పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఆగస్టు 2012, శుక్రవారం

బివివి ప్రసాద్ || దినచర్య ||

ఉదయం తూర్పుగుమ్మం తలుపులు తెరవగానే
అప్పటివరకూ గుమ్మంతెరపై ఆడుకొంటున్న కాంతిదేవతలగుంపు
గదిలోకి ప్రవేశిస్తుంది

ఈ వెలుతురు ఉత్తవెలుతురు కాదనుకొంటాను
ఇది గదిలోని చీకటితోపాటు, నా లోపలి దిగులునీ మాయం చేస్తుంది

పసినవ్వులాంటి స్వచ్ఛమైన వెలుతురు
నక్షత్రాల కాంతివంటి లోతైన వెలుతురు
చొరవగల స్నేహితుడిలా
నాలోంచి నన్ను బయటికిలాగి ప్రపంచంలోకి తోసేస్తుంది

అప్పుడు ప్రపంచంనిండా పరుచుకొన్న జీవితోత్సవానికి
నా కళ్ళు విశాలంగా తెరుచుకొంటాయి
నవ్వుతానో, గాయపడతానో, నవ్విస్తానో, గాయపరుస్తానో
నా పాత్ర నేను పోషిస్తాను

నా నమ్మకాలూ, ఉద్వేగాలూ
పగలంతా నన్నొక తొలుబొమ్మను చేసి ఆడిస్తాయి

దినాంతాన
ముఖంమీద పరుచుకొన్న ప్రియురాలి వస్త్రంలాంటి వెలుతురు
ఏ గాలీ వీయకుండానే ఎటో ఎగిరిపోతుంది

దిగులులాంటి చీకటి
తన విశాలబాహువులు చాపి నన్ను తన హృదయానికి హత్తుకొంటుంది
అనాదికాలంలో పాతుకుపోయిన జీవితేచ్ఛ ఏదో
నన్ను ఊహల కొమ్మలతో నిండిన వృక్షంలా నిలబెడుతుంది

ఇవాళ సంపాదించుకొన్న సుఖదు:ఖాలు
వలస పక్షులలా నాలోపల చేరి కాసేపు రణగొణధ్వని చేస్తాయి
నాలోపలి పక్షుల సందడి ప్రాచీన నిశ్శబ్దంలో కరిగిపోయాక
రేపు మళ్ళీ కొత్తగా వచ్చేందుకు, ఈ రాత్రిలోకి మాయమౌతాను.
*03-08-2012

శ్రీనివాస్ వాసుదేవ్ ||కాంతిని కప్పుకున్న కళ్ళల్లో....!.||



ఆ కళ్ళు రెండూ--
తియ్యని సంగతులన్నీ దాచుకున్న

తేనెతుట్టల్లా
చరిత్రపుటల్లో ఇమడలేని
నగ్నసత్యాలేవో ఒంపటానికి సిధ్ధం

రవీకౌముదుల జుగల్బందీ విన్యాసానికి
నీ జమిలినేత్రాలు వేదికయ్యాయనుకుంటా
నలుపు నచ్చిందీ అప్పుడె
చీకటిని చుట్టుకున్నదీ అప్పుడే
నాలోంచి నీలోకి మకాం మార్చిందీ అప్పుడె!

కళ్ళంతా నన్నెప్పుడూ నింపుకుని ఉంటావేమొ
పరువాల పొంగుతో పోటీపడుతుంటాయి
అందుకే నిన్ను సైకతశ్రోణీ అని పిల్చుకునేది

మనసు మౌనగీతాలన్నీ
ఆ కనురెప్పల నిశ్శబ్ద తబలాలో విస్పష్టమే!
ప్రేమంతా, ఆ కళ్ళలోనే గూడుకట్టుకుని
కథలన్నీ పేర్చుకుంటున్నట్టు...

ఈ అందమైన గిరడకళ్ళకి
వాకిట తలుపుల్లా ఆ రెప్పలూ,
అల్లల్లాడుతూ అవిచెప్పే ఊసులూ
అన్నేసి సీతాకోకచిలుకలు ఆ కళ్ళనుంచి
ఎగరటం చూసుంటే డాంటే ’ఇన్ఫర్నో’ మానేసేవాడేమొ

ద్వారబంధాలకు ముగ్గులేసినట్లున్న
ఆ కనుబొమ్మల సౌందర్యలహరీ స్ఫురితం
రక్షకభటుల్లా ఆ పక్ష్మములూ
వాటి చివర్న తళుక్కున మెరిసే
వెలుగేదో కావ్యం రాయించకపోదు

ఆ ఒక్క రెప్పపాటు కదూ నాకు ప్రేమ నేర్పిందీ!

వెలుగు రెప్పలకింద దాక్కున్న
రాత్రంతా తాపత్రయమే
నీ కనుసన్నల కాంతినీడలో
రాసుకున్న ఈ అనుభవం
కవితౌతుంది కదూ
నీ కనుదోయి సాక్షిగా....
(ఓ ప్రేమ కవిత రాద్దామనుకున్నప్పుడల్లా ఆమె కళ్ళు వెంటాడుతూనే ఉంటాయి...ఇక తప్పించుకోలేక ఇలా!)

*03-08-2012

హరికృష్ణ మామిడి||ఒకానొక Positive Purposivism అనే Philosophical Thought గురించి...||


ఈ ప్రపంచం లో జరిగే ప్రతీ చర్యకీ-ప్రతి చర్యకీ ఏదో ఒక purpose ఉంటుంది... గాలి వీచడంలో, ఆకాశం ఉరమడంలో.. మేఘాలు కురవడంలో.. విత్తనం మొలకెత్తడంలో.. కోయిల పాడటంలో.. కోడి కూత వేయడంలో.. నది ప్రవహించడంలో.. మంచు ఘనీభవించడంలో .. ఆఖరికి సూర్యుడు తూర్పునే ఉదయించడంలో ఏదో ఓ లోక కల్యాణం దాగి ఉంది..
చివరికి, నువ్వు నాకు తారస పడటంలో కూడా..!
*** ****
****
యుగాల నుండి వెదుకుతూనే ఉంటాను..! అలజడితో.. unrest తో..అసంతృప్తితో.. అత్యాశతో.. అనాశతో అవిశ్రాంతంగా అన్వేషిస్తూనే ఉంటాను.. అప్పుడెప్పుడో Mesozaic Era లోని Lost World కోసం Paleontology టార్చ్ లైట్ వెలుగులో నీ జ్ఞాపక శిలాజాలను తవ్వుతూంటూనే ఉంటాను. ఏడేడు లోకాలు, సప్త సముద్రాలు జల్లెడ పట్టినట్లుగా నీ కోసం గాలిస్తూనే ఉంటాను.. దాని కోసం ఓ సారి- "మాయా దర్పణం" సాయం తీసుకుంటాను.. మరో సారి "ప్రియ దర్శిని" ని అప్రోచ్ అవుతాను.. ఇంకో సారి అంజనం వేయించి, సోదెమ్మ పలుకులు విని, శివ సత్తుల భవిష్య వాణి లో నీ చాయల కోసం అదే పనిగా వింటాను..
ఎన్నెన్నో Prophesiesని చెప్పిన Nostradamus.. నీ గురించి ఏమీ చెప్ప లేదెందుకా అని ఫైర్ అవుతాను.. కాల జ్ఞానం లో, Mayan క్యాలెండర్ ఫ్యూచర్ ప్రోజేక్షన్స్ లో.. చైనీయ లామాల ఫోర్ కాస్టింగ్స్ లో.. ఆక్టోపస్ ఆస్ట్రాలజీ లో, డిస్కవరీ ఆస్ట్రానమీ లో నీ జాడ కోసం నేను Twilight లోని వ్యాంపైర్ లా వెదుకుతూనే ఉంటాను..
"దిల్ డూండ్ తా హై ఫిర్ వహీ ఫుర్సత్ కే రాత్ దిన్.."

ప్రియా, నువ్వంటే నాకు ఆకాశమంత ఇష్టం... విశ్వమంత కాంక్ష.. భూగోళమంత కోరిక.. కనకాంబరమంత మోహం.. నా మనసంత ప్రేమ..
నీ పై నాకున్న ఈ ప్రేమే DNA లా నన్ను తర తరాలుగా మళ్ళీ మళ్ళీ అవతరించేలా చేస్తోంది..
**** **** ****
ఈ లోకం లో జరిగే ప్రతీ పనికీ ఓ అర్థం ఉంది.. ప్రతీ ప్రకార్యానికీ- వికార్యానికీ, కార్యానికీ- కార్య రాహిత్యానికీ ఓ ఉద్దేశం ఉంది..
ఆఖరికి నేను నిన్ను చూడటం లో కూడా..!

లోకాలన్నింటినీ గూగుల్ లో గుబులు గుబులుగా సెర్చ్ చేస్తూ, ఎక్కడో ఓ చోట నువ్వు కనిపించక పోతావా అని జన్మ జన్మాల వాసనలను పునర్ స్మరిస్తూ వెబ్ సైట్ ల వెంట, బ్లాగులు, twitter ల వెంట పరుగెడుతూ ఉంటాను.. అన్ని విధాలు గానూ భంగ పడి, అంతటా ఛిన్నా భిన్నమై ఫేస్ లెస్ గా, షేప్ లెస్ గా మారి చివరాఖరికి ఫేస్ బుక్ దిశగా... నెట్ మహా సాగరంలో నాకు దారి చూపే చుక్కాని లాంటి మౌజ్ ని అదిలిస్తాను..

వేలాది ముఖాల సమ్ముఖాల విముఖాల శ్రీ ముఖాల మధ్య నీ ముఖ చిత్రం ప్రత్యక్షం అవుతుంది. అభావుడనై, అముఖుడనై, ఒక్క సారిగా జరిగిన చిత్త భ్రమలోని చిత్తరువు తరువు విసిరిన ఋతు పవనానికి తల్లడిల్లి .. ఆ వెంటనే తెప్పరిల్లి నిన్ను కనుగొన్నాననే అమందానందంలో, అమేయానందంలో తడబడి,, నా నుంచి విడివడి జడి వాన సుడిగుండాలు సృష్టించిన తడి దనాలను వడివడిగా దోసిళ్ళ లోకి తీసుకుని నీ చిరునామా ని కనుక్కుంటాను.. నీ ముందర ప్రత్యక్షం అవుతాను..
"దిల్ క్యా కారే కిసీ సే కిసీ కో ప్యార్ హో జాయే "
**** **** ****
ఈ విశ్వం లో జరిగే ప్రతీ సంఘటనకీ ఓ లక్ష్యం ఉంది.. Big Bangలో.. Blitz Kriegలో.. Buddha Smilesలో అది ప్రూవ్ అయింది.. ఇప్పటికి ఈ క్షణాన నేను నీతో మాట్లాడటం లో కూడా..!
అవును, ఈ ప్రపంచం లో జరిగే ప్రతీ చర్యకీ- ప్రతి చర్యకీ ఏదో ఒక purpose ఉంది...!
ఆ purpose ప్రేమే అయి ఉంటుంది...!!

పెరుగు సుజనారాం || నన్ను క్షమించొద్దు ప్లీజ్ .. ||


నా చిట్టి తల్లీ
నిమిషంలోనే
నా మనసంతా ఆక్రమించావు

తామరాకుల్లాంటి
బుజ్జి బుజ్జి పాదాలతో
ఎగసి పడే తరంగాలతో
నా పొట్టలో నువ్వు చేసే
అల్లరి
నా ఉహల్లోకి రాకముందే
నిన్ను భ్రూణ హత్య చేశాను
నా కళల కంటి పాపా
నీ తల్లి నిర్దయరాలేనమ్మా
నన్నెందుకు మొగ్గలోనే త్రున్చేసావమ్మా
అని ప్రశ్నించకుతల్లీ !
నీ కోసం ప్రపంచాన్ని ఎదిరించాలనే ఉంది
నీ కోసం దూరంగా పారిపోవాలనే ఉంది
కాని నిస్సహారాలుని
నా చుట్టూ ఉన్న
అందరి ప్రేమ రాహిత్యంతో
అందరూ ఉండీ
లేనిదానిలా
నిన్నో ఇర్భాగ్యురాల్ని చేయలేను
నా కేప్పటికీ నీ మీద ప్రేమే తప్ప
ద్వేషం రానే రాదు
ప్లీజ్ ....నీ బుజ్జి కాళ్ళ తో
నా గుండెని తన్నోడ్డు

అమ్మా...అమ్మా అంటూ నా చెవిలో
గుస గుస లాడవద్దు
నా మీద నాకే పెరిగిన కోపాన్నీ ద్వేషాన్నీ
తగ్గించ వద్దు
నన్ను క్షమించవద్దు.

*03-08-2012

రామ క్రుష్ణ రాఖి ధర్మపురి || ప్రేమించు ||


నీకు తెలుసా వాలిపోతున్న కనురెప్పల బరువెంతో
నీకు తెలుసా రాలి పడుతున్న అశ్రువుల విలువెంతో
నీకు తెలుసా నిద్రలేమితో మండే కళ్ల మంటెంతో


గమనించావా!
తదేకంగా తెఱపై చూస్తుంటే కనుకొలను
కోల్పోయిన ఆర్ద్రత అనుభవాలను
నీకు తెలుసా భావ గంగా ప్రవాహాన్ని నీకందించడానికి
వేళ్ళునొక్కేకీల హేల గోల
నీకు తెలుసా ముంచుకొచ్చే మత్తు గమ్మత్తు మహత్తులు

నీకు తెలుసా అనుక్షణం నీ ఆలోచనల కుమ్మరిపురుగు మెదడునెలా తొలుస్తుందో
నీకుతెలుసా! పుడమి కడుపు చీల్చుకొంటూ వెలికి వచ్చే గడ్డి పఱక ప్రయాస
నీకు తెలుసా!గొంగళి పురుగు రంగుల సీతాకోక చిలుక లా మారడానికి పడే ప్రస్థాన యాతన
నీకు తెలుసా! ఒక్కో పుల్లను,ఎండు గడ్డి రెల్లునూ కూడగట్టుకొని
పిచ్చుక గూడు కట్టుకోడానికి పడే తపన

ఎందుకు నేస్తం ! తీసిపారేస్తావ్ !! నన్నూ నా ప్రేమను
ఎందుకు మిత్రమా!! అపనమ్మకంతో చూస్తావ్ నన్నూ నా అనురాగాన్నీ

నీకు చేదు అనుభవాలు ఉండొచ్చుగాక !
నీవు విషమ పరిస్థులనెదుర్కొనవచ్చుగాక!!

అందరినీ ఒకే గాటుకు కట్టేయడం ఎంతవరకు సమంజసం?
అందరినీ అదే చోటుకి నెట్టేయడం ఎంతవరకు సబబు?
ఎప్పుడూ మోసపోతామని భయపడడం ఎంత వరకు న్యాయం?

నమ్మకం ఎప్పుడూ నమ్మదగ్గదే!
విశ్వసనీయత ఎల్లప్పుడు విశ్వసించ దగ్గదే!!
నమ్మంది నిమిషమైనా మనలేమే!
నమ్మంది క్షణమైనా శ్వాసించలేమే!!

పుట్టుక ఒక విశ్వాసం ?!
మరణం జీర్ణించుకోలేని నిజం
ప్రేమ అవసరమైన నమ్మకం
స్నేహం శాశ్వతమైన ఆనందం!!

గ్రహించు
సంగ్రహించు
విశ్వసించు
ప్రేమించు
సదానందంగా
సచ్చిదానందంగా
జీవించు
అనుభవించు అనుభూతులు పంచు!
*03-08-2012

పులిపాటి గురుస్వామి || జీవితానికి దారి ఎటు? ||

మనల్ని మనం
మౌనాంగాలతో భర్తీ చేసుకోలేం


ఇంకా మిగిలిన
అంటుకు పోయిన మూలల్ని
గాలికే వదిలేస్తాం

ఒకర్నొకరు
సమస్య చేత గుర్తించబడతాం

ఇంకా దాగిన
రోజు రోజు అలిసిన క్షత క్షణాల్ని
నిర్లిప్త దుప్పటి కింద తోసేస్తాం

నువ్వు నేను
చెల్లా చెదురు అంశాలతో కలుపబడతాం

ఇంకా మనకంటిన
కొందరి నమ్మకాలకు దిమ్మిస వేసుకుంటూ
మనుషుల్లో నిమజ్జనం చేసుకుంటూ

*03-08-2012

యజ్ఞపాల్ రాజు || అనగనగా ఒకదేశం ||

అనగనగా ఒకదేశం
ఆ దేశం పేరు అనంగ దేశం
రాజు ప్రియుడు, రాణి ప్రేయసి

ప్రజలు కూడా ప్రేమికులేనట
ఆ దేశం లో సంవత్సరమంతా ప్రేమ ఋతువేనట
ఎప్పుడు కావాలంటే అప్పుడు
వానలు కురుస్తాయట
ఎండ కాస్తుందట
మంచు కురుస్తుందట
పూలు పూస్తాయట
వెన్నెల కురుస్తుందట
చుక్కలు మెరుస్తాయట
జీవితమనే పంట అక్కడ బాగా పండుతుందట
ఏం కావాలన్నా ఎంత కావాలన్నా దొరుకుతాయట
అంతా సుందరమూ, సుగంధమయమూనట
ఆ దేశానికి వెళ్లాలంటే ఒకటే అర్హతట
అది స్వచ్ఛంగా అరమరికలు లేకుండా ప్రేమించడమేనట
అక్కడికి వెళ్ళినవారే కానీ తిరిగి వచ్చినవారు లేరట
నేను దారిలో ఉన్నాను
మరి మీరో....!

*03-08-2012

సురేష్ వంగూరి॥మౌనం॥

ఒక్కోసారి మౌనం
అర్ధాంగీకారం కాదు
అనంగీకారం కూడా!

మౌనం
ఒక నిరసన
పైకి వినపడని ఆగ్రహం
లోలోపలే రాపిడవుతున్న అభిమానం

మౌనం
ఒక అసంతృప్తి జ్వాల
పెదాల కరకట్ట కవతల
పోటెత్తుతున్న అభివ్యక్తి ప్రవాహం

ఏదో ఒక రోజు
మౌనం మళ్లీ మాటగా మారుతుంది
అయితే ఆది ఖచ్చితంగా ప్రశ్నించటమే అవుతుంది!
ఉవ్వెత్తున ఉద్యమించటమే అవుతుంది!

అందాకా,
మౌనమే సామాన్యుడి నోరు!
సహనం చేసే ఒంటరి పోరు!!
 
*2.8.2012

మెర్సీ మార్గరెట్॥నాలో నీ తలపులకు॥

ఒకటే గొడవ
నాలో నీ తలపులకు
నా మనసుకు

ముని వేళ్ళతో ముద్దుగా తాకి

అలా
వదిలేయక రెమ్మ పై గోరుతో గిల్లి
నీ తలపులు చేసిన గాయాలు

మనసంతా పరుచుకుని
స్వయానికి - స్వార్ధానికి మధ్య
నాకు నీకున్న తీరపు దూరాల్ని
పెనవేసుకొని
ప్రవహిస్తూ నదిలా నిండుకుని
కలుపుకు పోతూ

ఆగి ఆగి వెనక్కి తిరిగి
ఎంత దూరం వచ్చానో నీనుంచని
చూపుల అడుగుల్ని వెనక్కి నీ వైపు పరుగెత్తిస్తూ
నా కళ్ళలో నీకై నా భవిష్యత్తు నిలిపివేస్తూ

నీ ఒక్కో జ్ఞాపకాన్ని ఉండలుగా చుట్టి
మస్తిష్కపు పెట్టెలో గులికలుగా దాస్తూ
వ్యాపకాలలో పడి నిన్ను మరిచేంతలో
ఔషదమై
అర్ధభాగానిగా నిన్ను
నాలో నింపుకుంటూ మరుపుకు వైద్యం
చేసుకుంటూ .

దూరమైన ఈ కొద్ది నిమిషాలకే
నీ తలపుల సుడిగుండాలలో నేను
మునిగిపోతు
ఎదురుచూపుల తెర చాపనెత్తి
నీ ముందర మోకరిల్లే
గడియ కోసం చూస్తున్నా...
 
*2.8.2012

కె.కె॥హ్యూమనిస్టు॥


ఎండైన,వానైనా
గాలైనా,ధూళైనా
సైకిలెక్కి వీధులన్ని తిరుగుతూ
కల్తీలేని కబుర్లందించే
నిత్యఖర్మచారి పోస్టుమాన్.

ఖాకీ బట్టలతో,లేఖల కట్టలతో
మంచీ,చెడూ... వార్తలేవైనా
చిరునవ్వుతో తలుపుతట్టే ఆత్మబంధువు,
సమన్వయంతో సాగిపోయే బాటసారి,
నిజానికి లోకం గుర్తించని కమ్యూనిస్టు.

అదే..అదే..అందరికీ తెలిసిందే
జీవితం ఒక నాటకం,
తెరతీస్తే జననం,తెరమూస్తే మరణం
తెలియనిదొక్కటే
ఏ దృశ్యం కుదిపేస్తుందో?
ఏ ఘట్టం మదిదోస్తుందో??

తంతి రాగానే,గోడక్కొట్టిన బంతిలా
ఆతృత పడతారందరూ..చదివెయ్యాలని,
వాటిలో పైకి ఎగదోసేవెన్నో,
కిందికి దిగదోసేవెన్నో,
కవరు చివర పసుపుచుక్కలున్నా,
ఖర్మకాలి ఇంకు మరకలున్నా,
వార్తలేవైనా ఆతడి మందహాసం మామూలే
అందుకే నిజంగా అతడొక కమ్యూనిస్టు
కాదు..కాదు..నిజానికి గొప్ప హ్యూమనిస్టు
 
*2.8.2012

2, ఆగస్టు 2012, గురువారం

కాశి రాజు॥మగాళ్ళ సంత॥



నల్లగా నిగనిగలాడే
మట్టగిడస,
నాజూకైన నడుమున్న
షీలావతి,

కుర్రమేను కలిగిన
కొర్రమేను,
బొత్తిగా సేతికి సిక్కని
బొమ్మిడాయి,
పిచ్చపట్టించేటట్టున్న
బొచ్చుపిల్ల,

కుదురంటూ ఉండని
కానాగంత,
నిండుమనసున్న
పండుగప్ప,
వలసతీసుకుపోయే
పులస్సేప,
అన్నీ ఆడసేపలే దొరుకుతాయ్

అదేంటోమరి
మన మొగోళ్ళసంత
 
*2.8.2012

పులిపాటి గురుస్వామి॥నిస్తంత్రీ ప్రేమ॥


1

మన మధ్య
పరిచయమైన దూరం ఉండగా

పరామర్శించే వ్యత్యాసం కూడా
కేవలం పలకరిస్తుంది

నువు నాకు
తెలుసనుకునే లోపునే
ఒక ఖాళీ పేజీ ,పుస్తకం మధ్యలో
అవతలి ఇవతలి విషయాల మధ్య
ఎట్లా పూరించాలో తెలియక

మనం నిజానికి చాలా దగ్గర
ఎంతగా అంటే
రూపాయి తూకాల్లో జారిపోయేటంత

2

మన ఇద్దరి లోకాలు
ఒకటి కాకపోవచ్చు
కొన్ని స్వర చాలనాలు
కొన్ని ఆత్మాలింగానాలు
రహదారిలో తటస్థ పడవచ్చు
అవి నీ జ్ఞాపకాల మీద పుట్టుమచ్చలవచ్చు

తెలియక చేసిన తప్పు కూడా
గొంతు పెకిలించు కోవచ్చు
ఒంటరిగా వున్నప్పుడు కొన్ని ప్రశ్నలు
ఊపిరికి చుట్టుకోవచ్చు

మనం నిజానికి చాలా దగ్గర
ఎంతగా అంటే
వాతావరణం విడదీయ గలిగినంత
 
*2.8.2012

వంశీధర్ రెడ్డి॥ఏ నిమిషానికి ఏమి జరుగునో॥


" ఓ పిల్లా. మీ అయ్యేడి"
ఇంత రాత్రి మా ఇంటికెవరొచ్చారన్న ప్రశ్న,
తెల్సుకోవాలన్న కుతూహలం,
వాళ్ళ సారా వాసన ఇంటి వెనకాల, వెన్నెల కింద
పడుకున్న నాదాకా తాకుతుంటే,,

"అన్నా, ఎమి, గీ పొద్దు.
బాపింకా రాలే, కైకిలి కాడ్నుంచి"అక్క,
భయాన్ని కనపడనీయకుండా,
దీపం వొత్తిని చిన్నగా చేస్తూ

"తెలిసే వొచ్చినం,
మీ తాగుబోతోడే పంపిండు,
మా బాకీకి నిన్ను జమచేసుకోమన్నడు" గ్రామపంచాయతిలో అటెండర్,
పగలు నాతో చెరువులో ఈత కొట్టేవాడేనా ఇలా...
దీపం మరింత చిన్నదై..

వంటింటి దాకా వొచ్చారు,
కాళ్ళకడ్డంగా ఉన్న కొత్త కుండ పగిలిన శబ్దం
వాడితో మరో ఇద్దరు,
పోల్చుకున్నా వెన్నెల వెలుగులో

అక్క అరిచింది, నేను వాళ్ళ కాళ్ళ మీద..,
బెదిరిస్తే కాళ్ళు మొక్కడమొక్కటే నేర్చుకున్న ఊరది,
వాళ్ళ వయసులో సగం లేని నేను,
ఎలా ఆపాలో తెలీక, అరిచా.
ముగ్గురూ పారిపోయిన అలికిడి, గొడదూకి,

అక్క అలా ఏడవడం, అమ్మ పోయిన తర్వాతే,
ఆ రాత్రి చంద్రుడూ మాతోపాటు మేలుకుని
నాన్న మీద కోపంకన్నా. పగ పెరిగి..

తెల్లారుతుండగా నాన్న, ఆ ముగ్గురితో
అక్కని లాక్కెళుతూ
అమ్మలా కన్పించింది అక్క,
నన్నింకోసారి పోగొట్టుకుంటావా అని అడిగినట్టై
అక్కను దూరంగా నెట్టి, దీపం బుడ్డి విసిరిన
మంటల్లో నాన్న,
దసరాకి ఊరిబైట కాల్చే రావణుడిలా,
ఆ ముగ్గురూ మాయం

పోలీసుల్ని తీసుకొస్తారని తెలిసేంత చదువుంటే,
వాళ్ళని కూడా..
ఇంకా ఎందరో అక్కలు సుఖంగా ఉండేవారే..

చాలా ఏళ్ళు బోస్టన్ స్కూల్లో.
అక్క మొదట్లో చూడ్డానికొచ్చేది,
తర్వాత ఉత్తరాలొచ్చేవి,
చివరగా నేను పంపిన ఉత్తరాలు నాకే..
ఇల్లు మారిందనుకున్నా

విడుదలై ఇంటికెళ్తే,
అక్క, ఇద్దరు పిల్లల్తో,
గ్రామపంచాయితీ అటెండర్ గాడు కూడా,
చెయ్యి లేచింది గాల్లో, వాడి మెడ విరవడానికి

"తమ్ముడు,
మీ బావరా, నమస్తే పెట్టు" అక్క,
మనిషి కూడా మారినట్టుంది
నా మెడ విరిచేసి,
మనసును కూడా...
*2.8.2012

నందకిషోర్॥రాఖీ॥


హసన్‌పర్తి హాస్టల్లోంచి
పండక్కని పర్మిషనడిగి,
జీపుల్లల్ల ఆటోల్లల్లబడి
ఇంటిముందుదాక వచ్చి,

నేనొచ్చి లోపలికి తీస్కపోవాలని
కడపకాన్నే కూలబడ్డట్టు..
నీ కండ్లపొంట నీళ్ళు
బొటబొటా రాలుతున్నట్టు..

బట్టలుతుక్కొని ఎర్రగైన
లేత చేతుల్లల్ల కట్టెల్లసంచితో
నువ్వింకా అక్కన్నే
నిలుసున్నట్టు..

గనపడంగనే
ఉరుక్కుంట వచ్చి
కావలించుకుని
కండ్లు తుడుసుకున్నట్టు..

తెచ్చిన దారప్పోసల రాఖీకి
నీలెక్క నాలెక్క గుచ్చిపెట్టిన
రెండుపూసలూ..
మాయమయినట్టు,
మళ్ళీ తేలినట్టు..

ఏందోనే అక్కా!
రాత్రంతా ఒకటే మనాది!

***

రెండేండ్లు నువు రాలేనప్పుడు
చెల్లెనే రెండ్రెండు కట్టింది.
నువ్వు చెయ్యిపట్టుకునే తీరు
గదెప్పుడు నేర్శిందో తెల్వలే..

నాలుగేండ్లు నేను రానప్పుడైన
ఎట్లబడి నీ రాఖీ నాకుజేరేది.
పోస్టుల్నైనా పంపించి
కట్టుకొమ్మని పోన్‌జేసేదానివి..

***
సాగతోల్తాంటే
అమ్మ నా చేతిల
నీ చెయ్యిపెట్టినప్పుడో
నల్ల పూసలు గుచ్చినంక
కార్ల నిన్ను తీస్కపోయేటప్పుడో
నిమిషమన్నా
దుక్కించకపోతిని!

అందర్ని సూడబుద్దైతుందిరా అని
మొన్న మాట్లాడినప్పుడన్న
ఏడ్వకపోతిని!

నువ్వు మళ్ళా
పర్మిషనడిగి
కట్టెలసంచితో
ఇంటికాడ నాకోసం
ఎదురుసూస్తున్నట్టు

వెండి రాఖీ
రెండు దారప్పోసల మధ్య
ఇరుక్కున్నట్టు

ఏందోనే అక్కా!
పొద్దున్నే పిచ్చి కల!

***

ఏదేమైనా
నీకోటిజెప్పాల్నే..

గీ దినమన్నా
నీ యాదిల గడపకుంటే
యాడాదంత
గడ్వనట్టే ఉంటది.

అక్కా..నీ బాంచన్..
యేడున్న సల్లంగుండు.
 
*2.8.2012

మెర్సీ మార్గరెట్॥సంతోషం ఎలా ఉంటుందో తెలుసా ?॥


చేప నవ్వుతో
నీటిలో వచ్చిన బుడగల్లా

తంగేడు పువ్వు రంగులా

చీలిన వేణువు శరీరం లోంచి
వచ్చిన మోహన రాగంలా
వర్షపు చినుకులో
నిండుకున్న
హరివిల్లులోని రంగుల్లా

గులాభి మొగ్గను ప్రేమతో
కుడుతున్న చీమలా
నా చేతుల్లొ ముద్ధలా మారి
ఎరుపు రంగు నింపుతున్న గోరింటాకులా

పాపయిలా నేను తిన్న బలపపు
రుచిలా
తప్పుగా రాసిన అక్షరాలను తుడిచిన
ఎగిలి తడిలా

నాన్న కొట్టిన తర్వాత
కర్రను కొపంతో విరిచేసి
హమ్మయా అనుకున్న నవ్వులా
మొదటి తరగతిలో టీచర్కి
దొంగతనంగా కోసుకెల్లి ఇచ్చిన
పువ్వులా

నీకు దగ్గరై హత్తుకున్నప్పుడు
కళ్ళకి ఆనందం కలిగి
ఉబికి వచ్చి
చెంపలని ముద్దాడిన
కన్నీరులా

నీ కౌగిలిలో చిగురిస్తూ
పచ్చదనం పూసుకుంటున్న
లేత చిగురు ఆకులా
ఆ ఆకుపై నువు త్రాగుతున్నప్పుడు
నీ పెదాలపై నుంచి జారిపడ్ద
ప్రేమ రసంలా

సంతోషం ఎలా ఉంటుందో
తెలుసా ?
అచ్చం నీలాగే
హర్షాతి రేకలతో
తెల్లని నవ్వువైపుకు
నన్ను త్రిప్పుకుంటున్న
నంది వర్ధనంలా
నా నుదుటిపై నీ తొలి ముద్దులా ♥
* 2.8.2012

బాబీ నీ॥గీతలు॥


నీకోసం
నాకోసం
ఎన్ని గీతలు

అక్షరాలకు అక్షరాలుగా..

సరాసరి
నెత్తుటిగీత
నీ హ్రుదయాన్నుంచి
నాహ్రుదయంలోకి..!!

మనిద్దరిమధ్య ఎన్నెన్ని గీతలు

సొంగలు సొంగలుగా గీతలు
నీపెదాల్ని
నాపెదాలు
పలకరించినప్పుడు,
ఒకళ్ళకొకళ్ళం గాట్లుగా మిగిలినప్పుడు.

దుర్మార్గపు దారం గీతలు
మౌనంలో
ఆరోజు..
అదే పెదాల్నికుట్టి
నా పాదాల్ని కట్టి పడేసిన గీతలు!

నిన్ను-నన్ను
మనమనే ఇద్దరిని
బతుకంతా దూరం చేసిన
ఒకేఒక
పసుపురంగు దారంగీత!

చిక్కు ముళ్ళళ్ళో చిక్కుకుపోయిన గీతలు
ఆక్షణం..
ఆ జీవనదీజన్మస్థలంలో
మన ముఖాలమీద
ఆగని
ప్రవాహ గీతలు!!

నీకోసం నాలోపల ఎన్ని గీతలు

గీతలు
ఆగిపోవు
గీతలు
చెరిగిపోవు
నేననే ఆరడుగులగీత
నేలకింద రాసుకునేదాకా!!

హ్రుదయాన్ని
కత్తిరించి
చివరకు
పులిస్టాప్ పెట్టుకునేదాకా..!!
 
*2.8.2012

పెరుగు రామకృష్ణ||మృత్యు ఘంటికలు...||


మట్టితో,
ప్రకృతితో

మమేకమై
మహిమాన్విత మైంది
మనిషి బ్రతుకు..
పైరుపంటల,పాడియావుల
పురాతన బందం గుండెల్లో
పదిలపరుచుకుని
ఆత్మ సాంగత్యంతో నడుస్తున్నాడు
పచ్చని ప్రపంచాన్ని చూసినప్పుడు
చెట్టు మొదల్లో నిల్చునప్పుడు
అమ్మ పొట్టలో తలదాల్చుకున్నట్లు వుంటుంది..
నిర్మలమో
ప్రశాంతమో
ఏదయితేనేం..
ఈ నేలను సుజలాం,సుఫలాం,
సస్య శ్యామలాం చేసిన
సృష్టి కర్తకు వందనం..
ఎన్ని రంగులు,
ఎన్నిపువ్వులు
ఎన్ని అందాలు అద్దిన
సృజనకారునికి అభినందనం..
దురదృష్టం..
కాలుష్యం కల చెరుపుతుంది
ఏవీ ..
తుమ్మెదనై పూల మొక్కల మధ్య
పరుగెత్తిన కలల ప్రపంచపు కొసలు
ఇప్పుడు
ఎవరో రహస్య శిబిరం నిర్మించుకున్నట్లు
పొలం మధ్యన పొగ గొట్టాలు లేస్తున్నాయి
గెణాల పాదులు తీసిన పొలం
రాత్రికి రాత్రి రొయ్యలగుంట లై
రసాయన స్నానం చేస్తుంది..
రక్తం రంగు నింపుకున్న దేహాలు
పచ్చదనాన్ని మార్చురీకి తరలిస్తున్నాయి
భూమి శిధిలమై మనిషికి
బూడిద బహుకరిస్తుంది..
దీప ద్రవాలన్నీ ఆవిరై
ఆమ్ల వర్షాలు కురిపిస్తున్నాయి
మనిషికీ మనిషికీ
మనిషికీ మట్టికీ మధ్య
పరిచయ నిర్మాణం భారమై పోతుంది
రెప్పమూసినప్పటి నల్లని దృశ్యాలన్నీ
మనిషి బతుకును మసక బారుస్తున్నాయి
అంతా వ్యాపార వ్యాపకమే ..
తరాల నాటి మది గోడలనిండా
నింపుకున్న ఆకు పచ్చటి అడవి
ఇప్పుడొక శిధిల జ్ఞాపకమే..
వేడెక్కిన భూమి మీద
మృత్యు ఘంటికలు మోగుతూ
బ్రతుకు వస్త్ర పోగుల్ని నిలువునా జ్వలిస్తూ..
అతి తీవ్ర గ్రీష్మాల్ని
స్వాగతించాల్సి వస్తోంది..
వెన్నెలని ఏరుకున్న చోటనే
కంకాళాల వికార వంతెన మీద నడవాల్సి వస్తుంది..
నిషిద్ద ప్రపంచపు గది ముందు
శరీర తొడుగుల్ని విడిచి
ఏమీ లేని తనం తో మిగలాల్సి వస్తుంది
ఇప్పుడు
మనిషి స్వార్ధంతో మట్టిని మింగేస్తుంటే..
భద్రకాళిలా రుద్ర రూపం దాల్చి
ప్రళయంలా మట్టి విరుచుకు పడి
మనిషిని మింగేస్తుంది..!!
*2.8.2012

1, ఆగస్టు 2012, బుధవారం

నరేష్ కుమార్॥మనిద్దరం॥


అన్నా....!
మనిద్దరం
శత్రువులెప్పుడయ్యాం
నేను
ఆశయాన్ని
ధరించి నప్పుడా....?
నువ్వు
కర్తవ్యాన్ని పూసు కున్నప్పుడా....?

నెనెప్పుడు
నక్స లైటయ్యాను
నువ్
మనిషిగా చచ్చి నప్పుడా....?
నెను
మనిషి కోసం పుట్టినప్పుడా...?

ఇద్దరం
పరుగు తీస్తూనే ఉన్నాం
మరి
మనకు మృత్యు లక్ష్యాన్ని
నిర్దేశించినోడెవడు....?

అన్నా...!
మనిద్దరం
మనిషి విలువలు కాపడేందుకే....!
ఐతే
నువ్వు
నియమించ బడ్డావ్
నేను నిబద్దించ బడ్డాను..
నీది
కాపాడె ఉద్యోగం
నాది
రక్షించే ఉధ్యమం
అన్నో....!
నా ఆశయాల కుప్పల్లో
నీకూ ఓ విలువుంది
ఎందుకంటే
నీకు నెను నక్సలైటునే
నాకు మాత్రం
నువ్వో కార్మిక సోదరుడివి....!
 
*1.8.2012

భవాని ఫణి॥సరికొత్త కాంతి॥

అలా అలా మేఘాల చాటుకి
మనసు వెళ్ళిపోతోంది ......

నిశీధిలా నిరాశ దుప్పటి
పరుచుకుంటోంది ......

రెప్పలు కప్పుకుని
కన్నులు వర్షిస్తున్నాయి
ఎవరు చూడ లేరనుకుని !!

చీకటి ఆపలేని
గుండె చప్పుడు
రోదన లయలో
వినిపిస్తోంది ...

ఉండుండీ వెలుగుతున్న
విషాదపు మెరుపు
అసలు నిజాన్ని
నిర్భయంగా చూపిస్తోంది !!

మెల్లమెల్లగా తాకుతున్న
ఆశాకిరణం మాత్రం
కాళ రాత్రిని కరిగిస్తోంది

వెచ్చని తన వెలుగు చేతులతో
కలతల కన్నీటిని తొలగిస్తోంది

పట్టిన ముసురుని
తరిమికొట్టి
సరికొత్త కాంతితో
హృదయాకాశాన్ని మెరిపిస్తోంది!!!
 
*1.8.2012

ధనలక్ష్మి బూర్లగడ్డ॥కడసమయం॥

కాటికి కాళ్ళు చాపుకున్న కడసమయంలో
కాదంటూ కాలదన్నిన కన్నకొడుకులు
కష్టాలు కావలి కాస్తుంటే
కనబడలేదు కంటికి కరుణ

కర్మ అని అనుకోక
కాలానికి ఎదురొడ్డి
కడుపుకింత కూటి కోసం
కాయంలో బలం కూడగట్టుకొని
కష్టాన్ని కసిని కళ్ళల్లో నింపి
కర్మకాంఢలో వాడే కట్టెలమ్ముతూ
కాలాన్ని నెడుతున్నా

క్షణం మోస్తున్న కావిడిలోనివి కట్టెలే
కనుమూసిన క్షణంలో కౌగలించుకొనేవి కట్టెలే

కడకి "కూటి కోసం కోటి కట్టెలు" అయ్యింది నా ఈ జీవనం
 
*1.8.2012