పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

కవిత్వ పఠనం - వ్యాఖ్యాత పాత్ర - కొన్ని సూచనలు

ఫిబ్రవరి 9 -lamakaan
.............................

నిన్నటి ప్రొగ్రాంలో ఆంకరింగ్ చేసిన అనుభవం కొంత పంచుకోవాలనిపించింది. ఈ విషయంలో నిన్నటి నా పాత్రపై ఒకింత అసంత్రుప్తి మిగిలింది.

ఏదైన ఒక సభ నిర్వహించేటప్పుడు వ్యాఖ్యాత పాత్ర కూడా కీలకమైనది.

కేవలం కవి పరిచయం, సమాచారం షేర్ చేయడమే కాకుండా ఆంకర్ సభలో ఒక ఉత్తేజాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్రుష్టించ గలగాలి.

హాస్యమో, విశ్లేషనో, చనుకులో, ఏక వాక్య పంచులో కలగలిపి ఒక ఉత్సాహ ఉల్లాసభరిత మైన మూడ్ని క్రియెట్ చెయ్యగలగాలి. (అది సమయాభావ పరిధుల్లోనే సుమా).

కవిత్వ పఠనం Two way communication process. శ్రోతలు కేవలం వినేవారైనా వారి హావభావాలు, కరతాళ ధ్వనులు, మెచ్చుకొలు వహ్వాలు కవికి ఒక instant feedback వంటివి.

కవి తన కవిత్వం వారికి చేరిందా లేదా అనే మీమాంసలో వుంటే ఆ సంశయం వారి పఠనంపై ఒకింత నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుంది.

శ్రోతలు ఇన్వాల్వ్ కావాలంటే ఆంకర్ వారిని ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తూ కవిత్వ పఠనానికి అనువైన ఆంబీయాన్స్ మైంటైన్ చెయ్యాలి.

ఇది ఆషామాషి వ్యహారం కాదు. వ్యాఖ్యాతకు కుడా ఒకింత నెర్వస్ నెస్ వుంటుంది. అది కనబడకుండా చిరునవ్వుతో, ఆత్మ విశ్వాసంతో , చలాకీగా ఆంకర్ సభను నిర్వహిస్తే అది వేదికపై కవులకు, వారిని వింటున్న శ్రోతలకు కనెక్టివిటి పెంచుతుంది.

ఇందుకు కొంత ముందొస్తు ప్రిపరేషన్ మరియు ప్రాక్టిస్ అవసరం. ఆంకరింగ్ అనుభవం లేనివారు స్క్రిప్ట్ ఔట్ లైన్ కూడా రాసి పెట్టుకుంటే అ భాద్యత మరింత సుళువవుతుంది. వచ్చే సీరీస్లో వాఖ్యాతకు ఉపకరిస్తుందని ఈ విషయాలు పంచుకుంటున్నాను

ఈ కవిత్వ పఠనం సీరీస్ ఉద్దేశం కుడా అదే. యకూబ్ గారు అన్నట్టు ఇది ఒక లెర్నింగ్ ఇన్ ప్రాసెస్.

ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం, ఒకరినించి మరొకరు నేర్చుకొవడం... అందరం కలిసి కవిత్వాన్ని జనరంజకంగా నిలబెట్టుకొవడమే మన లక్ష్యం

కవిసంగమం లామకాన్ సిరీస్ - 2 - కర్టెన్ రైజర్

లామకాన్ లో ప్రారంభమైన సాహిత్య సంబరాలు మళ్ళి మీ ముందుకొచ్చాయి. ప్రారంభ సదస్సులో నగ్నముని, వసీరా గార్ల అద్భుత కవితా పఠనం రస హృదయులను ఉర్రూతలూగించింది. అలానే మెర్సి మార్గరెట్, చింతం ప్రవీణ్, కిరణ్ గాలి తమ దైన శైలిలో శ్రోతలను రంజింపజేసారు.

మళ్ళి ఈ రోజు సాయంత్రం మరిన్ని ఆహ్లాదకరమైన సాహిత్య పరిమళాలు విరబూయనున్నాయి.

చిట్టచివరి వాడిగా తన కవితా పఠనం వినిపించబోయె చిచ్చర పిడుగు, మన కవిసంగమం బుడుగు నంద కిషొరాన్ని గురించి, అతని కవిత్వం లోని వాడి వేడి... మెత్తదనం తీయదనం మీకందరికి తెలిసిందే. నందుది విలక్షణమైన శైలి. పువ్వులు గువ్వలు, వేకువలు వెన్నెలలతో పాటు నిప్పు కణికల్లాంటి నిజాలను నిర్దాక్షిన్యంగా మనపై చల్ల గలడు. తెలుగు సాహిత్యంలో (బహుశ సినిరంగంలో కూడా) రాబోయె కాలంలో అతడు ఎక్కబోయె శిఖరాల తొలి మెట్లు మన కవిసంగమం నించే కావడం మనందరికి గర్వకారణం. "పునర్విమర్శ అభ్యాసం", "యాది", "నా తెలంగాణ", "రాఖి", "ప్రియ సఖి" ఈ కవిత్వం ముద్దు బిడ్డ రాసిన వాటిలోని కొన్ని ఆణిముత్యాలు.

కవయిత్రి జయశ్రీ నాయుడు గారి కవిత్వం తన వర్చస్సు లానే స్వచ్చంగా, సరళంగా, సౌమ్యంగా, సౌందర్యభరితంగా వుంటుందనడంలో సందేహం లేదు. ముఖ పుస్తకంలో తరచుగా తన అలోచనలను అభిప్రాయాలను అందరితో పంచుకుంటు అప్యాయతలు, అనుభందాలు అల్లుకుంటు పోతు తనదైన ముద్రను మనందరి మనసుల మీద వేసారు. తన కవిత్వం కూడా అచ్చం తన చిరు దరహాసం లా పాఠకుల హౄదయాలలొ నిలిచి పోతుంది. జయశ్రి గారు రాసిన "మనిషి పేజి" , "నిరంతర చెలిమి", "పెయిన్ అఫ్ ఎ పోయెం", "అప్పటి నువ్వు" మళ్ళి మళ్ళి చదవవలసిన కవితలు.

నిలువెత్తు మనిషి, నిండైన గుండె క్రాంతి శ్రీనివాస్ గారి కవిత్వం ఒక స్ఫూర్తి. ఆయన స్పృశించని వస్తువు లేదు. అమ్మని , అమ్మమ్మని, అర్ధాంగిని...గుడిని, బడిని, గుండె సవ్వడిని... పల్లెటూరి మట్టిని, పట్టణ జీవితాన్ని... తత్వాన్ని మానవత్వాన్ని అన్నిటిని తన అక్షరాలతో ఆవిష్కరించిన పరిపూర్ణ కవి. ఇటివలే ఆయన రచించిన "సమాంతర ఛాయలు" సంకలనం స్తభ్దంగా వున్న సాహితి ప్రపంచంలో రేపిన కలకలం ముందు తరాలకు బంగారు బాట. కార్య దీక్షుడైన కవి తలచుకుంటే సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేయగలడొ అనేదానికి ఆయన ఒక గొప్ప ఉదాహరణ. వారి కవిత్వం అంటే ఎంత ప్రేమో వారి వ్యక్తిత్వమంటే అంత గౌరవం నాకు.

"మన కాలం కృష్ణశాస్త్రి" గురుస్వామి గారు అని ఒక కవిసంగమం మిత్రుడు అన్న కితాబులో నాకు అతిశయొక్తి కన్నా అక్షర సత్యం అగుపించింది. నిజమే పూల రెమ్మల లాంటి మృధువైన కవిత్వం, సెలెయేటి గలగలల కమ్మని సంగీత శబ్ధం, మనసును పరవశం చేసె మార్మికత ఆయన కవితలలోని ప్రత్యేకత. వారి కవిత్వం చదవడం ఒక అనుభూతి, ఒక అద్రుష్టం. వారు తన "జీవ గంజి", "చెమ్మ" సంకలనాలతో పాఠక లోకానిని దశాబ్ద న్నరకు పైగానే సుపరిచితం. ఆయన చెమ్మలో రాసిన "అయ్యా మళ్ళెప్పుడొస్తవే" చదివి కంట నీరు పెట్టని వారుండరు. మనిషిలోని మనసు ప్రపంచాన్ని ఆయన తన కవితలలొకి వంపే తీరు అద్వితీయం. వర్ధమాన రచయితలు ఆయన కవిత్వాన్ని అస్వాదించి, ఆకళింపు చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ జెనరేషన్ కి "Zen కవి" ఆయన.

దిగంబర కవితోద్యమంతో తెలుగు ప్రపంచాన్ని కుదిపేసిన కవులలో ఒకరు నిఖిలేష్వర్ గారు. సమకాలిన సాహిత్య దశని దిశని మార్చిన సాహసి. మన తరం అటువంటి మహా కవులకు ఇవ్వగలిగే కృతజ్ఞ్యత, గౌరవం - స్వయంగా ఆయనను కలవ గలిగే అవకాశాన్ని వదులుకోక పొవటం.

మీరు సాహిత్యాభిలాషులైతే, మంచిని పెంచే శక్తి అక్షరానికి వుందని నమ్మే వారైతే రండి నాతో పాటు ఈ సాయంత్రం సాహిత్యంతో సహచరిద్దాం, మేరుగైన సమాజ నిర్మాణానికి సహకరిద్దాం. ఈ నెల నెలా కవిత్వ వెన్నెలలో విహరిద్దాం.

కవిసంగమం~సీరీస్ -2 || మహేష్ కుమార్ కత్తి

స్టేజిమీదున్నప్పుడు నటుడైనా, గాయకుడైనా, కవి అయినా ఒక entertainer గా మారకతప్పదు. ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యక తప్పదు. కవితాపఠనాలలో దీర్ఘకవితని చదవడం గురించి నిఖిలేశ్వర్ గారు అన్యాపదేశంగా చేసిన హెచ్చరిక దాని గురించే. ప్రేక్షకులకున్న సమయాన్ని, అటెన్షన్ స్పాన్ ని, గ్రాహకస్థాయిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కవితల్ని ఎంచుకోవడం అవసరం. వాటిని కేవలం చదివెయ్యడంతో సరిపెట్టకుండా, వాటి ముందూ... వెనకాలా... వీలైతే మధ్యమధ్యలో కూడా కవిత గురించో, కవిగా తమ గురించో, అనుభవం గురించో, విశేషం గురించో విశ్లేషణ గురించో వ్యాఖ్యానిస్తూ చదవడం ఒక టెక్నిక్.

కవిత్వం రాసుకోవడం వేరు, రాయడం వేరు. చదువుకోవడం వేరు, చదవడం వేరు. ఆ చదవడం ఒక సభలో అయితే, మరీ ముఖ్యంగా సాటి కవులున్న సభ అయితే మరీ వేరు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని చదివే కవితల్ని ఎంచులోవడం అవసరం. కవిపెద్దలు శివారెడ్డి, నగ్నముని, నిఖిలేశ్వర్ గార్లు ఈ కవితల ఎంపిక కవితాపఠన శైలుల్లోకూడా అందరికీ గురుతుల్యులే. వారి దగ్గరనుంచీ యువకవులు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కవితాపఠనవత్సరం సీరీస్-2 || నందకిషోర్


అందరికీ నమస్తే!

లామకాన్ వేదికగా,కవిసంగమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కవితాపఠనవత్సరం సీరీస్-2 వేడుకగా జరిగిందనీ,విజయవంతమయ్యిందనీ తెలియజేయడానికి ఆనందిస్తున్నాం.feb9కవిసంగమం జన్మదిన తేదీ కూడా కావడంతో కార్యక్రమానికి మరింత విశిష్టత సంతరించుకుంది.

ప్రత్యేక అతిధిగా విచ్చేసిన,దిగంబరకవితావేశానికి పేరెన్నికగల కవి నిఖిలేశ్వర్,లామకాన్లో కవిసంగమాన్ని ఉద్దేశ్యిస్తూ " కవికి విశ్వమంతా ఇల్లేనని,తమ వ్యక్తిగతమైన ఆకాంక్షని-సామాజిక ఆకాంక్షగా మార్చుతూ విశ్వజనీనతకు యత్నించడమే కవులకుండాల్సిన లక్షణమనీ అన్నారు. యుక్తవయసులో,సమాజాన్ని మార్చాలన్న తీవ్రమైన కోపం,ఆపై తాత్వికత,మార్క్సిజం,అస్తిత్వవాదం తన ప్రయాణాన్ని ఎలా నిర్ధేశించిందీ చెపుతూ యాదవరెడ్డి నిఖిలేశ్వర్‌గా మారిన క్రమాన్ని,దిగంబర కవితోద్యమ దిశ-దశలని చర్చించారు నిఖిల్.70ల్లో విరసంలో చేరి ఝంఝ ప్రచురించినప్పుడు PD act కింద అరెస్ట్ అయిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ-కవి నిర్భయంగా మాట్లాడితే ఒప్పుకోలేని,మనోభావాల పేరుతో,తమ అసహానాన్ని ప్రదర్శించే తీరు ప్రస్తుత సమాజంలో నెలకొందనీ అన్నారు.యుగస్వరం,భయం,నల్లగొండ పల్లెటూరి వచ్చినా,నగరంతో తనకున్న విడదీయలేని బంధాన్ని చూపించే నాలుగుశతాబ్ధాలసాక్షిగా..లాంటి కవితలని గానంచేసి ఆహుతులని అలరించారు.సర్క్యులేషన్ తక్కువే ఉన్న పాతికసంవత్సరాలుగా తన సామాజిక,సాహిత్య స్పృహకి దర్పణమైన "జనసాహితి" పత్రికను గురించి ప్రస్తావించారు.

కవిసంగమంలో చిరపరిచుతులైన మరో కవి పులిపాటి గురుస్వామి గారు కవిత్వంకోసం తమ సాయంత్రాన్ని కేటాయించి వచ్చినవారందరికీ దండాలు అంటూ ఆత్మీయంగా మొదలుపెట్టి " రాయడం ఒక బాధ.రాసేంతవరకూ ఒక బాధ..రాసినంక ఒక తృప్తి,ఎవరన్నా బాగుందంటె ఇంకొంచెం తృప్తి" అంటూ తన కవిత్వానుభవాన్ని నాలుగేమాటల్లో చక్కగా చెప్పారు.97లో ప్రచురితమైన అయ్యా!మళ్ళెప్పుడొస్తవే తనని కవిగా పాఠకలోకానికి ఎలా పరిచయం చేసింది గుర్తుచేసుకున్నారు." ప్రియురాలా!ఈ రాత్రిని వెళ్ళనీయకు!" అంటూ తను రాసే శైలిని ఆత్మవెలదిగా ప్రకటించుకున్నారు.సాటిమనిషిని ప్రశ్నిస్తూ సాగే తన మొదటి కవిత " వొత్తుకుండ"తో పాటే,వానధ్యానం,మిషలాంటి దీర్ఘకవితలతో మెప్పించారు.

ఎప్పుడూ వేలమంది హాజరయ్యే సభల్లో మాట్లాడటం అలవాటై ఈ వాతావరణం కాస్త కొత్తగా ఉందనీ,పుస్తకానికి ముందుమాట రాయమంటే మూడునెలలు ఆలస్యంచేసి కవిమిత్రులు తన కవితల సంఖ్యని 93కి పెంచారనీ,పుస్తకావిష్కరణ జరిగి మూడురోజులు కాకమునుపే తనని వేదికమీద కవిత్వం చదవమనడం అన్నప్రాసన రోజే ఆవకాయలా ఉందనీ చమక్కులు పేలుస్తూ మొదలైన క్రాంతి శ్రీనివాసరావుగారి కవిత్వపఠనం ఆద్యంత ఉత్సాహపరిచింది.శ్రీశ్రీనే తనకి స్పూర్తి అని,దాదాపుగా అరవైవేలమంది విధ్యార్ధులకి శ్రీశ్రీ కవిత్వాన్ని తాను పరిచయంచేసాననీ చెప్పుకుంటూ మహానగరం,మా ఊరి మర్రిచెట్టుమీద,లోపలి మరకలు,అపార్ట్‌మంట్ బతుకులు..వంటి కవితలతో ఆకట్టుకున్నారు.స్త్రీలపై తనకున్న గౌరవాన్ని,మమకారాన్ని ప్రతిబింబించే అమ్మమ్మ,తన వ్యవసాయ కుటుంబపు బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ రాసిన "నాన్న కళ్ళు" బాగా హత్తుకున్నాయి.

తనలోని బాధల్ని కవితలుగా చేసి, మృదువైన స్వరంతో ఒలికించిన జయశ్రీనాయుడు..తన ఉపాధ్యాయవృత్తిని తనెట్లా ప్రేమించేదీ,బ్లాగులో తనెట్లా కవిత్వం ప్రచురించుకుందీ,fbలోనూ, కవిసంగమంలోనూ మిత్రులు తననెట్లా ప్రోత్సహించిందీ,వాళ్ళ నాన్నగారు ఎలాంటి ఆదర్శాలని తన జీవితానికి మార్గదర్శకంగాచేసిందీ గుర్తుచేసుకున్నారు.ఒకే మనిషిలో ఉండే విభిన్నకోణాలనూ,ఒక్కోసారి మరొకరిగా మరిపోవాల్సిన సందర్భాలనూ,అనుభవాలనూ తన మాటల్తో అందంగా విశ్లేషిస్తూ, నిజం-నైజం,నేనే నా నౌక.. వంటి మంచి మంచి కవితలతో నిశ్శబ్ధం నింపి కరతాళద్వనుల మధ్య వేదికదిగారు.

చివరగా వచ్చిన బుల్‌బుల్ కూడా,తనకున్న సమయ పరిమితి గుర్తెరిగి బాగానే ప్రయత్నించాడు. అమ్మని,నాన్నని,ఊరినీ,ఉపాధ్యాయుల్ని,తనని ప్రశంసతోని,విమర్శతోని,కావాల్సినప్పుడు తమ నిశ్శబ్ధంతోనీ ప్రోత్సహించిన కవిమిత్రులనీ తలుచుకున్నాడు.పసితనపు గుర్తుగా రాసుకున్న ఊవెలపిల్ల,ఓపెన్ కాస్ట్‌తో అంతరించిపోతున్న ఊర్ల గోస- ఇంకా గోడు,ప్రేమే..etc కవితలు వినిపించి, కవిసంగమం తెలుగు సాహిత్యానికి ఆత్మగాభాసిల్లే రోజు రావాలని కోరుకున్నాడు.

పచ్చని చెట్టుపై మేమంతా పిట్టలం అంటూ వచ్చిన యజ్ఞపాల్ ముగింపువాక్యాల్తో సభముగిసింది.వ్యాఖ్యాతగా మురిపించిన కిరణ్,live planచేసిన vice captainకట్టా,work out చేసిన రాజేశ్,cover upచేసిన మీడియామిత్రులు,అన్నీ తనై ముందుకు నడిపించే captain అభినందనీయులు.

ఇవ్వాళ నాకు సెలవు లేకపోవడంతో reportకాస్త ఆలస్యమైంది.మన్నించాలి.సీరీస్-3 తో మళ్ళీ కలుసుకుందాం.సెలవు.

10-02-13

కవిసంగమం ప్రయాణంలో ఒక సంవత్సరం!


...................................................

సరిగ్గా ఈరోజే(Feb'9,2012) కవిసంగమం మొదలయ్యింది.ఎంతోమందిని కలుపుకుంటూ సాగింది.ఇవ్వాళ ఫేస్ బుక్ కవితావేదికగా నిలబడింది.ఈ సంవత్సరకాలంలో అనేక సాహిత్యసందర్భాల్ని సృష్టించింది.కొత్తగా రాసున్నవాళ్ళు ఎందఱో ఇవాళ తమదైన ముద్రను ఏర్పరుచుకున్నారు.
చర్చలు,సూచనలు,సందేహాలు,సందోహాలు,-వీటన్నిటి మధ్య తమనుతాము ప్రూవ్ చేసుకున్నారు.ఆ మార్గంలో సాగుతున్నారు.
కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది.
'కవిత్వం ఇక యాభై ఏళ్ళ పైబడిన వారి ప్రక్రియేనని' ఎద్దేవా చేసినవాళ్లకి, 'తెలుగులో కవిత్వం లేదని' పెదవి విరిచినవాళ్లకి కవిత్వం నిత్యనూతనమని ,అదొక తీరనిదాహంగా అందరిలోనూ ఉందని కవిసంగమం వేదికగా కవులు నిరూపించి చూపారు.
ఆగష్టు పదిహేనున ఇఫ్లూ లో జరిగిన 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' ఒక గొప్ప ప్రయోగం.ఆంధ్రజ్యోతి,పాలపిట్ట,దక్కన్ క్రానికల్ ,హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని కొనియాడాయి.

***
బెంగాలీ కవి సుబోద్ సర్కార్ అతిధిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్ ను చూసి ముచ్చటపడ్డాడు.గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు.అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి.
ఈ మధ్య వచ్చిన ప్రసిద్ద తమిళకవి చేరన్ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు,చదివిన కవిత్వం ;మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్ ' గా ఎంతో ఉపయోగపడ్డాయి.
ఈ లర్నింగ్ ఇన్ ప్రాసెస్ కు కొనసాగింపుగా ఈ సంవత్సరం మనం మొదలుపెట్టిన 'లామకాన్ లో కవిసంగమం' కార్యక్రమం.! ఇప్పటికే మొదటి సీరీస్ ను ముగించుకున్నాం.ఇవాళ రెండవ సీరీస్. నగ్నముని,నిఖిలేశ్వర్,ఇంకా ముందు ముందు ఈ సీరీస్ కు రాబోయే సీనియర్ కవుల కవిత్వం వినడం,వారితో గడపడం ద్వారా ఈ లర్నింగ్ ఇన్ ప్రాసెస్ ను కొనసాగిస్తాం.

కవిత్వం పని అయిపోయిందనే దశనుంచి,కొత్తవాళ్ళు కవిత్వంలోకి రావడంలేదనే దశనుంచి 'కవిసంగమం'-'నువ్వొక పచ్చని చెట్టైతే ,పక్షులు వాటంతటవే వచ్చి వాలేను'అన్న మాటను నిజం చేసి చూపింది. ఈ సంవత్సరం విజయాలను చూసి తెలుగు పత్రికలూ ,అంతర్జాల పత్రికలూ 'మాకు కవిత్వం పంపండి 'అని కవిసంగమంలో రాస్తున్న కవులను అడుగుతూ ఉండటం గర్వంగానే ఉంది.

**
అప్పటివరకు తమకేమీ పట్టనట్లున్నఎందరినో 'కవిసంగమం'మేల్కొలిపింది. ఆ మేల్కొలుపుకు కవిసంగమం కారణం కావడం ఆనందదాయకం.కవిత్వం కేవలం పెద్దల వ్యవహారం అయిపోయిందని కొట్టిపడేసినవాళ్ళే ఇవాళ కవిసంగమం మార్గాన్ని,విజయాన్ని ఒప్పుకోక తప్పని పరిస్తితిని కల్పించాం.

ఈ సంవత్సరకాలంగా 'కవిసంగమం' ప్రయాణాన్ని గర్వంగా తలుచుకుందాం. మనమందరం ఈ ప్రయాణంలో భాగమైనందుకు ఈ తొలి జన్మదినాన్ని సంతోషంగా చాటుదాం!