పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

రేణుక అయోల॥హరిత శ్వాస॥

చిన్నవిత్తనం తెల్లమబ్బులా తేలుతూ

అలవోకగా వనంలోకి వచ్చి పడింది

మట్టితడిలో ఊపిరిపీల్చుకుంది

భూమిని ముద్దాడిన గింజ
ఫలాన్ని ప్రసాదించింది
మనిషిని అక్కున చేర్చుకునే చెట్టుకోసం
సర్వం సిద్ధం చేసుకుంది

చెట్టు తన ఊపిరితో
మనిషికి ప్రతిక్షణమూ ఆలంబన అవుతోంది
అడుగులు తడబడిన మనిషి
వృక్షం నీడలో సేదతీరితే
తన ప్రతిబింబాన్ని తానే చూసుకున్నట్లు
తృప్తిపడుతుంది చెట్టు!

***

సమూహంతో సాగిపోతున్నమనిషి
అనేక సందర్భాల సమాహారం.

ప్రతి సందర్బానికి కదలిపోవడం
కదలి కదలి కన్నీరై ప్రవహించడం
కలతల్ని కావేషాలని మోస్తూ
పెనుగులాటలే ఊపిరులై ద్వేషాలతో రగిలే మనిషికి

నీడల చల్లదనంలోంచి
పక్షి గానాల మాధుర్యంలోంచి
ఫలాల తీపిదనంలోంచి
సందేశమేదో అందిస్తూనే ఉంటుంది చెట్టు!

తల్లిఒడి వెచ్చదనపు జ్ఞాపకం లాంటి చెట్టు
కరిగిపోతున్నజీవితానికి రాలుతున్న ఆకుల్ని
ప్రతీకలుగా చూపుతుంది.

ప్రతి పోలికలోను మనిషి ,చెట్టును పోలుతాడు

ప్రాణవంతమైన హరిత శ్వాసతో
ఇక మనిషి చెట్టులా మారడం కోసమే
ఇన్ని రుతువులూ ఎదురు చూస్తూనే ఉన్నాయి.
*7.7.2012

జయశ్రీ నాయుడు॥కాలం ఎటుపోతుందో తెలియదు॥

అలజడికి నేను కొత్త కాదు..
తడబాటుకు పెదవీ దూరం కాదు
ముచ్చట్లలో మెరుపు తీగల్లే
కాలం ఎటుపోతుందో తెలీదు

పేజీలు తిరగేసి
పదాలు అలుకుతూ
ఆనందపు చుక్కలు
ఆలోచనల ముగ్గుల్లో కలుపుతున్నా

నీదవని ఉదయం లేదు
ముచ్చట పడుతూ
సవరించుకునే అంచల్లే...
హృదయం లో నీతోనే ఉదయం మరి..

ప్రతి పోగులోనూ
దాగిన స్వప్నాలు
మెరుస్తూ మురుస్తూ..
అద్దకంలా అద్దంలా
అందంలా..

 *7-07-2012

శ్రీనివాస్ వాసుదేవ్॥ఏ వాక్యమూ మరణించదు॥


నువ్వు మౌనివో, యోగివో
నీ చుట్టూ నిశ్శబ్ద సమాధి కట్టుకుంటావు
మరణానికెలాగూ భాషలేదు, ఇక జీవితమా
కొన్ని గుర్తులసమ్మేళనమే అని చెప్తూనె ఉంటావు....నిశ్శబ్దంగా!

తెల్లవాడివో, రంగద్దుకున్న అతివాదివో
నువ్వంటించిన ఆ కూ క్లక్స్ క్లాన్ శిలువ
మండుతూనె ఉంది, తెల్లగా! ఏంచెప్పలేక సతమతమవుతూ!

మనిషివో, మరమనిషిలా తయారయ్యావో
కణాన్నీ, క్షణాన్నీ విస్ఫోటిస్తే
వచ్చేది మన మనిషే, జీవం తాడు పేనుకుంటూ......
జెన్‌‌లు, సూఫీలందరూ చెప్పివెళ్ళిపోయారు

ఏ యూదుడవో, యోధుడవో
మనసుల్నీ, మతాల్నీ విడదియ్యలేక ఓడిపోతుంటావు
నీకు తెలియందికాదులే మానవత్వం.....

ఇలియట్‌‌ లీజుకు తీసుకున్న ఓమ్ శాంతి ఓం అన్నా
రుడ్యార్డ్ కిప్లింగ్ కిమ్మన్నా,
ఆ భావమేమీ మరణించదు
ఆ వాక్యమేదీ మరణించదు........

రెండు నగ్నాక్షరాల మధ్య పోరాటంలో
ఓ కవిగద్ద తన్నుకుపోయే బాధలో
భావమేదీ మరణించదు....
అదెప్పుడూ జీవిస్తూనే ఉంటుంది
ఈ కవితల్లొ.....

మనిషిగానో, రోబోగానో
ఓ పర్గేషన్ కోసమే, ఓ భావశుధ్ధికోసమో
రాసే వాక్యమేదీ మరణించదు
అవును, ఇక్కడ వాక్యానికి మరణమే లేదు
*7.7.2012

కిరణ్ గాలి॥ట్రాఫిక్ జామ్॥

ఎనిమిది సీట్ల Innova లో ఎంజాయ్ చేస్తూ

 ఒక్కడే వెళ్తున్నాడు ఏక దంతం


క్రీస్తు పూర్వపు Lunaపై కుచేలురిగా
కుర్షీద్, అర్షద్, ఫర్హాజ్

స్కూటీ పై శీలా
స్కూటర్ పై బాలా
బైక్ పై లాలా
మారుతిలో ప్రమీలా
అందరిది ఒకటే గోల
గబా గబా గమ్యం చేరేదేలా?

ఎంత చూసినా సిగ్నల్ మారదు
ఎందుకనో మరి కాలం కదలదు

వడి వడిగా
హడావిడిగా వెళ్తున్నారందరు
ఆఫీసుకి, ఆసుపత్రికి
వ్యాపారానికి, వ్యాహ్యాలికి
గుడి, బడికి

వందలు వందలుగా
సందులు గొందులగ
పందుల మందలుగా

కళ్ళుండి చూడలేని
దృతరాష్త్రులు

కాళ్ళుండి నడవలేని
వికలాంగులు

చెవులుండి వినలేని
చవటలు

మయ సభే మహా నగరమంతా .....

నడి నెత్తిన వంతెనలు
కాళ్ళ కింద సొరంగాలు
అడుగడుగున అలవాటైన
గతుకులె కద అని ఆదమరిచవా
అంతు చూసె గుంతలు

జనాభా నియంత్రణ విభాగం
జమ ఖర్చులు ఇచ్చిందెమొ మరి
రొడ్డురవాణా సంస్థకి
రాకాసి బల్లుల్ళా
తిరుగుతున్నాయి బస్సులు
రక్తం రుచి చూసేందుకు

మునిసిపాలిటీ వాళ్ళు
తరుముతుంటే ప్రాణ భయంతో
పరిగెడుతున్న
పిచ్చి కుక్కల్లా ఆటొలు

రణ రంగమే మన నగరమంతా ....

శిరాస్త్రాణాలు, తోలు శంకాలు
ఇనుప రధాలు, హహా కారాలు
పద్మ వ్యూహాలు, క్షతగాత్రులు

వాహనాలు లేని చోటు
నగరమంతా వెతికినా
దొరకదు

రహదారులన్ని సోపానాలే
కైవల్యానికి
కాకుంటే వైకల్యానికి

నగరం నడిబొడ్డున
ఒక తల్లి పేగు తెగింది
శివార్లలో ఒక పుస్తెల
పూటుక్కున రాలింది

రాత్రేమో ఒక రాఖీ
రక్తంతో తడిసింది
పగాలేమో ఒక పెన్షనీరు
చేతి కర్ర విరిగింది

రోడ్డులన్ని తడిసెను రక్తంతో
లేకుంటే కన్నీళ్ళతో

స్మశానమె నగరమంతా...

ఎటు చుసినా ఎనుబోతులపై
యమపాశాలతో కింకరులు
అద్రుశ్య రూపాలలొ

శవం చుట్టు చెరిన
బందువుల రొదననలా
హారన్ల రొద

సగం కాలిన కళెబరపు
దుర్గంధంలా ఘాటైన
పెట్రొలు వాసన

చితి నిండి ఎగిసె
పొగలా
వాహన కాలుష్యం

ట్రాఫిక్ జాం -

సామాజిక క్రమశిక్షణా రాహిత్యానికి సాక్షమా
నిబద్ధత లేని పాలకుల నిర్లక్షానికి
నిలు వెత్తు నిదర్శనమా లేక
సామూహిక స్వార్ధానికి ఫలితమా

ఎదైతెనేమి ఓ..నగరజీవి
నీ స్థితి
శ్లేష్మం లో ఈగలా
సాలిడులొ దోమలా
కుడితిలొ ఎలుకలా
కడు దుర్భరము..!
* 7.7.2012

శ్రీకాంత్ ఆలూరు॥మౌనం॥


ఒక ఆలోచన నాలో
మౌన సాగరాన్ని
నిత్యం మథిస్తుంటుంది
ఒక మాట నాలో
పదే పదే అణుబాంబై
పేలుతుంటుంది.
ఆలోచనల కణ విచ్చిత్తి
నిరంతరం కొనసాగుతుంటుంది.
కానీ
గొంతులో పేరుకున్న
మౌనపు పూడిక దాటి
బయట పడలేక మాట
పురిట్లోనే ప్రాణం విడుస్తుంది.

అప్పుడప్పుడూ ఒక మాట
అంతరాంతరాలలో అగ్గి రాజేసి
అమాంతం పైకి రావాలని
అదే పనిగా
ఆరాట పడుతుంటుంది.
అదృష్టవశాత్తు ఆ మాట
మౌనపు అగాథాలని
చేదించుకుని బయటపడ్డా
అప్పటికే అది
నిస్సారమై, నిర్జీవమై
శవం పలుకులని
తలపిస్తోంది.

అణువణువునా మౌనం
ఆవహించిన నేను
ఎన్నటికీ బద్దలవ్వని
అగ్నిపర్వతాన్ని..
సహజ గుణాన్ని కోల్పోయిన
లావాని...
మౌనమెంత దుర్మార్గమైనదంటే
మండుతున్న లావాని సైతం
ఉండ చుట్టి తనలో దాచేసుకోగలదు.

నువ్ దూరమయ్యాక
నాలో స్పందనలున్న
ప్రతీ నాడీకణంలోనూ
మౌనం దిగ్గొట్టబడింది.
నా రక్త నాళాల నిండా
చల్లని మౌనం ప్రవహిస్తోంది
గుండె కవాటాలు సైతం
మౌనాన్ని ఆవాహన
చేసుకున్నాయి.

ఇప్పుడు నేను
మూర్తీభవించిన మౌనం
ప్రతిరూపాన్ని...
మౌనమెలా ఉంటుందంటే
నువ్వెళ్ళిపోయాక నాలా...

మౌనం ఒక
తరగని జ్ఞాపకాల
ఊటబావి

మౌనమంటే నిశ్శబ్దమా..
కాదు... కాదు
మౌనం
భయంకర విస్పోటనం.!
*7.7.2012

శ్రీనివాస్ వాసుదేవ్॥నువ్వెళ్ళిపోతావ్...॥


(ఓ మాయమైన ఆలోచనకోసం)

నువ్వెళ్ళిపోతావ్......నా సంగీతాన్ని నాకొదిలి

పాళీ చివర్న అక్షరం మురిగిపోతుందన్నా
గొంతుమధ్యలో ఓ భావమేదో వెక్కిళ్ళలా
ఇరుక్కుందన్నా మాయమైతావు,
ఏ తియాన్మెన్ స్క్వేర్‌లోనో, బోగన్ విలియాల్లోనొ
వెతుక్కోమంటూ!

నిశ్శబ్దంలోపల తవ్వుకుంటున్న సమాధిలోనొ
క్రికెట్ పక్షి చెట్టుకు కొట్టుకుంటూ పిల్చిన పిలుపులోనొ
నువ్వు కన్పడతావనుకున్నా!

అనిద్రలో ఉన్న మందారం
నన్ను కాదని వెళ్ళిపోయిన నిట్టూర్పు
స్వేచ్చని రెక్కల్లో దాచుకున్న పక్షుల కువకువల్లో
నీకోసం వెతుకులాట.....

అసంబద్ధపు నీడల్లోనో , అసమంజసపు గుడ్డల్లోనో
ఇరుక్కుపోయింటుందని నిర్లజ్జగా చూస్తుంటా
నా మాయమైన ఆలోచనకోసం....
నానీడలాంటి ఆలోచనకోసం

ఏచీకటి రాత్రో వొచ్చిపోయిన మిణుగురుపురుగు సిగలో
చీకటితలుపుల్లోంచి తొంగి చూస్తున్న నైట్‌క్వీన్ నవ్వులో
నీ జాడలు వెతుకుతూ...వెతుకుతూ

గడ్డకట్టించే ఆలోచనకోసమొ
ఆకలికి, అసమానతలకి అడ్డంపడే
రక్తం చిందించని శిలువకోసమో!

నా నిరీక్షణ ఇలా
ఈ అస్తవ్యస్త అక్షరాలలో
నా ఆలోచనల వెతుకులాటలో....

*published date ???

కట్టా సుదర్శన్ రెడ్డి- కవిత

 
 
నేనో కవితను రాయాలి



నేనూ కవితను రాయాలి
కవిత రాయాలంటే కలంసాగాలి
కలం కదలాలంటే విషయం వుండాలి
ఏ విషయం మీదని రాయాలి

ఎవరిమీదని రాయాలి
ఎందరిమీదని రాయాలి
విషయాలైతే కోకొల్లలు
రాయడనికేగా ఎల్లలు .
కాని రాసేదెలా ?


కవిసంగమాలుచూస్తే పోలా
అవి కవుల కవితల పోడియా
అవునవును ఇది గుడ్ ఐడియా !


నన్ను నేనే మెచ్చుకోవాలి తప్పదు
అలా చేయకుంటే నామనసొప్పదు .
అందులో ఎందరో కవులు
వృద్దులూ, చిరంజీవులూ
ముందుగా ఎవరికవిత చూడాలి
సీనియర్లవా? జూనియర్లవా ?
కవిత్వంలో సీనియారిటీ కొలచేదెలా
ఇది కవితల పరీక్ష !
కవి"తలల" పరీక్ష !!


అవును పరీక్షల్లో విజేతలెవరు?
మార్కులెక్కువొచ్చేవారే కద
నా సమస్యకు పరిష్కారం దొరికింది
కవులపోస్టుల్లో "లైకు"లను చూస్తే సరి
నిజమె! వారితోనే మొదలెట్టాలి మరి
ఓ కవితను చూసా
ఓసారికి అర్ధంకాలా
మళ్ళీ చదివా
కొంచం తెలిసినట్టేవుంది
మళ్ళీ మళ్ళీ చదివా
పూర్తిగా అర్ధమౌతున్నది
అంతరార్ధపదాలతో
అంతర్గత భావాలతో.
కవిత వుందని ఇన్నిసార్లు చదివా
మరి లేని కవితను ఒక్కసారికి నే రాసేదెలా?
మళ్ళీ నా మేధస్సుకు అందడంలేదు!!
ఉత్సాహం నీరు కారుతున్నది
ఈ సారి తక్కువ "లైకు"ల కవిత చదివా
నమ్మలేకపోతున్నా నన్నునేనే
ఇది ఒక్కసారికే పూర్తిగా అర్ధం అయ్యింది.
ఇందులో భావాలన్ని సూటిగానే ఉన్నా
థ్రిల్లేదో మిస్సయినట్లుగా అనిపిస్తున్నది
మళ్ళీ అనుమానం తొలుస్తున్నది
ప్రమాణమున్నా
నా బుర్రకు అనుమానాలెక్కువే
ఎక్కువచదువులకు లైకులెక్కువ !
ఒక్క చదువుకు తక్కువ లైకులు!!


ఎక్కువసార్లు చదవడం కష్టమే
ఎక్కువ లైకులంటే మరి ఇష్టమే
కష్టమంటే దుఃఖమని
ఇష్టమంటే ఆనంద మని
ఇది తెలిసిందే!! మరి......
నా మట్టిబుర్రకు ఇపుడే తట్టింది!
కష్టముంటే ఇష్టాలుంటయని
దుఃఖాల్లోనే ఆనందాలున్నాయని!!


నా ఈ అనుభూతుల్నే
మీతో పంచుకుంటున్నా!
ఇది కవితంటారో నా మది కలతం
టారో
మీ నిర్ణయానికే వదిలేస్తున్నా !


*published date??

ప్రవీణ కొల్లి - కవిత

అబ్సర్డ్ పైయింటింగ్

మనసు పొరలలో నిక్షిప్తమైన బావాలు
కుంచె కొసలకు వేళాడి వేళాడి
ఏ కలనో జారిపడి
అలుక్కుపోయిన రంగుల కలబోత

వృత్తాల గర్భాల్లో అనంతాలు
వంకరటింకర గీతల్లో భావోద్వేగాలు
మోహమో, వ్యామోహమో
ప్రేమమయమో, ద్వేషపూరితమో
జీవమో, జీవచ్చవమో
ఏమో
ఏవేవో అర్థాలు
అంతులేని అయోమయాలు

హృదయాంతరాలలో ప్రకంపనల అలజడి లేపి లేపి
ఆలోచనల అలలు ఎగిసెగిసిపడి
చిక్కు ముడులలో బిగిసి బిగిసి
పాళీ కొనలకు అటు ఇటు ఊగిసలాడి
స్తబ్దత నిశ్శబ్దము నీడలో
చిత్రించబడిన ఆకారం
ఆ మోములో
ఆనందమో విషాదమో ఎవరికెరుక?
వీక్షించిన ఒక్కోమారు ఒక్కో బావం...

ఆచిత్రంలో
అన్నీ ఆద్యంతాలకు పరుగులు తీస్తున్న గీతలే
నా ఆలోచనల్లా
అన్నీ దిక్కులను వెతుకుతున్న రేఖలే
నా ఆశల్లా
అన్నీ శూన్యంలో అంతమవుతున్న ఆకృతులే
మనిషి మరణంలా

మా గోడకు వేలాడుతున్న అబ్సర్డ్ పైంటింగ్
అచ్చు గుద్దినట్టు నాలా.........


*published on ???

శారద కొట్ర - కవిత

ఇంద్రియాలకందని ...శాంతి....
అగాధం మీద తీరం కోసం ఓడల ప్రయాణాలు...
ప్రచలిత తరంగాలు...సరాగాలు..
ఒడ్డు మీద మీరూ..నేనూ....

తాపత్రయాలు లేవు...
తప్పులు వెంటపడటాలూ లేవు..
తెగని అశాంతి తమస్సులూ లేవు ..
అది మధురోష్ణతా కాదు..
సంతోషమూ కాదు..
ఆనందమూ కాదు..

పీయూష వర్షపు చల్లదనం ..
వుద్వెగాలు రగల్చని వెచదనం ..
యుగాల వెనుక తపో వనాల్లో
ౠషులు జపిస్తున్న గాయత్రీ మంత్రం లా మీరు...

"వాయు: శాంతి , అగ్ని: శాంతి, ఆప: శాంతి
శాంతిర్మె అస్తు శాంతి:
ద్వనిస్తున్న ౠషి మాటలు...
ఇంద్రియాలకందని ...శాంతి....
*7.7.2012
*

ఆర్. ఆర్. కే. మూర్తి - కవిత

" చేదు సుఖం "
-------------------
డియర్ "స్కైలార్క్" !
గాలి తోడవక పోతే
మేఘం కురవదట
ఎంత కదిలితే నేమి
ఓ సారి కురిసింతర్వాత

చూపులు తప్పుకున్నప్పుడే
గుండెలు నీరై పారాయి
డాలు కత్తిలో గుచ్చుకున్నటనిపించి
ధీరత్వం మాట పడిపోయింది

అయినా మనసు కొడిగట్టి
అట్టా చాల కాలం ఉందిగా
గువ్వ ఎగిరిన తర్వాత తెలిసింది
గూడు కూలిన సంగతి
కళ్ళు తెరుచుకోగానే
కలల నిండా కళ్ళాపి

అప్పుడేగదూ 70 ఎం. ఎం.లో
సప్త సముద్రాలూ
ఎగసిపడిందీ,
వరుసగా జ్వాలముఖిలన్నీ
పేలిపొయిందీ

కోప్పడకులే
నీ మనసు నాగ్గాక
ఇంకెవరికి తెలుసు?

ఈ పాడు లోకపు అల్లిబిల్లి తీగల చిక్కులు
నువ్వూ నేనూ విప్పగలమా?
ప్రయత్నిస్తే పోయేదేమీ లేకపోయినా
ఒరిగేదేమీ లేదుగా

నీవన్నీ నీదగ్గరే వున్నాయి
ఒక్క నువ్వు తప్ప
వున్నవి పంచి పారేయడానికి
ఆ అవిటి తీగలు తెగితే గదా?

కాలచక్రాల ఆకులు
కదిలిస్తే కదిలేవి కావుగా !
కలికాలపు గాయాలు
టించరు అయొడిన్ వేస్తే పోవు
పైగా బొబ్బల్లేస్తాయి జ్ఞాపకాల వలల్లా
వాటికి సిoహమూ చిట్టెలుకా అన్నీ ఒక్కటే
ఎవరూ ఎవరినీ కాపాడలేరు

నాకూ తెలుసు
బయటపడితే కలిగే మేలుకంటే
అందులోని చేదు సుఖమే
హాయి గా ఉంటుందని 
*7.7.2012

మోహన్ రుషి - కవిత

మార్ డాలా!

ఏమిచ్చాను నేను నీకు?
నిర్లక్ష్యపు నవ్వులు తప్ప-
శతాబ్దాలు ఏడ్చినా
తరిగిపోని దుఖం తప్ప-

మాటల మంటలు
వ్యధ పెంచే వ్యంగాస్త్రాలు
వేయి పడగల వేదన
అనంతమైన రోదన
శూన్యం మిగిల్చే నిరీక్షణ తప్ప-
ఏమిచ్చాను నేను నీకు?!

కోపాల్, శాపాల్, తాపాల్,
నాతోనూ, నీతోనూ చెయ్యక తప్పని యుద్ధాల్...
విచ్చిన్నమైన కలలు
ప్రచ్చన్నమైన దిగులు తప్ప-
ఏమిచ్చాను నేను నీకు?!

అనాదినుంచీ ఆడదానికి
ముదనష్టపు మగవాడు వేస్తున్న శిలువను తప్ప-
ఇస్తున్న శిలుం పట్టిన జీవితం తప్ప-
ఏమైనా ఇచ్చానా నేను నిజంగా నీకు?!
*3.7.2012

కోడూరి విజయకుమార్ - కవిత

పేదవాడి ప్రేమ పాట

నేల విడిచి గాల్లోకి తెలిపోవడాలు  వుండవు 
ప్రపంచం పంచరంగుల్లో కన్పించడాలు వుండవు 
పేదరికం పురా వీణ తంత్రులు
అప శ్రుతుల ఆకలి ప్రకంపనల్నే తప్ప 
శృతి చేసుకుని ఒక వలపు గీతాన్ని వినిపించలేవు 
ఉదయం లేచింది మొదలు 
జ్ఞానేంద్రియాలన్నీ ఆకలి కేంద్రాలై 
నాలుగు మెతుకుల కోసం గానుగెద్దయ్యేవాడికి 
రాత్రుళ్ళు గాయాల్ని తడుముకుని తల్లడిల్లడమే  తప్ప  
ప్రేమ కలల పల్లకీలో వూరేగి పోవడాలు వుండవు 
పేదరికం కారుమేఘాలు 
ఆకలి వురుముల్నీ, అసహనం మెరుపుల్నీ తప్ప 
దారి తొలగి వలపు వెండి వెన్నెల్ని కురిపించవు 
కరెన్సీకి కరువు లేని కథానాయకుడు 
దేశాల సరిహద్దులు దాటి కథానాయికని చేరడం 
కమనీయ వెండి తెర కథవుతుంది 
చప్పట్లుండవు ...విజిల్లుండవు 
కలవారి ప్రేమకతలకే తప్ప 
నిరుపేదల ఆకలి వెతలకు 
బాక్సాఫీసు దగ్గర కనక వర్శాలుండవు .....
అన్నమ్ముద్దకు తప్ప 
అందమైన చిరునవ్వుకు చలించని వాడినీ 
జీవిత పటంమీద విరక్తి సంతకమైన వాడినీ 
ఏ రాసానుభూతులూ రక్తి కట్టించవు 
తొలిచూపుల పల్లవింపులు వుండవు 
అద్భుత గమకాల చరణాలు వుండవు 
అరుదుగా గుండె అట్టడుగు పొరల్ని 
పెగల్చుకు వొచ్చినా 
పేదవాడి ప్రేమపాటని 
ఎవరూ హర్షించరు ......
 
*5.7.2012

కిరణ్ గాలి - కవిత

Android

నాకు కొంచెం బాధ కావాలి
గుండెల్ని పిండే నెప్పి కావాలి

ఇందులో అశ్చర్య పోవడానికి ఏమి లేదు
అతిశయోక్తి అంతకన్నా లేదు

మరబొమ్మ లాగ మారి పొయాను
నా నించి నేనే దూరంగా వెళ్ళిపోయాను

ఇప్పుడు నిద్ర పట్టని రాత్రులు లేవు
నీడలా వెంటాడె జ్నాపకాలు లేవు
నిప్పులా దహించె ఆశయాలు లేవు
నిఖార్సుగా ప్రేమించగల నన్న నమ్మకము లేదు
అసలు నేనంటే ఇది అనే ఒక అస్తిత్వమే లేదు

నాకు కొంచెమ్ నిజమ్ కావాలి
అబద్దపు సుఖాల జీవితం నించి విముక్తి కావాలి

ఆ/C రూముల్లొకి దూసుకు రాగల ఎండ కావాలి
పేదరికం మాత్రమే పుట్టించగల ఆకలి కావాలి
కల్తీ లేని కన్నీటి చుక్కలు రెండు కావాలి
కాలమ్ చెరెపలేని గాయం ఒకటి కావాలి
వేకువ లేని నిశీది కావాలి
నాకు కొంచెమ్ నేను కావాలి

నాకు కొంచెం నేను కావాలి
ఈ జడం నించి ఎడంగ రావడానికి మార్గం కావాలి

ఇప్పుడు గజల్స్ కి కళ్ళు చెమర్చడం లేదు
విప్లవానికి వళ్ళు గగ్గుర్పొడవడం లేదు
ఒంటరితనం కోసం మనసు ఉవ్విల్లూరటం లేదు
ముఖ్యంగా కవితకు కావలిసిన వెలితి లేదు

వయసుతొ శరిరం శిధిలమవుతుందని తెలుసు
కాని ఆత్మ శుస్కిస్తుందెమో అని భయంగా వుంది
పరిపక్వత పక్కలొ బల్లెంలా గుచ్చటంలేదు
పరినామంలొ ఎక్కడొ ఎదొ వికటించింది

నాకు కొంచెం మరణం కావాలి
నన్నెవరన్నా ఖననం చెయ్యండి

మల్లి నేను నాలో పరకాయ ప్రవేశం చెయ్యాలి
పొగుట్టుకున్నదెదొ వెతికి పట్టుకొవాలి
అప్యయంగా దాన్ని ఎదకు హత్తుకొవాలి

---------------

సుఖం ఇప్పుడు అనందం ఇవ్వటంలేదు
ధుఖం బాధను కలిగించడం లేదు
తనివి తీరా యేడ్చి ఎల్లు అవుతుంది
కళ్ళ కింద సంద్రం ఎడారయినట్టుంది
* 6.7.2012

కట్టా శ్రీనివాస్ - కవిత

 మీరైన చెప్పండి

అమ్మ నాన్న లెవురో ఎరికలేని దాన్ని
కడుపార ఓ పూటబువ్వ నెరగని దాన్ని
చింపిరి జుట్టుతో మురికి బట్టలతో
చెత్తలో తిరుగుతూ చిత్తు ఏరేదాన్ని

కవిగాడి మాటలకు కోపమోచ్చిందండి
యివరంగ సెపుతాను ఇనుకోండి కూసింత.

కడుపులో ఆకలి, కండ్లలో నీళ్ళతో
కాళ్ళలో వణుకుతో మనసులో ఆశతో
మండేటి ఎండలో కుండీలు ఎతికితికి
పంది గతికిన పాసియిస్తరైనా లేక
కడుపు సేతట్టుకొని గొడెంటనీల్గితే
కారున్న ఇంటిలో, జోడున్న(?) అయ్యేరు
సెయ్యెట్టి పిలిసిండు బువ్వెడత రమ్మండు.

ఎదేదో సెప్పిండు సేస్తె బువ్వెట్టిండు
టీవి సూపెట్టిండు, పక్క సూపెట్టిండు
తప్పేదో ఒప్పేదో నాకెట్ట తెలుసుద్ది
తిండి దొరికిందీడ బతుకు పరిసిందీడ
నా బతుకు నేనిట్ట బతుకుతావుంటే
కవిగాడు వచ్చిండు కన్నీరు కార్చిండు
నాకేదో అయినట్టు బెంగగా సూసిండు
ఆ సూపు నాలోన చితిమంట రేపింది
అడుగడుగు ప్రశ్నలతో నన్ను నిలదీస్తోంది
మీరైన చెప్పండి తెలివున్న సదువొరులు
నేనేమి సెయ్యాల ఏ రీతి బతకాల
తప్పున్నదెక్కడా ? ఒప్పు సేసేదెలా?
నిప్పులా కాలేటి బతుకు దారులలో
చెప్పండి వెన్నెలెలా నింపాలి సారులూ...?

(భన్వారీ దేవి, తారా చౌదరీ, రేవ్ పార్టీల కర్మాగారపు పని తనానికి ఆశ్చర్యపోతూ
దేవ్ బెన్ గల్ ‘‘ స్ల్పిట్ వైడ్ ఓపెన్ ’’ స్పూర్తితో )
*7.7.2012

వర్ణలేఖ - కవిత

మనసు ముందుకొస్తావే
పైర గాలికి ఊగే
ముంగురుల్లా
మాటి మాటికి
మనసు ముందుకొస్తావే
ఎంత దాచినా దాగవు

గాలికి ఊగి ఊగి
ఊరుకుంటావంకున్నా
నీవొచ్చిపోయిన
గురుతులూ
వదిలిపోయావే
చిందర వందర
చిక్కులు మనసుకి....

ఎన్ని ముడులని విప్పను
అందులో చిక్కుకున్న
నీ జ్ఞాపకలెక్కడ
జారిపోతాయోనని
జాగ్రత్తపడడం
నావంతయింది..
*6.7.2012.

వర్ణలేఖ - కవిత

అడుగుతావేం
అందివ్వలేనని తెలిసీ
అడుగుతావేం

నా పిలుపుతో
పరవశిస్తావు

నా మౌనంతో
రోధిస్తావు

నా నవ్వుతో
పులకరిస్తావు

నా నిస్సహాయతతో
నీరసిస్తావు

దరిచేరలేనని తెలిసీ
దగ్గరకొస్తావేం 
*7.7.2012

జాన్ హైడ్ కనుమూరి॥ఫేసుబుక్కు గుంపు॥


మానవ మేధస్సు మధనం
ఫేసుబుక్కు గుంపుల ప్రవాహం

కాలేజీల్లో నచ్చినవాళ్ళు
గుంపులు గుంపులుగా మాట్లాడుకున్నట్టే

కొందరు వస్తూవుంటారు
మరికొందరు ఇమడక వెళ్ళిపోతుంటారు

ప్రవాహాల అర్థం
ఏ తీరంలో దొరుకుతుంది! ప్రశ్నే!

భావోద్వేగాల మధ్య
ఎవరికివారు అక్షరాలను ఆరబెడుతుంటారు

ఎవరికున్న బంధనాలు వారివే
కొద్దిసేపు విప్పికోడానికి ఇక్కడికొస్తారు

----

కొన్ని కామెంట్లు చదివాక
నా ప్రతిస్పందన ఈ రూపుదాల్చింది
*6.7.2012
 

పులిపాటి గురుస్వామి - కవిత

మాయ''మ్''

ఈ రోజు
నను రాకుండా
గది గోడలు
ముడుచుకు పోతే బాగుండు

బలవంతంగానైనా సరే
దభాల్న తలుపులు
నను బయటకు నేట్టేస్తే సరి

తప్పని సరిగా చేవుల్లోకిపారే
ప్రపంచ శబ్దాలకి
భస్మమైన అవయవాలకి
తడిపి,నమ్మకం నాటుకోవాలి

అయస్కాంతపు కాసుల్ని
నిర్వీర్యం చేసి
నిమజ్జనం చేసుకోవాలి

ఆకలి మీద
కంటి చినుకు చల్లి
నిద్ర పుచ్చాలి

ఈ రోజు
ప్రపంచం కనిపించకుండా
పిచ్చుక గూట్లో దాచుకుంటే బాగుండు

.....
*6.7.2012

కె.కె -కవిత

డబ్బుచేసింది

అప్పుడెప్పుడో నువ్వు బాగా బతికినప్పుడు
నీ జబ్బల్లో సత్తువున్నప్పుడు
నీ మనసు నిబ్బరం తో ఉన్నప్పుడు
నీ ఒళ్ళో కూచొని వాడు ఎంగిలి పడేటోడు
నీ భుజాలమీద సవారి చేసేటోడు

అప్పుడెప్పుడో నువ్వు సైకిల్ తొక్కేటప్పుడు
నీ గుండెలో ఆశలున్నప్పుడు
నీ రక్తానికి వేగమున్నప్పుడు
నీ ఎనక గూర్చొని బడికెళ్ళేటోడు
నీ చెమట కొన్న గుడ్డ తొడిగేటోడు

అప్పుడెప్పుడో నువ్వు అప్పుల్జేసినప్పుడు
నీ మీసం మెరిసినప్పుడు
నీ కంటిచూపు తగ్గినప్పుడు
నీ టాటా తో ఇమానం ఎక్కినోడు
నీ ఆశతో దొరలసెంత జేరినోడు

ఇప్పుడు.. నువ్వు బోర్లా పడ్డప్పుడు
నీ ఇంటిది కాటికి సేరినప్పుడు
నీ కంటనీరు ఇంకినప్పుడు
నీ పిలుపుకి అందకుండా.. దూరం లో వాడు
నీ గుండెబరువు తలకెక్కనంత భోగం లో వాడే

ఏం జేస్తాం లే అయ్యా!!!
ఆడికి డబ్బుజేసింది
ఈ రోగమొస్తే మతిమరుపు పెరుగుద్ది
గోరుముద్ద,గుర్రమాట మర్సిపోయే
ఆడికన్నమెట్టి నువ్వు జేసిన పస్తులు మర్సిపోయే
నువ్వు చేసిన అప్పులు మర్సిపోయే
నువ్వు పంచిచ్చిన రక్తమే మరిసిపోయే

ఇప్పుడు ఇంటిదానికి తలకొరివి నువ్వే బెట్టాలా
ఈలుంటే నీ సితికి నువ్వే కర్రలు సమకూర్సుకోవాల
ఆడికి డబ్బుజేసింది మరి..!
*2.7.2012

మెర్సీ మార్గరెట్ -కవిత

 మూగ నిట్టూర్పు
నేనిక్కడే నీ కోసం ఎదురు చూస్తూ
హరివిల్లులోని రంగు రంగుల పరదా వెనక
అప్పుడెప్పుడో
ఉదయపు రాగం పాడుతుంటే విని
నీకోసం బయల్దేరి వచ్చా
సంధ్యారాగం పాడే ఆ గొంతులో
నీ రాకకు సూచనలే కనబడవే ?

గుమ్మంలో నీ రాకకై ఎదురుచూస్తూ
నిలబడి
కాళ్ళు నా మీద విసుగు ప్రదర్శిస్తున్నా
నీళ్ళు నింపుకొని వాపుల బరువు భరిస్తున్నా
సర్ది చెప్తూ
ఆత్రుత అడుగంటకుండా .. నిరీక్షణ పొంగారకుండా
కళ్ళకి నీ ప్రేమ తేనెల రుచి చూపిస్తూ
బుజ్జగిస్తున్నా

ఒక్కసారి వచ్చి పోరాదు
విడి విడిగా కౌగిలింతల కలివిడికై
వడి వడిగా అంచులవరకు పరవసంతో
నను నింపేందుకు
చినుకుల మువ్వల అలికిడి
చెవుల చేరేదాక ..
మళ్ళీ వర్షించే వరకు..

మూగ నిట్టూర్పులు పాడే
గుండె సడి నిన్ను చేరేదెలా ??
*6.7.2012

రియాజ్ - కవిత

ఓటమి

ఉండగలవా ఓటమేలేకుండా?
ప్రశ్నలే రాని చింతలే లేని మరో ప్రపంచం ఉందా??
ఓటమి.. తిరుగుబాటు... అనంతరం వచ్చేదే అసలు సిసలు విజయం !!!

అద్దం వెక్కిరిస్తుందా?
ఏం..నువ్వు ఎదురు వెక్కిరించలేవా?
నీపై నువ్వే తిరుగుబాటు చేయలేవా?
అయ్యో పాపం..

ఓటమీ గెలుపూ ..తాత్కాలికమే!!
కానీ ఏది కావాలో నిర్ణయించుకో?
***
కళ్ళుతెరచి పోరాడితే అపజయం కాస్తా జంకుతుంది
కాస్త వెనుకడుగు వేస్తుంది
కళ్ళు మూసుకుంటే ఓటమి నిన్ను నిర్దాక్షిణ్యంగా వరిస్తుంది
****
కళ్ళు మూసుకొని ఓటమిభరించేవు
కళ్ళు తెరిచి పోరాడలేక?

ఓటమి నిన్ను అద్దంలో స్పష్టంగా చూపుతుంది

పోరాటమో ఆరాటమో
గెలుపో మరేమిటో
ఓటమికి అది తెచ్చే ప్రశ్నలకు
శక్తిమేర సమాధానం ఇవ్వు
అదే నువ్వు !అంతే నీ సామర్ధ్యం !!

ఓటమే సమాధానం అయితే?
ప్రశ్నించడం మానుకో?
వెనుకంజకు నిర్ణయం తీసుకో? పో! వెనక్కు తిరిగి పారిపో!!

***
గెలుపు కావాలా?
నిజాయితీగా ప్రశ్నించుకో? తక్షణమే నిర్ణయించుకో!
నిర్ద్వంద్వంగా నిర్దాక్షిణ్యంగా ప్రతిఘటించు పోరాడు!!
తిరుగుబాటుకు సిధ్ధంగా ఉండు ఆఖరుకు నీపై కూడా..
సమాధానం దొరక్కుండా పోదు విజయం రాకుండా పోదు !!
***
ముందు తిరుగుబాటు పుట్టి తర్వాత విజయం పుట్టిందని తెలుసుకో! 
*6.7.2012

జాన్ హైడ్ కనుమూరి - కవిత

 అసలు జీవితం
నన్ను ప్రేమిస్తున్నావన్న
బిగి కౌగిలి
కరిగిపోయినవీ ఘనీభవించినవీ
కవిత్వీకరించలేనివీ
దోసిలిలోనో జ్ఞాపకాల్లోనో మిగిలిపోయాయి

ఇప్పుడు నేను
నిన్ను ప్రేమించాలని ఆత్రం

ఒకరికొకరం అని తెలిసినా
రెండుగా విడిపోయిన నీ నా ఆలోచనలు

సమాంతర పట్టాలై
రైలుబండి నడుస్తున్నట్టు జీవితం

ఏ స్టేషనులోనైనా అగుతుంది
కొన్ని ష్టేషన్లలో ఆగకపోవచ్చు

డ్రైవరు నువ్వు గార్డును నేను
చివరిష్టేషను ఇద్దరికీ తెలియనిదే!

ఇప్పుడే మొదలయ్యింది
అసలు జీవితం

-----
జ్వరంగా వుంది
ఏవో పల్వరింతల్లా అక్షరాలు దొర్లాయి
*5.7.2012

వంశీధర్ రెడ్ది ॥ఆవాహన॥


నేనో నియాండెర్తల్ కీటకాన్ని,
నియో హ్యూమనైజ్డ్ కవాటం
తెరుచుక్కూర్చున్న క్రోటన్ మొక్కని,
మనసుల్లో ఖాలీల్ని ఎడారి ఇసుకతో నింపుకుని,
ఆశల కోర్కెల విత్తనాలేసి, రోజూ
కన్నీటితో తడమలేక తడుపుతూ,
వర్షించే మేఘం కనపడితే, కొల్లగొట్టడానికెదురు
చూసే మెక్సికన్ రెడిండియన్ని,
మధ్య ఆఫ్రికా అమానవీయ ఆదివాసీ ని,

కడుపు దాహాన్ని సంద్రంతో ముంచుకుని,
అడుగునేలని మిగల్చకుండా పంచుకుని,
దప్పిక తీరక చమురునీ,
నేల చాలక చంద్రుణ్ణీ చూసే,
పులిచారల్ని హోమోసెపియన్ గా కప్పుకున్న,
సామ్రాజ్య వాద స్వార్ధాన్ని,
సామ్యవాద బలహీనతని,

మనుషుల్ని చంపే నందిగ్రాంలను,
దేవుడ్ని దింపే సాలిగ్రామాలను,
బెస్ట్ బేకరీలో మాడిన రొట్టె ముక్కల్ని,
గోద్రా రైల్లో వాడిన చర్మపు తుక్కుల్ని,
ఒకేలా చూడగల దిష్టి బొమ్మని,

గాంధారంలో తథాగతుణ్ణి
గతంగా మార్చిన "విధ్యార్ధిని",
స్వస్తిగ్గుర్తుల్తో తథాస్తంటూ
క్యాంపులు రాల్చిన విగత వేషాన్ని,
పవిత్ర యుధ్దం చేసిన శాంతిని,
కోనేట్లో రక్తం కడుక్కుంటున్న అశాంతిని,
స్మశాన శైథిల్యంలో కైవల్యించిన విస్మృతిని,
విషాద నైర్మల్యానికి కైమోడుస్తున్న వికృతిని,

అర్ధానికే తప్ప పరమార్ధానికి విలువివ్వని
కార్పోరేట్ కల్చర్డ్ కాగితాన్ని,
స్వార్ధానికే తప్ప, స్వాభిమానానికి వలువివ్వని
డెస్పరేట్ కలర్డ్ ఇంగితాన్ని,
బలానికే తప్ప బంధానికి బానిసవ్వని
స్మార్ట్ టెంపర్డ్ సంగీతాన్ని,
కులానికే తప్ప కాలానికి బాసటవ్వని
సిగ్గు లేని నిజాన్ని,

అందుకే
రానీ ప్రళయం, కానీ జగం లయం,
పొనీ సకలం, తేనీ మరో శకం,
అప్పుడైనా,
నేను "మనిషి"గా ఉంటానేమో,
నేనూ "మనిషి"నే అంటానేమో....
*6.7.2012

పి.రామకృష్ణ - కవిత

ఎంతెంత దూరం


దారంతా నీ పాదాలు
గుచ్చుకున్న
గాయాల గుర్తులు.

బహుశా
ఈ తోటంతా
పరిమళం కోసం
వెతుకుంటావు.

వేలి చివర-
ఆశల తూనీగల్ని
పట్టుకోవాలనే
ప్రయత్నించి వుంటావు.

ఇదికాదు..ఇదికాదు అనుకుంటూ..
నీది కాని కన్నీటి జడిని-
అటో, ఇటో
చల్లుకుంటూ వెళ్ళి వుంటావు.

దారంతా
నీ గుబుల్ని దాచుకున్న
గులాబి జ్ఞాపకాలు.



( ఒక మిత్రురాలి టైంలైన్ లోని పిక్చర్ చూసిన ప్రతిస్పందనతో )
*4.7.2012

పులిపాటి గురుస్వామి - కవిత

ఆత్మభంగం

అలా గాలికి పోతున్న నన్ను
హత్తుకున్నాక,

ముఖాలు మాట్లాడే భాష
మనతో చర్చకు దిగి
మళ్లీ కలిసిన పిదప

సౌందర్యానికి
ఒక వ్యాకరణం మొదలుపెట్టాక

తుఫానుకు సర్దిచేప్పుకోలేని
సందర్భాలు మొలకెత్తావ్

ఎవరితూకానికి
ఎవరూదిగక

ఎవరివీపులు వారికి
అపనమ్మకాన్ని మోసుకొచ్చాక

ఎవరిపతాకాల్లో వారికి
వెలిసిపోయిన రంగుల్లా
రెపరెపలాడాక

ఏం?జరిగినట్టు

.....
*5.7.2012

జిలుకర శ్రీనివాస్ - కవిత

వాక్యం విరిగి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టే

రాయాలని కూర్చున్న ప్రతిసారి వాక్యం విరిగిపొతుంది
నీ మాటల వేటుకు తెగిపడిన శత్రు స్వరంలా

కోపంతో నీకు చెప్పాపెట్టకుండా
ఇంట్లోంచి పారిపోయిన పిలగానిలా ఎటో వెళ్ళిపోవాలని బయల్దేర్తాను
తీరా చూస్తానా! నీ ముందే తచ్చాడుతూ పిల్లిలా కాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటాను

వీధులు తిరుగుతూ భుజాల చివర ఒడుపుగా తప్పుకపోయే రంగుల చిలుకల్ని చూసి
లోకం ఇంత వికారంగా మారిందేమిటా అనుకుంటానా
ఒంటరి గదిలో గోడకు వెళ్ళాడే నీ నవ్వుల చిత్ర లేఖనం చూసి
ఈ ప్రపంచం ఇంత సుందరంగా నీ వల్లే వర్ధిల్లుతుందని బోధపర్చుకుంటాను

వాక్యం విరిగి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టే
ఎన్నోసార్లు ముక్కలు ముక్కలుగా నిన్ను విరుచుకొని లెక్కలేనన్ని అర్థాలుగా తెరుచుకున్నావు
ఒక్కోరోజు అర్థం కాని శూన్య శబ్దానివి నువ్వు!
*6.7.2012

శ్రీనాధ్ రాజు - కవిత

అందం - ఆనందం

ఓ గడ్డిపూవా,
ఆనందం - అటూ ఇటూ ఎగిరే సీతాకోకచిలుక కాదు.
నీ గుండెల్లోనే దాక్కున్న ఆ కొంచెం మకరందం !

ఆందం తన రంగురంగుల రెక్కల్లోనే లేదు.
నీ చిన్ని చిన్ని రెక్కల్లో లాలిత్యం అందం !

మే'మందమ'నే అందమానందాలను అందలమెక్కించకు...
నీ మదిలోకే తొంగిచూడు.... నిదానంగా నిశ్శబ్దంగా !

ఆక్కడే ఉన్నాయవి ..
నీవెక్కడో వెతుక్కుంటున్నావని తెలిసి
తమలో తామే నవ్వుకుంటూ .....
గంధంగా మకరందంగా,అందంగా ఆనందంగా
  అనంతంగా !!
*6.7.2012

జ్యోతిర్మయి మల్ల - కవిత

పుత్రోత్సాహం


" చూడవే మనబాబు ఎంతముద్దొస్తున్నాడో ! "
పట్టలేనంత ఆనందం
పసికందుని చూసినపుడు

"వీడెంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూసావూ?"
అత్తా తాతా తొలిపలుకులే
వేదాల్లా వినపడినపుడు
"అరె, నా దిష్టే తగిలేలా ఉందే !
తోటిపిల్లలతో పోలిస్తే వీడే అందంగా ఉన్నాడు కదూ! "
తన ఉత్సాహాన్ని
భార్యతో పంచుకుంటున్నపుడు

"మావాడికి బ్రహ్మాండమైన ర్యాంకు వచ్చింది"
తొణికిసలాడే గర్వంతో
ఆఫీసులో స్వీట్లు పంచిపెడుతూ
"ఎంత టీవి, ఏమి దర్జా. మగవాడంటే ఇతడే కదా"
పట్టలేని సంతోషం
అతన్ని ఉద్యోగస్తుడిగా చూస్తూ

"మనవాడు పెళ్ళికొడుకుగా ఎంత బాగున్నాడో కదూ !
ఇంత ముచ్చటగా మునుపెవర్నైనా చూసామా?"
"నా కన్నతండ్రి అప్పుడే ఇద్దరు పిల్లలకు తండ్రయాడా ?
ఎంత హుందాతనం తండ్రిహోదాలో!"
"మనవాడు కాబట్టి ఇంత గొప్పగా కట్టించగలిగాడు
ఇంత అందమైన ఇల్లు దరిదాపుల్లో ఉందా?"

ఇలా...
ఒకటేమిటి? అడుగడుగునా సంభ్రమమే
నాకు వాడి ప్రతి కదలికా సంబరమే
మొన్నటివరకూ..
ఇప్పుడిక మురిసిపోవడానికి ఇక్కడేమీ లేదు
కలిసి నెమరేసుకోడానికి ఆమె కూడా లేదు
నాచుట్టూ నాలాంటి నాన్నలే
వాళ్ళకొడుకులూ మావాడిలాగానే

అమెరికాలోనో..ఆస్ట్రేలియాలోనో.. !
*5.7.2012

లక్ష్మణ్ స్వామి - కవిత

దైవకణ౦ --- దెయ్యపు కణం!

దైవకణం దొరికిందట !!
కాదు ... కాదు దాని నీడ దొరికిందట !
అరశాతాబ్ధపు నిరీక్షణ !
వందలాది శాస్త్ర వేత్తలు.
వేలకోట్ల ధనాన్ని ఖర్చు చేసి....

గీతను మర్చిపోయారేమో....
‘అణువును - పరమాణువును నేనే’ నని....
ఏనాడో ..చెప్పాకా,
కొత్తగా విప్పారు ఈ రహస్యాన్ని !

ఒక్క కణజాడకి ఇన్నేళ్ళు పడితే ...
దాన్ని కన్నోన్ని కనిపెట్టేందుకు....
‘భౌతిక’ వాదులకు లక్షేళ్ళు సరిపోతాయా.....
వృధా ప్రయాస....

కోట్లాది మందిని
హింసించి
భాధించి
చిత్రవధ చేసే ....
అతి భయానక
రాక్షస కణం ....
వేధి౦చే రాచ వ్రణం
దెయ్యపు కణం! క్యాన్సర్ !!

క్యాన్సర్ని తరిమే ...
ఒక్క మాత్రను
కనుక్కోండి చాలు...
కోట్లాది మంది
మీకు జన్మాంతం ఋణపడి ఉంటారు...

హెచ్ ఐ వి... తలసేమియా
మస్కులర్ డిస్ట్రోఫీ...లుకేమియా. ..
ఒక్కటా, రెండా ...
లెక్కలేనన్ని మందేలేని
మహమ్మారులు....
శిథిలమవుతున్న
దుర్భరమవుతున్న జీవితాలు !!
అక్షరాలకందని ఆక్రందన వారిది ...
ఒక్కసారి
ఒకే ఒక్క సారి చూడ౦డటు ...

మీ అశృ కణాల్లోనుడి
ఖచ్చితంగా విచ్చుకు౦టుది ...
జగతిని కాపాడే అమృత కణం ...
ఆయుష్ కణం ....
( సృష్టి రహస్యాలపై పెట్టె శ్రద్ధ శాస్త్ర వేత్తలు మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న భయంఖర రోగాలపై పెట్టట్లేదనే అక్కసుతో, ఆవేదనతో.)
*3.7.2012

మేర్సీ మార్గరెట్ - కవిత


ఎంతటి ఇంద్రజాలం నేర్చావో ?
నీ మాటల కుంపటిని రగిలించి
మనసు చలి కాచుకుంటూ
ఊహల జలపాతంలో తడిసి
నీ అడుగుల తడికి అంటుకుపోయే
మంటినవుతూ...

బొట్టు బొట్టుగా కారే భావాన్ని
దోసిళ్ళలో ఒడిసిపట్టి
ఈ కాగితంపై పోస్తూ
అక్షరాలన్నీ జతకూడి నీలా
రూపుదాల్చుతుంటే చూస్తూ ...

టప టప మని రెక్కల శబ్దం
నిట్టూరుస్తుంటే వింటూ
ఒంటరితనం ఎగిరే ప్రయత్నం చేస్తుంటే
నా వెన్నంటే నిల్చుని సన్నగా నువ్వు
విసిరే నవ్వులు చూస్తూ...

ఎంతటి ఇంద్రజాలం నేర్చావో ?

భాషేరాని నా మనసుతో మాట్లాడిస్తూ
నన్ను కమ్ముకొని ,కౌగిలించుకున్న
తొలి అక్షరం నువ్వైతే చూస్తున్నా!
*4.7.2012

మోహన్ రుషి - కవిత

ఆశ లేదు!

గాలి వీస్తే తప్ప
నిప్పు రాజుకోదు
మంట అంటుకోదు!

ఉప్పెన వస్తే గానీ
సముద్రం శిగమూగదు
ఊరు కొట్టుకుపోదు!

ఉష్ణోగ్రత మైనసుల్లోకి మారితేనే
మంచు గడ్డ కట్టేది
దవడ గడగడా వొణికేది!

రోకళ్ళు పగిలే రోహిణి కార్తెలోనే కదా
వడగాడ్పులూ
పిట్టలు రాలిపోవడాలు!

అంతు చిక్కని సృష్టి రహస్యాలు సైతం
అంతో ఇంతో అవగతమవుతాయి

కానీ,
నేనెప్పుడు పాటల ఊటనవుతానో
మరెప్పుడు మాటల చెర్నాకోలనవుతానో
తెలీని ఆమెకు-
డైలమా డైనమైట్లతో సహవాసం...
బ్రతుకంతా దినదిన గండం!
*3.7.2012

జితేందర్ బత్తుల - కవిత

ఒక చిన్న చినుకు అయిన పడద అని...
ఓ రైతన్న తోలకరి చినుకు కోసం
ఎదురు చూస్తున్నవు నీవు
ఒక చిన్న చినుకు అయిన పడద అని
నీ మనస్సు ఆరాటపడుతుంది

ఏదో ఆలోచన మొదలయింది నీలో
ఈసారి అయిన పంట చేతికి వస్తుందా
ఉన్న అప్పులను తీర్చగలన
అన్న సందేహం వస్తుంది
పుట్టెడు కడుపు కోసం గింజేడు మేతుకులతో
సేద తీరు తున్నావు నీవు

నీ ఆకలి మంటలు ఎవరికి తెలియడం లేద
మూగ బొతున్న నీ గొంతుకు
నీరు అందించే వాళ్ళే లేరా రైతన్న
అన్నదాతగ నిన్ను పూజిస్తరే
నిన్ను చూసే వారు కరువయ్యారే

భూమిని నమ్ముకున్న రైతన్న
ఆ లక్ష్మి దేవి నీ పై సిరులు కురిపిచడం లేదాయే
మట్తిని దైవంగా భావించే నువ్వు
అ మండు తేండల్లొ పొలం దున్ని
దుక్కి పట్తి భూమిని సాగు
చేస్తున్నవు కదా రైతన్న

పండించే పంట చేతికి అందే లొపే
వడ గాలులతో పంట నాశనం అవుతున్నదే
ప్రక్రుతి నిన్ను కన్నీరుకు దగ్గరగ చేస్తున్నదే
పంట కొసమని అప్పులు చేసిన నీకు
అప్పులు గుడి బండలు అవుతున్నాయే

ఏమని చెప్పను రైతన్న ప్రకృతిలో
సేద తీరలన్న నీకు అన్ని
కష్టాలే ఎదురు అవుతున్నయి కదా
తిండి తినక నిద్ర హరలు మారి
ఒక్కొ సారి గంజి నీళ్ళతో
కడుపు నింపు కుంటావు రైతన్న

పొలంలో పంట పండిస్తే
సరి అయిన ధర రావటం లేదాయే
ఎంతని బాధ పడను
కుటుంబం అంత కష్ట పడుతున్న
సమస్యలు తీరడం లేదాయే

నీ మొఖంలో అనందాన్ని
చూసేది ఎప్పుడు నీ కష్త్తాలు
తీరేది ఎప్పుడు రైతన్న
ఇది న ఒక్కడి ఆవేదన కాదు 
రైతు కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరి ఆవేదన
*3.7.2012

నరేష్ కుమార్ - కవిత

పారిపొతా
ఏడుపొకటే
మిగిలిందిప్పుడు.....
కాస్త నా కల్లగంతల నెవరైనా విప్పేద్దురూ....
పారిపోఏందుకు దారివెతుక్కొవాలి
ఔను....!
నాపుత్రులే నన్ను
కసాయోడికి అమ్మేస్తున్నారు
మిగిలిన ఒక్క కాలితో నైనా పారిపొతా .....

నన్ను
మీరెవరూ
కాపాడ లేరు.....
సిగ్గులేని..
చేవ చచ్చిన
దరిద్రుల్లార
చావండిక
దినదినమూ....
న్యాయం చచ్చి
పోతోంది అంటూ
మీ అరుపులాపండి...
ఏం....!
మీరూ భాగస్వాములు
కాదా....!?
పాస్పోర్ట్ ఆఫీస్లోనొ,
రిజిస్తార్ కార్యాలయంలోనో.. మీరు
నా గుండెలని
కోసిన
వారెకదా.....! ఇప్పుడెందుకా
అరుపులు సచిన్ 100ని చూసి
ఆనందపడండి
మొగలిరేకులూ.., ముద్దుబిడ్డల్ని
తనివితీర
చుస్కోండి.....
మధ్య
విరామ ప్రకటనల్లొ
కత్రినా సొంపుల్ని
చూసి
ఉద్రెకపడండి....
అప్పుడప్పుడూ
ఖాలీ దొరికితే
న్యాయం
మరనిస్తోందంటూ
అరవండి....

కానీ.....
ఒక్క సారి
నా గంతలు
విప్పండి నేను పారిపోవాలి.
*20.6.2012

నరేష్ కుమార్ - కవిత

ఒక నిష్క్రమణం

నీ సాంగత్యం లో సాధించిన
స్వప్నాలన్నీ
ఇంకా సజీవంగా కదులుతూనే ఉన్నాయి
శ్వాస కూడా నీ ధ్యాస లో
ఇంకా పచ్చిగానే వుంది
నీ నిష్క్రమణ క్రమణాన్ని వీక్షించిన క్షణమే
ధుఖ్ఖ ధుర్ఘంధ ధూప ధూమం లో
మనసు ధగ్ధమైనా...
ముగ్ధ భావాలేవొ
ధుగ్ధ సంధిగ్ధంలొ
రుద్ధంగా రోదిస్థూనె ఉన్నాయ...ి
నాకిప్పుడు
ఒంటరి మేఘమై
అచల మేఖలల మధ్య విహరించాలనుంధి
ప్రజ్వరిల్లె జ్వాలల్ని
ప్రపంచం లొకి ప్రసరించకుండా
పాతాల ప్రవాళం లొ
పాతెయ్యలనుంది
నిశ్శబ్ధ శబ్ధ సంగీతమయి
ధిగంతాల నడుమ శబ్ధించాలనుంది..
ప్రణయమే ప్రళయమై కరాల కాళ కంకాలమై
హృదయ కుడ్యాల్ని చిద్రం చేసినపుడు
ప్రాణాన్ని వీడి
మరణంలొకి
పయనమవ్వాలనుంది...
*22.6.2012

పులిపాటి గురుస్వామి - కవిత

గుజ్జలాం ......(గులాబ్ జాం)

దాడీ...
ఒక*టోరి చెప్పనా!...(స్టోరి)

వొక రాజుంటడంట
మూడమ్మాయిలు
పెద్దబ్బాయి
వాళ్ళ కాకి ఫ్రెండు
అయితే....ఆకలేస్తది
ఎపో.!.నువ్వు నవ్వుతున్నవ్ ...చెప్ప

ఎప్పుడు ఇంట్ల *చుక్కోవు (*కూర్చోవు )
వుండొచ్చు గా...
పీజ్ దాడీ
*లీల్లల్ల ఆడను (*నీళ్ళల్లో)
*ఓంకం మంచిగ చేస్త (హోంవర్క్)

ఇన్ని *బుస్కులల్ల (బుక్స్)
ఏమున్నది దాడీ
ఏబీసీడీ లేనా ?

కోoప మొచ్చిందా ?
సారీ...
ఊకె కోమ్పమెందుకు
మమ్మీ *ఈనకు..... (ఈయనకు)

మూతట్ల పెట్టినవ్?
ఏమైంది *పాచీ ! (పరిచయ)
అల్ల(ర్) చేయకు
*నరకాలా!.. (నకరాలా)

తొండకు
ఆళ్ళ మమ్మీ దాడీ లేరా ?
ఎప్పుడొక్కటే చెట్టు మింద ...

*బకడీ ఆడుకుందామా దాడీ (కబడ్డీ)
పోనీ *దొక్కిచ్చుకునే ఆట (దొరికిచ్చుకునే)
*దాతురూమ్ల (బాత్ రూంల)
*దెద్ రూంల దాచు కోవద్దు (బెడ్ రూంల )

ఈ బుక్కేసుకో
కమ్మగుంది కదా !
మమ్మి నాకిష్టం
నువ్వు కూడా ఇష్టం దాడీ ...

ఎప్పుడు బస్సులనే
(స్)కూల్ కు పోవాలా?
*ఎంపపాల్ ల పంపొచ్చుగా....! (ఏరోప్లేన్)

రేపు నా *బత్తుడే (బర్త్ డే )
*జిక్కుటు తేక పోయావో (గిఫ్ట్)
ఒళ్ళు *చింత పత్తైత(ద్) (చింత పండు)

నీకో *చాకెటి స్తా (చాక్లెట్)
పండ(గ్) చేస్కో
ఓ పోయెం రాస్కో ....

.....
మిత్రులారా!ఇది మా నాలుగు సంవత్సరాల "ఆనంద స్వామి",
ఉండాల్సిన చోట ఒత్తులు జార్చుకొని ,అవసరం లేని చోట అలంకరించుకొని ,కిమ్మనక ఒదిగిపోయిన బాల్యం భాష.....పదాలు,వాక్యాలు వాడివే .....
నేను కూర్పరిని మాత్రమే,
వాడి పుట్టిన రోజుకై....ఈ రోజు 
*4.7.2012

మెర్సీ మార్గరెట్ - కవిత

నీ తోడులేక పోయినా...!
ఒక్కరోజే పూసి వాడిపోయిన పూవుల్లా
నావైన ఎన్నో నీ కలలు
వాడి రాలిపోతుంటే
నీ తోడులేక పోయినా
నా కన్నీటి దారపోస్తూ బ్రతికిస్తున్నా

ముందుకేయాల్సిన అడుగులు వెనక్కి
వెళ్తూ ..
పిచ్చి - 'నాకా ?? నా పాదలకా "?? అని ప్రశ్నించే
లోకాన్ని చూస్తే
నా మీద కాదు కాని
నన్నొదిలిపోయి నిన్ను గుర్తు చేసుకునే జనాల మీదే
నా జాలి అంతా

గుక్కపట్టి ఏడ్చిన చిన్నతనం ఇప్పుడు కాదు
కాని నా గొంతులో బాధ బ్రతకలేక చావలేక
ఉక్కిరిబిక్కిరవుతూ
నా గొంతుని నులిమేస్తుంటే
లోకానికి నా కన్నీళ్లు అసహయతగా
కనిపించకుండా ఆపేయాలని ప్రయత్నిస్తుంటే

నువ్వేమో ఇంకో కొమ్మకి అంటుకట్టుకొని
ఆనందంగా ఊహలు ,కలలను పండించుకునే
ప్రయత్నం చేస్తున్నావ్
నామీద కన్నా నీ మీదే జనం చూపులన్నీ
జాగ్రత్తా నిన్ను కాయడానికి నేను లేను

పచ్చిగా ఉన్న నీ వేళ్ళు
బలం పుంజుకునే వరకైనా కొంచెం స్థిమితంగా ఉండమని
నేను చేసే విజ్ఞ్యప్తి (ఇప్పుడు నాకు ఏమి కాని ప్రియా )
మళ్ళీ నీకేమైనా అయితే నా ప్రాణం నీ వెనకాలే
వచ్చేస్తానని నన్ను బెదిరిస్తుంది
ఒక్కరోజే పూసి వాడిపోయిన పూవుల్లా
నావైన ఎన్నో నీ కలలు
వాడి రాలిపోతుంటే
నీ తోడులేక పోయినా
నా కన్నీటి దారపోస్తూ బ్రతికిస్తున్నా

ముందుకేయాల్సిన అడుగులు వెనక్కి
వెళ్తూ ..
పిచ్చి - 'నాకా ?? నా పాదలకా "?? అని ప్రశ్నించే
లోకాన్ని చూస్తే
నా మీద కాదు కాని
నన్నొదిలిపోయి నిన్ను గుర్తు చేసుకునే జనాల మీదే
నా జాలి అంతా

గుక్కపట్టి ఏడ్చిన చిన్నతనం ఇప్పుడు కాదు
కాని నా గొంతులో బాధ బ్రతకలేక చావలేక
ఉక్కిరిబిక్కిరవుతూ
నా గొంతుని నులిమేస్తుంటే
లోకానికి నా కన్నీళ్లు అసహయతగా
కనిపించకుండా ఆపేయాలని ప్రయత్నిస్తుంటే

నువ్వేమో ఇంకో కొమ్మకి అంటుకట్టుకొని
ఆనందంగా ఊహలు ,కలలను పండించుకునే
ప్రయత్నం చేస్తున్నావ్
నామీద కన్నా నీ మీదే జనం చూపులన్నీ
జాగ్రత్తా నిన్ను కాయడానికి నేను లేను

పచ్చిగా ఉన్న నీ వేళ్ళు
బలం పుంజుకునే వరకైనా కొంచెం స్థిమితంగా ఉండమని
నేను చేసే విజ్ఞ్యప్తి (ఇప్పుడు నాకు ఏమి కాని ప్రియా )
మళ్ళీ నీకేమైనా అయితే నా ప్రాణం నీ వెనకాలే
వచ్చేస్తానని నన్ను బెదిరిస్తుంది 
*3.7.2012

రియాజ్ - కవిత

వాగుడుకాయ్..

మెరిసే యవ్వనపు కాంతితో
తొణికిసలాడే ఉత్సాహంతో
గంతులేస్తూ వెక్కిరిస్తూ చిందరవందరగ
ఉత్సాహంగా ప్రవహించేది
విసుగుకే విసుగుపుట్టి పారిపొయేలా వాగుతుండేది ఆ వాగుడుకాయ్!!

ఊహించని పరిణామం-----
ఎందుకో అంతులేనిమౌనం దాల్చింది
గడగడవాగుతూ నిండిపోయినవాగులా
పరుగెత్తుతుండేది యేమయ్యింది దీనికి??

తీవ్ర నైరాస్యం ఆవహించినట్లు స్తబ్ధుగా
నెర్రులుబారిన చెరువులా
ఇంకిపొయిన కలలు చచ్చిన కన్నీటి గుంటలా
ప్రవాహంలేని మౌన సరస్సులా నిశ్చేష్టగా వుండిపోయింది యేమైంది దీనికి?

నిశ్శబ్ద నైరాశ్య వైరాగ్యరాగంలో..
బహుశా.. ఎవరో గాయపరిచారు?
*4.7.2012

జాన్ హైడ్ కనుమూరి - కవిత

నీతో మాట్లాడానివుంది

పెదవుల కదలికల్లో
ధ్వనించే అంతరంగంతో సంభాషించాలి

సాంకేతిక పనిముట్లు శబ్దాన్నే అంతరీకరిస్తాయి
వ్యవహాళికెల్లిన చేతిస్పర్శ వాటికేం తెలుసు పాపం!

వంటరిరాత్రి మోసుకొచ్చే ధ్వనిచిత్రాలు
భయపెడుతూనో ముద్దాడుతూనో
సమూహాంతర ప్రవాహంలోకి నెట్టేస్తున్నాయి

నలుదిక్కులనుండి విసిరే వలలు

ఎదురెదురాగా వుంటూనే మనం
ముక్కలు ముక్కలుగా విసిరేయబడుతున్నాం

సంభాషణకోసం సమయాన్ని వెదుక్కునేలోగా
ముచ్చటపడ్డ రింగుటోను పాట
ఏదో మూలకు లాక్కెళుతుంది

ఎవ్వరూలేని తరగతి గది ఓమూల బెంచీలో
మనదైన ప్రపంచానికి ఎల్లలుగీస్తూ
ఎన్ని మాటలు ఎన్ని సంభాషణలు

రావిచెట్టుక్రింద ఎంకిపాటలతో
వర్డుస్వత్తు కీట్సుతో కలిపి
రాల్తున్న ఆకుల్ని ఏరుతూ
మారకంలేని చిరునవ్వుతో సంభాషణ కావాలన్పిస్తుందిప్పుడు

అక్షరీకరించలేని ఎన్నో సంభాషణలు
మెమరీనుంచి డిలీట్ అవుతూనేవున్నాయి

కాలానికి ఎదురీదడం కొత్తేమీ కాదు
కాలంలో కలిసిపోవడం పాతా కాదు

మాట్లాడలనే ఆశ
కోర్కై గూడుకట్టడానికి ప్రయాణిస్తుంది

*1.7.2012

వంశీధర్ రెడ్డి- కవిత

* అమ్మ పోయింది *

శుక్రవారం,
సూర్యుడింకా రాకముందే,
అమ్మ, నిద్రలోనే, నిద్రించి..

అన్నీ నాతో చెప్పే అమ్మ,
ఇదెందుకు చెప్పలేదో,
ఎప్పుడొస్తావని నేనడుగుతాననేమో,

ఊరిచివర నిశ్శబ్దీకరించబడ్డ ఇల్లు,
కాకులు చేరిన మర్రిచెట్టులా
చుట్టాల్తో, హితుల్తో,
వాళ్ళేడుస్తూ నన్నేడిపించ ప్రయత్నిస్తూ,
అమ్మ చెప్పేది,,
"నేను పోతే ఏడవొద్దురా,
మనింట్లొనే పుడతాగా అని,
బాధకి కొలమానం కన్నీరు కాదని,
ఓదార్పుకి స్థిరరూపం బంధుమిత్రులు కాలేరని",

అందరూ తింటూ తాగుతూ,
ఇక్కడొకరు నిర్యాణించారని మరిచి,

సూర్యాస్తమయానికి సమీపించిన్నా నీడ,
నా తమ్ముడు,
"అనా, ఏమన్న తిన్నవా, తెస్తా ఉండు"
కళ్ళు కొలనులై,
అమ్మ లేదని తెలిసాక
నన్ను, నా ఆకలిని తాకిన తొలి మాటకి
ఆనందానికీ కొలత కన్నీరు కాదేమో,

" అన్నా,
ఎంతకాలమిలా తన గురించాలోచిస్తూ,
పెళ్ళి చేస్కోకుండా,
అమ్మ కూడా లేదిపుడు"
గొంతులో జీర ఆగలేదు,
"అన్నా,
వింటున్నావా, కర్మ జరిపించా,
పదకొండో రోజొస్తా,
లీవ్ దొరకలేదే, నువ్ జాగర్త"
తడి కళ్ళలో నిజాయితీ దాగలేదు,

కాకులెగిరిపోయాయ్ చీకటికి,
ప్రాకృతిక మౌనం తోడైంది,
ఈ పాటికి అమ్ముంటే,

ఏడవడం తెలీకుండా పెంచి,
తెలీకుండా నవ్వడమొకటే పంచి,
అమ్మ పోయింది,
నువ్వున్నా బావుండేదేమో,
ఎక్కడున్నావో,
ఎలా ఉన్నావో...
*4.7.2012

జగద్ధాత్రి-కవిత

పుట్టుక ...

హృదయం లో భావ విస్ఫోటనం
జరిగి అక్షరాల లావా
తనకు తనే పొంగి పోరిలే దాకా
ఆగాలి తప్ప .... వేగిర పడకూడదు
ఎరువులూ మందులూ
ధాతు పుష్టీ వీర్య పుష్టీ
కలిగించగలవేమో గానీ
కవిత బీజాన్ని ఫలదీకరించలేవు

భావ సాంద్రత ఉండీ కూడా
పలకలేని భావనలెన్నో
ఇవి కనిపించని గాయాల్లా
ఎదను సలుపుతూనే ఉంటాయ్
కౌకు దెబ్బల్లా
మదిని మెలి పెడుతూనే ఉంటాయ్
మగటిమి ఉండీ ఫలించని
వీర్యంలా సిగ్గిల జేస్తాయి
అయినా అక్షరాలుగా
మాత్రం మారకుండా
మొరాయిస్తాయ్
అప్పుడు కావాలి
కవికి చాలా సహనం
ఎద బురద నీటి బుగ్గ వద్ద
కూర్చుని ....ఎదురుచుసీ ...చూసీ
గజిబిజి గందర గోళం
సద్దు మణిగాకా...
ఆ సమయం ఆసన్నమైనప్పుడు
నిర్మలంగా స్ఫటికం లా
మెరుస్తూ వచ్చే
అందమైన మత్స్య కన్యల్లాంటి
భావ చిత్రాలని
అతి సున్నితంగా
ఒడిసి పట్టి .... తనదైన శైలి దారం తో
మాల కట్టి నప్పుడు ...

అబ్బా!!! అప్పుడు జరుగుతుంది
ఒక సృష్టి ....కార్యం
కొత్తగా ఓ కవిత బిడ్డ
కవి బొడ్డు తాడు తెంచుకుని
కేర్ మంటుంది .....
ఏమాత్రం ఆవేశపడి
తొందర పడ్డామా
బిడ్డ అడ్డం తిరిగుతుంది
పెద్దాపరేషన్ కి కూడా
లొంగని పుట్టుక ఒక్క కవిత దే...!
అందుకే అంత సహజ సుందరంగా
అమూల్యంగా రూపు దాల్చి
అందరి మన్ననలు పొందుతుంది
కన్న కవి కడుపు పంటగా మిగులుతుంది .....!!!
*2.7.2012

ప్రవీణ కొల్లి- కవిత

నాలోని నా గుహ

నాకు నేనుగా
నా ఒడిలో నేను పాపగా
నా బడిలో నేను విద్యార్ధిగా
నాలో నేనుగా ఒదిగిపోయే నా స్థానం
అంతర్మధన సముద్రాన్నిఅంతరంగంలో ఇముడ్చుకున్న నా స్థలం
నాలోని నా గుహ…..నా అంతర్గుహ…

అటు ఇటు వీలుచూసుకుని
హటాత్తుగా తనలోకి లాగేసుకుంటుంది
ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు
సంఘర్షణల కొలిమిలో కాలిపోతునట్టు
గతమంతా ఓ ప్రశ్నగా నిలదీస్తున్నట్టు
సమాధానాల వెతుకులాటకు పొమ్మని
నిర్ధాక్ష్యణ్యంగా తనలో నుంచి నన్ను నెట్టివేస్తుంది

విజయాల చప్పట్ల మోత ఆగాక
ఆనందపు పరిసరాలు ఖాలీ అయ్యాక
తన కౌగిట్లో బంధించి
నుదుటన ముద్దిచ్చి
నా కష్టం తీరుస్తుంది

కన్నీటి పరామర్శలు అయ్యాక
సాధింపు ఎత్తిపొడుపులు వెళ్ళాక
తనలో నన్ను దాచుకుని
నా వెన్ను చరిచి
అనుభవాలసారంతో నా గొంతు తడుపుతుంది

ఆ గుహ ద్వారానికి
ఎన్నోసార్లు ఉరేసుకుని వేలాడాను
ఆ గుహ గర్భంలో
ఎన్నోసార్లు ప్రాణం పోసుకున్నాను
ఆ గుహ గోడలలో ప్రతిధ్వనించే శబ్దమే నాకు వేదం

అదే నాలోని నా గుహ…..నా అంతర్గుహ…
అంతర్మధన సముద్రాన్నిఅంతరంగంలో ఇముడ్చుకున్న నా గుహ…
* 3.7.2012

జగద్ధాత్రి-కవిత

కదలనివ్వని నిశ్చింత 
ఎప్పుడో ఎన్నేళ్ళకో
ఎక్కడో అంతరాంత రాళం లో
ఘనీభవించిన ఓ మంచినీటి ముత్యం
సుడిగుండంలో పొర్లుతున్న
అతలాకుతలమైన హృది నదిని
నిశ్చలమైన ఓ దోసిలి పట్టి
కదలనివ్వని నిశ్చింత 

ఎప్పుడో జార విడుచుకున్న
తియ్యని అవకాశం
కమ్మని మేఘాలలా
మళ్ళీ కమ్ముకుని
మదినావరించి ..
మైమరపించిన అనుభూతి
అతని ఒక్క మాట కోసం
వేయి జన్మలు ఎదురు చూడాలన్న
ఆవేశపు ఆకాంక్ష
ఒక్క నిమిషం మాత్రమే నీకోసం
అన్నా.....మరొక్క క్షణమైతే బాగుండుననే
దురాశ.

ఎప్పుడో ఏనాడో
చవి చూసిన తరి తీపి దనం
రుచి మరవని మధుర స్మృతి
అతని మాట .....
అతని మందలింపూ
ఇంపుగానే స్వీకరించే
చిన్ని మనసు ..

అతనికి తెలిస్తే ఎంత బాగుండునో
అని ఆశ పడే అత్యాశ ...
*3.7.2012

కరణం లుగేంద్ర పిళ్ళై॥నాకు ఇంకేమి కావాలి॥

పిల్లగాలి తెమ్మరగా
ఇలా వచ్చి అలా వెళ్ళావు...

ప్రియతమా చూడు
నీవు తెచ్చిన స్నేహ సుగంధం
ఇంకా పరిమళిస్తూనే ఉంది
సంతోషం రెక్కలు మొలిచి
ఊహల్లో విహరిస్తూ ఉంటే
నాకు దూరమై
నింగిని తాకిన కలల చుక్కలను
నేలకు రాల్చి తగులబెట్టావు..

అయినా నీ ధ్యాస
నాలో పెరుగుతూనే ఉంది
ఉఛ్వాస నిచ్వాసలే నీవైనప్పుడు
నాకు ఇంకేం కావాలి
నీవు తోడు రాకపోయినా
నీవు మిగిల్చిన
తడి ఆరని జ్ఞాపకాల ఊతం చాలు
ఈ జీవితం మోడుబారకుండా గడిపేందుకు
నీవు వెదజెల్లిన
వెన్నెల వెలుగుల జిగేలు చాలు
ఈ చీకటి పయనంలో చింతలేకుండా ఉండేందుకు
*3.7.2012

కుమార్ వర్మ-కవిత

ఒక్కోసారి...
---

ఆకు కూడా అలికిడి లేనితనంతో
అల్లాడుతూ...

నీటి పాయ అలా గడ్డకట్టినతనంతో
ఉరకలేక పోతూ...

గాలి అలా స్తంభించిన వేదనతో
ఉగ్గబట్టుతూ...

వెన్నెలంతా మబ్బుపట్టినతనంతో
చీకటిని రాలుస్తూ...

ఇంత ఉక్కపోతను భరిస్తూ దేహం
ఆత్మను దహిస్తూ సేదదీరుతోంది..
*4.7.2012

స్వాతి శ్రీపాద- కవిత

ఎలా?

ఇక్కడ ఇప్పుడు
ఓ తడిసిన ఉప్పు బస్తాలా
కనిపించకుండా కరిగిపోతూ
చెమ్మగిలిన కళ్ళతో పడిఉన్నట్టున్నానా?
మీ కేం తెలుసు
లోలోపలి మాగాణీ లో
ఎన్ని పూల వనాలను సాగుచేస్తున్నానో
ఎన్ని రంగుల పరిమళాలను కలగలిపి
అనుభూతుల ఆవిష్కరణకు
అగరొత్తుల పొగలా రూపాలు మార్చుకుంటున్నానో
పెదవుల మధ్యన పుట్టే కొత్త నక్షత్రాల గుత్తులకు
వెలుగు వెల్లువ నవుతున్నానో......
స్థంభించిన చీకటి ముద్దలా
నిస్తేజపు చూపులను గుమ్మరిస్తున్న నా కళ్ళ ప్రపంచాల్లో మీరేం చూడగలరు?

సుదూర తీరాలనించి మోసుకు వస్తున్న
కలల బిందెలోంచి తొణికిన అమృతపు చుక్కలను
నాలుక కొనతో అందుకోవాలన్న తపన
బ్రతుకు బ్రతుకంతా తడిపేస్తున్న తొలకరి జల్లుల
తొలి గుసగుసల చిరు మువ్వల రాగాన్ని
మళ్ళీ మళ్ళీ నినదించే వెలుగుల సడి
అణువు అణువునా అలదుకున్న
ఊహల సొగసులు
మీకేం తెలుసు 

తెర మీది భాగోతలకే వివరణలు కుదరవు మీకు
నా స్పష్టాస్పష్టపు రూపదృశ్యానికి వెనక
ఏ కొత్త ప్రపంచం ఉద్భవిస్తోందో
నాకే తెలియదు .... మీ మరుగుజ్జు ఊహకెలా అందుతుంది.
*3.7.2012