పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

బివివి ప్రసాద్ || సహజ కవులు, సాధన కవులు ||


*26-07-2012 నుండి
సహజ కవులు, సాధన కవులు అని కవులు రెండు రకాలు. సహజ కవులు తమ ఆలోచనలను నేలకి దించగలిగితే, సాధన కవులు తమ ఊహలను ఎగరనివ్వగలిగితే మరింత పక్వమౌతారు.


  • Katta Srinivas
     మరి ఎవరు ఏ రకమో తెలుసుకునే మర్గమేదైనా వుందంటారా సార్.
    సహజ కవులు ఆలోచనలను నేలకి దించాలంటే చేసే ప్రయత్నం సాధనే కదా అపుడు మళ్లీ సాధన కవుల వర్గంలోకి వచ్చేస్తారు కదా.




  • Bvv Prasad చాలా సూక్ష్మంగా గమనించాలి ఎవరికి వారు తనలో. ఒక వస్తువుని చూడగానే ముందు స్పందన (identificatiom) కలిగి, దానిని పదాలుగా ( thought) అనుసరిస్తే వాళ్ళు సహజ కవులు. ముందు ఆలోచన పుట్టి, దానిని స్పందన అనుసరిస్తే సాధన కవులు. ఈ విభాగాలు అనగాహనా సౌలభ్యం కోసమే. thought and feeling కలిస్తేనే కవిత్వం కదా..



  • Katta Srinivas లోన ఏదో వెలిగింది... ఎంతో లోతుగా చూసి స్పష్టంగా విభజించారు.
    ఇప్పుడు నన్నునేను కూడా సులభంగా చూసుకునే కొలత తెలిసింది సార్.
    మరి సహజ కవుల ఆలోచనలు ఆకాశంలోనూ
    సాదన కవుల ఊహలు క్రింద ఎందుకుంటాయి.
    వాళ్లు దించటం
    వీళ్లు ఎగరనివ్వటం అంటే ఏమిటి ? ఎలా చేయాలి?
    (క్షంతవ్యుడిని... మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టటం లేదు కదా)




  • Bvv Prasad ప్రశ్న జ్ఞానానికి దారిచూపే దీపం కదా.. సహజకవుల ఊహలు ఆకాశంలో ఉంటాయి, వాటితోనే ఆలోచనలు కూడా. సాధకుల ఊహలు నేల విడిచిపెట్టవు, వారి అలోచనాశక్తి ఊహల్ని ఎగరనివ్వదు.



  • Lugendra Pillai సాధన చేస్తున్న కవికి మంచి స్పందన వస్తే కవిత అంత సహజంగా వస్తుంది. సహజత్వం కవితలో ఉండాలి..


  • Bvv Prasad ఊహించటం ఒక సాహస చర్య. కాసేపు ఆలోచననీ, తర్కాన్నీ విడిచి ఊహల్ని ఎగరటానికి అనుమతించాలి, పిల్లలవలే. ఆలోచన ఒక దార్శనిక ప్రక్రియ. కాసేపు ఊహలు విడిచి, ఓర్పుగా ఆలోచనను లోతుల్లోకి ప్రయాణించనివ్వాలి.



  • Katta Srinivas ఆలోచననీ, తర్కాన్నీ విడిచిపెడితేనే ఊహలు ఎగరుతాయంటారా. ఊహకు ఇవిరెండూ ప్రతిభందకాలుగానో, శ్రుంఖలాలుగానో వుంటున్నాయా?
    మరి సహజ కవులు ఎలాగూ ఊహలను ఆకాశంలో నిలుపుకునే వున్నారు. వారిని క్రిందకు దింపేందుకు మళ్లీ ఇవి రెంటినీ పట్టుకోవాలంటారా ?



    •  'ఒక మనిషి మబ్బుల్లోకి ఎగిరాడు, మబ్బుల్లో మాయమై మరొక లోకంలోకి వెళ్ళాడు, అక్కడ తన పూర్వులతోనూ, తన తరువాత తరాలవారితోనూ మాట్లాడాను. అక్కడ మాటలంటే మన శబ్దాలు కాదు, ఒకరిలో స్పందన కలగగానే మరొకరికి అర్థమైపోతుంది. ' ఇది ఊహ. ఇది తర్కానికి నిలబడదు. అయినా ఈ ఊహ అంతా కొద్దిపాటి తర్కాన్ని ఆశ్రయించి ఉండటం గమనించవచ్చు.
      అలాగే 'నేను ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్నాను. ఇంతలో కరెంట్ పోయింది. కరెంట్ లేకపోతే నా కంప్యుటర్ పనిచేయదు. దీనికి బాటరీ సపోర్ట్ లేదు కనుక. ' ఇది కేవలం ఒక వాస్తవాన్ని చూపిస్తున్న ఆలోచన. దీనిలో ఊహ లేదు. అయినా ఈ ఆలోచన కూడా, మనకి కనిపించని విద్యుత్తుని ఊహిస్తుంది.
      కేవల ఊహ ఆశ్చర్యం కలిగిస్తుంది, ఒక రస స్ఫూర్తిని ఇస్తుంది. కానీ అది తర్కానికి నిలబడనప్పుడు, మనలో ఎలాంటి వికాసమూ కలిగించదు. మనలోపలి, వెలుపలి సంక్లిష్టతల్ని ఇది పరిష్కరించదు. ఆలాగే కేవల ఆలోచన, రసహీనంగా ఉంటుంది, అది ఎలాంటి ఉత్తేజాన్నీ ఇవ్వదు.
      కవి ఈ రెండిటి సమ్మేళనం ద్వారా మనిషి బహిరంతర ప్రపంచాలకి మేలుచేసేది (మేలు చెయ్యాలన్న నిష్ట లేనప్పుడు, హాని చేసేది) ఏదో సృష్టిస్తాడు. అది పాఠకులని దాని ఊహాశక్తిని అనుసరించి, ఆలోచనాశక్తిని అనుసరించి ప్రభావితం చేస్తుంది.
      అందువలన కవికి రెండు శక్తులూ అవసరమే. ఏది లోపించినా సమగ్ర రచన జరగదు.
      మనుషులలో అన్ని శక్తులూ సమగ్రంగా 'మేలుకొని ' ఉండవు, వివిధ నేపధ్యాలను అనుసరించి వివిధ పాళ్ళలో ఉంటాయి. ఊహా శక్తి ఎక్కువగా ఉండి, ఆలోచనా తక్కువ ఉంటే, వారు ఆలోచించటం సాధన చెయ్యాలి. అలాగే ఆలొచన బాగా ఉండి, ఊహ తక్కువ ఉంటే వారు ఊహించటం సాధన చెయాలి. అయితే కవిత్వమంటే ఊహించటం, స్వప్నించటం అని సామాన్య వాడుక కనుక, ఊహా బాగా ఉన్నవారిని సహజ కవులని, ఆలోచన బాగా ఉన్నవారిని సాధన కవులని అన్నాను. అంతకు మించి, వీరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. మనలో పసిదనం ఉంటుంది, sense of wonder ఉంటుంది. అందువలన మనం ఊహని ఎక్కువ ప్రేమిస్తాం. కాని ఊహా, వాస్తవమూ ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఎదిగినప్పుడు మానవుడు మహా మానవుడవుతాడు. కవి మహాకవి అవుతాడు. ఒకదానికొకటి ప్రతిబంధకమైనపుడు అతను దు:ఖంలో చిక్కుకుంటాడు.
      తనలోపలి శక్తుల పట్ల సరైన అవగాన ఉన్నవారు తనకీ, ఇతరులకీ మంచి జీవితం గడపటానికి సహాయకారులవుతారు. ఎదగని ఊహల్నీ, ఎదగని ఆలోచనలనీ పట్టుకొని, ఉద్వేగాలు ఎటు నడిపిస్తే అటు నడిచేవారు, తనకీ, ఇతరులకీ దు:ఖం కలిగిస్తారు. అందుకే జీవితంపట్ల శ్రద్ధ, అధ్యయనం అవసరం.
      అన్నీ స్పష్టంగా అర్ధమయ్యాయా శ్రీనివాస్..


    • Katta Srinivas ఇంతకు ముందు కేవలం మీరు ఇచ్చిన ప్రతిపాదన చదివినపుడు
      ఏదో చిక్కుముడుల దారపు వుండలా వుండి, ఎక్కడో పోంతనలేని తనం తడుతున్నట్లు అనిపించింది.
      ఇప్పుడు
      అవే దారాలు అందంగా అల్లిన గూడులా వున్నాయి.క్రమత్వం బొమ్మ కడుతోంది.
      ఇప్పటికి రెండు,మూడు సార్లు చదువుతూ అర్దంచేసుకుంటూ చదువుతున్నాను.
      ఊహా ఆలోచన మీద మీరు చెప్పన వివరణ చాలా బావుంది.
      ఊహని మనం ప్రేమించటానికి గల కారణం తార్కకంగా వివరించారు.
      ఇంకా చదివింది సరిపోల్చుకుంటున్నాను.
      ఇంకా సందేహాలేమీ మిగిలినట్లు లేదు.


    • Bvv Prasad లోపలి ప్రపంచాన్ని ఒకరు మరొకరికి చెప్పటం చాలా కష్టం. అది అంతా నైరూప్యవిషయం కదా. ఉదాహరణలు కొంత సహాయం చేస్తాయి. కానీ, లోపలి ప్రపంచాన్ని తెలుసుకోకుండా, వెలుపల ఎన్ని తెలుసుకున్నా మనిషికి మరింత గందరగోళం, దు:ఖం మాత్రమే మిగులుతాయి.


    • Katta Srinivas ఒక ప్రతిపాదన అర్దం చేసుకొనేందుకు చేస్తున్న ప్రయత్నంలో
      లభించిన మరికొన్ని ప్రతిపాదనలు.

      => మనుషులలో అన్ని శక్తులూ సమగ్రంగా 'మేలుకొని ' ఉండవు, వివిధ నేపధ్యాలను అనుసరించి వివిధ పాళ్ళలో ఉంటాయి.

      => ఊహా శక్తి ఎక్కువగా ఉండి, ఆలోచనా తక్కువ ఉంటే, వారు ఆలోచించటం సాధన చెయ్యాలి.

      => అలాగే ఆలొచన బాగా ఉండి, ఊహ తక్కువ ఉంటే వారు ఊహించటం సాధన చెయాలి.

      => కవిత్వమంటే ఊహించటం, స్వప్నించటం కనుక, ఊహా బాగా ఉన్నవారు సహజ కవులు, ఆలోచన బాగా ఉన్నవారు సాధన కవులు

      => వీరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.

      => ఊహా, వాస్తవమూ ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఎదిగినప్పుడు మానవుడు మహా మానవుడవుతాడు. కవి మహాకవి అవుతాడు. ఒకదానికొకటి ప్రతిబంధకమైనపుడు అతను దు:ఖంలో చిక్కుకుంటాడు.

      => తనలోపలి శక్తుల పట్ల సరైన అవగాన ఉన్నవారు తనకీ, ఇతరులకీ మంచి జీవితం గడపటానికి సహాయకారులవుతారు.

      => ఎదగని ఊహల్నీ, ఎదగని ఆలోచనలనీ పట్టుకొని, ఉద్వేగాలు ఎటు నడిపిస్తే అటు నడిచేవారు, తనకీ, ఇతరులకీ దు:ఖం కలిగిస్తారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి