పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, అక్టోబర్ 2012, శనివారం

బూర్ల వెంకటేశ్వర్లు//నాకొక మనిషి కావాలి//

నల్ల ఆకాశాన్ని చూసి
నల్ల రేగడిని వలచి
మనుషుల నోటి బువ్వ కోసమే కదా

నేను కారు నలుపయ్యింది

సాటి మనుషులనే కదా!
అడవి జంతువుల్లాంటి మీకు
జుట్లు కత్తిరించి, గడ్డాలు గీసి,
బట్టలునేసి, బట్టలుతికింది.

నోరెత్తని చెప్పునైనా
లబలబలాడే డప్పునైనా
నేపడ్డ తపనంతా
తోటి మనిషి కోసమే కదా!
నేనెప్పుడేపనిచేసినా
రక్తమాంసాలున్న సాటి మనిషి కోసమే కదా!

నన్ను చూసి బీళ్ళు భయపడ్డాయి
నా కండలకెదురై రాళ్ళుపగిలాయి
నన్ను చూసి మోళ్ళు నవ్వాయి
నా కాళ్ళకింద ముళ్ళు తలదాచుకున్నాయి

ఆదిమ యంత్ర నాగరికతకన్నా ముందట్నుంచి
నేను చూపిన పనితనం కదా
మిమ్మల్నిట్లా సౌధాల్లో నిలిపింది

మీ కుర్చీల్లో కులాసాల్లో
విల్లాల్లో విలాసాల్లో
నా జాతి శ్రమ చెమట నీరైతే కదా
మీరిట్లా ఉయ్యాలలూగుతున్నారు
నేను కర్రపెత్తనమిస్తే కదా!
మీరు నేడిట్లా రారాజులై ఊరేగుతున్నారు

నా పాదపూలు ముద్రించబడని నేల
నా వేలిముద్రలు లిఖించబడని వస్తువు
నా చెమట తడి అద్దని భోగం
మీలో ఈ నేలమీద ఒక్కటుందా!

ఎందుకురా మరి!
కులం గీతగీస్తారు, కులం కూత కూస్తారు.
అందుకే అంటున్నా!
నాకొక కులమంటని మనిషి కావాలి.
నాకొక మనిషి కావాలి
అచ్చమైన మనిషి
కులం పేరెత్తని స్వఛ్ఛమైన మనిషి కావాలి.
*19-10-2012

16, అక్టోబర్ 2012, మంగళవారం

నందకిషోర్ । చక్రవ్యూహం


1

ప్రతీ అనుభవం నేర్పేదే.
ఎంతో కొంత.
కొంచెం జ్ఞానం.
అంతే అజ్ఞానం.

ప్రతీ మనిషిదీ స్వార్ధమే.
ఎంతో కొంత.
కొంచెం నీకోసం.
మిగతా తనకోసం.

2

అవకాశం ఉన్నన్ని రోజులు
నియమాలమీద సావాసం.

తీరికలేక,ఓపికలేక ఒకరోజు-
అన్నీ మలిపి ఆనందిస్తాం.
ఒకే జీవితమని గుర్తించేస్తాం.

ఒక్కరోజన్న గడుస్తుందో లేదో-
ముందే చేస్తే బాగుండని ఎవడో
భుజాలుపట్టి ఊపేస్తాడు.
తలలోకి దూరి గోలచేస్తాడు.

ఇంకేం!
ఓ కొత్త పత్రం తయారవుతుంది.
నువ్వెప్పుడు ఆనందించవు.

3

అభిమానం దొరికినన్ని రోజులు
మనసుల మీద వీరంగం.

పొడిబారి,పొగరు తగ్గి ఒకరోజు
ఎవరూ లేరని ఏడ్చేస్తుంటాం.
బతుకిదికాదని తేల్చేస్తుంటాం.

కన్నీటి చుక్కైనా రాల్తుందో లేదో-
హత్తుకొని తిరుగుదాం రమ్మంటు ఎవరో
తెగిపడిన చేత్తో పిలుస్తుంటారు.
పగిలిన గుండెతో పాటకడతారు.

ఇంకేం!
ఓ కొత్త భయం పరుగుతీస్తుంది.
నువ్వెప్పుడు కలిసిపోలేవు.

4

సంజాయిషీ ఇవ్వాల్సిన నిమిషాలు
ఎప్పటిలాగానే మిగిలేఉంటాయ్.
వినాల్సిన మనుషులుండరు.

ఎక్కడున్నారో తెలిసీ-
నడిచే ధైర్యం నీకూ ఉండదు.

సందేహాలు తీర్చాల్సిన మనుషులు
ఎప్పటిలాగానే మిగిలేఉంటారు.
చెప్పాల్సిన నిమిషం మిగలదు.

ఎక్కడికిపోయిందో తెలిసీ-
వెతికే కోరిక నీకూ ఉండదు.

5

ఒప్పుకుంటానంటే నిజం చెప్తా!

రోజోసారి రోజుల్ని లెక్కేస్తామేగాని
నీకు,నాకు,మనలాంటి అందరికీ-
సుఖానికి,సంతోషానికి తేడా తెలీదు.
అవసరానికి,ఆశకి గిరిగీయడం తెలీదు.

ఋతువుకోతీరుగా దుప్పట్లు మారుస్తాంగాని
నీలో,నాలో,మనలాంటి అందరిలో-
ఊహల కొత్తదనం- ప్రయత్నాలకు అంటదు.
నవ్వుల తడితనం-గుండెలకు తాకదు.

15-10-12

వంశీ | క్షుద్రం


రమించు.. రమించు,
శవాల్నీ, గాయాల్నీ, అశుభాల్ని, అస్ఖలితాల్నీ,
పగలుచూడని రాత్రులతో, పదాలు చెప్పలేని విన్యాసాలతో..
ఇంకా.. ఇంకా..
రక్తమంతా చెమటలు కక్కేవరకూ
రిక్తమంతా గావుకేకలు పెట్టేవరకు,
ఎవరది..చంపెయ్.. చంపెయ్ వాడిని,
నీతిభోదలుచేస్తూ నిన్నాపుతున్నాడెవడో,
మనస్సాక్షా...
ముక్కలు ముక్కలుగా నరికెయ్, వీలైతే తినెయ్,
ఏ మీమాంసలెందుకు
నీ మాంసపు రుచి అలవాటేగా..

శరీరం బుధ్దినోడించి
రోజురోజుకూ అతిక్షూద్రుడివైపోయి
నీకు నువ్వే శత్రువై
దారితెలీని లోయల్లో గమిస్తూ
నోరుతిరగని మంత్రాలేవో జపిస్తూ
సున్నితత్వాన్నీ మనిషిమూలాల్నీ సమాధిన తోసి..

పువ్వులన్నీ ఫలాలవకమునుపే చిదిమేసి కార్చిన తేనెలో
విషాలోచనలని ముంచుకు తిని కాలకూటభాష్పాల్ని త్రేన్చు,
రజస్వలించలేక ద్రవించిన స్రావాల తావితో
నాసికను తాటించి వికృతాకారిడివై భ్రమించు..

తొందరగా.. తొందరగా...
ఔషధాల్లేని జాడ్యాన్ని వెంటేసుకుని ధర్మాల్ని వినిర్మించు,
ఉపాసించని దైవత్వాన్ని పురాణాల్లోకి విసిరి
నిర్వేదాలకు భాష్యం రాయి,

నీదైన రసాతలానికి
నీదవని భూతలాన్ని ప్రక్షేపించి ఆఙ్నాపించు..
నువ్వే రాజువి

రమించు.. రమించు..
భూతగణాలతో, దైత్య కణాలతో,
నీలాంటి మరో అష్టావక్రుడు భవించేట్టు
అంధయుగపు రేతస్సు జ్వాజ్వలించేట్టు...

13.10.12

3, అక్టోబర్ 2012, బుధవారం

Naresh Mandagondi POEM / TRANSLATIONS


మేధో మూర్తి
_________

విశాల ద్రవిడ భాషాశాస్త్ర ప్రపంచానికి
మకుటం లేని మహారాజు,
పండితుల మహా పండితుడు!
గోవర్ధన గిరినెత్తిన శ్రీకృష్ణుడివై
మహోన్నత జ్న్యానపర్వతాన్ని అలవోగ్గా ఎత్తినవాడా,
భద్రిరాజు కృష్ణమూర్తీ!!

అంతేలేని సువిశాల మహా వ్యాకరణం నీ దోసిటిలో ఒక చుక్క!
ఈ అనంత జ్న్యాన సాగరాన్ని ఒక్క గుక్కలో ఖాళీ చేసినవాడా!
శోధనా తపస్వీ!
అన్వేషణే జీవన రుధిరంగా దేహాన్ని నడిపించినవాడా!
తెలుగు, ద్రావిడ భాషా విగ్న్యానాలు
నీ దీవెనతోనే కదా పునీతమయ్యాయి!

తెలుగు శబ్ద మూలధాతు శోధనం,
వృత్తిగత మాండలిక పదకోశ సంకలనం
నీ కీర్తి పర్వతాలపై మెరిసే రెండు మహా శిఖరాలు...
విగ్న్యాన కేంద్రాలూ, విశ్వవిద్యాలయాలూ
కేవలం నీ స్పర్శతో, బోధనతో
ఎంత గౌరవాన్ని పొందాయి!!
నీలాంటి మేధో మూర్తులు సదా ఖ్యాతిలో సజీవులు
అసమానం నీ ప్రదానం!
లోలోతుల్లో వేళ్ళూనుకుంది కదా నీ ప్రభావం!!
కాలపురుషుడొక విధివంచిత చోరుడు
వేరు దారి లేక నిను మన లోకం లోంచి అపహరిచుకెళ్ళినా
అమరుడవు నీవు!
అమూల్యమైన కాలపు ఖజానాలో
నువ్వు జీవించేవుంటావు అనంతంగా ....

(ప్రఖ్యాత ద్రావిడ భాషావేత్త ప్రొ.భద్రిరాజు కృష్ణమూర్తి గారి దివ్యస్మృతికి...)

ఆంగ్ల మూలం : శ్రీ నరేష్ మందగొండి
రచనా కాలం : ఆగస్ట్‌, 2012

తెలుగు సేత : కరిముల్లా ఘంటసాల
అనువాదకాలం : 01.10.2012

(For those interested here follows the original Text...
----------------------------------------------------------------------------------------------------------
Naresh Mandagondi :
August 12.
The scholarship embodied:
-----------------------------------
A king and scholar's scholar in Dravidian lingistics
Like the Krishna's lifting of mountain Govardhan
You did lift the lofty knowledge mountain with ease
We bow to your feet, Bhadriraju Krishnamurthy sir!

The vast and endless classical grammar was the drink
In just one cupped hand, you emptied the ocean large
Research was your tapasya, research is your life blood
...You blessed Telugu and the great Dravidian linguistics.

Telugu verbal bases, Bank of Dialects of professions
The twin peaks in your bigger mountainous fame
Universities and seats of learning are honoured
Your gracious presence and lectures are the worth.

Learned men of your status live in the body of name
The contributions unrivalled, the impact deeprooted
Time the dutiful thief, has stolen you from our world
But you live eternally in the precious volts of Time!!

(A homage to Prof. Bhadriraju Krishna Murthy sir-
the eminent Dravidian Linguist)
— with Naresh Mandagondi.

29, సెప్టెంబర్ 2012, శనివారం

యాకూబ్ ॥ లోలోపలి గాధ


ప్రేమకోసమే ప్రేమిస్తున్నానా నిన్ను?
కాదు,
నా సహజస్వభావమే ప్రేమ !
గడ్డిపువ్వు శిరస్సుమీద
తళతళలాడుతున్న మంచుబిందువుల్లా
సందేహాలమధ్య, జీవనభయాలమధ్య ప్రేమికుడిలా ప్రకాశిస్తుంటాను.
ప్రేమ - పూలు వికసించినట్లు
నాలో వికసిస్తుంది.

1
ఎవరో మనసులో ఉన్నారు.గుబగుబలాడే గుండె, అలిసిన వదనం, నిరంతర ఖేదం.!

2
రేవులో బిందె ముంచాను
నీళ్ళకు ప్రేమభాష తెలుసని అపుడే తెలిసింది.
ఆత్మనంతా కూడదీసుకుని అది పలికే బుడబుడలభాష
గులకరాళ్ళపై కదిలి
ఆకుపచ్హ తుంగలతో సంభాషించే
సజలగాత్ర ప్రణయ సంగీతభరిత భాష !

3
బాధను ప్రేమించాను
విషాదంలోని ఆనందాన్ని ప్రేమించాను
ప్రేమలోపలి దుఃఖాన్ని,సంతోషాన్నీ ప్రేమించాను

నన్ను నేను దాచుకునేందుకు
ఇంత పెద్దవెలుగులో కొద్దిపాటి చీకటికోసం
వెతుక్కుంటున్నాను

ప్రేమకోసమే ఇలా ఒంటరినయ్యాను

4
జీవితపు ఆవలితీరాన్ని చూడ్డంకోసమే
నిజానికి
నేను ప్రేమపైన అధారపడ్డాను.!!

---------------------------
*Old text,'సరిహద్దు రేఖ'
28-9-2012

http://www.facebook.com/groups/kavisangamam/permalink/450461978339893/

కిరణ్ గాలి || ఒక్కొసారి ||


1. ఒక్కొసారి

సమూహాలకి సాధ్యమైనంత దూరంగా
ఒంటరితనం నడిమధ్యలోకి నడవాలి
నిన్ను నువ్వుగా కలవాలి, పలకరించాలి, పరామర్శించాలి

ఎమో అలా చేస్తె
సమూహాలలొ లేని స్నేహం, స్వాంతన, కోలాహలం
నీకు నీలోనే దొరుకుతుందేమొ

2. ఒక్కొసారి

శబ్ధాలను బహిష్కరించి నిశ్శభ్దాన్ని ఆహ్వానించాలి
కాలం అడుగుల చప్పుడు వినపడని ఖామొషి తేవాలి

ఎమో అలా చేస్తె
నిశ్శభ్దం మౌనం వీడి నీతో మట్లాడవచ్చు,
నువ్వు ఇదివరకెరుగని నిజాలను చెప్పవచ్చు
నువ్వు నిజమనుకున్న అబద్దాలను చెరపవచ్చు


3.ఒక్కొసారి

అలొచనలన్నిటిని ఆర్పేసి శున్యాన్ని వెలిగించి ధ్యానించాలి
స్తబ్ధతలోని చైతన్యాన్ని, చైతన్యంలోని నిశ్చలతను అన్వేషించాలి

ఎమో అలా చేస్తె
ఆ ధ్యానంలోనే సర్వసత్యాలు సాత్కక్షరించవచ్చు
సమస్త సంశయాలు ధ్వంసం కావచ్చు

***


1. ఒక్కొసారి

స్నేహితులని కాకుండా శత్రువనుకున్న వాడినీ సంప్రదించాలి
అహాలు అపోహలు అడ్డురాకుండా అడగవలసినవి అడగాలి

ఎమో అలా చేస్తె
స్నేహితుడిలా సలహాలతో సరిపెట్టకుండా సహాయం కుడా చేస్తాడెమో


2. ఒక్కొసారి

మనిషితో కాకుండా మనసుతో పరిచయించాలి
తనువుతో కాకుండా ఆత్మతో సహచరించాలి

ఎమో అలా చేస్తె
పరిణయంగానె మిగిలిన ప్రహసనం,
రసవత్తర ప్రణయంగా తర్జుమా కావచ్చు


3. ఒక్కొసారి

కూడ బెడుతున్న సంపాదన కాకుండా
దాచి పెడుతున్న కాలాన్ని కుడా ఆత్మీయులకు ఖర్చు పెట్టాలి

ఎమో అలా చేస్తె
కొని తెచ్చిన వస్తువులు ముడివెయ్యలేని అనుభందాన్ని
కలిసి గడిపిన క్షణాలు కడవరకు తోడు తేవచ్చు


***

1. ఒక్కొసారి

పొందవలసిన సుఖాల జాబితా పక్కన పెట్టి
పోగొట్టుకున్న సంతోషాల చిట్టా విప్పి చూసుకోవాలి

ఎమో అలా చేస్తె

లేని వాటిలో వున్న సౌఖ్యం కన్న
వున్నవాటిలో లేని ఆనందంమేముందని తెలుస్తుంది


2. ఒక్కొసారి

పరిగెత్తటం మానెసి
ఆయాస పడుతున్న కాలాన్ని కుదురుగ కూర్చొని చూడాలి
రాలి పడిన క్షణాలని, నిమిషాలని, రోజులని దులుపుకోని జేబులో దాచుకొవాలి

ఎమో అలా చేస్తె
గమ్యంలో వుందనుకున్న గెలుపు గమనంలో దొరకచ్చు


3. ఒక్కోసారి
ప్రశ్నలడగడం, జవాబులు వెతకటం మానెయ్యాలి
పరీక్ష అనుకొని జీవితాన్ని చదవడం ఆపెయ్యాలి

ఎమో అలా చేస్తె
ఫలితం గురించిన బెంగ లేకుండ
స్వేచ్చగా జీవించవచ్చు సంత్రుప్తిగా మరణించనువచ్చు

Date: 29-09-2012

http://www.facebook.com/groups/kavisangamam/permalink/450458578340233

నరేష్ కుమార్ ‎//డబల్ రొట్టె//


రాత్రి ఆకాశంలో
కాసిన చంద్రున్ని
పొద్దున్నే
చేతిలో పట్టుకున్నట్టుండేది
...
డబల్ రొట్టె తింటుంటే

చీ...మా బాపు
నీన్న ఒక్కటే తాగిండ్రా..
గందుకే
ఒక్కటే కొనుక్కుంటా...!
చేతిలో
పవ్వ కీసలు
వట్టుకొనచ్చిన రాజిగాని బాద,
తాతా
మా అవ్వ
పైసల్ రేపిత్తనన్నది
ఒకటియ్యవా..
సత్తిగాని అభ్యర్తన

అమృతాన్ని పంచె
మోహిని
మగవెషమేస్కున్నట్టు
కనవడేటోడు మా డబల్ రొట్టెల హుసేన్ తాత,

సార దాగని మా బాపు
అవసరాల బరువునీ
మా మీద ప్రేమనీ
బడ్జెట్ తరాజు ల జోకి
రూపాయ్ బండి
చేతుళ్ళో
డబల్ రొట్టె గా
తర్జుమా అవగానే
సంబురం
నాతో సావాసానికి
ఉరికచ్చేటిది

గిలాసల పాలు
రొట్టెకి తాగించినాక
మా చిన్నక్కకు కనబడకుండా
నోటి సరిహద్దులు
దాటించేటోన్ని ....

పట్నంలడుగు వెట్టినంక
డబల్ రొట్టె ముచ్చటే
మర్శిపోయినం.
మొన్న
ఊరికి వోతె తెల్సింది
మా పొద్దటాకలికి
ఆనందాన్ని మోస్కచ్చిన
హెరో సైకిలి
ఉరికిన పదారేంద్ల కాలపు
మారథాన్ ల
ఓడిపొయిందాట
గాడెవడో అంగ్రేజొని
పిజ్జా బండి
తాత సైకిలికి
టక్కరిచ్చిందాట

గిప్పుడు
మా హుసేన్ తాత
బెల్టు షాపు కాడ
కీసలేరుకుంటుండు
ఐనా ఆడేం నిరుపేద కాదులే
రొజుకి థీస్ రుపాయ్
ఖర్చు వెడ్తాండు.

భవాని ఫణి || మౌనం


మౌనం ఉదయించింది
మాటల చీకటి కనుమరుగయింది

మౌనం వర్షించింది
శబ్దం నిశ్శబ్దమై చిగురించింది

మౌనం పలికింది
పలుకు మూగబోయింది

మౌనం పలకరించింది
భాషణం బిత్తర పోయింది

మౌనం వెల్లివిరిసింది
వాక్కు వాడిపోయింది

మౌనం పరిమళించింది
ప్రతి మనసూ పరవశించింది
28.09.2012

మోహాన్ కృష్ణ || నవయుగ కవి చక్రవర్తి

భరతవర్షంబీను వజ్రాల ధనరాశి
తూకంబునకు పెచ్చు తూగువాడు
కవిలోకం కెల్ల ప్రత్యేకత గాంచు
విశ్వకవి సమ్రాట్ కవి కోకిల
పదివేల యేండ్ల లోపల ధరాదేవత
కనియెరంగని కర్మయోగి
నిమ్నజాతుల కంటినీరు తుడిచి
శ్వాసించు నిరుపేదకు బంధువై నిలిచినాడు
వినుకొండ పురంబున పుట్టి
ఆంధ్రదేశానికే గౌరవశ్రీ అయినాడు
మనుజుడై పుట్టి
ఖ్యాతి పదిపుట్లు సంపాదించిన వాడు
తిండి లేక భారత సంతతిలెల్ల
ఉపవాస దీక్ష పూనితే
ముప్పది మూడు కోట్ల దేవతలు
ఎగబడుతున్నారు నైవేద్యం కొరకు అని
ఈ కష్టం శివునికి తెల్పగా
చిత్రంబుగా ఖగసతిని చేసినాడు సాధనంబుగా
అట్టి మహర్షికి
తన గురువులే చేసినారు
గండపెండేర,కనకాభిషేక సత్కారాలు
కళా ప్రపూర్ణుడు, పద్మ భూషణుడు
నవయుగ కవిచక్రవర్తి ఇతడే
విశ్వనరుడు- మన జాషువా!
28-09-2012.

డా. కాసుల లింగారెడ్డి || ఒకానొక అసంపూర్ణ వాక్యం కూర్చి,గురించి....


1
ఒక అసంపూర్ణ వాక్యం గురించి
నేనిప్పుడు మాట్లాడుతున్నా-
భావాల్నే కాదు, భాషల్నీ వక్రీకరించే వాడివియ
అసంపూర్ణ వాక్యాల ఆత్మఘోష నీకేమెరుక?
చరిత్ర పుటల్లో మిగిలిపోయిన
ఒక ఉద్విగ్న అసంపూర్ణ వాక్యం గురించి
మళ్ళీ మాట్లాడుతున్నా-

2
జానెడు భూమిజాగ కోసం
గుప్పెడు తిండిగింజల కోసం
ఒక్క పొట్టతిప్పలు కోసం
ఆ మట్టిపుట్టల కోసం
బారులు తీరిన
బాటెరుగని చీమలు
తొక్కిపెట్టినా కుట్టనేర్వని చీమలు
చిన్ని చిన్ని సర్పాలు చిల్లర దేవుళ్ళు
నడిచొచ్చె దారులల్ల కలిసొచ్చె కాలమది-
దారి కాచి
శత్రువు మంద మలిపి
చెరువు కట్టలేసిన చీమలు-
కందకం తవ్వి
కండ్ల కారం కొట్టి
గుత్పలు చేతపట్టి
గుండెలు ఎదురొడ్డి నిలిచిన దండు-
కత్తుల వంతెన దాటి
కాలాన్ని జయించిన కవాతు-
కొండి విరిగిన తేళ్ళు
కాళ్ళు తెగిన జెర్రి
తోక ముడిచి
కోటగోడల దాగిన రక్తపింజర.
3
వేల పులుల మింగిన అనకొండ
చీమలదండుకు అభయమిచ్చిన అనకొండ
రంగు మార్చి
రక్తపింజరకు రక్షణిచ్చి, రాజభరణాలిచ్చి
మట్టిని తొవ్వి
చెట్టును కూల్చి
పుట్టను తొల్చి
చీమల దండును చిందర వందర చేస్తె
బేత దాటి వైరి పక్షాన చేరిన చిన్ని సర్పాలు
మువ్వన్నెల తువ్వాళ్ళ మాటున ముఖం దాచుకున్న చిల్లర దేవుళ్ళు-
సెప్టెంబర్‌ పదిహేడు
చెదిరిపోయిన ఆశయ పతాక ప్రతీక
ఆగస్టు పదిహేను
అనూహ్య రాకాసి అనకొండ పుట్టిన రోజు
చీమల దండు చరిత్రలో రెండు గ్రహణాలు
ఒక అసంపూర్ణ వాక్యాన్ని నిలువరించిన రెండు కామాలు.
4
ఇప్పుడు
చారిత్రక ద్రోహాలకు
గుండె పగిలిన చీమల దండుకు సైరనూదాలి
దినద్వయం ముఖాల మీద నల్లటి తారు వేయాలి
కామాల కింది కొసలు విరిచి
వాక్యాన్ని పూర్తి చేయాలి.

డా|| కాసుల లింగా రెడ్డి
సెల్‌: 9703432211


రచనాకాలం: 11 సెప్టెంబర్‌ 2007.
ముద్రితము: ఆంధ్రజ్యోతి దినపత్రిక 'వివిధ'లో 17 సెప్టెంబర్‌ 2007.

కె.కె. // ప్రయాణం


ఇదొక ప్రయాణం,
రహదారిలా కనిపిస్తుంది,
ఎడారిలా ఎదురవుతుంది.
ఎంత లోతుకెళ్ళినా ఒక్కోసారి,
చమురుచుక్కైనా చెమరించదు.

ఇదొక ప్రయాణం,
రోడ్డుమీద,నడ్డివిరుస్తూ నడవాలనిపిస్తుంది,
అంతలోనే అడ్డదారి సందుల్లో కాలు నడుస్తుంది.
మందలో ముందుకు పోయే ముఖాన్ని,
ఎవరు గుర్తు పడతారులే అనుకుని,

ఇదొక ప్రయాణం,
ఒక సుదీర్ఘ వాక్యం.
పాడెక్కినప్పుడే ఫులుస్టాప్,
వాక్యం పూర్తి చెయ్యాలనుంటుంది.
కామా మంచం మీద
కునికిపాట్లు పడుతుంటుంది.

ఇదొక ప్రయాణం,
జారిపడని కాలుంటుందా???
గాయపడని గుండె ఉంటుందా???
రంకెలేసి గర్జించాలని ఉంటుంది.
సంకెలేసిన గొంతు సకిలింతలతో సరిపెడుతుంది.

కానీ... ఇదొక ప్రయాణం,
ప్రయోగం చేస్తేనే ప్రకాశం,
ప్రయత్నిస్తేనే వికాశం,
మంచుపొగలా మూల్గుతావెందుకు అనుదినం,
మండే నిప్పులా గుప్పుమనాలి కనీసం ఒక్క క్షణం

కర్లపాలెం హనుమంత రావు॥ఆలోచనా శకలాలు


1
పువ్వుతో పాటు
పొద్దూ తిరుగుతోంది
బిడ్డ చుట్టూ తల్లిలా

2
నాన్న రాయని
వీలునామా
అమ్మ

3
కొన్ని దృశ్యాలు అతుక్కుపోతాయి
కొన్ని దృశ్యాలు అలుక్కుపొతాయి
కొన్ని దృశ్యాలు అడుక్కుపోతాయి
మనసు సరోవరం

4
సముద్రం
కన్నీరు ముందు
పిల్లకాల్వ

5
రూపాయి-నోటు
పాపాయి
-ప్రేమ ప్రాంసరీనోటు

6
వేదానికైనా
వేదనే మూలం
రామాయణమే వేదం

7
గింజ
గాదెలో ధాన్యం
భూమిలో జీవం

8
స్వర్గం టూ నరకం
వయా భూలోకం బస్
ఫుల్

8a
నరకం టూ స్వర్గం
వయా భూలోకం బస్
నిల్

9
రెడ్డొచ్చె
మొదలాడు
-జీవితం కదా!

10
రాత్రి ఎప్పుడు పెట్టిందో!
మందారం పండింది నాన్నరచేతిలో
అమ్మప్రేమ గోరింటాకు మహిమ

11
సందు ఇరుకైనా
ఇళ్ళు విశాలం అప్ప్టట్లో
ఇళ్ళు విశాలమే
గుండె లిప్పుడు గుప్పెట్లో

వంశీ // కన్ఫెష్షన్స్

లోపల్లోపల్లోపల్లోపలి
కేంద్రక జన్యుపటపు అతిబలహీన
హైడ్రోజన్ బంధాలసాక్షిగా,

ఖాలీ సీసాలమ్మి కొనుక్కుతాగిన
విదేశీ దారు ధారల కామపు కళ్ళు హరాయించుకోలేని
సౌందర్యంపారే ఫ్రౌడల బజారు
నడుమ్మడతల్లో గొంతుపిసుక్కుని
లిప్ స్టిక్ వాసనల్లో ఆయువు దహించుకున్న దాహంలో,

రహస్య మైదానపు మైధునాల్లో
చుంబనాల చేదుని, రాపాడించిన చర్మాల తడికి
నిశ్శబ్దంగా అన్వయిస్తూ
నిషిధ్దాక్షరాన్నై నిశీధిన నిశ్చలంగా
సుప్త నిష్ఫలాల ఆవల
లిప్త లిప్సల లాలస..

భాఆఆఆఆఆఆఆణ్ ణ్ ణ్ ణ్ ణ్ ణ్ ..
సృష్ట్యాదిన మహావిస్ఫోటనం చిత్రించిన శిథిల
స్ఫోటకప్మచ్చల వదనం కార్చే రసిలో పేరుకుపోయిన
అతిరాత్రపు యఙ్నం విదిల్చిన సంప్రోక్షణపు మసికి
మిధ్యా మానస మానవుణ్ణై,
వధ్యపు మానుకు నిర్జీవపు కానుకనై..

సౌందర్యరాహిత్యంతో
వికృతాసనపు వైకుంఠపాళికి
పాము మింగిన సోపానాల అవరోహణాన,
విరుధ్దవినోదాల విపరీతచర్యల మహానందాన
పరుగాపని కాలం విలోమమై,
అవనిలోనే అంతమైన అంకురంలా
అవధిదాటి అల్లుకుపోయిన అవకరంలా...

28.9.12

నందకిషోర్ || నా తెలంగాణ (గేయ కవిత)

అరవైయేండ్లసంది- మనము నిండా రంది
కడుపునిండా తిని -ఎన్ని రోజులైంది?
ఎట్టెట్ల బతికినవ్ తెలంగాణ?
నువ్వు ఎట్ల గడిపినవమ్మ తెలంగాణ?

దీనమైన బతుకు-కడుపు నింపని మెతుకు
హూనమైన ఒళ్ళు-దూపకందని నీళ్ళు
చేవగలిగిన తల్లి తెలంగాణ!
నీ కధ ఎంత సిత్రామె తెలంగాణ!

వలసవాదులంత-విడుదలని ఆపేస్తే
వలవల ఏడుస్తు-రోజుల్ని లెక్కేస్తు
ఎదురుచూసే తల్లి తెలంగాణ-నీకు
ఎదురొస్త సూడమ్మ తెలంగాణ

అస్తిత్వమే నేడు ఆగమయిపోతుంటే
ఇంక ఆగేదేంది - అణిగి ఉండేదేంది
పోరు దారిలోన తెలంగాణ-నేను
పొలికేక పెడతాను తెలంగాణ
-
వనవాసమొచ్చిన సీతారామయ్యను
పర్ణశాలవయ్యి సేదదీర్చినవంట
అనుమంతుడెగరంగ తెలంగాణ-నువ్వు
కొండగట్టయ్యావ తెలంగాణ

నరసిమ్ముడేరాగ యాదగిరిగ వెలిసి
పాండవుల్నిదాచ నేలకొండల కలిసి
గోదారి తీరాల తెలంగాణ-వేదాల
నోదార్చినావంట తెలంగాణ

కంఠేశ్వరములోన కొలనుపాకలోన
ఇందురు కోటల్లో చోళెవాడల్లోన
వేలయేండ్లకుముందె తెలంగాణ-నువ్వు
విలసిల్లినావంట తెలంగాణ

కోటిలింగాలలో ఆటలాడిననాడు
నేలకొండల్లోన బుద్దినేర్చిననాడు
ఆకాశమందింది తెలంగాణ-యీ నేల
సింగిడై పూసింది తెలంగాణ

త్రిభువనగరికోట తిరుగాడినా రోజు
కాకతీయుల కలలకోకలేసినరోజు
అమ్మవైపోయావె తెలంగాణ-పచ్చాని
అడవుల్లో నడిచావె తెలంగాణ

మెతుకుదుర్గంలోన ఏకశిలలపైన
రామప్ప శిల్పాల్ల వేయి స్తంభాలల్ల
నాట్యాలు జేసావె తెలంగాణ-నువ్వు
నవ్వుతూ తిరిగావె తెలంగాణ

అబలవంటు తలచి ఆక్రమించగ వస్తె
ఆవేశమె ఎగసి మగవేషమే వేసి
ఎదురించినావమ్మ తెలంగాన-రుద్రమ్మ
చేతుల్లో కత్తివై తెలంగాణ

జంపన్నవాగులో జరిగింది ఒక తప్పు
తెలిసితెల్వని తప్పు తెచ్చె నీకు ముప్పు
గూడెంల గుడిసెపై తెలంగాణ-సమ్మక్క
సల్లటి సూపువే తెలంగాణ

అడవిబిడ్డల కప్పమడిగిన పాపమే
బంగారుసువ్వల్ల బందీగబోయింది.
వీరశైవముబోయి తెలంగాణ-యీడ
బానిసత్వము సొచ్చె తెలంగాణ

బహుమనీ మొఘలాయి సుల్తాన్లు సైతాన్లు
షాహీలు,జాహీలు దొరలు,దోపిడిదార్లు
అధికారమెవడైన తెలంగాణ-నువ్వు
అణిగి ఉన్నవె తల్లి తెలంగాణ

బమ్మెరపోతన్న పాల్కుర్కి సోమన్న
పిల్లమర్రిన పినవీరభద్రన్న
కవులగన్నా తల్లి తెలంగాణ-పాట
కట్టడం నేర్పావె తెలంగాణ

బాధనోర్చుకుంటు బతుకునీడ్చుకుంటు
బరువైన గుండెలో కండ్లల్ల నీళ్ళతో
అడవిదారులపొంట తెలంగాణ-నువ్వు
అడుగులేసావమ్మ తెలంగాణ
-
గుర్రాలపై వచ్చి గుడులు కూలగొట్టి
మతముమారమంటు కుతికపై కాలేస్తే
ఊపిరాపకుండ తెలంగాణ-మమ్ము
కాపాడిన తల్లి తెలంగాణ

తోలు చెప్పుల కింద చెయ్యి నలుగుతున్న
మరఫిరంగి గాయం గుండె సలుపుతు ఉన్న
కన్నబిడ్డల పొదివి తెలంగాణ-కడుపు
దాసుకున్నవె తల్లి తెలంగాణ

ఆడబిడ్డల చెరచి అడవిసంపద దోచి
అడ్డమొచ్చినోని కాళ్ళు చేతులు విరిచె
కాలమే కదలంగ తెలంగాణ-మమ్ము
కాసుకున్నవె తల్లి తెలంగాణ

అడవుల్ని అక్కల్ల,నదిని నాయనలాగ
తండాని తమ్మునిల,పల్లెల్ని పిల్లల్ల
సూసుకున్నవె తల్లి తెలంగాణ-కండ్లల్ల
కలుపుకున్నవె తల్లి తెలంగాణ

పంటని పల్లెని ఇంటి ఇల్లాలుని
ఏది దొరికినగాని ఎత్తుకెళ్ళిపోయి
మానాలుదోస్తుంటే తెలంగాణ-నువ్వు
మౌనంగ ఏడ్చినవె తెలంగాణ

బాంచలంటు దొరలు బతుకులాగంజేస్తే
బట్టలే ఇప్పించి బతుకమ్మలాడిస్తే
గుండె రాయిగ మార్చి తెలంగాణ-
ఏడ్చిన దైన్యమె తెలంగాణ

కరువు దాపురించి కాలువల నీళ్ళెండి
గడిలబాయికాడ నీళ్ళు తేవబోయి
దొరలసూపుకి నోచి తెలంగాణ
దాంట్ల దూకిన రోషమె తెలంగాణ

కాళ్ళ రెక్కల కష్టం శిస్తుకట్టనంటే
కన్నెర్రగాజేసి కాల్చిపారేస్తుంటే
కడుపుతీపి పొంగి తెలంగాణ-కన్నీటి
నదులపారిన తల్లి తెలంగాణ

నోటికాడి ముద్ద నైజాములాక్కుంటే
కూటికిగతిలేక కొడుకులేడుస్తుంటె
రజాకార్లను తరుమ తెలంగాణ-
రగిలిపోయిందాన తెలంగాణ

ఎండనక వాననక చేసిన కష్టాన్ని
బండెనక బండ్లల్ల నిజాం పట్టుకపోతే
నిండైన నీ గుండె తెలంగాణ-నిప్పు
కణికల్లె మండిది తెలంగాణ
-
బలిఅవుతనని ఎరిగి నాజీలకెదురేగి
బందూకుగొట్టంల బతుకురాగం పాడి
తిరగబడ్డవె తల్లి తెలంగాణ-యాదన్న
గొంతుకల పాటవై తెలంగాణ

పసులు కాసేటోన్ని పైసల్ కట్టుమంటే
పసిపిల్లలా అడివి పరేషానయితుంటే
గెరిల్లాపోరులో తెలంగాణ-భీమన్న
విల్లమ్ములయ్యావ తెలంగాణ

రాంజిగోండుతో కలిపి వెయ్యిమందిని తెచ్చి
ఉరులమర్రికి కట్టి ఉయ్యాలలూగిస్తె
ఊడల్లో వాళ్ళూగ తెలంగాణ-ఇంకింత
గట్టిపడ్డ చెట్టు తెలంగాణ

వెట్టిచాకిరి బతుకు ఆత్మగౌరవ ఘోషై
జాగీర్ల జామీన్ల ఆగడమంతుసూడ
ఆయుధం పట్టావె తెలంగాణ-కొమ్రన్న
త్యాగమే సూస్తుంటె తెలంగాణ

కొంగునడుముకి చుట్టి కొడవలి చేతబట్టి
విన్నూరు దేశ్‌ముఖ్ వెన్నుపూసలు కదల
ఉరికురుకి దూకినవె తెలంగాణ-ఐలమ్మ
సూపు పౌరుషంల తెలంగాణ

కుచ్చుటోపి అయితే నేను పెట్టనంటు
సమ్మెరాగంపాడి సర్కారునే దింపి
వెలివేస్తేబడినిండి తెలంగాణ-రంగన్న
నామంల గెలిచావె తెలంగాణ

నా తెలంగాణ కోటి రతనాల వీణంటు
తీగ తెంపి నువ్వే మంటలేసినవంటు
తిడుతుంటె దాశరధి తెలంగాణ-జైలు
గోడెక్కి ఆడినవె తెలంగాణ
-
కూలిన ఖిల్లాల బురుజుల్ల కమాన్ల
పారిపోయిన దొరల మూతపడిన గడిల
తలదాచుకున్నావె తెలంగాణ-మమ్ము
పొత్తిళ్ళ దాచావె తెలంగాణ

సర్కారు ఏలుబడి సావు తప్పించుకుని
సర్ధారు సైన్యంతో మాట నెగ్గించుకుని
మమ్ము కన్నవె తల్లి తెలంగాణ
మళ్ళ జన్మనిచ్చినవమ్మ తెలంగాణ

పుట్టిన ఘడియల్నె ఎట్ల సాదుతవంటు
పురిటిబిడ్డ నోట్ల గింజేయసూస్తుంటే
పనికిజేరినవమ్మ తెలంగాణ
దొరలపాత బాధలు మరిచి తెలంగాణ

చిందిన నెత్తురు చనుబాలుగాదాపి
రాలిన ప్రాణాల్ని గోరుముద్దలుబెట్టి
మమ్ము సాదినవమ్మ తెలంగాణ-గుండె
కెత్తుకుని సాకవె తెలంగాణ

