాలాలెన్నో...

సత్యాలను సాక్షాత్కరింపచేసిన
సరిగమలెన్నెన్నో....

* 06-08-2012

కవి యాకూబ్ ॥ కొన్ని ప్రశ్నలు ॥

ఇనుపగోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు, నీళ్ల పొదుగుల్లో
దాహం తీరక ఉక్కిరిబిక్కిరవుతున్న దిక్కులేని కాలం, నిరంతరంగా
సాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు.. విరిగిపోతున్న

అనుభవాల సమూహం
ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు?

ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని, పొల్లుని వేరుచేస్తున్న
ఈ పెనుగాలు లెక్కడివి?
ఉసిళ్ళగుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య
మసిబారుతున్న జీవన కాంతుల మధ్య
తుఫానుల విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి?

ఇక్కడ కాగితప్పూల పరిమళాల్ని సృష్టిస్తున్న సృష్టికర్తలెవరు?

సందేహాల మధ్యనే కరుగుతున్న జీవితాలు
అన్నీ ప్లాస్టిక్ సన్నివేశాల సమాధానాలు

దూరం దూరం
మనిషికీ మనిషికీ మధ్య ఎవరూ అతకలేనిదూరం

షట్టర్లుగా తెరుచుకుంటున్న రోజుల్లోకి దిగుమతవుతున్న మనిషి
బళ్లమీద, టీకొట్టుల మీద, వర్కు షాపుల్లో, రోడ్ల మీద, పొలాల్లో
చారికలు కట్టి ఘనీభవించే చెమట చుక్కల మధ్య మనిషి.. మనిషిని
చీత్కరిస్తున్న ఈ సందిగ్ధకాల మెక్కడిది?

కంప్యూటర్ తెరల మీద దర్శించే జీవితాల్ని
ప్రామాణీకం చేసుకునే సాంకేతిక సంస్కృతిలోకి
తలుపులు తీస్తున్న ఆ మానవులెవరు?

గొంతు స్వేచ్చగా పెగల్చనీయని మతప్రమేయాలు, భూమిని సరిహద్దుల
మధ్య బంధించి మనిషిని కాందీశీకుణ్ణి చేసిన రాజ్యాలు,
గాలిపీల్చినంత సులభంగా చంపగాలిగే క్రౌర్యం..
చుట్టూ అల్లుకుంటున్న
ఈ యంత్రపుగూడు ఎక్కడిది?

ఈ కాలానికి చిరునామా లేదు
ఇది ప్రశ్నల్లోంచి ప్రశ్నల్లోకే పయనిస్తున్నది.

*Old text.

శ్రీనివాస్ వాసుదేవ్ || కొన్ని అనుభూతులంతే ||

కొన్ని అనుభూతులంతే కలానికీ కలవరపాటే


జ్వరంలా చుట్టుముట్టేసి

తుఫాను మేఘాల్లా కమ్మేసిపోతుంటాయి

కురవకుండానే!


అప్పుడప్పుడు

ఆకాశాన్ని కోసుకుంటూ మీదపడిన

ఆ నాలుగు వర్షపుచుక్కలూ

గుండెని తడిపి మరీ పలకరింపు!

తడికోసం వెతికిన ఆ రెండు చేతులూ

వెనక్కొస్తుంటాయి చిత్రంగా!



లీలామహల్లో మార్నింగ్ షో,

మట్టివాసన చినుకుల నేపథ్యంగా

ఓ హాఫ్ చాయ్,

యూనివర్శిటీ లైబ్ర్రరీ సాక్షిగా

ఆకలి సమ్మేళనాలూ,

వెతల వెక్కిళ్ళూ......



కొన్ని మధురానుభూలంతే

రెప్పల్నీ మాట్లాడనియ్యవు

కనుబొమ్మల్నీ కదలనీయవు

మనసుని ఎండగట్టి వదిలేస్తూ..



ఆత్మావలోకనంలో ఆదమరిచినప్పుడల్లా

ఓ మెరుపు!

మనసు కొక్కాలకి వేళ్ళాడుతున్న

ఆశలన్నీ రంగుల్లేని చిత్తరువులే!

ఎగిరిపోవాలన్న అనుభూతే తత్తరపాటు...



ప్రేమలేఖ ముడతల్ని జాగ్రత్తగా

విప్పుతూన్నప్పడూ,

అదురుతూన్న అధరాలను అందిపుచ్చుకున్నప్పడూ

నీ గుర్తులేవీ తెలియవు!

ఆ రెండుచెక్కిళ్ళనీ ప్రేమగా చేతుల్లోకి

తీసుకున్నప్పడూ అంతే

చాక్లెట్ రేపర్లో దాక్కున్న ముక్కని

వెతికిపట్టుకున్న చిన్నపిల్లాడిలా

ఎంతో అందమైన అనుభూతి!



ఈ అనుభూతులంతే!


వెన్నెలనీ జేబులో పెట్టుకోనీయవు

వర్షాన్నీ తాగనియ్యవు

ఏ అర్ధరాత్రో ఆర్తిగా

మీదపడ్డ చెయ్యి

వెచ్చని ప్రేమనే అడుగుతోన్నా

అక్కడా మాటలు కరువే!

కలానికీ నాలుక ఎండిపోయిన

అనుభూతే ఇప్పుడూ......

చంద్రశేఖర్ || నీతోనే ఉన్నాను! ||

సమాధిలా ...
నా సమాధిని పలుకరిస్తున్నావు!
సమాధి పక్కన నిలబడి విలపిస్తున్నావు!

సమాధి...లో నేను లేను.
అలసిపోయి ... సేదదీరడం లేదు.

గాలిలో ... తలలూపే చెట్ల,
కొమ్మల, ఆకుల ... సవ్వడిలో ...
మంచు కురుస్తున్న పర్వతాల తెల్లని
ఆచ్చాదనం మీద,
పరావర్తించే మెరుపు లక్షణాన్నై ఉన్నాను!

మంచు తుంపరులు
కడిగిన,
ఆకుల పత్రహరితాన్నై ...
సున్నితంగా తట్టి లేపే
శరత్కాలం వర్షాన్నై ......

*07-08-2012

Kvd వర్మ || గుండియ సవ్వడి... ||

ఎగిరే అలలపై వెన్నెల నురుగు , అందుకోవాలని తీరాన నా పరుగు ,
నీ ఎదురు చూపుల నిశ్సబ్దపు సడి , నన్ను వెంటాడుతున్న కలల ఒరవడి

అలసటలో ఎరుపెక్కిన పడమటి సూరీడు , చీకటి చప్పట్లలో నింగిన నెలరేడు ,
గదిలో నీ గాజుల సవ్వడి ,నా మదిలో తీయని ఊహల రాపిడి

నిండు కొలనులో కలువలు , ప్రకృతి రాసిన కవనాలు
పానుపు పై తన పరువాల సవ్వడి , నా దరి చేర్చుకోనా తనువంతా ముద్దాడి ...
*08-08-2012

పులిపాటి గురుస్వామి || విషయ సూచిక ||

ప్రతి విషయాన్ని
గుండెల మీద అంటించ వద్దు

ఈ రోజు లాగే తేడా లేని
ప్రతి రోజు పలకరించి పోతుంది

సమస్యలు అనేక ముఖాలతో
నీ చుట్టూ తిరుగుతాయి

మితంగా తింటూ ,సరదాగా అన్నిటినీ
కష్టాన్ని ప్రేమ గా మచ్చిక చేసుకోవాలి

జీవితమంతా పండగలా,నీటి అద్దంలా
ఇష్టంగా,దీపం లా ధ్యానంగా గడపాలి .
*07-08-2012

ఆర్. ఆర్. కే. మూర్తి || ఇంతే ||

నిరాకార జ్వలనంలో
నిశీధి నిప్పుల కుంపటి
పురుటి నొప్పి పుట్టు కేక
తలకిందుల శిశు గీతిక

చిందిన క్షీరపు బిందువు
మాత్రు కణపు పరిశోషణ
తడి ఆరని పసిగుడ్డుకు
శీర్షిక మ్రుత్యు జ్ఞాపిక

మస్తిష్కపు పరిణామం
మాయని మచ్చల తోడుక
బాల్యపు బలవంతానికి
తడబడు నడకల నేర్వ

సకల వర్ణ సంశోభిత
యవ్వన కుసుమాలు పూయ
జంకులేని దుడుకు తనపు
నునూగులు నిగ నిగలు

జ్ఞానపు కరి చిక్కువడగ
అజ్ఞానపు మకరి నోట
నిందాస్తుతి మేలి ముసుగు
బ్రుందావన వంశీ లయ

నడిమి వయసు నడమంత్రపు
నానా నటనలు సేయగ
ధన కనకపు కీర్తి కాంక్ష
మార్చు మనుజు మత్తునిగ

ముదుమిన శూన్యపు చాయలు
ముడుతల చర్మపు గురుతులు
జ్ఞానపు నేత్రము తెరువగ
సమయానికె చావు పిలుపు

*07-08-2012

సైఫ్ అలీ || ట్రోపోస్ఫేర్ హని ||

1
అవివాహిత సమయం ఆపుకున్న వేళ
గుండే అలారాల జుగల్ బంది మొదలవుతుంది

2

ఆదివారం పాఠశాల ప్లేగ్రౌండ్లో
రెండు తుమ్మేదలు ఎప్పుడూ ఎగురుతుంటాయి


3
చీకటి దారిలో పెద్ద గుంట లాంటి ఓ గంట సమయం .
పాతాలం లో ఉన్న గోపురం
తలెత్తుకుని గర్వంగా పిల్లగాలులకు ఊగుతుంటది .

4

అంతలో నే
గోడమీదున్న ఆకాశం లో
చీకటి వచ్చి కూర్చున్న ప్రతిసారి ..
అందుబాటులో ఉన్న మౌనం తో
తరిమే ప్రయత్నం


5

గాలి నింపుకుంటూ ప్రతీక్షణం
జీవితం ఎగరేస్తూ ఎగరేస్తూ ..

6

సమీపం లో ఎవరో ఏవో శబ్దాలు చేస్తున్నా
భూమినుండి భూమికి చాలా దూరంలో పట్టించుకోని ప్రవాహం
5

సూర్యుడిని ఎవరో ఖూని చేస్తే వచ్చిన నల్లటి రక్తం అది
మరింత చిక్కగా సమయాన్ని మింగేస్తుంది

7
శ్వాస వెనక్కు వెల్తూ ముందుకు వస్తుంది
ఏవో సంఖ్యలు ఆజ్ఞాపిస్తుంటే
మారువేషం లో ఉన్న వేషాలన్ని వెలుగుతున్నాయి


8
లోయ లో ప్రార్ధన చేస్తున్నా భక్టుడేవరో
మౌనంగా ప్రార్ధన చేసి వెనక్కు వచ్చేస్తాడు


9
దేవతా వస్త్రాల మీద
రెండు తేనే టీగల తేనే లోని బ్యాక్టీరియాల సంగమం.
*08-08-2012

చంద్రశేఖర్ || తోటమాలి ||

ఇంతా అని తెలియదు
ఒంటరివాడిని నేను అని తెలుసు కానీ
మొగ్గ, పువ్వై, పరిమళించి ...

కొమ్మను వెగటు చెందుతుందని అనుకోలేదు

ఇంత తియ్యగా ఉంటుందనుకోలేదు
నీది కోకిల గళం అని తెలుసు కానీ
పొత్తిళ్ళలో, పాకుతూ, తప్పటడుగులు వేసేప్పటి తోడు
నడిచి నిలబడ్డం వొచ్చాక వొద్దనుకున్నావనే నిజం ఇంత తియ్యని బాధని ...

ఇంత మార్పు నీలో వస్తుందని తెలియదు
తెలిసినా అప్పుడు ... నిన్ను ముద్దాడటం చేసేవాడ్నే
మొక్క ఎదిగి, పూచి, కాస్తుందని తెలుసు
ప్రతిఫలం నాకే చెందాలనుకోవడం భావ్యం కాదని తెలుసు కనుక

ఇంత మధురం పొందకపోవడం పోగొట్టుకోవడం అనుకోలేదు
ప్రతిసారీ ... దూరంగా నిన్ను చూస్తున్నప్పుడు
నీవు నన్ను గమనించట్లేదనే బాధను మించి ... సంతోషంగా ఉన్నావనే గర్వం
ఆనందం అస్రువులు అనుభూతులు

ఇంత కష్టం అనుకోలేదు మరుపు ... లేవనుకోవడం
ఎంత ప్రయత్నించినా సంబంధం లేదు అని అనుకోలేని బలహీనతే తపన ...
నాన్నా అని పిలుస్తావని ... పిలిపించుకోవాలని
భరించలేని ఈ తియ్యని బాధాగ్నిని నిన్ను దగ్గరకు తీసుకుని చల్లార్చుకోవాలనే.

*08-08-2012

క్రాంతి శ్రీనివాస రావు || రోడ్ల గొణుగుడు ||

రోడ్లు వేదనతో నా చెవిలో వూదిన రహశ్యం
మాటలుగా మార్చి
మీటర్ కున్నా లేకున్నా

మ్యాటర్ మీముందుంచా చదివి పెట్టండిక

కొన్ని రోడ్లు
స్పొటకం పోసి పెచ్చులూడి
మచ్చలు పడ్డ మొహాన్ని
ఎప్పుడూ హైస్పీడ్ తో వెళ్ళే
ఖరీదయున కార్లు బోసు గారి బస్సులు
మోరీలను ముద్దుకొనే లారీలు
బుర్రున్నాలేకున్నా గిర్రల కాళ్ళెట్టుకున్న ప్రతిదీను
స్లొగ స్లొగ పోకుంటూ ఆగి ఆగి చూస్తుంటే
గయబ్ అయున గాంగోళ్ళను గట్టిగనే తిట్టుకొంటూ
చస్తే బాగనుకొంటూ సిగ్గుతో చస్తున్నాయు


కొన్ని రోడ్లు
గుండెల్లో మోకళ్ళ లోతు గుంటలు పడ్డా
ఎడుపు మొహానికి నవ్వు తగిలించుకొని
ఇంకుడుగుంటలివి భూమి తల్లి దాహం తీరుస్తున్నానని
బంగపాటును వ్యంగంగా చెబుతున్నాయు

మరి కొన్ని రోడ్లు
వోదార్పు దరువు సబ్దాన్ని
తొడగొట్టినప్పుడు వచ్చిన నిశ్సబ్దాని
చెంపలు నిమిరే చిత్రాన్ని
మీసం మెలెట్టే మొదనస్టాన్ని
మౌనంగా వింటూ కంటున్నాయు

ఇంకొన్ని రోడ్లు
విధిలేక వోడ రేవుల దాకా సాగి
దేశం నడి బొడ్డున మొదలై
జీవనదిలా పదిలంగా పారే
అయురన్ ఓరును తరలిస్తున్న
లారీల చక్రాలను నిరంతరం ముద్దాడు తున్నాయు

కొన్నిరోడ్లు
తనపిల్లల్ని తనే చంపుకుతినే పాముల్లా
అడవి అన్నల్ని చంపేందుకు బారులు తీరిన
మిలటరీ వాహనాలను
మోయలేక చస్తున్నాయు


మరి కొన్ని రోడ్లు
పదవులకై సాగే పాదయాత్రల
పద ఘట్టనలతో నలిగిపోతున్నాయు

పల్లెటూరు కెళ్ళే పిల్ల రోడ్లు కొన్ని
వయసొచ్చి వలసెళ్ళిన పిల్లలు
మళ్ళెప్పుడోస్తారాని
వట్టిపోయున పల్లెకు వసంతమెప్పుడా అని
వేదనతో రోదిస్తున్నవి

అలాగే అలిగిన కొన్ని రోడ్లు
లక్షల మందిని ప్రమాదాలకు పట్టించి
శిక్షలు వేస్తున్నాయు

ఆగ్రహించిన కొన్ని రోడ్లు
ఈ మద్యే రంగేసుకొని కాస్త హంగేసుకొని
టోలు గేట్లు పెట్టి జనం తోళ్ళు వలిచేస్తున్నాయు

బహుశా అందుకేనేమో
ఈమద్య జనం
రోడ్ల ను క్రికెట్టు మైదానంగా మార్చి
ఆటలతో అలరిస్తున్నారు
వంటా వార్పూ రోడ్డుపైనే చేసి
మేము మీ వెంటేనని గుండెమంటను తగ్గిస్తున్నారు

ముదిగొండ లాంటి చోట్ల
గుండుకు గుండడ్డం పెట్టి
నడిరోడ్డుకు రక్త తిలకం దిద్దుతున్నారు

మీరు వస్తారా వెళదాం
ప్రగతి రధ చక్రాల పాట్లను తప్పించేందుకు
మన ఈరోడ్లను రక్షించేందుకు

*08-08-2012

జుగాష్ విలి || ఎవరి నిర్వచనాలు వారివి ||

ప్రేమే జీవితంగా బతికే వారెప్పటికీ ఓడిపోరు
మహా అయితే తరచుగా గాయపడుతుంటారు
బహు తక్కువగా సుఖపడుతుంటారు

వారికి జయాప జయాలు అనిమిత్తం
వారి లాభనష్టాల నిర్వచనంవేరు

ప్రేమను తప్ప
మిగతా అన్నిటినీ ప్రేమించేవాళ్ళు
మహా అయితే ఎక్కువగా సుఖపడుతుంటారు
బహు తక్కువగా ఆనందపడుతుంటారు
ఎప్పటికప్పుడు లాభనష్టాల పట్టిక తయారు చేస్తుంటారు
వీళ్ళ జయాపజయాల నిర్వచనం వేరు

ప్రేమను కొలవడానికి ప్రేమతప్ప
ఏవేవో కొలబద్దలన్నీ అనేకం వుంటాయి వీళ్ళదగ్గర
ప్రేమ లేదనీ, దొరకలేదనీ, అంతామోసమనీ
అన్నీ వేళలా నిందిస్తుంటారు...చింతిస్తుంటారు
కొందరిపట్ల, కొన్నిటిపట్ల
హృదయాలను
వాటర్ ప్రూఫ్ వాచీలల్లే చేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే

ఆనందంలో కంటే
సౌకర్యంలోనే హాయిని పొందుతారు
ఓటమిని గెలుపుగా బతికేస్తుంటారు
వీళ్ళ సుఖసంతోషాల నిర్వచనమే వేరు ...వేరు...
*07-08-2012

రాఖీ,,,|| నీకే ఈ నా సమస్తం !! ||

ఆనంతాల అంతుల నుండి
దిగంతాల అంచుల దాటి
పాలపుంతలేన్నో మీటి

చుక్కలు చిక్కులు తెగ త్రెంచుకొని
ఖగోళాలు కృష్ణబిలాలు తప్పించుకొని
నవగ్రహాల ఉపగ్రహాల పీడ వదిలించుకొని

సప్త సముద్రాలను ఈదీ
మేరు పర్వతాల నధిరోహించి
అరణ్యాలు ఎడారులన్నీ ఏదీ వదలక
కౄర మృగాలు విష సర్పాలు ఎదునారైనా నే బెదరక

మైదానాలు నదీ నదాలు
కొండలు కోనలు వాగులు వంకలు ఏవీ విడవక
ఎండమావులు ఇంద్ర ధనువులూ వేటి మాయలో అసలే చిక్కక

లోయలు గుహలూ మిద్దెలు మేడలు
రెక్కల శ్వేత తురంగంపై అంతటా సంచరించి

విశ్వమంతటా అన్వేషించీ
అణువణువున నిను శోధించీ
ఆఖరికి నాలోనే నీవైన నన్ను గ్రహించి సంగ్రహించీ

తరించి అవతరించానిట నేస్తం!
నీకే ఈ నా సమస్తం!!
కుశలమే నా ప్రస్తుతం ?!
*07-08-2012

శ్రీ వెంకటేశ్ || నిశ్శబ్ధం ||

ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు మొదట నీలో మెదిలే ఉత్తేజం,
ఎదలో దాక్కున్న దుఖ్ఖం తెరలు తెంచుకుని కను రెప్ప మీదుగా పయనమవ్వకముందు పులుముకున్న మౌనం,
అబద్ధంతో స్వర్గానికి తీసుకెళ్ళే నాలుక రెక్కలు నిజాన్ని మోసుకు పోయెందుకు తటపటాయించే తరుణం,

అప్పటి వరకు ఇష్టమైనది ఇరుకుగా అనిపిస్తే ఇష్టం లేదు అని పూర్తిగా తేల్చలేని సంధిగ్ధం,
హౄదయానికి వరసైన వాళ్ళు వీడి దూరంగా వెళ్తుంటే మొహాన ముసురుకున్న వర్ణం,
నాది అనుకున్నదేది దక్కకుండా దాగుడుమూతలాడుతుంటే కోరికల గుర్రానికి మనసు వేసే కల్లెం,
ఇష్టమైన వాళ్ళు మనసుకు కష్టమైనది చేస్తున్నా వద్దని వారించలేని వైనం,
రాజభోగాలనుభవించిన రామచిలుక చిన్న పూరిగుడిసిలో పడే కష్టం,
ఆకాశాన్ని అందుకునే మార్గంలో అవరోధాల అడ్డుతెగలు ఆపేందుకు యత్నిస్తుంటే సంధించే చిరునవ్వు భాణం,
కొన్ని పరిస్థితులకు ఆవశ్యకం, కొన్నిటికి ఆటంకం ఈ నిశ్శబ్ధం....

ప్రకాశ్ మల్లవోలు || అర్ధ' శాస్త్రం లో ఇమిడిపోయిన ఆర్తనాదం... ||

'అర్ధ' శాస్త్రం లో ఇమిడిపోయిన ఆర్తనాదం...
అర్ధం కాక మిగిలిపోయిన యదార్ధ వాదం...

ఎందుకో ఈ అంతస్తుల తేడా???
అసలెందుకో ఈ అసమానతల జాడ ....

ఒక్కోసారి అర్ధం అయినట్టే ఉంటాయి...
అందుకునే లోపే జారిపోతాయ్ సమాధానాలు ..

ఈ తేడాలకు కారణం ఒకోసారి మూర్ఖత్వం అయితే
ఇంకోసారి అమాయకత్వం అవుతుంది.
ఒకోసారి చేతకానితనం అయితే
ఇంకోసారి చేవ చచ్చిన తనం అవుతుంది..
ఒకోసారి తెలివై అంతస్తును పెంచితే
ఇంకోసారి 'అతి' తోడై అది'ము'౦చుతుంది ..

కానీ ఇవేం పట్టవు కలలకి
అవి మాత్రం మేడలు కడుతూనే ఉంటాయి
పునాదుల్లేకుండానే ....

ఊహలకి రెక్కలు తొడుగుతూనే ఉంటాయి..
అడుగులని నేలపై ఉంచుతూనే...

కొన్నైతే వాస్తవం ముసుగేసుకుని మరీ
కళ్ళెదుర కనపడతాయి , (వి)భ్రమలో ముంచేస్తాయి...

కనడానికి ఎన్ని సంగతులున్నా , ఈ
మాయదారి కలలన్నీ డబ్బు చుట్టూనే ఎందుకో???
బహుశా ప్రసవ వేదన శ్రమ లేదనేమో...???

అర్ధం కాని ఆర్తనాదం ఈ 'అర్ధ' వాదం...
అర్ధం కాపోయినా చేసే వితండవాదం ఈ 'అర్ధ' వాదం..

-సుష@4u4ever@