పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, జూన్ 2014, శుక్రవారం

John Hyde Kanumuri కవిత

రాత్రిమైదానం ||జాన్ హైడ్ కనుమూరి|| ~*~ ఓ రహస్య ప్రేయసీ! నేనొచ్చేలోగా కదులుతున్న బస్సు లోంచి అల్విదా చెపుతూ వూపిన చేతినీడల్లోంచి కన్నుల్లో మెరిసిన జలసయాలలో మునిగితేలుతున్నా ఉతికి ఆరేసిన వస్త్రాల్లా జ్ఞాపకాలను కాలం క్లిప్పులకెప్పుడో తగిలించా ఇప్పుడవి పీలికలు పీలికలుగా బయట పడ్తున్నాయి ప్రేమంటే తెలియని ఏ చిహ్నాల మద్యనో చిగురించిన పచ్చదనాన్నో వలచి వలచి ఏకంకాని రైలుపట్టాలమయ్యాము। కాలచక్రాలు కదిలిపోతుంటే మారింది నువ్వో… నేనో…? స్వప్న రాగాలకేం అన్నీతానై పలికిస్తుంది ఒక్కో స్వరాన్ని పల్కడానికి ఎన్ని నరాలు తంతిలయ్యే సమన్వయమో! నదిపై పిల్లగాలి అలల్ని తెచ్చినట్టు తేలియాడిస్తుంది తెరచాపెత్తిన పడవలో ఈలపాటై గానమాలపిస్తుంది ఇప్పుడు జ్ఞాపకాలు ఝడివానై కురుస్తున్నాయి తడిసిన దేహంతో ఈ వంటరి రాత్రి దాటేదెలాగో? నన్ను నేను చూసేందెకు నలుమూల్నించీ మెరుపు తళుక్కుమంటోది తడిపిన తనమేదో చలై మెలిపెడ్తున్నా ఒకొక్కటి గా విప్పే వస్త్రాలలో ఒక్కో రూపమైపోతున్నావు మన పరిచయం ఎక్కడిది? అక్షరాలవెనుక బలపమై పరుగెట్టిన పక్కింటి పరిచయమా! పాఠశాలనుండి హైస్కూలుకు ఎదిగి వయసు వయ్యారమేదో దూరంచేస్తుందని పూలరేక సొగసుల్ని జతచేసి కవితాగానాన్ని నేర్పేందుకు నీవిచ్చిన తొలిలేఖ అర్థంకాని కన్నుల్లో ఏ స్వప్నాన్ని వెదికావో? ఇప్పుడు నవ్వొస్తుంది కదూ! ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులమై తరగతిగది వదిలేస్తుంటే ఎంత వుత్సాహంగా వుండేదో! ఊరికున్న హైస్కూలును వదిలేసాం కదా! ఇప్పుడది కాన్వెంటుకు పోతున్న పిల్లల్ని చూసి దారితప్పిన వంటరి పక్షిలా బిక్కుబిక్కుమంటూంది మనం ఆడిన ఆటలకు సాక్షిగా నిలిచిన సూరయ్యతోట నామరూపాలు కోల్పోయినట్టే ఆటలుకూడా కనుమరుగయ్యాయి కదా! ఇప్పుడు మార్కుల రేసులు కంప్యూటరు చిప్సు బాల్యమయ్యింది విడిపోయిన మనకాలేజీ దార్లకు ఎన్ని రహస్యమార్గాలు వెతకలేదూ! జీవితమెప్పుడూ అద్దంలో భూతంలా కనపడలేదు కలుసుకున్న క్షణాలన్నీ కబుర్లై గడిపెయ్యలేదూ! అత్తయ్యా! అంటూ అడుగెట్టగానే ఎంత గుండె దడ దడ! ఇప్పుడా గుండె చప్పుళ్ళేవి? ముసిముసిగా నవ్విన మౌనాన్ని శాస్త్రంగా రాయాలనుందిప్పుడు కానీ ఆ నవ్వుల నిగారింపేదీ? ఎక్కడా ఎవ్వరిలోనూ కనపడదేం? జీవనయానం కోసం బందీలౌతూ నవ్వుల్ని తాకట్టు పెట్టేందుకు ఎక్కడెక్కడికో వలసపోతున్నాం కదూ! అయినా అమ్మనీకు ఎలా అత్తయ్యిందో? ఎన్నడైనా మతంవేరని కులంవేరని అనుకున్నామా? ఆన్నట్టు ఇప్పుడొచ్చిపలుకరిచాలన్నా అత్తయ్య లేదు తెలుసా? విడివడిపోతున్న బంధాలకు దూరంగా జరిగింది. వెన్నెల పొద్దులో విప్పుకుంటున్న అరటిపువ్వుల డొప్పల శబ్దాల్ని వినడం నేర్చివుంటే కాటుకరెప్పల చప్పుళ్ళను ఒక్కోముత్యమై వొదిగే హారాన్నిచేసి విజయాన్నేదో వడిసిపట్టి వినువీధుల్లో తిరిగేవాణ్ణేమో! ఆ కీచురాళ్ళకు ధ్వని సంగీతాన్ని నేర్పిందెవ్వరు? ఎన్ని