ఒరిగిన అమరుల వీరగాధలు జెప్పి
విప్లవాలని అల్లి జోలపాటగ పాడి
నిదురపుచ్చినవమ్మ తెలంగాణ-మమ్ము
ఎండిపోయిన ఒడిల తెలంగాణ

పోరాటాల భాష మాటలే పలికించి
ఉద్యమం పలకపై అక్షరం దిద్దించి
పెత్తందార్లను తన్న తెలంగాణ-మమ్ము
పెంచినవమ్మ తెలంగాణ

కొండగాలిపాట వాగువంకల ఆట
గువ్వపిట్టలకూత గంజిగడక మేత
మాకు తెలిపినవమ్మ తెలంగాన-మా
మనసు నింపినవమ్మ తెలంగాణ
-

తెలీవిలేనోళ్ళమని సదువురానోళ్ళమని
మదరాసు బొంబాయి మనుషుల్ని పట్కొచ్చి
మనల అడుగునతోస్తె తెలంగాణ-ముల్కి
ముల్లువైగుచ్చినవ్ తెలంగాణ

కుడినుండి ఎడమకి రాసెటోడెందుకని
కొలువుల్ని సదువుల్ని కాలరాసేస్తుంటె
సిటీ కాలేజిలో తెలంగాణ-లేత
సిగురోలే పూసినవ్ తెలంగాణ

మన ఇంట్ల కుర్చేసి మనల నౌకర్‌జేసి
సాంబారు ఇడ్లీలు జొన్నరొట్టెలమేస్తే
చెయ్యి పిడికిలి బిగిసి తెలంగాణ
చెంప దెబ్బల్ల కలిసినవె తెలంగాణ

పెద్ద మనుషులుజేరి పద్దుపత్రం రాసి
కనికట్టునేజేసి తాకట్టు నినుపెడితె
పయ్య పద్దతికింద కింద తలంగాణ
నలిగిపోయిన చెయ్యి తెలంగాణ




ఢిల్లినుండి వచ్చి పెళ్ళి నాటకమాడి
అంచుల్ని చెరిపేసి ఉంచుకొమ్మన్నారు.
ఉమ్మడి రాష్ట్రమని తెలంగాణ-నిన్ను
అమ్ముకుని ఉరికిండ్రు తెలంగాణ

భాషపేరుజెప్పి పక్క ప్రాంతం కలిపి
అంధకారముదెచ్చి ఆంధ్రదేశమనిరి
కొత్త పేరు మొలిచె తెలంగాణ-నిన్ను
వేరు పురుగై తొలిచె తెలంగాణ

వాడొకడు వీడొకడు దేహి అంటు వస్తె
వాడవాడలు రాసి వాళ్ళకిచ్చినావు.
మనసున్న తల్లివే తెలంగాణ-నువ్వు
దయ ఉన్న మన్నువే తెలంగాణ

దేహి అంటు వచ్చి దేహమంతా పొడిచి
ఆంధ్ర సర్కరోడు ఆర్డర్లు వేస్తుంటే
కుత్తుకను తొక్కంగా తెలంగాణ-నువ్వు
ఎత్తుకున్న బోనం తెలంగాణ
-
వ్యవసాయమన్నారు-భూములే కొన్నారు
చీమల పుట్టల్ల పాములైపోయిండ్రు
వలసవాదులు వచ్చి తెలంగాణ-వాళ్ళె
విషనాగులయ్యిండ్రు తెలంగాణ

ముల్కిరూల్సుని వాళ్ళు మూసిల ముంచిండ్రు
గెలిచిన తీర్పుని మలిపేసి నవ్విండ్రు
ఫ్రీజోను చేసిండ్రు తెలంగాణ-వాళ్ళు
ప్రేతాల మించిండ్రు తెలంగాణ

ఇరవయ్యొక్కటి వస్తె హింది పాసన్నారు
ఇష్టమొచ్చినట్టు రాజ్యాంగం మార్చిండ్రు
దొరల రాజ్యంబోయి తెలంగాణ-యీడ
దొంగపాలన వచ్చె తెలంగాణ

వలసవాదులుమారి విషవాదమే నూరి
కొలువుల్ని భూముల్ని కొల్లగొడుతు ఉంటె
మండిపోయినదాన తెలంగాణ-గుండె
మంటలారనిదాన తెలంగాణ

పోరపొమ్మంటుంటే పాతుకునిపోయిండ్రు
రాజధాని మొత్తం మా రాజ్యమన్నారు
పాతబడ్డామంటు తెలంగాణ-నిన్ను
పాతరెబెట్టిండ్రు తెలంగాణ

పన్నెండేండ్లు ఉండి ఇల్లు మాదన్నారు
ప్రశ్నిస్తె పోలీసు బలగాల దింపిండ్రు
పసిపిల్లలను సంపి తెలంగాణ-తెల్లోల్లె
నయ్యమనిపించిండు తెలంగాణ.

ముల్లెమూట సర్ధి ఎల్లిపోరా అంటె
మూన్నూట డెబ్బై ప్రాణాలు తీసిండ్రు
మనుషులకి సావుంది తెలంగాణ-వాళ్ళ
త్యాగం సావులేంది తెలంగాణ

సీమాంధ్రులమని మరిచి సిగ్గుశరమొదిలేసి
ముఖ్యమంత్రి కూడ మావోడె అన్నారు.
సింహాసనమే ఎక్క తెలంగాణ-నక్క
సింహంగాదు తెలంగాణ
-
ప్రజాసమితిపెట్టి పదిజిల్లలు తిరిగి
పార్లమెంటు సీట్లు పన్నెండు గెలిచిండు
పదవి ఎరకి చిక్కి తెలంగాణ-ఒకడు
పారిపోయిండమ్మ తెలంగాణ

పార్టీని కాంగ్రెస్‌ల పరువుని గోదాట్ల
కలిపి కనపడకుండ ఢిల్లీకిపోయిండు.
తల్లి తాళిబొట్టు తెలంగాణ-వాడు
తాకట్టుబెట్టిండు తెలంగాణ

కుటిల కుతంత్రాల మనలేని పిల్లల
ఒళ్ళు బాధలుజూసి తల్లడిల్లిపోయి
తండ్లాడినావమ్మ తెలంగాణ-కాళన్న
గొడవ గోడు నువ్వు తెలంగాణ

తెలుగంటె మాదంటు తెలివంతజూపిస్తె
పుంటికూరని ఆంధ్రమాతంటు పూజిస్తె
యాస బదనామైతే తెలంగాణ-యశోద
కధలబూసిన పువ్వు తెలంగాణ
-
యాస బొందలబెట్టి భాష మాదన్నారు
భోగంమేళా ఆట యోగమని అన్నారు.
తమ్ముని లెక్కజూస్తె తెలంగాణ-వాళ్ళు
ఆస్తి పంచమండ్రు తెలంగాణ

సంప్రదాయం మాది నేర్చుకొమ్మన్నారు
అమ్మతమ్ముని కూడ చేసుకోమన్నారు
పీర్ల నెత్తినెక్కి తెలంగాణ-జోడు
సవ్వారిజేసిండ్రు తెలంగాణ

హైద్రబాదు మేమె కట్టినామంటారు
చార్మినారు ప్లాను గీసినమంటారు
మోచేతుల బతికి తెలంగాణ-వాళ్ళు
మొకము నాదంటారె తెలంగాణ

అడిగి వచ్చినోళ్ళు అభివృద్ది మాదంటు
మురికంత మూసీల కలిసేలజేసిండ్రు.
కాళ్ళు మొక్కెటోడు తెలంగాణ-వాడె
కాళ్ళొత్తమంటడె తెలంగాణ
-
గోదావరి క్రిష్ణ పరవళ్ళు తొక్కిన
పంటచేనుకి నీటి సుక్క దిక్కులేదు.
నోరు తెరిచిన బీడు తెలంగాణ-నువ్వు
నల్ల రేగడి గోడు తెలంగాణ

సుక్కనీరులేక డొక్కలెండుతుంటే
సర్కారు నిధులల్ల టక్కరిచ్చె నీకు
నిండిపోయిన కరువు తెలంగాణ-నువ్వు
ఎండిపోయిన చెరువు తెలంగాణ

