పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఆగస్టు 2012, బుధవారం

జగద్ధాత్రి || చిటపటలు||


తొలి రాత్రి మోహావేశం లో
అతని చేతిలో నలిగిన ముంజేతి చిట్లిన గాజుల చిటపటలు

చంటి పాప కి దిగదుడిచి తీసి నిప్పుల్లో వేసిన
ఉప్పు మిరపకాయల దృష్టి దోషపు చిటపటలు

ఆర్తితో అర్చుకుపోయిన ధాత్రి పై
ఆశల చినుకుల సోయగాల చిందుల చిటపటలు

ఆనందాల దీపాల వెల్లి లో
కాకర పువ్వొత్తుల మతాబుల వెలుగుల చిటపటలు

దీపం కొడి గట్టి చివరి వెలుగునిచ్చే
సమయపు చమురింకిన చిరచిర చిటపటలు

చాలించిన దేహపు చివరాకరి మజిలీలో
జీవనరంగానికి తెర పడిన చితి మంటల చిటపటలు

చిటపటలు చినుకులు ..బతుకులు ..భావాలు
అనిర్వచనీయాలు....ఆది ...మధ్య ...అంతాలు.
*13-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి