కవిసంగమం కుటుంబంలో అందరికీ వేనవేల అభినందనలు - బివివి ప్రసాద్
ఆంధ్రజ్యోతి వార్త దగ్గరిది.. అందరూ చూడాలని మళ్ళీ ఇక్కడ..
సమగ్రంగా జరపాలంటే రెండు రోజులైనా జరపవలసినంత ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక పూటకి కుదించినపుడూ, సమగ్రంగా రాయాలంటే రెండు పూర్తిపేజీలైనా రాయాల్సినది అరపేజీలో సర్దవలసివచ్చినపుడూ, అది కార్యక్రమ నిర్వాహకునికీ, వ్యాసకర్తకీ చాలా పెద్ద పరీక్ష అవుతుంది. అంత సాంద్రతనీ ఆవాహన చేసుకొని ఒక అవుట్ లైన్ తయారుచేసుకోవటానికి చాలా నిర్మలత్వమూ, ఓపికా కావాలి. మొన్న కార్యక్రమానికి యాకూబ్ గారికీ, ఈ వ్యాసానికి స్కైబాబా గారికీ ఆ ఓపికకీ, నిర్మలత్వానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
కవిసంగమానికి సీరియస్ నెస్ తీసుకువచ్చినవారూ, ఆ వేదికకి కారణమైన వారూ, ఇంకా ఎందరో వెనుక ఉండి దీనిని విజయవంతం చేస్తున్నవారూ తగుమాత్రం గుర్తించబడలేదనీ, లేక పూర్తిగా విస్మరించబడ్డారనీ చిన్నబుచ్చుకొనే అవకాశం ఉంది గనుక, వారి ప్రేమనీ, శ్రమనీ అశ్రద్ధ చేసారనే భావం కలగకూడదని ఇదంతా రాస్తున్నాను.
ఒక విషయాన్ని అందరం దృష్టిలో పెట్టుకొందాము. సాహిత్యం బ్రతకాలి. కొత్త తరం ఉత్సాహం గా గొప్ప వారసత్వాన్ని కొనసాగించాలి, అంతేకాదు మరింత సంపద్వంతం చేయాలి. అపుడు వారి విజయాలలో కవిసంగమ కృషి అంతా ప్రతిఫలిస్తుంది.
నా మటుకు నాకు, కొత్తవాళ్ళ పేర్లూ, కవితలూ ఈ పేజీలో చూడడం, మొన్న అందరినీ ఆహ్వానించే దగ్గర నుండి, వేదిక చుట్టూ, వేదికపైనా వాళ్ళు కళకళలాడుతూ ఉండటం చూస్తే, వాళ్ళందరిలో నన్నే చూసుకొంటున్నంత ఆనందంగా ఉంది. ఒక తల్లి తాను ఇంటికే పరిమితమైనా, ఆమె బిడ్డల విజయాల వెనుక ఆమె పెట్టిన అన్నమూ, ఆమె దీవెనలే కదా శక్తి.
మొన్న యకూబ్ గారి లోని వత్తిడినీ, ఇప్పుడు స్కైబాబా గారిలోని వత్తిడినీ మనం కూడా పంచుకొని మన ముందుండే ఇటువంటివారికి మనం ఎప్పుడూ భరోసాగా నిలవాలి.
సాహిత్యం అలా ఉంచండి, ఇంతా చేసి, ప్రతి సందర్భం నుండీ మనం ప్రేమలోకి అహంకారాన్ని కోల్పోవటం నేర్చుకోవటానికి కాక కవిత్వాలెందుకు. మన కుటుంబంలో అందరికీ వేనవేల అభినందనలు.. ఇక దూకండి కార్యరంగం లోకి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి