1, నవంబర్ 2012, గురువారం
డా. రావి రంగారావు // గుంటూరు-టు-విజయవాడ //
తెగ నరికిన చంద్రుడు
చక్కగానే నవ్వుతున్న వేళ
గుంటవూరులో “గుంటగ్రౌండ్”నుండి
నత్త నడకతో “బస్టాండ్” కు బయలుదేరాను,
పడమటి గుంటలో చంద్రుడు పడిపోతే
చీకటి నడక తర్వాత “ఎర్ర బస్” ఎక్కాను...
చేతు లెత్తి ఆగమనే
చిన్న ఊళ్ళను మన్నిస్తూ
దారి కడ్డమై నిలిచే
విష సర్పాలను నలిపేస్తూ
నా పయనం
బస్సులో జనం...
ఆలోచనలతో తలను
తగలబెట్టేసుకుంటున్నాను
చలి “చెర్నకోల” దెబ్బలు
పులిని చీమ కుట్టినట్లు...
“మంగళ”గిరి చేరేసరికి
మసక వేకువ మొలుస్తోంది
కుర్రవాళ్లమ్మే “డైలీ” పేపర్లలో
ఎర్రక్షరా లింకా కనబడటం లేదు...
విజయవాడ దగ్గరపడింది
విజయం సాధించినట్లే,
బ్యారేజీ మీదుగా పోతూ నేను
తలలోని మంటల్ని నదిలోకి విసిరాను,
అపుడు “కృష్ణ నది”లా లేదు కృష్ణానది-
అరుణ ఉష్ణ జ్వాలా ప్రవాహం అది...
సహస్రానేక కరాలతో పరస్పరం
కౌగిలించుకుంటూ
కలిసి ప్రయాణిస్తూ
అదిగో! కనబడటం లేదా!
సూర్యుడు-
మండుతున్న నది హృదయంలో...
నది-
ప్రహించే సూర్యుని దేహంలో...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి