పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

కుమార వర్మ కవిత


అలా విసురుగా ఓ గాలి కెరటం
ముఖంపై చరిచి
కాసింత సేదదీరమంది...

వేల అడుగుల ప్రయాణంలో
ఈ మజిలీ మరల
ఊపిరి తీసుకోనిస్తుంది...

పొద్దంతా తిరిగిన సూరీడు అలసి
పడమటింట యింత ఎరుపు
రంగు పులమగా ఆకాశం సిగ్గుపడ్డది...

పారే సెలయేటి ఒరిపిడి
రాతి పాలభాగంపై
యింత నునుపుదనం అద్దింది...

రాలిన పూలతో రహదారంతా
రక్తమోడుతూ కన్నపేగు
ఆర్తనాదమౌతోంది...

ఒకదానికొకటి అతకని అక్షరాలతో
అసంపూర్ణంగా విరిగిపోతూ
భావం దుఃఖ రాగమయింది...

రాయలేనితనంతో కవి గుండె
ఎండి పోయిన
కట్టెల వంతెనయ్యింది......

కాసింత ఆ గాయానికి
నీ వేదో మంత్రమేసి
నెమలీకతో పలాస్త్రీ పూయవా?
    .....
*25.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి