పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జులై 2012, బుధవారం

కిరణ్ గాలి ॥ప్రేమ లేఖ! ప్రేమ లేక?॥


ప్రేమ లేఖంటే ప్రణయ శిల్పం
మాటలలో చెప్పలేని దాన్ని
మనసు ఉలితో చెక్కడం

కాని ఎం రాయను?

గుండె కింద గడ్డకట్టిన ఙ్నాపకాన్నా?
పెదవి చివర చిక్కుపడిన తడి పలకరింపునా
రెప్ప మూస్తే గుచ్చుకునె నీ రూపాన్నా
రేయి వీస్తే తగలబడే నా దేహాన్నా

నీ చిరునవ్వుల ధ్వని తరంగాలను
గుప్పిల్లలొ పట్టి గుండెకు హత్తుకున్నక్షణాలు
మారె నీ పెదవుల చుట్టుకొలతలను చూస్తు
గడిపిన అసంఖ్యాక యుగాలు ...

నీ ముని వేళ్ళ కొసలకు
బంధించ బడ్డ సున్నితమైన స్మ్రుతులు
నీ దేహ ధ్యానంలో
జ్వలించి స్కలించిన మధురానుభూతులు

అన్ని ...
కాలంతో పాటు బొట్టు బొట్టుగ రాలి పడుతున్నాయి

మౌనం ఘనిబవించే ద్రుశ్యాన్ని
ఙ్నాపకాలు ఉరితీయబడి
ఉపిరాడక పొవటాన్ని
అనుభందాలు కాలబిళంలో
కలిసిపొవటాన్న్ని కళ్ళరా చూడగలిగాను కాని

అణువణువు నా ఆత్మలో ఇంకిన
నీ తనువు స్పర్శను ఎలా మరిచేది

ఎరుపంటే నీ పెదాల రంగనె
తెలుపంటే నీ చిరునవ్వు తళుకనే
నలుపంటే నీ కాటుక కళ్ళగానే తెలుసు
కాని వలపంటే రంగులు మారుతుందని తెలియదు

శీలమంటే చిరిగిన చర్మపు పొర కాదు
చెదిరిన నమ్మకపు అర

గుండెల్లో వాయు గుండాలు
సుడులు తిరుగుతున్నాయి
రెప్పల మాటు వర్శంలో
హ్రుదయం తడిసెదెప్పుడో

-----
కన్నీటి సాంద్రత
ఒంటరితనమ్ వైశాల్యమ్
ఓటమి విస్తిర్నం తెలియలంటే
ప్రేమలొ "పడా"ల్సిందే
*10.7.2012

కరణం లుగేంద్రపిళ్ళై॥ చిగురులు॥


ఏదో మూగతనం
మాట గొంతులోనే
ఆగిపోతూ..మరణిస్తోంది..

ఏదో అవిటితనం
అడుగు తీసి వేసేంతలోనే
మడుగు మింగేస్తోంది..

తరతరాల తలరాతలు
మార్చాలనుకున్నా
చెరగని దాని ఆనవాళ్ళు
తిరిగి తిరిగి మొలకెత్తుతున్నాయి

ఎదిరించలేనితనం
ఎవరూ చేశారీ గాయం
రక్త స్రావం తప్ప
అత్మార్మణ తప్ప
తిరిగి కొడదామన్న
స్పృహను రానివ్వడం లేదు

మోడుబారిన కొమ్మలపై
పచ్చిని చిగురులు
మరణశయ్యపైనుండి
లేస్తున్న శ్రామికుడి మూల్గులు

ఇకనైనా ఆలోచనకు రెక్కలు వస్తాయేమో?!
*10.7.2012

వాడ్రేవు చినవీరభద్రుడు॥ఒక కాంతికోశం॥


పొద్దున్నే మేమా జలపాతం దారిపట్టాం. ఊరువదిలి
అడివిబాట.వానకు తడిసిన కొండలు.రెండు మలుపులు
తిరిగామో లేదో గుప్పున తాటిపళ్ళసువాసన.ఊపిరితిత్తులు
దొన్నెచేసి నా అదృశ్యబాల్యాన్ని ఆబగా ఆఘ్రాణించాను

'నిన్న చూసామే మబ్బులు, అవి ఇక్కడివే' అన్నారొకరు
నిన్నరాత్రే మేఘమాల నేలకి దిగివచ్చినట్టు కొండవాగు-
జపనీయ సాధుకవిశ్రేష్టుడు సైగ్యొ ఇక్కడికి వచ్చివుంటే
ఈ సెలఏటితో చెలిమి చేసి ఒక కవిత చెప్పివుండేవాడు.

జలపాతం కూడా ఈ మాటే చెప్పింది: చుట్టూ పచ్చదనం
పరుచుకున్నప్పుడు రాళ్ళు కూడా కావ్యగానం చేస్తాయని.
అంతటా ఆవరించిన నిశ్శబ్దం మధ్య ఉరికే నీటి చప్పుడు
నా హృదయధ్వనిని నాకు మరింత స్పష్టంగా వినిపించింది.

లేఎండవేళ పచ్చికదారులమీద పూలుచల్లినట్టు వేనవేల
సీతాకోకచిలుకలు.ఏ చిరుగాలికో ఒక కాంతికోశం
పగిలినట్టుంది.వెలుతురుపోగులు నన్ను కమ్ముకోగానే
అందాకా నా చుట్టూ అట్టకట్టిన ఒక పెంకు చిట్లిపోయింది.


*10.7.2012

నందకిషోర్॥మనవి॥


కుడితే కుట్టావ్ పో!
మళ్ళీ ఎందుకు
ఇక్కడే తిరుగుతావ్?

నొప్పిలేదనో,
బాగున్నాననో

తప్పిరాలేదనో,
బాగున్నావనో

నేనెపుడైనా
అబద్దం చెప్పానా?

ఆలస్యం చేయకుండా పో!
నే రాలిపోవాలి.

పుప్పొడి దారుల్లో
మళ్ళీ కలుద్దాం..
సెలవు.


*10.7.2012

మెర్సీ మార్గరెట్॥మిస్డ్ కాల్॥


ఏంటి గుండె ఉమ్మేసింది
నా వాలిడిటి ఎక్స్పైర్ అయిందా ?

కొన్ని పరిచయాల గాయాలు అలాగే వున్నాయి
కాని ..
మానిపోయే గాయం కన్నా ఏడ్పిస్తూ ఎక్కిరించే
వాతల అంకెలని చూస్తే
మళ్ళీ మళ్ళీఅస్తమించమని
బలవంతంగా నన్ను సముద్రంలోకి
విసిరి కొడుతూ ఆడుకోవద్దని
విన్నవిస్తూ మనసు తివాచి పరిచా

ఇప్పుడు
నా పిలుపు ఏడుస్తుంది
ఎందుకు జీవితకాలం దూరం చేసావని ?

ఏ అరణ్యంలో దాక్కున్నావ్
నా మనసు కుడా చేరలేని ప్రదేశమా?
ఏ ఎడారిలో ఇసుక దిబ్బ వయ్యావ్?
నీ అడుగుల జాడలు తుడిచేసి దాక్కున్నావ్
నా పాదాలు నిను చేరకుండా

కాలం దోసిటిలో పట్టుకున్నా
బొట్టు బొట్టుగాదారులెతుక్కుని
మరీ జారి పోతుంది
ఎం చేయను ?

మిస్డ్ కాల్స్ లా మిగిలిపోయే నన్ను
ఎప్పుడో ఒకప్పుడు నీ చూపు తడుముతుందని
తిరిగి స్పందించేంతలో నిజంగానే నేను
నీ గుండె అర నుంచి
బయట పడేసే సిమ్ కార్డునయిపోతానని
భయం

అందుకే జీవితమే మిస్ అవుతున్నా
నా పిలుపుకి నువ్ స్పందించేంత వరకు
నీ గుండెను తెరిచే అంకెలని వల్లే వేస్తూ
నీ గడప దగ్గరే
తలుపు తెరిచే వరకు తడుతూనే ఉంటా..
*10.7.2012

10, జులై 2012, మంగళవారం

వంశీధర్ రెడ్డి॥నీడలూ నిజాలు॥


అప్సర బార్,
సికంద్రాబాద్, 11.30 p.m
ఆరు లార్జ్ లు, నాలుగు ఫింగర్ చిప్స్,
ఒక చికెన్ మంచూరియా ,
కడుపులో,
ఆసిడ్ తో ఆడుకుంటూ,
నికోటిన్ ఊపిరిలో దూరి ఊహల్లో చేరి,
ఉత్తేజింపచేస్తూ,

-"సర్, క్లోసింగ్ టైమ్",
ఐ నీడ్ వన్మోర్,
-"సర్, పెరేడ్ గ్రౌండ్స్ వెనక,
లాంబా దగ్గర, యూ మే గెట్ సార్",
మర్యాదగా మెడ పట్టి గెంతుతూ సర్వర్,
ఇచ్చిన టిప్ప్ పిడికిట్లో ఉండగానే,

నిమిషాల్లో కారెక్కి, గమ్యానికి చేరి,
ఎవర్నేమనడగాలో వెతుకుతుంటే,
చేరిన ఓ నీడ,
ఆ రాత్రి
"స్నానించిన పువ్వులా",
మగ నీడా?
ఐతే, "కడిగిన కాయలా",
మందెక్కితే ఉపమానాలుప్మా తిన్నంతీజీ...

రాణిగంజ్ వరకు లిఫ్ట్ కావాల్ట,
మందక్కడే దొరుకుద్దట,
చొరవగా కారెక్కి
చనువుగా తొడ గిల్లిన నీడ,
అకస్మాత్తుగా
స్థానభ్రంశం చెందుతూ నీడ చెయ్యి,
నన్ను నాకపరిచితుణ్ణి చేస్తూ,
నీడ చెంపన సంతకమిచ్చిన నా వేళ్ళు,
కారాపకుండానే,

-"యూ రోగ్, వై డిడ్యూ గెట్ మీ ఇన్ దెన్,
అమ్ నాట్ అన్ ఆర్డినరీ పింప్, యూ @#$&"
పూర్తిగా పరిచయమై
నన్ను నాకు అసంపూర్ణంగా మిగిల్చి, నీడ..

ప్లీజ్, గెడ్డౌన్,
అమ్ నాట్ దట్ కైండ్, అండ్
అమ్ నాట్ దట్ "కైండ్" టూ,
కోపం, అసహ్యం, జాలి, బాధ, భయం
నా గొంతులో,
రేడియో లో పాట,
"నిను వీడని నీడను నేను"....

దాహం చచ్చి, ద్వేషం పెరిగి,
పరిస్థితుల మీద,
ఒక్కడ్నే ఉన్నా,
ఎన్నో నీడల్నన్ను చూస్తున్నట్టు,
నా నీడే ఏదో రహస్యం దాస్తున్నట్టు.
ఏనాడో ఇవన్నీ తెలిసినట్టు.
అన్నీ కలిసి నన్ను కప్పేస్తున్నట్టు.
టాంక్ బండ్ మీద విగ్రహాల నీడలూ,
పుట్పాత్ జీవనాల జాడలూ,
చీకట్లో, ఏడుస్తున్న, స్త్రీ నీడ,
వెలుగు చూడ్డానికి ఉక్కిరిబిక్కిరయ్యే కన్నీటి గాథ,
ఏదో నిజం చెప్తున్నట్టు,
ఈ నీడలు,
ఏ నిజాలవో......
*10.7.2012

జిలుకర శ్రీనివాస్॥సాయంత్రం ఏడు దాటిందా..॥

సాయంత్రం ఏడు దాటిందా గుండె ఏదో కీడు శంకిస్తూనే చెట్ల మధ్య
దొర్లుతూ ఉంటది
ఏమి జరుగుతుందో ఏమో అక్కడ తెలీదు
ఎన్ని కలలు కూలిపోతాయో తెలీదు
ఆ రాత్రంతా మొద్దుబారి శవంలా వాసనేస్తదో తెలీదు
సాయంత్రం ఏడు దాటిందంటే చాలు ఎడమ కన్ను అదురుతూ ఉంటది

రణగొణ ధ్వనుల మధ్య మూడు గిర్రల బండి నెమ్మదిగా మాట్లాడుతూ ఉరుకుతది
అప్పటి దాకా ప్రియుని సమక్షం లో ఓలలాడిన గవ్వ కళ్ళున్న గువ్వ
చెవి జూకాల సడిలో అతడి ప్రేమ తాలూకు గుసగుసలు
ఎవరికీ వినపడకుండా దాచుకుంటూ
నాతో మాట్లాడుతూ ఎగిరిపోవాలని ఒకటే ఆరాటం దానికి
నేను మాటల పంజరాన్ని అని అప్పుడే తెలుసుకున్నట్టు
ముళ్ళ కంచెలా తన రెక్కలకు గుచ్చుకున్నట్టు
గుల్బర్గా పాత గోడల మీది తన స్వప్న సీమను నేనే కూల్చేసినట్టు
అంబర్ పేట ఆకాశాన్ని నేనే చించేసినట్టు
ఒక్కసారిగా పర్దా లోపల కొన్ని పాములు బుసకొడుతాయి
అంతే! మాటల తీరే మారిపోతుంది
చెట్లకింద చీకటిలో బిక్కుబిక్కుమని దాక్కున్న నల్ల కుందేలు పిల్లలా బెంగటిల్లుతాను
నేరం ఏమి చేశానో తెలియక వొంటినంతా తడుముకుంటాను

సాయంత్రం ఏడు దాటిందంటే నేను అల్లుకున్న పాట పగిలిపోతది
ఆమె పిలుపు కోసం ఎదురు చూసిన కుందేలు గుండెలో విషపు ముళ్ళు గుచ్చుకుంటాయి
నల్లని చీకటిని నా మీదికి విసిరి మూడు గిర్రల బండిని ఒక్కసారిగా దిగెసి వెల్లిపోతుంది
నేను కాల్లు తెగిన కుందేలులా నెత్తురు కార్స్తూ ఎండిన కొమ్మల నడుమ పడిపోతాను
సాయంత్రం ఏడు దాటిందంటే చాలు నాకు చావు ముంచుకొస్తది
*10.7.2012

కిరణ్ గాలి || ఆడమ్ తిన్న ఆపిల్ పండు ||

మండుటెండలో, తారు రోడ్డుపై
చింకి గోనెపై, చిల్లర మధ్య
ఎండిన రొమ్ముల ఆకలి తీరక,
గుక్క తిప్పక పాలకు వెక్కె
పసి గొడ్దుని నేను

జన్మొక వరమా? కర్మల ఫలమా?

కుక్క పిల్లి, అక్కా చెల్లి, ఆవు మేక, అన్న తమ్ముడు
ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి
దుమ్ము ధూళితో దోస్తి చేస్తూ, బోరింగ్ నీళ్ళ కడుపు నిండక
ఫుట్ పాత్ పైన పరుండుకునే అనాధ బాలుడిని

నీవె చెప్పు నిజాన్ని నేడు
నీవొంటరివా, నేనొంటరినా?

మారుతి అద్దం, మరిగే ఛాయి, గనిలొ రాయి,
ఇటుకల బట్టి, సున్నపు తొట్టి
కమ్మరి కుండ, కుమ్మరి కొలిమి,
బరువుకి ఉత, పొలాల కోత,
ఆకలి పేగుగు, బాల్యానమ్మి,
వర్తువు ఇరుసున భావి నలిగిన

బాల కార్మికుడిని

చిన్మయమూర్తి చూసావా మరి
నా చిన్ని చేతులా చితికిన బొబ్బలు?

తప్పుడు కేసుని బనాయించి,
తల్లకిందులా తాళ్ళతో కట్టి,
గోళ్ల సందున సూదులు గుచ్చి,
అరిపాదాల లాటి దెబ్బలు,
డొక్కల నడుమ బూటు డెక్కలు
తోలు బెల్టుల ఇనుప బిళ్ళలు
చెళ్ళు చెల్లున వెన్నున మోగగా

విలవిలలాడిన విప్లవ వాదిని

దయ గల తండ్రి
దండంనీకు
కాలానన్నా వెనక్కి నెట్టు
మరణనన్నా ముందుకు తోయ్యి

శుక్రవారమున కోవెలకొచ్చి
భక్తి శ్రద్దలతొ నినుఅర్చించి
బీద సాదలకు దానమొనర్చి
ఆలస్యముగా వెనుదిరిగిన నన్ను

చికటి మాటుని అపర కీచకులు
ఎలుగుబంటులై పొదలకు ఈడ్చి
పైశచికముగ మానం చెరచగ
రక్తపు మడుగున మాంసపు ముద్దను

ఎంత తెలివితొ అలొచించితివో మరి
కర్మల ఫలమను ఈ కఠిన శిక్షను

అణురణియామ్ మహతో మహీయామ్
ఆదియు అంతము అన్ని నీవె
సర్వేశ్వరుడా జగదీశ్వరుడా

తొమ్మిది చిల్లుల తోలు బొమ్మలం
మాయకు లొంగే మట్టి ముద్దలం

ఆడమ్ తిన్న ఆపిల్ పండో
కర్మల ఫలమొ మర్మల మలమో
పిల్లి ఆపై చెలగాటం
ఎలుకలం మాకిది ప్రాణ సంకటం.

* 09-07-2012

సత్య శ్రీనివాస్ || మజిలీ ||

ఒడ్డంచున
చెట్టు
విశ్రమిస్తున్న
నీటి పొరల
పడవ

*09-07-2012

డా.కాసుల లింగారెడ్డి || తుపాకి కన్నుకు తెలుసు ||

అవును, నిజమే
గాయం చేసిన బుల్లెట్‌కు కాయం చిరునామా తెలవదు
నువ్వు అభివర్ణిస్తున్న దేశ అంతర్గత పెనుముప్పో
అనాదిగా అడవినీ అవనినీ
నమ్ముకున్న ఆదివాసో
కాయమెవ్వరిదన్నది కసిగా దిగిన బుల్లెట్‌కు
తెలవదుగాక తెలవదు
నిజం.. ఎక్కుపెట్టిన తుపాకి కన్నుకు తెలుసు
ఆ కన్నును తన కనుసన్నల్లో ఆడించుకునే
రాజ్యానికి తెలుసు
అవును.. నిజమే
బుల్లెట్ ఆవులపల్లి అమాయక విద్యార్థిని గుర్తించదు
అడవిని పోడుగొట్టి
బతుకు గింజ పండించుకున్న రైతును గుర్తించదు
విత్తనాల పండుగలోని
వైవిధ్య జీవనవిధాన్ని గుర్తించదు
ఆత్మీయబంధాల ఆకలి పంపకాల్ని గుర్తించదు..
రాజ్యసర్కస్ మాస్టరే అధికారిక నక్సలైట్ ముద్ర వేస్తడు
మనిషి రక్తపు పొలినారగించే సాయుధ మృగాలను ఆదేశిస్తడు

అవును.. నిజమే
బుల్లెట్ మాయా కన్నుకు
సాల్వాజుడుం అత్యంత సాధుజంతువే
పేదపిల్లల వైద్యుడు తీహార్‌జైళ్ళో శిక్షించదగినవాడే
ఆరులేన్ల వనరుల దోపిడిమార్గం అభివృద్ధి చిహ్నమే
వేదాంత జిందాల్‌లకు జై కొట్టకపోవడం రాజద్రోహమే
రాజ్యం రాకాసి కళ్లకు
ఇక్కడ మనిషన్న ప్రతివాడు మావోయిస్టే-
ఘనతంత్ర సాయుధ బలగాలకు
ఆదివాసీ నిరాయుధులంతా కాల్చి చంపదగినవారే



* 09-07-2012

అనిల్ డానీ || అరుణ తార ||

ఆకులన్నీ ఎర్రబడ్డాయి.............................
ఓ అరుణతార నేలరాలింది అడివిలో
అలసింది అప్పటివరకు గర్జించిన
తుపాకీ గొట్టం
నేలకొరిగింది తుపాకీ తూటా

నమ్మిన సిద్దాంతం కోసం
నమ్ముకున్న వాళ్ళను వొదిలి
అడివి తల్లి ఒడిలో వొదిగిన మానవత్వం

వస్తుందో రాదో మరి మీరు కోరుకునే
రాజ్యం సామాన్యులకి
మీ ఫోటో మాత్రం ఖచ్చితంగా వస్తుంది
లోన్గిపోతెనో , లేక ఒరిగిపోతెనో అడివిలో

అడివి పూల అంత స్వచ్ఛత మీ ఆశయం
సూరీడు అందరికి వెలుగునిస్తే
మీకు మాత్రం స్ఫూర్తి నిస్తాడు
అరుణ ఉదయమై ప్రతీరోజు

భావాల సంఘర్షణ నిలబడనివ్వదు
పోలీసు తూటా మిమ్మల్ని బతకనివ్వదు
నిత్యం పరుగు విప్లవ భావాలవెంట
తుపాకీ వంటి బతుకును మోస్తూ

గడ్డి పువ్వులాంటి జీవితం
అజ్ఞాతంలో వుండే మీకైనా
బాహ్యంగా వుండే మాకైనా

ప్రతీ సిద్దాంతం రాద్దాంతమే
అది మవోఇజం అయినా
సామ్యవాదం అయినా
ఎవరు నమ్మినా నమ్మకున్న
ఏది ఏమైనా మీరు మాత్రం గొప్పే

తన వాళ్ళకోసం ప్రాణాలు ఇచ్చారు
చరితలో మహానుభావులు
మీకు మాత్రం లేదు బేధం
కులం మతం ప్రాంతీయతత్వం
మీరు ఇస్తే ప్రాణం సకల మానవాళి కోసం
అందుకే కామ్రేడ్ మీకు మా లాల్సలాం

* 09-07-2012

రియాజ్ || కవితా సంగమం ||

అదో..నిత్య స్పందనా మౌనచ్చేదనా ఉద్విగ్న క్షేత్రం
ఆవేశాల గుట్ట
విభిన్న ఆలోచనల గంప
... వైరుధ్య భావాల సమూహం
భావుకతా ప్రదర్శనం
సాహితీ సంగమం ! (అది మరో ప్రపంచం)

కోడికూయక ముందే వెలసిన ముగ్గులా
నవ్వకముందే పడిన అమ్మాయి బుగ్గసొట్టల
అందమైన ముఖచిత్ర దర్శనం వారం వారం !!

కొద్దిసేపు విరామం
అనంతరం మరల మరల వస్తూపోయే వానలా కవుల ఆగమనం

తన పదాల పంట పండాలని ఎప్పుడెప్పుడా అని
ఎదురుచూసే సాహితీ రైతు

వాన పడ్డాక
చేను తడిసినట్లు అది చూసి రైతు గుండె తడిసినట్లు
నెర్రులుబారిన చెరువుగుండె నిండినట్లు
స్పందనల చినుకులు
ఎడతెగని వర్షంలా ప్రశంసల హర్షం
అప్పుడప్పుడూ ఓ ఖండన
అదో నిరంతర సాహితీ ప్రవాహం !!

భిన్నకవుల కవితా సంగమం !!!! (అది మహా ప్రపంచం)

*09.07.12

కరణం లుగేంద్ర పిళ్ళై || మరణభయం లేదు.. ||

ఆకులన్నీ రాలిపోయి
మోడుగా నిలిచిన క్షణం
నిస్సారమైన జీవితాన్నీ
జ్ఞాపకాలతో నింపుకుంటుంటాను

పచ్చని ఆకులు పూసిన దృశ్యాలు
పువ్వులు పరిమళించిన సువాసనలు
నెమరువేసుకుంటాను..
నాకు రాలే ఆకులు ముఖ్యం కాదు
చిగుర్లు వేసే చిగుర్ల కబుర్లు ముఖ్యం
అంతా కన్నా నా మూలాల వేర్లు ముఖ్యం
నన్ను నేను పాతాళంలోకి దింపుకుని
నింగికి ఎదిగేందుకు పడ్డ శ్రమను
చెమటబిందువులతో సహా గుర్తుకు పెట్టుకుంటాను.
.
ఇప్పుడు భాధపడనవసరం లేదు
ఇప్పటి స్థితికి నేనే కదా భాధ్యున్ని
నేటి ఈ స్థాయికి నేనే కదా భాధితుడిని
వాలిన పక్షులు ఎగిరి వెళ్ళిపోయిన చప్పుడు
రాలిన కాయలు క్రింద పడ్డ చప్పుడు
ఏది ఏమైనా నేను స్పందించడం మరిచాను
ఎందుకంటే నాకు చిగురించడమే కాని
మరణించడం తెలియదు

మరణభయం లేనివాడికి
బతుకు ఎలా ఉన్నా ఒకటే
తోడు ఎవరు లేకపోయినా ఒకటే.

*09-07-2012

9, జులై 2012, సోమవారం

పూర్ణిమ సిరి॥తెలిసి..తెలిసీ॥

ఆసాంతం విరబూసిన రెమ్మని
అడిగావా ఎప్పుడైనా
నిన్నటి మొగ్గలు ఏమయ్యాయని
మరి నన్నెందుకు అడుగుతావ్
ఈ వేళ మాటలు కరువయ్యాయా అని...

అమావాస్యరోజున నక్షత్రాలతో మెరిసే
ఆకాశాన్ని అడిగావా ఎప్పుడైనా
ఆ చంద్రుడు లేకున్నా నీకేం లోటనీ
మరి నన్నెందుకు అడుగుతావ్
నీవు లేని క్షణం ఎలా ఉందనీ

నీవన్నీ ప్రశ్నలే ఎప్పుడూ
సమాధానాలన్నీ నీతోనే... నీలోనే..
ఏం కాదంటావా? నా మాటల్లోనిజం లేదంటావా??
ఇదిగో మళ్ళీ నేను కూడా ప్రశ్నిస్తున్నా
సమాధానం తెలిసి తెలిసి...
*8.7.2012

పూర్ణిమ సిరి॥ముంగిలి॥

దారి పొడవున
జారి పడిన వరి గింజలను
ఒడుపుగా ఏరి తెచ్చి
గొలుసులుగా కడతాను
గుమ్మానికి వేలాడదీస్తాను..

వచ్చీ పోయే ఓ పిచ్చుక
నీకెలా చెప్పేదే-
అలా జారిపడిన గింజలపై జాలి కానీ
నాకై నువ్ ఎగిరి ఎగిరి రావాలనే ప్రేమ కానీ
నాకేమి లేవని...

ఏటి ఒడ్డున చేరి
అందమైన గులకరాళ్ళూ ఏరి
పలురకాల జలపుష్పాలు తెచ్చి
గాజు పెట్టె లో అమరుస్తాను
ముంగిలిని అలంకరిస్తాను

చూడగానే ముద్దులిస్తూ
మురిపించే సజీవ జలపుష్పమా!
నీకెలా చెప్పేదే..
నాలోకం నీవే అని భ్రమించే నిన్ను
అందంగా బంధించానని
నీలోకాన్ని నే కుదించానని..

నాకోసమే అన్నీ చేస్తూ...
నావల్లే అన్నీ అని తలచే నేను
అన్నింటికన్నా తక్కువే అని
తెలిసినా ఎలా ఒప్పుకునేది..
ఈ తలపులనుండి ఎలా తప్పుకునేది...
*8.7.2012

ప్రవీణ కొల్లి॥నిశ్శబ్దం॥


నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
రాణిని నేనే, దాసిని నేనే!
ఆలోచనల అలల్లో తీరం చేరితే
సామ్రాజ్యమంటాను!
ఆశల వలలో చిక్కుకుపోతే
నడిసముద్రమంటాను!

నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
అంతే వేగంగా
తటాకంలోని గులకరాయి
బుడుంగున మునిగిపోతుంది….

ఏ పలకరింపో
ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి
చుట్టపుచూపులా ఇలా తరలిపోతుంది….

దివారాత్రుళ్ళు లోలకానికి అతుక్కుపోయినట్టున్నాను!
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
గడియారపు టిక్కుటిక్కులే మిగిలిందిక

కనురెప్పల కదలికలలో సవ్వడేది?
కన్నీటి సుడులలో హోరు, మీరెవరన్నా విన్నారా?

నాకనిపిస్తోంది , నిశ్శబ్దమే శాశ్వతం……..కాదంటారా?
*9.7.2012

నరేష్ కుమార్॥ఒక తుఫాన్॥


మనసులో ఒక టోర్నడో

ఎక్కడో సుడి తిరిగే ఆలోచనలన్నీ
లోచనాలెగరేసి చేస్తున్న
ఓ హల్లీసకం 

గుండెల్లో రక్త నాళాలన్నీ
ఉద్వేగాగ్నిలోకాలిపోతూ కాగిపోయిన
నెత్తుటిని ఉమ్మేస్తూ..
ధ్వాంతాన్ని ధిక్కరిస్తూ దీపమై ప్రజ్వలిస్తూ
సుడిగాలిగా రేగుతున్నాయ్
మస్తిష్కాన్ని బద్దలు కొట్టే ఢంకారవం
గూబలు పగిలేలా ద్వనిస్తూ
సుప్త కంకాళాలలో జీవాన్ని వొంపుతూ
కరాళ నృత్యాన్ని చేయిస్తోంది 

పారిపో...! పారిపో...!
నానుండి నువ్వు నీ స్వార్థాన్ని తీసుకొని
ఇప్పుడిక్కడ
స్వచ్చమైన మనసె మిగులుతుంది..
*8.7.2012

ఉషారాణి కందాళ ॥ప్రతి చూపుకి ఒక పదునుంది!॥

ఎగిరే గాలిపటానిది ఎప్పుడూ పై పై చూపే!
కట్ కొట్టే పతంగులను పట్టించుకోదు, కరెంటు తీగలను లెక్కచెయ్యదు!!


ఉరికే అలది ఎప్పుడూ మునుముందు చూపే!
అడ్డొచ్చే రాళ్ళను చూడదు,
 విరిగే కెరటాల్ని గమనించదు!
వేటాడే చిరుతది ఎప్పుడూ వాడిచూపే!
పొంచిన శతృవులకు భయపడదు, బంధించే వలలకు వెరువదు!
విలుకాడికి ఎప్పుడూ ఎదురు చూపే!
బాణం గురి తప్పనీడు

దృష్టి లక్ష్యంనుంచి మరల్చడు!
కత్తి పట్టిన వీరునికెప్పుడూ కరుకు చూపే!
రక్తానికి జడిసిపోడు, 

ఆయుధాలకి హడలిపోడు!

ఆశావాదిది ఎప్పుడూ రేపటి చూపే!
నిరాశలకు భయపడడు, నిరీక్షణలు మానుకోడు! 


కలం పట్టిన వాడిదీ  ఎప్పుడూ చుట్టూ చూపే!
విమర్శలకు భయపడరు, విసుర్లకు విరుచుకుపడరు!
కంటతడో, గుండె దడో..

ఆ చూపులని లొంగదియ్యలేవు!

ప్రతి చూపు కి ఒక పదునుంది!

ప్రతి చూపుకి ఒక పరుగుంది!


* 9.7.2012

జయశ్రీ నాయుడు॥ కల్లోల జగతి॥

కాలమెందుకు
కదిలిపోతుంది..
అదృష్టాన్నీ
ఆనందాన్నీ
దోచుకు పోతుంది..

ఆనందమెంత అమాయకం
ఎప్పుడూ వుండిపోతాననే...
ఆశ కి ఎంత ఆశ
కల నుండి నిజమౌదామనే..

నీకైనా తెలుసా
ఆ నువ్వుగా వుండవనీ
తెలియకుండా వుంటుందా
అది నువ్వేగా...

గుప్పిట మూసిన కాలమే
తెరవగానే ఎంత ఉలికిపాటో
గుండె నుండి కన్నీరు
కంటిలో ఆవిరైనట్టు

భగ్గుమన్న ప్రతిక్షణమూ
హృదయపు ఆర్తనాదం
నీకు చేరని దూరంలోనే
మెరుపుల్లో మాయం

చిరునవ్వులన్నీ నిజమూ కాదూ
మౌనాలన్నీ మూగవీ కావూ
తెలిసినా ఉలకని నిన్ను
పలకరించి మరీ నవ్వుతాను..

నాలోనే మౌనం
నాలోనే మధనం
నాలోనే గరళం
ఆన్నిటా హాలాహలం

అమృతమెందుకు
అమరత్వం వద్దు
నిశ్చలత్వం చేదించి
కల్లోల జగతి లోనే
నా కలల కుటీరం

 *08-07-2012

సుజాత సుజాతతిమ్మన॥అటూ...ఇటూ....॥


ఙ్ఞాపకాల సమాదులవెంట
ఆగని పరుగులు
శిధిలాల కాలవాలమయినా
వీడని పచ్చివాసనలు

క్షణికమయిన ఆలోచనల
నీటిబుడగలో....
బ్రతుకు చిద్రమై
భవిష్యత్తును కాల్చేసిన
చితిమంటలు

అర్థమయీ...అవక
నలుగుతున్న భావం
ఒకటే...జీవితం..
అటూ...ఇటూ.....
*6.7.2012