గాయాలు లేకుండా అక్షరాల్ని స్రవించకు నేస్తం!
"సెప్టిక్" అవుతుంది.
అక్షరాల్ని మూట కట్టకు
పదబంధాల జీర్ణవస్త్రంలోంచి భావం కారిపోతుంది.
ఆలోచనల దారాలతో అల్లని మాటలు చెల్లాచెదరైపోతాయి.
"మనసిత్వం" పోసి వెలిగించని అక్షరాలు
ఉల్కల్లా అరక్షణం వెలిగి ఆరిపోతాయి.
వివర్ణహృదయంతో పదచిత్రాలు గీయలేవు, నేస్తం!
అనుభూతుల వర్ణపటం నుండి రంగులు ఎరువుతెచ్చుకోవలసిందే.
స్వయంచాలితాలైన అక్ష"రే"లకు
అలంకారాల, సమాసాల అల్లెతాడు అవుసరం లేదు.
అనాదినుండీ భావాలకెప్పుడూ సుఖప్రసవం జరుగలేదు. నిజం.
అక్షరాలా--- అక్షరాల సిజేరియన్ చేయవలసిందే!
కానీ, పెన్సిలు ముల్లు చెక్కినట్లు అక్షరాలను చెక్కనక్కరలేదు.
అవి వజ్రకాఠిన్యాలేకాదు--- సునిసితాలు కూడా.
పద్యాల ఊయలలో మనల్ని లాలించినవీ,
బంధ, చిత్ర కవితలతో హింసించినవీ,
భావ కవిత్వంతో వినువీధులలో త్రిప్పినవీ,
జగన్నాధ రథ చక్రాలై --- నేల మీద నడిపించినవీ
ఈ అక్షరాలే!
అక్షరాలు వెన్నెట్లో ఆడుకునే ఆడపిల్లలే కాదు,**
నిక్షిప్తం చేసుకున్న విశ్వ రహస్యాలను
విపులీకరించడానికి Armstrong పాఠకులకై
అహరహమూ ఎదురుచూసే చంద్ర శిలలు కూడా.
రోజుకొక్క సూర్యోదయాన్ని ఆవిష్కరించేదీ,
కోకిలలనీ, వనాలనీ కొత్త ప్రతీకలుచేసి,
వ్యావహారపుకొలిమిలో పుటం వేసిన పుత్తడిలా
వింత వన్నెలు సంతరించుకునేదీ--- ఈ అక్షరాలే.
ప్రకృతికి శాస్త్రాల భాష్యం చెబుతున్న మనిషికి శబ్దమై హసించినవీ,
పదంగా ధ్వనిం చినవీ --- ఈ అక్షరాలే
అక్షరాలు జీవన్మరణ సూచికలు
కొందరు అక్షరాల్ని ఆలింగనం చేసుకుని సహగమనం చేస్తారు -- హష్మీలా,
కొందరు అక్షరాలను అడ్డువేసుకుని వీర విహారం చేస్తారు --- అర్జునుడిలా.
అక్షరాలు అనుభవాల్ని మేసిన "అణు " భవాలు.
విస్ఫోటన- సంయోజనాల అదుపు తెలుసుకోక ప్రయోగించావో ---
అవి సమాజాన్ని సర్వసేనా మూర్చ లోనైనా ముంచేస్తాయి
లేదా
దాని గురుత్వాకర్షణ శక్తి నైనా లేపేస్తాయి.
(**with apologies to Tilak)
*11.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి