పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
యం. శ్రీవల్లి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యం. శ్రీవల్లి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

యం. శ్రీవల్లి కవిత

ll ఏమో మరి ..నా ప్రేమll యం.శ్రీవల్లి. 04/04/2014. కాదనలేని సత్యమో.. ఔననలేని అహంభావమో... అంతులేని మోహమో... మోయలేని విరహమో... ఏమో మరి..నా ప్రేమ. మాటరాని మౌనమో.... అలవికాని అనురాగమో.... గుండెలో ఇముడ్చుకోలేని ప్రేమో... వ్యక్తపరచలేని భావమో... ఏమో మరి నా ప్రేమ. అక్షరాల్లో కూర్చలేని కావ్యమో... బంధనాలు దాటలేని దాస్యమో... అర్ధంకాని తత్వమో... నువ్వే కావాలనుకునే మొండితనమో.. ఏమో మరి నా ప్రేమ. సందేహాల నడుమ ప్రశ్నగా నా ప్రేమ.. వదులుకోలేని బంధమై నాప్రేమ... ఒంటరిదైనా ...నీతలపుల ఊపిరితో.. అమరమే నా ప్రేమ.

by యం. శ్రీవల్లి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q2EsPq

Posted by Katta

14, మార్చి 2014, శుక్రవారం

యం. శ్రీవల్లి కవిత

llసంకల్పంll యం.శ్రీవల్లి. బేలగా కూర్చున్నా.. కళ్ళల్లో బాధ, మనసులో పుట్టెడు దిగులుతో.. ఏటికి ఎడురీద లేక..ముందుకు సాగలేక... అర్ధాంతరంగా పయనం ముగించలేక.. కుప్పకూలిపోతున్న ఆశల సౌధాలని నిలబెట్టలేక.. మనసంతా ఆవహించిన భయాన్ని నిస్సహాయంగా అనుభవిస్తూ.. భయం, బలహీనత, ఆత్మన్యూన్యత, పిరికితనం పిశాచాలై నను కబళిస్తుండగా.. ముందుకు సాగలేక, అడుగు ముందుకు వేయలేక.. ఆలోచిస్తున్నా... ఉవ్వెత్తున ఎగసే కెరటం క్రింద పడుతోంది..మళ్ళీ లేవటానికేగా.. క్షణంలో మాయమయ్యే మెరుపు..మరింత తేజస్సుతో వస్తోంది.. ఎప్పటికైనా ఫలిస్తాననే కదా...ఆశ మళ్ళీ మళ్ళీ పుడుతోంది.. ఇంతటి శక్తి వీటికి ఎవరిచ్చారు? నోటితో పలకరింపు వద్దు..నొసటి వెక్కిరింపు వద్దు.. జాలి చూపులు వద్దు, మొసలి కన్నీరు వద్దు.. ఉన్నదొక్కటే..సంకల్పం. సంసిద్ధమవుతున్నా.. నా జీవన గమనాన్ని నేనే నిర్దేశించుకుంటూ నాకు నేనే ధైర్యం, నేనే సైన్యంగా.. నేనే సారధిగా, ఆశలనే అస్త్రాలుగా .. ధృడమైన మనో నిశ్చయంతో..నింగికెగసే ఆరాటంతో.. కొండల్ని పిండిచేసే గుండె నిబ్బరంతో... మహా ప్రళయాన్నితట్టుకునే ఆత్మ విశ్వాసంతో.. మహాసముద్రాన్ని దాటిన మారుతి వేగంతో.. ఎల్లలు లేని సంకల్ప దీక్షతో .......కార్యసిద్ధికి.

by యం. శ్రీవల్లి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cX50zf

Posted by Katta

5, ఫిబ్రవరి 2014, బుధవారం

యం. శ్రీవల్లి కవిత

ll సింధూరంll యం.శ్రీవల్లి. 03/02/2014. హృదయాన్ని తాకివెళ్ళే నీ ప్రతి జ్ఞాపకం .. నా పెదవిపై చిరునవ్వై మెరుస్తోంది. నా తనువుని స్పృశించే పిల్లతెమ్మేరేదో.. నీ చిలిపి ఊహకు ప్రాణం పోస్తోంది. నీ తలపుల సెలయేరులో తానమాడే నా మది లో వలపు కలువలు విరబూసినాయి. నీ ప్రేమ చినుకులలో తడిసిన వేళ రాలే ప్రతి ఆనందభాష్పమూ స్వాతిముత్యమయ్యింది. చిన్న చిన్న ఆనందాల నా ప్రపంచం నీ అనురాగ వీచికలతో స్వర్గతుల్యమయ్యింది. నీ మనసు స్వచ్చత నా ప్రేమ హరివిల్లు తో కలిసి సంధ్యారాగమై.. ఆనంద వర్ణాల నిలయమయ్యింది. నీ సాంగత్యపు క్షణాల ముందు.. వందేళ్ళ కాలం అల్పమయ్యింది. మన ప్రేమ నుదుటి సింధూరమై నా స్త్రీత్వం పరిపూర్ణమయ్యింది.

by యం. శ్రీవల్లి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j67VXP

Posted by Katta