1.
ఊరంతా నల్లని ఊసులాడే క్షణం
పొగ మంచులో ఓ అస్పష్ట రేఖ
రెప్పల చాటు నవోన్మేష స్వప్నం..
ఆకాశప్పొద మీద
కొత్త యవ్వన పరిమళంలా
మల్లెమొగ్గల కాంతి
ఒంటరి పక్క మీద
అస్తిత్వపు సంఘర్షణలో
అస్తిమిత హృదయారాటం
ఎవరికీ తెలియని లోకంలో
చిక్కని రంగులు నేసిన సీతాకోక చిలుకల
రెక్కల చప్పుళ్ళు...
ఆదమరుపు తీరంలో ఏకాంత కెరటంలా నేను
ఒరుసుకొంటూ ఎగసిన ఊహలతో....
అప్పటిదాకా నిద్రపోయిన సంగతులన్నీ
గుప్పుమన్న పరవశం
ఎటు చూసినా రంగుల పుప్పొడి తడి
ఎటు చూసినా పొంగిన తేనెల అలికిడి
ఇప్పుడు
నేనొక స్వేచ్చా బంధాన్ని
వాంఛా మకరందాన్ని
ఆనంద మేఘాన్ని....
2.
నిశ్శబ్దం భళ్ళున బద్దలైన శబ్దం
తూర్పు పక్షి రెక్కల సంగీతం
తోటంతా ప్రవహించిన అందాల జలపాతం...
ఊరంతా పసుపు కుంకుమల నిగారింపు
పొగమంచుగా కరుగుతున్న అస్పష్ట రేఖ
రెప్పల చాటు కరిగిన కోయిల గీతం...
3.
ఉదయం పొత్తిళ్ళలో
ఓ జ్ఞాపకం మొదటి ఏడుపు....
ఓ నిట్టూర్పు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి