ఇడుపు కాయితం||డా //కాసుల లింగ రెడ్డి ||02-02-2014 పుస్తెలతాడు కట్టించి తన్నుకు చావమని సాపెన పెట్టిండు సచ్చినోడు. 1 తాటికమ్మల గుడిసన్నా లేదని రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన. కాసులు లేని కనాకష్ట కాలంల నిలువ గరిసెలిచ్చి నిలబెట్టిన. గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె కుడిదాయి కుడిపి కుతిదీర్చిన. నా రామసక్కని కుర్చీ ఇచ్చి సదువుకున్నోనివని రాజును చేసిన. నిన్నేమన్న కర్రె కుక్కను చేసి ఎంటదిప్పుకుంటినా? 2 మర్లువెళ్ళన్నా కాలేదు కాళ్ళ పారాణన్నా ఆరలేదు ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి. పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య అడ్డు తెరలెందుకంటివి సంపదలు నీకు సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి ఈ కాపురం నేనొళ్ళనంటె కూసున్న పెద్దమనుషులు కాసింత సర్ది చెప్పి కాయితం మీద కాపురం నిలిపిరి. 3 కుడి ఎడమల పెయ్యినొరుసుకుంటూ కాలపు పలుగురాళ్ళమీద పదునెక్కి పారుతున్న జీవనదులసొంటి భాష బాగలేదని చీదరిస్తివి. ఎగిలివారగట్ల వరిమొవ్వలోని మంచు ముత్యమసొంటి యాసనెక్కిరిస్తివి కట్టుబొట్టుమీద కథలల్లి కోట్లు కూడ పెడ్తివి. సెలిమలు దోచి సేనెండవెడ్తె కన్నీళ్ళు నాకాయె నీళ్లు నీకాయె. నిల్వ నీడలేదు చెయ్య కొల్వు లేదు ఉనికి ఉనుక పొట్టయితుంటే నా కుర్చి నాక్కావాలంటె ఇకమతులతోటి కాలం కమ్మలు మర్లేస్తివి. 4 నా ఇంటి చుట్టూ మొలిచిన ప్రైవేటు ఎస్టేట్ సర్కారు తుమ్మల మధ్య నేను బందీనైన ఆస్తమా రోగి లెక్క శ్వాసకోసం తండ్లాడుతున్న. సూర్యుడు నీవోడయ్యిండు సుక్కలన్ని నీ కుక్కలయినవి. బళ్ళు నీవి, గుళ్ళు నీవి మడులు నీవి, మాన్యాలు నీవి చెమట నెత్తుర్లు ధార పోసి మిగిలిన బొక్కల గూడును నేను. మల్లెసాల మీద మంచమేసి సాధికారంగ సకులం ముకులం పెట్టి చర్నాకోల చేతవట్టి నా ఇంట్ల నన్ను బాంచెదాన్ని చేస్తివి. 5 ఇగ ఇప్పుడైనా పనుగట్లకీడ్చి పంచాయితి పెట్టి ఇడుపు కాయిదం అడుగక ఇంకేం చెయ్యాలె? రచనా కాలం: 29 అక్టోబర్ 2007 'తెలంగాణ కవిత 2008' 'సూర్యుడు ఉదయిస్తాడు' సంకలనం
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LqQBhn
Posted by Katta
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LqQBhn
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి