అసమాన ప్రతిభాశాలి ఆళ్వార్‌స్వామిPosted on: Tue 04 Feb 23:06:02.05006 2014 వ్యక్తి ఒక సంస్కృతికి, చరిత్రకు ప్రతీకగా, ఒక శక్తిగా ఎదిగితే ఏమౌతాడు..? సరిగ్గా అతడు ఆళ్వారుస్వామి అవుతాడు. మనిషి మనిషిగా ఎదిగితే మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిస్తే తప్పక వట్టికోట అవుతాడు. సాహిత్య సంపదను తన భుజాల మీద మోసుకుపోయి పల్లెపల్లెకూ చేరవేస్తూ వ్యక్తి వ్యక్తికీ పంచిపెడితే సరిగ్గా అతడు అరుదైన సాహితీమూర్తి అవుతాడు. కథకుడౌతాడు. నవలాకారుడౌతాడు. ఉద్యమశీలి అవుతాడు. కార్యకర్త, యువకులతో యువకుడు, మేధావులతో మేధావి, కమ్యూనిస్టుల మధ్య ఉత్తమ కమ్యూనిస్టు, నాయకుల నడుమ అరుదైన నాయకుడు. ఒక స్వాప్నికుడు, ప్రేమికుడు, స్పార్టకస్ వారసుడు. ఒక గోర్కీ సృజనాత్మకలో ఆనందంగా తడిసి తరించినవాడు.ఆళ్వార్ పుట్టుకతో అందగాడు. వెన్నెల్లాంటి చిరునవ్వు, నిష్కళంకంగా నవ్వినవాడు. ఢిల్లీ కోటలో గుండెఝల్లుమనిపించిన, నల్గొండకే వన్నె తెచ్చిన నకిరేకల్ ముద్దు బిడ్డ. మదార్‌కలాన్ కన్నబిడ్డ. రామచంద్రాచార్యులు, సింహాద్రమ్మలకు 1915 నవంబర్ 1 జన్మించాడు. తన జన్మే ఒక తిరుగుబాటు సంకేతమైంది. ఒక విప్లవబావుటా అయ్యింది. జీవితాంతం వట్టికోట దౌష్ట్యంతో పోరాడుతూనే వచ్చాడు. దురహంకార పాలనపైనా, పాలకులపైన తిరుగుబాటు చేస్తూనే వచ్చాడు. నోరు తెరిచిన జైళ్ల ఇనుపకోరలకు చిక్కి బందీ అయినా యుద్ధంలో శత్రువును నిలువరించిన శాంతియోధుడుగానే కదులుతూ, చైతన్యవంతుడై మెదలుతూ వచ్చాడు.పాఠశాల చదువు అంతగా ఒంటబట్టక పోయినా అన్యాయం, అక్రమం, మోసం, వివక్ష, హెచ్చుతగ్గులు, ఆధిపత్యం వంటి అనేక విషయాలను అనేకులకంటే మిన్నగా అధ్యయనం చేస్తూ వచ్చాడు. అధ్యయనానికే పరిమితం కాకుండా రాస్తూవచ్చాడు. కాలం మీద తనదైన ఒక ప్రత్యేక ముద్రను వేస్తూ వచ్చాడు. ఇక సృజన కాలమంతా ఆళ్వార్ స్వామిదే అయ్యిందనాలి. కాకుంటే కథలు, గల్పికలు, నవలలు వెలువడతాయా ? దేశోద్ధారక గ్రంథమాల వంటి అపూర్వ సంస్థలు జన్మకు నోచుకుంటాయా ? నిజాం నిరంకుశ పాలనలో ఇటువంటి సాహసాలు, సాహసీకులు బతికి బట్టకట్టడం సాధ్యమవుతుందా ? ఆళ్వార్ స్వామి దృఢ సంకల్పం, అంకుఠిత దీక్ష, చెక్కుచెదరని నిరతి వల్లనే అవన్నీ సాధ్యమయ్యాయి. పేద, గ్రామీణ జీవితం నుంచి వచ్చి ఒక అధ్యాపకునికి వండి పెడుతూ బతుకుబండిని నెట్టుకుంటూ వచ్చాడు. ఆయన సామాజికత్వం, నిరంతర అధ్యయనమే అన్ని విపత్తులనూ, లేమినీ అలవోకగా గెలిచే శక్తి సామర్థ్యాలను అతనికి ప్రసాదించి ఉంటాయి. ఆ తర్వాత కొంత కాలం వరకూ (1933 దాకా) కందిబండ గ్రామానికి చెందిన నారపరాజు సోదరులకు పని చేసి పెడుతూ అణా గ్రంథమాల పుస్తకాలను అమ్మి పెట్టే ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తూ, తెలంగాణ పల్లె పల్లెనూ చైతన్య పరుస్తూ వచ్చాడు. కోదాటి నారాయణరావు సహకారంతో ఆనాటి గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరి కొంత కాలం గడిపాడు ఆశ్వారుస్వామి. ఈ ఉద్యోగం పెద్దగా ఆర్థిక స్థోమతనేమీ సమకూర్చక పోయినా, బోలెడంత లోకజ్ఞానాన్ని, సాహిత్య పిపాసనూ పంచి ఇచ్చింది. నిరంతరం అధ్యయనం వల్ల అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, సృజనశీలుర పరిచయం వల్ల వివిధ ఉద్యమాల విప్లవ స్ఫూర్తి కలిగింది. ప్రపంచం ఆయన కళ్లెదుట నిలిచినట్లయింది. పీడిత తాడిత జనానికి, అణగారిన, దిక్కూ మొక్కూ లేని వారికి తాను చాలా దగ్గరి వాడినన్న సోయి కలిగి పెద్ద దయింది. 