రాత్రులు గీతమాలపించాలని ప్రయత్నించామో? స్మృతి సమాధి తలుపులు తెరుచుకుంటున్నాయి అనంత యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి సంఘటనలు చిన్నివైనా వెదకి తడిమి చూస్తున్నాయి ఆశించినదేమైనా దొరుకుతుందా! వెదకులాట నానుంచి నీవు నీనుంచి నేను ఆశించినదేమీ లేనప్పుడు ఎందుకీ వెర్రి ఆలోచనలు? రంగుల స్వప్నాలెలావస్తాయనే నిరంతర అలజడి ఒక్కసారైనా ఇంద్రచాపానికి చినుకు వెలుతుర్లమై నిలిచామా? నియంత్రించే ఆంక్షలమద్య బందీలం స్వేచ్చారెక్కల్ని ఎప్పుడైనా చూస్తే కదా! పండిన తలతో యిప్పుడు స్వేచ్చను నిర్వచిస్తున్నాం చిత్రంగా వుంది కదూ! పందిరి తోరణం కడుతున్నప్పుడైనా గూడు కట్టూకున్న మనసుని ఆరాధనా దీపంగా వెలిగించాలనిపించలేదేం? శుభలేఖల్ని రెక్కలుగా కట్టి అందరినీ ఆహ్వానించా నడుస్తున్న ఏడడుగుల క్రింద మనసు నలుగుతుందని అనిపించలేదేం? గోదారి అలలపై సరంగు పాడిన పదం ఏ విషాదాన్ని వొలికించదేం? నదిలోతుల్ని కొల్వడానికి తనదగ్గర కొలతలేవీ లేవంటూ వేస్తున్న గడతో ఊర్ల తీరాలు దాటించేస్తున్నాడు మనమే ఏదో తెలియని వెలితి తీరాల్లోకి అడుగుపెడ్తున్నాం బహుశ అలజడి చెందిన నీ కళ్ళను చూసి కొత్తసిగ్గు శింగారమనుకున్నదేమో ఆ గట్టు పై నీకోసం పూలపల్లకి ఎదురుచూస్తుంది రాలేని నా కాళ్ళు బరువెక్కుతున్నాయి అప్పుడెప్పుడో మిఠాయి మోసుకొస్తూ పరుగెత్తుకొచ్చిన గస స్పర్శ నాకు లేదుకదూ! ఈ రోజు మాట్లాడాలని వుంది। నీచెవి నాకోసం కాదు కదా! జాబిలేదో కొత్తరెక్కల్ని తొడిగి వెన్నెల విహారానికొచ్చినట్లుంది ఏ కాంతీలేని నాలోకి పదే పదే దూరాలని చూస్తోంది సంసార చక్రానికి బిగించబడ్డపుడు నీ బంధాలేవో! అన్నీ రేఖామాత్ర లక్ష్మణ రేఖలే! జీవితాన్ని వెదుక్కుంటూ వెదుక్కుంటూ ఏ సడీలేని సమయాన నా వెంటొచ్చిన ఓ వనిత బంధాలేవో కూర్చింది అనురాగమై అల్లుకుందో! అవసరాలే తీర్చిందో! కేర్ కేర్ మన్న శబ్దంవెనుక ఆకలుందో ఆత్రముందో నేర్వాల్సివచ్చింది నడక నేరుస్తున్న పాదంముందు మూడుచక్రాల బండిని నేనే ఇద్దరు నల్గురయ్యే పదఘట్టాలలో ఏది మరచానో… ఏది కూర్చానో…? ఓ చల్లని సాయంత్రం కిక్కిరిసిన సుల్తాను బజారులో ఏ పిల్లల దుస్తుల మద్యనుంచో చిరునవ్వై పలుకరించావు బెదురు బెదురు అరుపులకు కోడి పిల్లల్ని రెక్కల్తో కప్పినట్టు కాలమేదో కప్పేసింది హఠాత్తుగా వులిక్కిపడింది నేనా? నా మనసా? నా పరిస్థితా? అప్పుడప్పుడు నీ కనుల పలకరింపులు సరికొత్తగాయాన్ని చెసాయి గాయాలు కొత్త కాదు కదా! నోట్లతో కట్లుకడుతున్నా! ఇప్పుడు మన ఇష్టాల్ని కలబోసుకుని స్వప్నలిపికి భాష్యాల్ని తప్పిపోయిన దారుల్ని అన్వేషిస్తూ వేర్వేరు బిందువులమై చెరొ వొడ్డున నిలబడి సంకేతాలను నిరంతరం వెదజల్లుతున్నాం దాచుకుంటున్న శ్రమబిందువుల్ని ఎగురుతున్న గ్రద్దేదో తన్నుకుపొతుంది ఏమి కూరుస్తున్నామనేది శేష ప్రశ్న? అప్పుడెప్పుడో నగరానికి నీ వస్తున్నావని తెలిసి కన్నుల్లో వత్తులేసి అర్థరాత్రో అపరాత్రో ఇరానీ చయ్ చప్పరిస్తూ నిదుర కళ్ళతో ఎదురుచూసిన అఫ్జల్ గంజ్ బస్సు స్టేషను యింకావుంది మస్సును తెరిచిన ఆకాశంచేసి చార్మినార్ గుమ్మటాలపైనుంచి చూసిన నగర సౌందర్యమెంతగా మారిందో తెలుసా! మక్కా మసీదులో ఎగిరే పావురాల మద్య జొన్నగింజల మవ్వాలని ప్రయత్నించలేదూ! పావురాలింకా గింజలకోసం పోటీపడ్తున్నాయి. ఖండాల్ని దాటొచ్చి కనువిందుచేసి నీ జడలో మందారాన్ని లాగిన జిరాఫీ కాని చోటులో కలిసుండలేమంటూ తనువు చాలిస్తే భర్తీ చేయలేని 'ఝూ ' వెలవెలపోతుంది తెలుసా! నీ వంటూండేదానివి చల్లదనాన్ని రాతిలోనో చోటులోనో దాచుకున్న బిర్లా మందిర్ వెన్నెలకొండగా మెరుస్తుందని పరుచుకున్న హైటెక్ రోడ్ల నియాన్ కాంతిలో పరుగులెడుతూ అటుచూసే తీరికేది? ద్వారాలులేని అంతఃపురాలచల్లదనం మర్చిపోటట్టు గోల్కండ ఖిలా నగరం మద్యకొచ్చింది తెలుసా! ఏమగ్గాలనుంది తెచ్చావో చీరెంతో బాగుందని మురిసి మురిసిన నా యింతి ఎంత పదిలంగా దాచిందో ఇంకా అలానేవుంది తెలుసా? నగరం మనల్ని మింగేసిందేమో! ఇప్పుడు నీవచ్చావని తెలిసీ రోజూ ఎదురెదురు మట్టాడుతున్నట్టే గాలి తరంగాలలో సుక్ష్మాతి సూక్ష్మ భాగాలుగా విడిపోయి కలవలేక పోతున్నాం నీ వొచ్చిన పనుల మద్య యిల్లు దూరమై కలుసుకొనే చోటుకోసం వురుకులు పరుగులు ఎన్నో పనుల్ని పక్కకుపెట్టి ప్రయాణ సమయంకోసం నడుస్తున్న దారిలో ట్రాఫిక్ ఆటంకాలు దాటి చేరేసరికి జిడ్డుమొహంతో నేను పడిగాపులు బస్సుకోసమో కదులుతున్న బస్సులోంచి నాకోసమో చూపులన్నీ గడియారంపై చూసి చూసి విసుగెత్తిన మొహంతో నీవు ఉస్సూరుమంటూ నిట్టూర్పుతో మట్లాడాలేని మౌనంతో మూగబొయిన సైగలే మన బందానికి సరికొత్త దారంతో ముడివేసాం కదూ! ఇప్పుడేదైనా మాట్లడొచ్చు నిర్భయంగా చెవిలో గుసగుసలాడొచ్చు ఉత్సహ రింగు టోనుకోసం ఎదురుచూడొచ్చు సాలెగూడులో చిక్కుకున్న బంధానికి తీరికేది మనల్ని ఓలలాడించిన స్వరాలన్నీ ఒకొక్కటిగా మూగపోతున్నాయి శృతిచేయని స్వరాలమద్య ఇప్పుడిక స్వప్నాల్లేవు అన్నీ అగ్రిమెంటులే అన్నీ కరెన్సీ కొలమానాలే వెలితి వెలితిగా తడుముకుంటున్న బాల్యం గుర్తులు తవ్వుకుంటున్న జ్ఞాపకాలు వసంతాలిప్పుడు రంగుల్లోకి మారాయి పసుపు నీళ్ళతో పనేంటి? నా కిప్పుడు ఏదేను వనంలోనో బృందావనంలోనో తిరగాలనుంది దావీదు మ్రోగించిన పిల్లనగ్రోవి గీతమవ్వాలనివుంది పిచ్చిగా దేహాలు ముక్కలౌతున్నాయి మన రేపటి కలలపై మిస్సైల్స్ ఎక్కుపెట్టబడ్డాయి నిన్ను అందర్ని వంటరిగా ఎలా వదలాలి? వెర్రి వెక్కిరింతేదో వినిపిస్తున్నా నా గుండెను ఎదురొడ్డుతున్నా ఓ రహస్య ప్రేయసీ వీడ్కోలుకై వూపిన చేయి మసక మసగ్గా కదిలిపోతుంటే కలవర పెడుతున్న ఈ రాత్రి మైదానాన్ని ఎలానైనా దాటి వేకువలో విరిసే సూర్య పుష్పమవ్వాలని వుంది వర్షానికి ముందు యెగిరే తూనిగల గుంపునవ్వాలని వుంది రేపటి స్వాగతోత్సవానికి సిద్దపడాలని వుంది వేకువలో కోయిల గొంతుల కొత్తగీతమవ్వాలని వుంది. ~***~ ........రచనా సమయం 2007 ...20.6.2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UjyWxd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి