ఎన్నివేల ఏండ్ల అనుబందమో
మనిద్దరిది_
నాలా నువ్వు
నీలా నేను
ఎన్ని వేలసార్లు రూపాంతరం చెందామో!
నాకు నువ్వు లేకపోతే
నింగి నీరు నిప్పు గాలి అన్నీ
శూన్యమే కదా_
ఎన్ని వేల సముద్రాలను
ఎన్ని లక్షల నదులను నీలో దాచుకున్నా
ఎన్ని అగ్నిపర్వతాలను గుండెల్లో మోస్తున్నా
ఎప్పుడు నిర్మలవదనంతో ఉంటావ్
చూడగానే చేతులెత్తి మొక్కేలా_
నేను లేనప్పుడు నీలో
ఎన్ని విస్ఫొటనాలు సంభవించలేదు
ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవ్వలేదు
నువ్వెన్ని గ్రహాల చుట్టూ తిరగలేదు
నా తోడు కావాలని_
ఎప్పుడైతే నేను వచ్చానో
ఎంతగా మురిసిపోయావో
ఇంకెంతగా ముద్దాడావో
తోడు లేక గడిపిన క్షణాలు గుర్తొచ్చి_
నన్ను నువ్వు గాఢంగా ప్రేమిస్తావ్
నాకోసమే కొన్ని యుగాలు ఒంటరి జీవితం గడిపావ్ కదా
నువ్వు కార్చిన కన్నీళ్ళు సముద్రాలై
నువ్వు చిందించిన ఆనందబాష్పాలు నదులై ప్రవహించాయ్
నీ ప్రేమకు గుర్తులుగా
కొండలు కోనలు చెట్టు చేమా అవతరించాయ్
ఒక్కటేమిటి నీ అణువణువు ప్రేమమయం...
నీ తనువులో
ఏ అణువును తాకినా
పులకించిపోయాను
తన్మయత్వం చెందాను_
నన్నింత వెర్రిగా ప్రేమిస్తున్న నిన్ను
కౌగిలించాలనీ
ముద్దులాడాలనీ
నా చేతుల్లోకి నిన్ను తీసుకోని మురిసిపోవాలని
నాకనిపించని క్షణం లేదు
ఐతే నేనేమి చేస్తున్నాను?
నిన్ను అనుభవించే వరకే నటిస్తున్నాను
నీతో సహజీవనం చేస్తూనే
నీలో అణువణువు చరిస్తూనే
నీనుండి దూరంగా జరిగిపోతున్నాను
ఓ పక్కన ఒరిగిపొతున్నాను
నీ కోపానికి గురౌతున్నాను
నీ ప్రేమే కాదు
నీ కోపం నాకు తెలుసు...
ఒక్కసారి నువ్వు శివాలెత్తితే
కంపించిపోతాను
భయంతో పరుగులు తీస్తాను
బిక్కుబిక్కుమంటు నిన్ను వేడుకుంటాను
నువ్వు వెంటనే శాంతిస్తావ్
మళ్ళీ షరా మామూలే!
నిన్ను గాలికొదిలేస్తాను
నా పెంపుడు జంతువులే నాకన్నా
నయమనిపిస్తున్నాయ్
చివరి శ్వాస వరకు నీకు విశ్వాసంగా ఉంటున్నాయ్
ఓ భూకామాంధు నిన్ను రంపపుకోత కోస్తున్నా
ఇంకో దుర్మార్గుడు నీ అణువణువూ కబలిస్తూ
నిన్ను మరు భూమిలా మారుస్తున్నా
నాకు స్పందనుండదు
ఛీ! వెదవ జన్మ
దేన్ని పొందుతున్నామో
దేన్ని పంచుకుంటున్నామో
దాన్ని కాపాడలేకపోతున్నాం_
నీకు దూరంగా
ఎన్ని వేలమైళ్ళు నడిచినా
ఒక్క అడుగైనా
నీకు తెలియకుండ వేయగలిగానా?
(భూమిని రక్షించండి)
20.09.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి