పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, నవంబర్ 2012, ఆదివారం

కాశి రాజు ||మార్పు ||


ఎంతటి రూపంతరమంటే
నిన్న శరీరం , ఈ రోజుదాకాలేదు
ఏదో మార్పు

నిక్కరు నుండి ప్యాంటుదాకా
నాకు తెలిసీ,తెలియకుండానే

కానీ
అదే ఆత్మ

మళ్ళీ చిన్న సందేహం
నిర్మలమైనది నిలకడలేనిదైపోయిందేమో! అని

ఒక మార్పు
అల్లరి.అమాయకత్వం నుండి
ఆత్మశుద్ది,ఆత్మాభిమానమ,ఆత్మబలం,ఆత్మవిశ్వాసం
అనే నాలుగు స్తంబాలనేసుకుని నాముందు నిలబడింది

ఆ మార్పే
కొంత కాలాన్ని కవితగా
నా ఖాతాలో జమచేస్తుంది
అది కూడా గాడార్దాలతోనో,గూడార్దాలతోనో
మార్పుకు లోనౌతుంటుంది

ఒక మార్పు
కాలంలోని క్షణాలన్నీ క్రమబద్దంగా మారుస్తూ
ఈ నిమిషం బతుకు సుఖమనే భావన నాతో బలవంతంగా మోయిస్తూ
కాలమే మార్పు చెందుతుందనే నిజాన్ని
నాతో చెప్పకనే చెప్పి
మార్పు చెందుతూనే ,అంటే మనిషిలాగానే బతకమని
ఓ ఉచిత సందేశాన్ని ఇస్తుంది .

10, నవంబర్ 2012, శనివారం

కాశిరాజు ||అక్షరయానం ||


“అ” వెళ్లి “అహా” మీద వాలుదామని
అచ్చులాంటి కవితై
“క” నుండి “క్ష” వరకూ హల్లుల దారిగుండా ప్రయాణిస్తుంటే

జిత్తులమారి వత్తులు చేరి
గుణింతాలతో చుట్టూ గుమిగూడాయి

ద్విత్వాక్షరాలు,సంయుక్తాక్షరాలు
సందుల్లోకి రమ్మని సైగ చేస్తుంటే
సమాసాలు ఏకంగా సంగామిద్దాం రమ్మంటున్నాయి
అర్దాలూ,ప్రతిపదార్ధాలు
నానార్దాలను నాటుతున్నాయి...............

ఎక్కడా తలెత్తకుండా
ముందుకు సాగుతూ ఉంటే
పదాలుకొన్ని ఊరికే పలకరిస్తున్నాయి
వాక్యాలు వరసలు కలుపుతున్నాయి

అయినా సరే
ప్రయాణిస్తూ పేరాదాకా చేరింది పాపం
పేరాలన్నీ కలిసి పేజీఅయ్యేసరికి,
పేజీతో రాజీ పడక తప్పదని
అక్షరం అక్కడే ఆగిపోతే
దాన్ని కలుపుకున్న పేజీ మాత్రం
క్రేజీగా పెరిగిపోతూ పుస్తకమై
ప్రపంచ పర్యాటన చేసేద్దాం పద అని అక్షరాన్ని అడుగుతుంది......
తేది: 04-11-2012

1, నవంబర్ 2012, గురువారం

Praveena kolli || ఇలాగే ఉందాం||


ఈ లోకం ఇంతే
నేనూ ఇంతే
మంచినే చూస్తానో, చెడునే చూస్తానో

అంతా నా దృష్టిలోనే ఉందంటాను.
నీదంతా అమాయకత్వం అని నవ్వేస్తారు!
కాదే!.... నేనేమి చూడాలనుకుంటున్నానో నాకు తెలుసంటే
పాపం మంచితనమంటారు
ఈ పాపం అలంకారమెందుకో??!!

ఈ లోకమూ ఇంతే, అంతు చిక్కనంటుంది!
నేనూ ఇంతే, అవగతం కానిదేముంది?
అంతా ప్రేమమయమే అని తేల్చేస్తాను.
ఇంకెక్కడి ప్రేమ?అంతా స్వార్ధపూరితం
రుజువులు నిరూపణల జాబితా విప్పుతారు.
నిజమే కావొచ్చు...
ఖాలీ కంచాలు దొర్లుతున్నాయి
ఆకలితో అలమటించే మనసు అక్కడ
కొసరి కొసరి వడ్డించు
సూచన కాదు కర్తవ్యం....

ఈ లోకమూ ఇంతే, నువ్వు మారలేదంటుంది
నేనూ ఇంతే, నువ్వూ మారలేదంటాను
మరి తప్పెక్కడ?
నువ్వు మారావని నేనూ
నేను మారానని నువ్వూ
ఒకరిని ఒకరు సాకుగా చూపిస్తూ
అదీ కుదరకపోతే, కాలాన్నే దోషిగా చిత్రించేస్తూ ఉంటాం!

మనం మారొద్దు...
స్వచ్చంగా, స్వేచ్చగా, సూటిగా, సరళంగా....సంపూర్ణంగా జీవిద్దాం.

నువ్వు నేను అందరం ఎదుగుదాం
ఎవరూ ఎగిరెగిరి పడోద్దు
మనందరి మూలాలు మట్టిలోనేనని మరవొద్దు....

కర్లపాలెం హనుమంత రావు॥కావలిమనుషులు కావాలి॥


1
నాతిచరామి సంకల్పం చెప్పుకుని
అగ్నిసాక్షిగా సాప్తపదీనం చేసిన వాడు

కడదాకా తోడుంటాడని పుస్తెల నమ్మకం
వెన్నులో ఎన్ని పోట్లు దిగినా
ఆ మొదటి వెన్నెలరాత్రి కుసుమపరిమళశోభే
సంసారాశ్వాస విశ్వాసజ్యోతి కొండెక్కకుండా ఆపే అఖండశక్తి
దింపుడుకళ్ళెం దగ్గరా కన్నపేగు
ఆఖరి పిలుపు ఆసరానాసించే
ఆఖరినిశ్వాసం అసలు స్వభావస్వరూపం విశ్వాసం
వరదలో పడి మునకలేస్తున్నా
గడ్డిపోచకోసం గుడ్డి ప్రార్థనలు చేసేది ఆ విశ్వాసమే
చెట్టూ పుట్టా రాయీ రప్పలోనైనా సరే
కంటిపాపను చంటిపాపలా కాపాడే రెప్పల్నే మనిషి కలగంటాడు
చుట్టూ పెరిగే లోకం తనకేనని ఓ గట్టి నమ్మ్కకం
అమృతసాధనే ఆఖరి లక్ష్యమైనప్పుడు
హాలాహలం రేగినా మింగే శంభుడొకడుంటాడన్న భరోసా
శీలవతి మానరక్షణకు పరీక్షసందర్భం ఏర్పడప్పుడల్లా
అపద్భాంధవుడిలా అడ్డొచ్చి ఒడ్డునేసిన ఆ విశ్వాసం
కనిపించుట లేదు

2
కంచెపైని నమ్మకమే లోకంచేను నిశ్చింతనిద్ర రహస్యం
కంచెలే చేలని ఇంచక్కా భోంచేస్తున్నకాలం ఇది
కడబంతి దాకా ఆగే ఓపిక ఎవడికీ లేదు
అయినవాళ్ళకన్ని వడ్డనలూ ప్ర్థథమ విడతలోనే పరిసమాప్తం
గజాననులకు గణాధిపత్యం ముందే ఖాయమైపోయుంటోంది
అమాయక కుమారుల తీర్థస్నానాలన్నీ వట్టి ప్రహసనాలే
ఆషాఢభూతులకివాళ వేషాలు కూడా ఎందుకూ దండగ!
ప్రజాపాండవులనలా అజ్ఞాతంలో ఉంచే నయానయా వంచనల
పంచదార గుళికలనిలా పంచుకుంటూ పోతే చాలదా!
దేవుడి మీదో రాజ్యం మీదో
ప్రమాణాలు చేయడం పాలకులకదో వినోద విధాయకం
న్యాయరక్షకులే నేరగాళ్లతో సరిసమానంగా బోనుల్లో నిలబడుతున్న
విశ్వాసఘాతుక పతాకసన్నివేశమాలికే ప్రస్తుతం నడుస్తున్నది

3
నమ్మకానికి అపనమ్మకానికి మధ్యున్న సన్నగీతను
ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు చెదరగొట్టారో నిగ్గు తేలాలి
ప్రజావిశ్వాసమెంత కంటకప్రాయమైనా
కీరీటమల్లే మోసే జనంకావలిదళం మళ్ళీ కావాలి
కేజ్రీవాలులో మాజీ జయప్రకాషులో
నమ్మి వదిలిన విశ్వాస కపోతాన్ని తిరిగితెచ్చే నేతలు
మళ్ళీ పుట్టుకు రావాలి!

Satya Srinias ||ప్రతిబింబం (సీక్వెల్)||


పక్షులు
ముక్కున తీసుకున్న
గరిక పరకల్లా

నేను
రోజూ
కొన్ని అక్షరాల్ని
ఏరుకుంటా
ఇంటిని
అక్షర మాలగా
కూర్చాలని
ప్రయత్నం
చేస్తుంటా
వాటి కాలం వేరు
పరిణతి చెందినవి
నా మటుకు
తరచు
చేయాల్సిందే
అందుకే
పెరటి నిండా
మొక్కలే
ఇంట్లో కూడా
అవి ఇంటి సభ్యులవ్వాలని
మా యత్నం
సదా కొనసాగే
అలవాటుగా
మారాలని
ఎప్పటికైనా
ఇల్లుని
కవిత్వ పొదరిల్లుగా
అమర్చాలని.
రోజూ
ఉదయం
పిట్టలు
బయటకు
వెళ్ళే
ముందు
కిటికీ
తట్టి
మరీ
గుర్తు చేస్తాయి
లోనా
బయటా
నేల చీరని
పచ్చగా
అమర్చమని
గూళ్ళని
కళ్ళలో
పెట్టుకుని
చూడమని

బాటసారు || అయ్యా ||


అయ్యా శాస్త్రి గారు
రెడ్డిగారు ,
రాజుగారు,
నాయుడుగారు ...

మనమంతా ఒకే తాను ముక్కలం
అమ్మ చనుపాలు సగపాలు రుచి చూసిన వాళ్ళం ..!

పొరపాటో,
గ్రహపాటో...
మంచి చేయాలనే తొందరపాటో
సమాజ మలినాన్ని మా ముక్కతో ఒక్కసారి కడిగాం ..!

అంతే !
అంటరాని వారిగా
అణగారిన వర్గాలుగా మిగిలిపోయాం
శతాబ్దాలుగా మీ సేవలోనే తరిస్తున్నాం ..!

అయ్య పెట్టిన పేరున్నా
రారా, పోరా, ఎరా, ఒరేయ్ లతో
సరిపెట్టుకుంటున్నాం , మట్టిలో మాణిక్యాలు
మాలో ఎందరున్నా ఇంకా నిరక్షరాశ్యులుగానే మిగిలిపోయాం..!

రాచరికాలు పోయినా
ప్రజాస్వామ్యానికి విలువలు అద్దినా
జీవచ్ఛవాలుగా వున్న మా నైతికతను
నూటికో కోటికో ఓ అంబేద్కర్ తట్టిలేపినా..!

ఏ వర్ధంతికో, జయంతికో
మా ఆవేశాన్ని పూలదండల్లో,
మీ తెల్లపంచెలు వేదికలెక్కి
మనమంతా ఒక్కటే అన్న మాటలతో
సర్దుకు పోతున్నాం , సమసమాజ ఉషోదయం కోసం ఎదురు చూస్తున్నాం...

వంశీ // సీక్రెట్ విండో //


గర్భం మోస్తూ అలిసిన
మాతృస్వామ్యపు శిథిలాల్లోంచి నిర్మితమౌతూ
పితృరాజ్యపు విశృంఖలత్వం,


మంచికో చెడుకో
అక్షౌహిణుల ప్రాణాల పలుకాపి
అర్ధాకళ్ళ హననాల పరుగాపి,
జాతుల పోరు నిర్విరామంగా..

శతాబ్దాలుగా దాహం తీరని ఖడ్గం, ఒరలో..
ప్రశాంతంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటూనో
రక్తస్పర్శలకు ఆరాటపడుతూనో,
వీరులు నేలపొరల్లో నిద్రిస్తూ
చరిత్ర చిత్తరువుల్ని రేపుకి తర్జుమా చేయలేక
ఓడి క్షయమై..

అధికారం తోడిచ్చిన భయంతో
దేవుణ్ణి పుట్టించి,భయమింకా పెంచుకుని
నిజరూప దైవాంశలను శిలువేస్తూ
వీరుల వారసులు,

సహజాతపు విధేయతతో
దేవుణ్ణి పారాకాస్తూ ఖడ్గాల పునర్జననం,
వీరుల అస్థిత్వమ్మీద చీల్చలేని పొరల్నికప్పి
రహస్యకవాటాల్లో కళ్ళు నిలిపి సకలం పరికిస్తూ
నాటకీయంగా నడుస్తూ కాలం..

నరకమెవరికి
ఖడ్గానికా, వీరులకా, సంకల్పానికా. సందేశానికా

స్వర్గమెవరిది
దేవుడిదా,వారసులదా , రహస్య కవాటపు కాలానిదా..

29.10.12

డా. రావి రంగారావు // గుంటూరు-టు-విజయవాడ //


తెగ నరికిన చంద్రుడు
చక్కగానే నవ్వుతున్న వేళ
గుంటవూరులో “గుంటగ్రౌండ్”నుండి

నత్త నడకతో “బస్టాండ్” కు బయలుదేరాను,
పడమటి గుంటలో చంద్రుడు పడిపోతే
చీకటి నడక తర్వాత “ఎర్ర బస్” ఎక్కాను...

చేతు లెత్తి ఆగమనే
చిన్న ఊళ్ళను మన్నిస్తూ
దారి కడ్డమై నిలిచే
విష సర్పాలను నలిపేస్తూ
నా పయనం
బస్సులో జనం...

ఆలోచనలతో తలను
తగలబెట్టేసుకుంటున్నాను
చలి “చెర్నకోల” దెబ్బలు
పులిని చీమ కుట్టినట్లు...

“మంగళ”గిరి చేరేసరికి
మసక వేకువ మొలుస్తోంది
కుర్రవాళ్లమ్మే “డైలీ” పేపర్లలో
ఎర్రక్షరా లింకా కనబడటం లేదు...

విజయవాడ దగ్గరపడింది
విజయం సాధించినట్లే,
బ్యారేజీ మీదుగా పోతూ నేను
తలలోని మంటల్ని నదిలోకి విసిరాను,
అపుడు “కృష్ణ నది”లా లేదు కృష్ణానది-
అరుణ ఉష్ణ జ్వాలా ప్రవాహం అది...

సహస్రానేక కరాలతో పరస్పరం
కౌగిలించుకుంటూ
కలిసి ప్రయాణిస్తూ
అదిగో! కనబడటం లేదా!
సూర్యుడు-
మండుతున్న నది హృదయంలో...
నది-
ప్రహించే సూర్యుని దేహంలో...

పీచు శ్రీనివాస్ రెడ్డి || బంగారు తల్లి || 29-10-2012


ప్రేమగా పరిగెత్తుకుంటూ వచ్చి
ఒక్క సారిగా అలా ఆగి పోయింది అక్షరం
కౌగిట్లోకి తీసుకొని ముద్దాడితే కరిగి ముద్దయ్యింది

దానికి నేనొకప్పుడు తాతను
ఇప్పుడు మనవన్ని
దానికి నేనొకప్పుడు తండ్రిని
ఇప్పుడు ముద్దుల కొడుకును
మొత్తానికి నా తల్లి
ఇప్పుడు నా చంటి తల్లి

బంగారు తల్లి బెంగ పెట్టుకుంది
ముద్ద ముట్టదు
మెతుకు మింగదు
తన మీద ప్రేమ కరువవుతోందని

బుజ్జగించేదేలా బిడ్డని
తల్లి మనసు నాకున్నా
తల్లి లేని బిడ్డలా నా చిట్టి తల్లి
తల్లడిల్లి పోతోంది

బివివి ప్రసాద్ ll వర్తమానంలోకి ll


రాలిపోయిన రాత్రిలాంటిది గతం
ఇంకా రేకులు విప్పని రాత్రి భవిత
వర్తమానపు కాంతిపుష్పం ఊగుతోంది గాలిరేకులతో


రాత్రులకైనా నల్లని రంగుంటుంది
మృదువిషాద పరిమళముంటుంది, విరామంలోకి వికసిస్తూవుంటుంది
రంగూ, రుచీ, వాసనా లేని గతమూ, భవితా
ఊహల్లో మాత్రమే ఉనికిని పాతుకునుంటాయి
జీవితమంతా వెంటాడినా
వేలికొసకు క్షణకాలపు దూరంలో నిలిచి వెక్కిరిస్తాయి

గతం జీవన శిధిలాలయం, భవిత గాలిలో తేలుతున్న నగరం
కూలిన గోడల్నో, పునాదిలేని భవనాల్నో ప్రేమించేవాళ్లని ప్రేమించనీ
మిత్రుడా, రా
హద్దుల్లేని ఆకాశాన్ని కప్పుకొన్న వర్తమాన భవంతిలో
మనం కాలం మీటుతున్న సంగీతాన్ని విందాము

దాహాగ్ని కోల్పోయి ఎండిపోయిన చెట్లనీ
మట్టిని తవ్వి మొలకెత్తని విత్తనాల్నీ చూస్తూవుండేవాళ్ళని చూడనీ
రా, మనం పోదాము
ఆకుపచ్చని జీవితంలో, అది రాల్చే నీడల్లో తడుద్దాము

గతంలో వెలిగి ఆరిపోయిన దీపాల్నీ
భవిత కోసం ఇవాళ చమురు పోగేసేవాళ్ళనీ పోగుపడనీ
రెండిటినీ దగ్ధంచేసే అగ్నిలా లెక్కలేనితనంలోకి వెలుగుదాము

గతంలోకో, భవితలోకో ఇవాళ్టి సంపద ఒంపుకొంటూ
నిరంతరం పేదలుగా మిగిలేవాళ్లని మిగలనీ

కాంతి పగిలి కిరణాలు వెదజల్లినట్లు
ఆనందం పగిలి జీవితం అన్నివేపులకీ విచ్చుకొంటోంది

రా మనం పోదాము త్వరగా
వర్తమానంలోకి, జీవితంలోకి, పసిదనంలోకి
ఎప్పటికీ మరణించని బహిరంగ రహస్యంలోకి
చిరంతన శాంతిలోకి, చిరునవ్వులోకి, ఏమీ మిగలకపోవటంలోకి..

Sailajaa kanuri


ఆశ్చర్యమే కదా
నిన్న మొన్నటి వరకూ
ఒకే మనశ్శరీరమయిన నువ్వూ నేనూ
ఇవాళ ఈ క్షణాన రెండు శత్రు సేనలం!


నిన్నమొన్నటి వరకూ
కలిపి వుంచిన కారణం
ఇవాళ విడిపోవడానికి కారణం కాకుండా పోయింది.

ఆశ్చర్యమే కదా
విడిపోవడానికి ఎన్ని కారణాలు కావలి?!

ఒకళ్ళ మీద ఒకళ్ళం
ఎన్ని అస్త్రాలు సంధించుకోవాలి?

ఆశ్చర్యంగా వుంటుంది
నువ్వు రాలే ఆకుల్లో హరివిల్లు రంగులు
వెతుక్కుంటున్నప్ప్పుడు!

నాకు రాలే ప్రతి ఆకు
ఒక కుప్ప కూలిన కల.

తిరిగిరాని వసంతాన్ని కల కంటూ
నిస్సహాయత్వంలోకి వాలిపోయే
ఒంటరి.

కట్టా శ్రీనివాస్ || అహల్యా పరితాపం ||


ఏమైందసలు నీకు? ఎటుపోయావిన్నాళ్లూ?
కవిత్వాపు రుచికూడా చూడటంలేదే ఈ మధ్య?
అలసత్వం ఆవరించిందా? ఆదమరిచావా? అజీర్తి గానీ చేసిందా?


నడిచినదారులే నలిగినపనులే ఎదురోస్తుంటే,
క్షీణోపాంతసిద్దాంతం పనిజేసిందా?
ఉరికే జీవితపు పరుగులలో
కునుకే కినుక చూపుతుంటే.
ఊహాతటాకాల తీరాలు ఊరించటం మనేశాయా?

తోచిందల్లా మనసుగదుల్లోకి తోసేస్తుంటే
తడిలేని పదాలెన్నో లోపలికి దిగినా అరుగుదల జరగక అజీర్తి చేసి
మరేకొంచెంకూడా లోనకి వేసుకుందామనిపించటంలేదా?

వాడి వాడి వేడి తగ్గి వాడిన వాడిలేని భావనలతో లోతులేమీ
తవ్వలేక ఊటచలమలే ఇంకిపోయాయా?

ఓ లకుముకిపిట్టా ఎడారిదారులలో లొట్టిపిట్టవై
ఎక్కడెక్కడతిరుగుతున్నావురా ఇన్నిరోజులూ?
కొయిలవే నీవైనా కూతేలేనపుడు చీకటితోసమానం.
చిగురాకులు రుచిచూస్తుంటేనే, చిగురాశలు వెలికొస్తాయి.
చిరాకుగా పరాకు చెందితే జరూరుగా పరాయివౌతావు.
ఊటలుగా వెలికొచ్చే బావనలే నీభాషైనప్పుడు
ఉలిపై శిలకోసం సుత్తిదెబ్బలెందుకు?


http://www.facebook.com/groups/kavisangamam/permalink/464011036984987/
♥ 30-10-2012




కెక్యూబ్ వర్మ ॥సముద్రానికెదురుగా॥


సముద్రానికెదురుగా నేను
నాకెదురుగా తను...


ఒక్కో అలా ఎగసిపడుతూ
తీరం దాటనితనంతో మరలుతూ...

మౌన ఘోష చుట్టూ ఆవరించుకున్న
తరగని ఇసుక తీరం...

లోలోతుల ఇంకని ఆశల నురుగు
అలల అంచుల తాకుతూ...

కదలుతూనే వున్నట్టున్న
జడభరితం...

తుఫానులెన్నొచ్చినా
తన పరిథి దాటనితనం...

ఆకాశన్నంటుతున్నా
అందని జాబిలి...

నాకెదురుగా తను
సముద్రానికెదురుగా నేను...
(31-10-12)