మానేరు మంజీర పొంగి పొరలవేంది
కిన్నెరసాని వన్నె కులుకుయేమయ్యింది
ముచికుంద యేమైంది తెలంగాణ
అది మూసి ఎందుకైంది తెలంగాణ

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టేడబాయె
సాగర్ల నీళ్ళని ఎవని పంటకిబాయె
పుట్టగతిలేనోళ్ళు తెలంగాణ-నిన్ను
పుట్టి ముంచిండ్రమ్మ తెలంగాణ

ఇచ్చంపల్లి మర్చి పోలవరమని ఒకడు
బాబ్లి కట్టి ఒకడు ఆల్మట్టి అని ఒకడు
పొరుగు రాష్ట్రపోడు తెలంగాణ-నోట్లె
మట్టి కొట్టినాడు తెలంగాణ

తుంగభద్ర కృష్ణ కళ్ళముందే ఉన్న
పాలమూరిపొలము వలస ఎందుకుబాయె
నీటిమీది లెక్క తెలంగాణ-నిన్ను
తుంగలో తొక్కింది తెలంగాణ

సిరిసిల్ల గద్వాల చేనేత యేమాయె
ఇందూరు మగ్గాలు బొంబయెందుకుబాయె
ఆప్కో అంటె అర్ధ అర్ధం తెలంగాణ-సాబ్కో
అయిపోయిందె తెలంగాణ

ఆరుగాలంజేసి పంట తీసేటోడు
బాయిల్ల పనిజేయ దుబాయి పోయిండు
ఎంత కష్టమొచ్చె తెలంగాణ-అంత
నష్టమెవడు తెచ్చె తెలంగాణ
-
ఎగురుతు ఆడేటి ఎర్రజెండేమైంది
దున్నెటోందె భూమి అన్న అన్నలేరి
చర్చలకు పోయిండ్రు తెలంగాణ-వాళ్ళు
సుక్కల్లోజేరిండ్రు తెలంగాణ

ఆంధ్రోడిపాలన అంధకారములోన
సుక్కల్లో అన్నలు దిక్కుల్లో అరుపులు
కుక్కలా పెత్తనం తెలంగాణ-నిన్ను
చిక్కుల్లో తోసెన తెలంగాణ

సూరుకు తలతగిలి రకతంకారుతుంటే
పాపాల చీకట్ల ఉద్యమ దీపంబెట్టి
తచ్చాడినవె తల్లి తెలంగాణ
సొంత తనయులని ముద్దాడ తెలంగాణ

సక్కనైన గుణము నిన్ను ఇడవకపాయె
దిక్కులేని యాల సావన్నరాదాయె
సూరీడు పొడవంగ తెలంగాణ-పొద్దు
ఎరుపులో తేలావె తెలంగాణ
-
ప్రకటించినానంటు పత్రికల మీదెక్కి
పదిరోజులకె ఒకడు మాట మార్చేసిండు
పెట్టుబడి దయ్యాన్ని తెలంగాణ-నువ్వు
మట్టుబెట్టవె తల్లి తెలంగాణ

శ్రీకృష్ణుడిపేర కుట్రజేసిండొకడు
పాండవులనిడిచేసి కౌరవులజేరిండు
ఆత్మగౌరవమంటె తెలంగాణ-అది
నాకు తెల్వదండు తెలంగాణ

మా అన్న ఒకని న్యాయమడగబోతె
రాయలతెలంగాణ రావొచ్చునన్నాడు
మతములేనిదాన తెలంగాణ-మమ్ము
సీమలో కలపొద్దు తెలంగాణ

తెలంగాణ నా ధ్యేయమన్నాడొకడు
తీరజూస్తెవాడె సమైఖ్యాండ్రన్నాడు
స్వార్ధపరులజూసి తెలంగాణ-నువ్వు
సావునెతకొద్దమ్మ తెలంగాణ

సామాజికమని ఒకడు సంకలె గుద్దిండు
విశాలాంధ్ర నేడు ఇంపుగుందంటాడు
విలువలేని మాట తెలంగాణ-నువ్వు
బలి అయ్యిపోవద్దె తెలంగాన

సెంటిమెంటుని మేము గౌరవిస్తామంటు
మాట మార్చినోడు జైళ్ళు తిరగబట్టె
తప్పుజేసినోడు తెలంగాణ-శిక్ష
అనుభవిస్తాడమ్మ తెలంగాణ

రబ్బరు బుల్లెట్లు రక్కసి నృత్యాలు
ఎదురుమాట్లాడితె ఎస్మాలు గిస్మాలు
లాఠీ దెబ్బలు తగిలి తెలంగాణ
నీ తోలంత కమిలింది తెలంగాణ

రెండుకళ్ళని ఒకడు రెండు నాలకలోడు
యీడ్నెపుట్టిన అనే హిట్లరు ఇంకొకడు
మోకాలు అడ్డేస్తె తెలంగాణ-వాని
కాళ్ళు ఇరగగొట్టు తెలంగాణ
-
సిగ్గుశరములేని బద్మాశిరాజ్యంల
ఎనిమిదొందలమని బలిదానమయ్యిండ్రు.
రాజకీయములోన తెలంగాణ-నీ
రక్తమె మరిగింది తెలంగాణ

ఒక్క పుట్టుకలోనె ఇంకెన్ని యాతనలు
మొక్కవోని దీక్షకెన్ని ఆటంకాలు
కాలిపోయిన బతుకు తెలంగాణ-నువ్వు
సావులేని ఆత్మ తెలంగాణ

ఉరికొయ్య తాళ్ళల్ల ఊగేటి కాళ్ళల్ల
సల్ఫాను డబ్బాల్ని మోసే చేతుల్లల్ల
పాణంల పాణమై తెలంగాణ-నువ్వు
వదిలిపోవద్దమ్మ తెలంగాణ

బీడు భూముల్లోని కోతకడుపుతోటి
ఇంకిపోయిన కాల్వ నీళ్ళ ఈపుతోటి
అట్లనే ఆగుండు తెలంగాణ-నీకు
అమృతం తెస్తున్న తెలంగాణ

అమరవీరుల స్థూపం చిట్టచివరంచులో
యెలిగేటి సుక్కల దారిలో అడుగేసి
ఇదిగిదిగో వస్తున్న తెలంగాణ
ఇంక ఏడ్వకె తల్లి తెలంగాణ

అస్సైదుల అంటు ఆటలాడుకోని
పెట్రోలు మంటల్తో తానమెపోసుకుని
నిన్ను చేరుతనమ్మ తెలంగాణ-నీ
కన్నీరు తుడిచేస్త తెలంగాణ

చేనేత మగ్గంల బట్టలే నేసుకొని
సెజ్జుభూములకాడ దర్జాగ యేసుకుని
అలయ్‌బలయ్ అంటు తెలంగాణ-తల్లి
అందర్ని కలుస్తా తెలంగాణ

తూటాలకెదురేగె ఆటలె చూపించి
బూట్ల కవాతులకి జోడురాగం పాడి
మురిపిస్తనె తల్లి తెలంగాణ-నీకు
ముద్దుబెడతానమ్మ తెలంగాణ

నాగేటి సాళ్ళల్ల నవ్వేటి బతుకుల్ల
పనిచేసెరెక్కల్ల పల్లె పాటల్లల్ల
నీతోటె నేనుంట తెలంగాణ-నిన్ను
వదిలిపోలేనమ్మ తెలంగాణ

బూరుగు చెట్లల్ల బుర్కపిట్టల్లల్ల
తంగేడు పువ్వుల్ల అడవి ఆకుల్లల్ల
కలిసిపోతానమ్మ తెలంగాణ-నిన్ను
కావలించుకుంట తెలంగాణ

తల్లిపాలుదాగి రొమ్ముగుద్దేటోల్లు
సందుల్లల్లదాగి మొకము చాటేసిండ్రు
డప్పుసప్పుడుజేసి తెలంగాణ-వాళ్ళ
ముప్పుతిప్పలుబెడత తెలంగాణ

కేంద్రమే కదిలేట్టు ఢిల్లి ఊగేటట్టు
అన్నదమ్ముల వెతలు జల్ది తీరేటట్టు
పొరుజాతరలోన తెలంగాణ-నేను
పొలికేకబెడ్తానె తెలంగాణ

రాళ్ళుపోగు చేసి ఆయుధాలుగ దాచి
అడ్డమొచ్చెటోని అంతునేసూడంగ
అడుగేసి కదులుతా తెలంగాణ
పిడుగల్లె దుంకుతా తెలంగాణ

పూలు తెంపుకోని గుండెకద్దుకోని
అమరుల త్యాగాల్ని కళ్ళల్ల నింపుకొని
ఉరికేటి సూపుతో తెలంగాణ-నేను
ఉద్యమాన్నవుతానె తెలంగాణ

గునుగు పువ్వుల్లోంచి గుండెమలుపుల్లోంచి
ఎండిపోయిన చెలక ఎరుపు చెక్కిట్లోంచి
ఎదురువస్తానమ్మ తెలంగాణ-నేను
వెలుగు సూరున్నవుత తెలంగాణ

జబ్బకు సంచేసి దబ్బుదబ్బున కదిలి
చేతిలో జెండతో నినదించె గొంతుతో
సాగరహారమై తెలంగాన-
హారతే నీకిస్త తెలంగాణ

28-09-12

కట్టా. శ్రీనివాస్ || నడక


ఆవిష్కరణాత్మక ప్రగతిశీల ఆలోచనలు
నీ విశాల నిశీధి గదులలో
పరుచుకుంటూ వెలగాలి.
అక్కడితో చాలదు.

ఆ వెలుతురు దారిలో
నీ ధ్రుఢమైన అడుగులు
తడబడకుండా కదలాలి


లకుముకి పిట్టా
అప్పుడే నూతన ద్వారం నిన్నాహ్వానిస్తూ
తెరుచుకుంటుంది.
నీక్కావలసిన నిధికూడా
అక్కడే దొరకొచ్చు.

http://antharlochana.blogspot.in/2012/09/blog-post_27.html

మూర్తిరాజు అడ్లూరి // నీవు ఏది పొందలేవు


అది నాదె
ఇదినాదె
అన్ని నీ ఇంట్లొ
వుండాలని
ఆశపడ్డావు
ఏది కాకుండా
నీవు వీధినపడ్డావు

స్వార్థం మూసీ కంపు
నీదేహమంత ప్రవహిస్తుంది

నీఅవాగ్దానాలే
నీగొంతులో అబద్దపు
పుండ్లు గా పుడుతాయి

స్వార్థమా నీవు ఏదిపొందలేవు

26/09/2012

కాసుల లింగారెడ్డి // వర్గశత్రువు

కాలం ఎవని కనుసన్నల్లో
నడవదు
ప్రాణం ఎవడి సేఫ్టీలాకర్లలో
నిలువదు
అక్క
పెద్దోడు
చిన్నోడు
అచ్చంగా అబ్డామినల్‌ పెయినే అంటరు
హఠాత్తుగా
జీవం అలుగు దుంకుతది
ఒక్క కాటు
మూడు పసి పిట్టలు
'సేవ్‌ స్నేక్‌' మహోద్యమకారులారా!
చంపండి ఇప్పుడైనా-

ఉగ్రవాదం
ఏ మట్టిపొయ్యిమీద ఉడుకదు
సామూహిక హనన చర్య
ఎవడో మీటనొక్కందే ప్రాణాలు ఎగురేసుకపోదు
దారిద్య్రం దారి దోపిడికి లైసెన్సు కాదు
కసబ్‌ వేలి అంచులమీది కాలిన శవాల కమురు
కడిగేస్తే పోదు
183 మాత్రమే కాదు
సమస్తం నిషేధం విధించుకున్నా
పిల్లి మెడలో నేనే గంట కడతా
ప్రాణదాతను కదా నేను
కసాయిలను ఉరితీసే తలారినైతా

పంచభూతాలు
ఎవడి పాదాక్రాంతమూ కావు
ఎవడి పడకెక్కే
పసిడి కాంతలూ కావు
'బాంచెన్‌, కాల్మొక్కవు'
ఒరేయ్‌ మూర్ఖుడా!
చుట్టబెట్టుకొని
ఉక్కు లాకర్లలో భద్రపరుచుకునేది
ఉట్టి కాగితపు ఉండలే
జీవకోటి ప్రాణాధారపు భూమి కాదు

నాగలి భుజాన మోస్తున్న రైతా!
సర్రున కర్రు లాగి
నా దేశ భూస్వామ్యం గుండెల్లో గుచ్చు
చెమట నెత్తుర్లు పోసి
చక్రాన్ని తిప&్పుతున్న శ్రామికా!
నేలతల్లి కడుపు చీల్చి
బంగరు వనరుల దోస్తున్న బడాచోరుల పాతరెయ్‌

వర్గశత్రు నిర్మూలన
ఒక అనివార్య చర్య.

(వరంగల్లు జిల్లా బచ్చన్నపేటలో2-9-12నాడు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు ఒకే రాత్రి, ఒకే పాము కాటుకు మరణించిన విషాద సందర్భంగా)

సురేష్ వంగూరీ || ఏకాంతం


నాకెవరూ లేరనుకోకండి
నాతో నేను స్నేహించడానికే ఈ ఏకాంతం

ఏకాంతంలో
కొన్ని జ్ఞాపకాల పలకలూ, బలపాలూ
నన్ను నేను దిద్దుకుంటూ, చెరుపుకుంటూ

ఏకాంతంలో
కొన్ని అనుభవాల అద్దాలూ, అర్ధాలూ
నన్ను నేను చూసుకుంటూ, తెలుసుకుంటూ

ఏకాంతంలో
కొన్ని అవకాశాల తలుపులూ కిటికీలూ
నన్ను నేను తెరుచుకుంటూ, తొంగిచూస్తూ

ఏకాంతంలో
నన్ను ఉతుక్కుని ఆరబెట్టుకుంటాను
నన్ను వెతుక్కుని కూడగట్టుకుంటాను
నాకు నేనే భుజం తట్టుకుంటాను

నాకెవరూ లేరనుకోకండి...
హృదయాన్ని పైకి లాగి బిగించి కట్టుకుని
మళ్లీ మనుషుల్లో కలవడానికే ఈ ఏకాంతం

27. 9. 2012

చేపూరి వినాయకప్రసాద్ || రాయాలి...


రాయాలి..
రాళ్ళని మార్చాలి...
మనసుని కవ్వించాలి..

హృదయాన్ని రంజించాలి...
తనువుని తుళ్ళించాలి...

గమ్యం వైపు మళ్ళించాలి..
కర్తవ్యం భొధించాలి..

అదే కవితల్లొని మూలమంత్రం...


27SEP2012

--శ్రీవిప్ర--

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ || ప్రేమవతారుడు

మొదటిసారి అతడి రక్తం చిందించబడింది
అతడికి ముళ్ళకిరీటం అలంకరించబడ్డప్పుడు

అతడు శిలువను మోసాడు
దానితోటే అందరి పాపాలను మోస్తున్నానని భావించాడు
ఆ బరువుతో శరీరమొంగినా..
తనలో కరుణ మాత్రం నిఠారుగా ఉందని చాటాడు

అతడి రక్తం స్రవించి ఇంకుతూనే ఉంది
వంటిపై కొరడా పేల్తున్నప్పుడూ
శిలువకు మేకులు మోదుతున్నప్పుడూ

రక్తమింకిన ప్రతిసారీ..
అతడి ప్రేమద్విగుణీకృతమయ్యిందనుకున్నాడు
అతడు నోరు తెరిచి అడగడడమే తరువాయి..
దైవం తరఫు లక్షల సైనికులు
అతడి పక్షాన నిలబడే అవకాశముండీ
ప్రేమించే బలహీనత వల్ల
అతడు మిన్నకున్నాడు

సరిగ్గా మూడ్రోజుల తర్వాత
అతడు పునరుజ్జీవితుడయ్యాడు
కానీ..
ఇంకా భూమిపై ఎన్నో
సంపూర్ణ ప్రేమోద్భవ హృదయగర్భాల ద్వారా
అతడు నిత్యం
పునరుజ్జీవితుడవుతూనే ఉన్నాడు!! 
25SEP12