తనతో
ఉన్న కాసేపు
సమయాన్ని తీగలుగా చుట్టి
మూలకు పడేసి
కనబడకుండా
వర్తమానపు గోనెసంచుల్లో నింపి
కుట్టేస్తే చాలు
అనిపిస్తూ
మాటలన్ని
బంతి పూల రెక్కల కింద
దాక్కుని
ఆ రంగుల్లో స్నానమాడి
తన పెదాలపై
అంటుకున్నట్టు
కనిపిస్తూ
చీకటంతా
ప్రవహమై
వెలుగులో కలుస్తూ
కను రెప్పలని
ఆ వెలుగు తరగలతో నింపి
తన కళ్ళలో
ఆ ప్రకాశాన్ని
మెరుస్తుంటే చూస్తూ
గాలినంతా
ఎక్కడికక్కడ ఆపి
తన స్వేదాన్ని తాకకుండా
చేసి
ఆ చెమ్మనుంచి సుగంధాన్ని
తీసి
నా గుండెలనిండా
తనుగా నింపుకుంటూ
ఆ క్షణాల దగ్గరే
ఆగిపోయా
అడుగు ముందుకేసే ధైర్యం చాలక
తనకు
ఈ రోజుకు
వీడ్కోలు చెప్పలేక
నన్ను నేను
గతాన్ని జ్ఞాపకాల్ని కౌగలించుకొని
రేపటికి
తను వేసే
అడుగుల కింద
పచ్చగా పరుచుకొనే
గడ్డి తివాచి నవుతూ
ఆ పాదలని
సున్నితంగా
ముద్దాడటానికి ఎదురుచూస్తుంటా.
*20-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి