పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జులై 2012, గురువారం

జయశ్రీ నాయుడు || నిజం - నైజం ||

రోజంతా ఎక్కడ నక్కి వుంటాయో..
బస్సు హారన్ల లోనో..
ఆలోచనల అంగళ్ళలోనో..
ముందూ వెనుకలు లెక్కించని
అడుగుల ఆతృతల ధూళిలోనో..

ముక్తసరి పలకరింపుల్లోనో..
మొఖమాటపు మౌనాల్లోనో..
కాగితపు పూల వంటి కరచాలనాల్లోనో..
ప్రవాహమై సాగే లౌక్యపు ఘడియల్లోనో..

ఎక్కడో..
లోలోనే వుంటూ..
అన్నీ చూస్తూ..
అన్నిటా విస్తరిస్తూ..

ఒక నవ్వుగా..
ఒక పిలుపుగా..
ఒక హెచ్చరింపుగా
ఒక వెన్ను చరుపుగా

నా వెంట నాతోనే
ఆలోపలే నాలోనే..
ప్రపంచాన్ని ఈది..
సందెవేళై ఒడ్డు చేరిన వేళ

తనను తానే మీటుకునే సితారులా
మాటలన్నీ చేరిన మౌనంలో
అద్దం తుడిచి ముఖం చూసుకుని..
స్పష్టంగా కనిపించే
నేనుని చూసి..

ఇదా నా నిజం
ఇదా నా నైజం
ఎన్నిసార్లు విస్తుపోయాను..

నేనో కరుకు హృదయాన్ని
నేనో కసాయిని
నేనో విస్తరిస్తున్న మలినాన్ని
నేనో అసహనాన్ని

యేదైనా యేమైనా
ఈ నేను నాదే
నైజంలోని నిజం
గడ్డకట్టిన బాధల ఖనిజం

ఇరుకు సందుల్లోంచి
విశాలత్వం వైపు చూపు
అడుగుల్లో ఆర్ద్రతల మళ్ళింపు
ప్రతి సాయం సంజెల్లో ఇస్తుంటా
మానవత్వపు సలైన్

రాత్రి నిద్రలో
కలలాంటి బుద్ధత్వం
నరాల్లో ఇంకి
కొంతైనా ఒలకక పోతుందా
ప్రతి ఉదయం.
*19-07-2012

1 కామెంట్‌:

  1. Jayasri Madam,

    రాత్రి నిద్రలో
    కలలాంటి బుద్ధత్వం
    నరాల్లో ఇంకి
    కొంతైనా ఒలకక పోతుందా
    ప్రతి ఉదయం....
    Everybody wants to reinvent themselves each day and yearns for their real self which is buried under the veil of civility.
    with regards

    రిప్లయితొలగించండి