1993లో వట్టికోట హైదరాబాద్ (సికిందరాబాద్)కు మకాం మార్చడమన్నది తెలంగాణ ఉద్యమానికి, సాహిత్యానికి పెద్ద మలుపుగా పరిణమించింది. తొలి తెలంగాణ నవలా కారుడిగానూ, నిజాం రాష్ట్రంలో పౌర హక్కుల కోసం పోరాడిన ప్రథమ పౌరుడిగానూ ఎదిగే అవకాశం కలిగింది. దొడ్డి కొమరయ్య హత్యపై నిజ నిర్ధారణకు వెళ్లిన తొలి కార్యకర్త వట్టికోట. యశోదమ్మతో వివాహం, సికింద్రాబాద్‌తో సంబంధాలు, అక్కడి వర్తక సంఘాలతో పరిచయాలు, యువకుల మధ్య పెనవేసుకు పోయిన స్నేహ బంధాలు, విరబూసిన పరిమళాలు ఆళ్వారు స్వామి భావజాలాన్ని మరింత ప్రోదిచేశాయి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలుకొని, నాలుగు సంవత్సరాలకు పైగా జైలు జీవితాన్ని అనుభవించిన వట్టికోట చివరి వరకూ గట్టి పిండంగా, మొక్కవోని సాహసికుడుగా నిలబడ్డాడు. ఏనాడూ కనీసపు సుఖాలనైనా చవిచూడని, (అసలు అటువంటి వాటిని కోరనైనా కోరని) వట్టికోట తన కోసం ఏమీ మిగుల్చుకోని నిస్వార్ధజీవిగానే కడవరకూ కొనసాగాడు. అరకొర బతుకు బతుకుతూనే అతడు ఆసాంతం సాహిత్య సేనానిగా, సమతావాద కార్యకర్తగా నిలబడ్డాడుగాని కించిత్తు తడబడడం గాని, వెనుకడుగు వేయడం గాని చేయలేదు. పైగా అతడు సభలను రంజిపజేసే ఉత్తమ ఉపన్యాసకునిగా ఎదిగాడు. సాహిత్య సంస్థలను పెంచి పోషించిన సాహసికుడుగా నిలిచాడు. సాహిత్య సృజన, ఉద్యమ నేపథ్యం అనేవి ఒక వంతైతే 'తెలంగాణ' సంపుటాలను ఆళ్వారుస్వామి వెలువరించడం మరొక గొప్ప సేవ అవుతుంది. అన్ని రంగాలకూ చెందిన తెలంగాణ వివరాలను అందులో పొందుపరిచాడాయన. ఇప్పటికీ ఆ సంపుటాలు సమగ్రమైనవిగా నిలుస్తున్నాయంటేనే మనం అతని అసమాన ప్రతిభను, అనితర సాధ్యమైన శ్రద్ధను గూర్చి అంచనా వేయవచ్చు.1952లో వెలువడిన 'ప్రజల మనిషి' నవలలో వట్టికోట ఆనాటి గ్రంథాలయోద్యమం, రాజకీయ-ప్రజోద్యమాలు, తన కాలం నాటి స్వానుభవాల చిత్రీకరణకు అద్భుతంగా చోటు కల్పించాడు. తెలంగాణ ఉద్యమ జీవితాలకదొక అరుదైన దర్పణంగా ఎప్పటికీ నిలిచి భాసిస్తుంది. ఆ నవలకు కొనసాగింపుగా గంగు వచ్చింది. జైలు జీవితాన్ని వివరించే గ్రంథం 'జైలు లోపల' రూపుకట్టింది. ఇవిగాక, వట్టికోట వారి మరొక అసాధారణ కృషి ఫలితం- గ్రంథాలయ సూచి. ఈ విధంగా నిరంతరం అటు ఉద్యమ జీవితానికి, ఇటు సాహిత్య సృజనకు నడుమ ఒక సంతుల-సమన్వయాన్ని సాధిస్తూ నిజాం క్రూర ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతూ వచ్చి తెలంగాణ అంతటా ఉద్యమమై విస్తరించిన ఆళ్వారు స్వామి తన 47వ ఏటనే (1961 ఫిబ్రవరి5న) హఠాన్మరణం చెందటంతో ఒక గొప్ప అధ్యాయం ముగిసినట్లయింది.మహోన్నత సాహిత్య శీలి, అలుపెరగని ఉద్యమకారుడు గనుకనే మహాకవి దాశరథి తన 'అగ్నిధార'ను ఆళ్వారు స్వామికి అంకితమిచ్చారు. దేవునిపై భక్తి లేకున్నా జీవులపై భక్తి ఉన్నవాడని, అతని జీవనధర్మాన్ని, తాత్వికతను ప్రశంసించారు. అంతేకాదు మంచికి పర్యాయపదం ఆళ్వారు, అతనిదే సార్థకమైన జీవితం అంటూ కొనియాడారు. అందుకే వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వార్. పలుకుతోంది పిడికిలెత్తి నవతరం జోహార్లు. భూపతి వెంకటేశ్వర్లు (నేడు ఆళ్వారు స్వామి వర్ధంతి)http://ift.tt/1fsSEL6
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fsSCDe
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fsSCDe
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి