స్థబ్దత నిండిన గుండెలో
చప్పుడు చేస్తూ
రివ్వున దొసుకొచ్చి,
గతాన్ని తాకిన స్మర శరం!
కాలాన్ని సాయమడిగి
ఆర్తిగా బంధించబోయాను...
కలకలం రేపడమే తప్ప,
కాలానికి ఎలా చిక్కగలనంటూ..
జాలిగా చూస్తూ..
హ్రుది వాకిలి
విడిచి వెళ్ళిపోయింది!
తడి ఆరని కన్నుల కలువల్లో
పుప్పొడి అద్దుతూ
తుషారస్నాత ప్రభాత స్వప్నపు
వెన్నెల మరక!
రెప్పల తలుపుల్లో లాలనగా
బంధించబోయాను...
అందమైన నలతనవుతానే తప్ప,
తలపుల తలుపుల్లో
బందీని ఎలా అవుతానంటూ
దైన్యంగా చూస్తూ
కళ్ళ లోగిళ్లు విడిచి వెళ్ళిపోయింది!
అంతరంగపు ఆకాశంలో
మిణుకు మిణుకుమంటూ
వెలిగే స్మ్రుతి నక్షత్రం!
ఆనందపు రెక్కలు కట్టుకుని,
ఆబగా అందుకోబోయాను...
అంధకారపు ఆశల వలయంలో
మిణుక్కుమంటానే తప్ప,
పట్టు చిక్కే వెలుగునెలా
అవుతానంటూ..
అమాయకత్వాన్ని వెక్కిరిస్తూ
మది చాటు మబ్బుల పరదా దాటి
మసకబారిపోయింది!
date: 02/08/2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి