పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జులై 2012, గురువారం

శిలాలోలిత || గోరటెంకడి పాట ||

వాగ్గేయకారులెలా ఉంటారు !?
చింతాకంతే వుంటారు
చిరస్మరనీయులై నిలుస్తారు


ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య
ఒక త్యాగయ్య, ఒక మీరా
ఇదిగో ఇక్కడ
తెలంగాణా భూమిని తొలుచుకుని గోరటి వెంకన్న!


అతడి నోటినిండా పల్లెపదాలు
పాట ఎత్తుకుంటే పల్లె మన ముంగిట నిలుస్తుంది
పదబంధాలు,ప్రతీకలు బంతిపూలై నవ్వుతాయి.
కళ్ళు ఎగిసిన అలలై మెరుస్తాయి
ఊరుతల్లి ఇంటిముంగిట ముగ్గవుతుంది
చెట్టూ చేమా , కాయాకసరూ
ఉప్పూనిప్పూ కరువూ కష్టం
చేలెంబడి ,డొంకలెంబడి తిరుక్కుంటూ పాటల్లా నడుస్తాయి


ఊరోళ్ల ఊసులు సంతలకధలు వెతలు రాములయ్య బతుకుభాగోతాలు హరిశ్చంద్రుడి కాటికాపరి దుక్కం
కన్నీరొక చుక్కుండిన చాలునన్న వేదాంతాలు ఆలుమగల్ల రాద్దంతాలు సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మలు
డెంకదేడ్డెం 'అంటూ లేగాదూడలైన పిల్లకాయలు కనిపించని కుట్రల్లో పల్లెకన్నీరు పెడుతుందని దృశ్యమానం
చేసే పాటల మాటల ఊటల ఆవేదనార్తుల కలబోతల ఒక అనంత ప్రవాహం ఆతడి పాట.చదువుకున్నోళ్ళ
ఉన్నోళ్ళ ,ఉన్నున్నోళ్ళ నోటెంట పలికే గిలికే రాతలే నిజమంటున్న కాలంలో -బతుకుబండిలో పల్లెనేక్కించిన
జానపద సాహిత్య రారాజు అతడు.


అతడొక ఉద్యమం ,అతడొక ప్రవాహం ,పరీవాహకం
అతడి గుండె ఒలికిన పాట పోటెత్తిన అల
'వేమన'లా ప్రతీకలని చుట్టూ చూస్తూనే
ఒడిసిపట్టుకుని విత్తనాల్లా వెదజల్లుతాడు
చరణాల నాగటిచాల్లలో ఏం పోలిక రువ్వుతాడో తెలీదు
ఎవరి గుండె పిగులుతుందో తెలీదు
అతడినోట ప్రతి పాట ఓ బతుకుగుండం ,జీవన్మరణ పోరాటం
అంతర్గత సంక్షుభిత విలయనృత్యం


తెలంగాణ కన్నమట్టిబిడ్డ,మరో బిడ్డ
కన్నతల్లి కనుకొలకులలో మెరుపై నిలిచే నెత్తుటి గుండం!

*12-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి