పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

కె.కె || తప్పదుగా నాకు ||

నేనెదురు పడగానే
పక్కకు జరిగే మీ కళ్ళు
తప్పుకు తిరిగే మీ కాళ్ళు
చిరాకు విసిరే మీ నొసలు
ఇవన్నీ తెలుస్తున్నా
నా మనసుని పొడుస్తున్నా
వెర్రినవ్వు నొకదాన్ని ముఖాన
పులుముకొని పలకరిస్తుంటాను
తప్పదుగా నాకు...

కొత్త పాలసీ,కొత్త స్కీం అని చెప్పడానికి
భయం తో,బాధతో,మొహమాటం తో
ఎన్నిసార్లు కుస్తీ పట్టానో నా మనసుతో
ప్రతీసారీ నేనే నెగ్గి, మనసుని తొక్కి
కొత్త భీమాపథకాన్ని,అందమైన శతకంలా
వివరిద్దామని పిచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాను
తప్పదుగా నాకు...

నాలుగు ఇంగ్లీషు ముక్కలు జోడించైనా
ఆకట్టుకోవాలని నేను ప్రయత్నిస్తుంటే
నా పీకట్టు కోవాలన్నుట్టు మీ చూపులు
అవి నేను గమనించినా
ఆ దాడి తట్టుకోక
తప్పదుగా నాకు...

"నేను పోయాక వచ్చే సుఖం గురించి
నాకే చెబుతావేంటిరా సన్నాసి" అంటూ
మీరు విసిరే చతుర్లకి చిర్రెత్తుకొచ్చినా
నోరెత్తకుండా పాలసీ మెచ్యూర్ అయ్యాకొచ్చే
డబ్బుకోసం నే చెబుతుంటాను
తప్పదుగా నాకు...

దేశం లో ఆర్దికమాంద్యం,
జరుగుతున్న రాజకీయ 'స్కాం'
బోర్డు తిప్పిన ప్రైవేట్ బాంక్.కాం
వీటన్నిటికి నేనే కారణమంటూ
నన్నో దొంగని చేసి మాట్లాడుతుంటే
చెవికింద ఒక్కటిచ్చి చుక్కలు
చూపించాలనిపిస్తుంది
అయినా చిరునవ్వుని కాపాడేస్తుంట
తప్పదుగా నాకు...

బతకడానికి బతిమాలుకుంటున్నానని,
నిరుద్యోగ సంఘం నుంచి
బలవంతంగా బహిష్కరించబడ్డ
చిరుద్యోగి నేనని.. నేనేనని
నీకు తెలిసేదెప్పుడు???
*26-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి