పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఆగస్టు 2012, మంగళవారం

జయశ్రీ నాయుడు || మహరాజా బహుపరాకు ||


ఉదయం నుండి నడక మొదలు
పాదం అడుగు వేయనిదే మొదలెక్కడ
అయినా పాదాన్ని తలకెత్తుకోలేను కదా

తల కు తెగువెక్కువ
తనదే ఆలోచనన అనేమో
కూర్చుని ఆలోచిస్తే కుంపటిరాజేసేదెవరోయ్

చేతులొచ్చి మధ్యలో హాస్యం వడ్డించాయి
వాటికీ చేతలెక్కువ కదా..

ఈ వినోదమంతా చూస్తూ
రాణీలా నవ్వే హృదయం
ప్రక్కనే కాపలాదారు మనసు
కర్రపెత్తనమంతా దానిదే

కనిపించకుండా చూస్తూ
కదలకుండా అదిలిస్తూ
మెదిలే క్షణాన్ని సృష్టిస్తూ
జ్ఞాపకాలుగా అచ్చేస్తూ
మరపుగా తెగ్గొడుతూ
ఆత్మతో అతికిస్తూ

ఓ మనసు మహారాజా
వేల వేల బహుపరాకులు!

*13-08-2012

జిలుకర శ్రీనివాస్ // వొలవొలా ఒక చేప పిల్ల కన్నీరు కార్చింది //


కమ్ముకొస్తుంది చీకటి కళ్ళ మీదికైతే ఎలాగోఒకలా తుడుచుకుకే వాణ్ణి ఎదలో పొడుసిన సన్నని నెలపొడుపును నల్లగా మింగేస్తుంది చూడు! నీ కళ్ళ కాంతులనే నమ్ముకున్న వాణ్ణి ఆ వెలుగు కింద నాలుగు రాళ్ళు కొట్టుకంటున్న వాణ్ణి

ఆ మిట్ట మధ్యాహ్నం వేళ పక్కనే వాన వరద పారుతున్న కాల్వ ఒడ్డున కూర్చొని వొలవొలా ఒక చేప పిల్ల కన్నీరు కార్చింది వొంటికి బురదంతా పూసుకొని మురుగులోకి దూకి ప్రాణం వొదిలేసింది వేటగాడి గాలానికి కూడా చిక్కలేదది ఏ ఖాకీ గుడ్డకూ దాని ఆచూకి దొరక లేదు అస్సాం గుట్టల మీద గుజరాతు మళ్ళా మొలకెత్తిందని నువ్వే చెప్పావా దానికి?

నీతో కలిసి హలీం తినాలని ఉంది గాలీబ్ కురిపించిన ప్రేమ కవితల చాంద్ తారను నీ పోనీటేల్ కురుల మీద తురుమాలని ఉంది ప్రియున్ని కొల్పోయిన అస్సాం అందగత్తె కన్నీళ్ళను నీ చేతులు తుడుస్తుంటే నీ పక్కనే నిల్చోని ఏడ్వాలని ఉంది! నీతో కలిసి రక్తపాతం లేని సమాజాన్ని ప్రసవించాలని ఉంది

అనంత కరుణామయిలా అద్భుత ప్రపంచంలా తేజోరిల్లే నా ప్రేమ కావ్యమా! చదివిన పుస్తకాలర్థం అవుతున్నాయి నువ్వు తప్ప చూడని లోకాలూ ఎరుక పడుతున్నాయి నువ్వు తప్ప! నా గుడిసె నిండా చీకటి కప్పుకుంది నీ వలపు దివ్వె ఆర్పేశావు కదా! చెట్ల పొదల మొదళ్ళలో దాక్కొని నీ అడుగుల చప్పుడు విని సంగీతం రాసుకుందామని.
*13-08-2012

జాన్ హైడ్ కనుమూరి ||ఆసుపత్రి ఒక వ్యాపారం||

నాకున్న భీమా ఆసుపత్రి

తనదగ్గర ఆధునిక సౌకర్యాలు లేవంటూ

కార్పొరేట్ ఆసుపత్రికి తరలించడంకోసం

సూచనా(రిఫరల్) కాగితం తయారు చేస్తుంది

దానివెనుకున్న నాకు తెలియని రహస్య ఒప్పందం

బయట అంబులెన్సుగా సిద్దంగా వుంటుంది

అందులోకి అడుగెట్టగానే

ట్రాఫిక్ ఆంక్షలను దాటుకుంటూ

గేటుముందు ఆగగానే

ఆఘమేఘాలమీద స్ట్రెశ్చర్ సిద్దమౌతుంది

లేఖలు సమర్పించి రోగలక్షణాలపై ప్రశ్నల వర్షం కురుస్తుంది

నా దేహానికి అర్థం కాని స్థితిలోచెప్పే సమాధానలమధ్య

ఒక అడ్మిషన్ పైలు తెరవబడుతుంది దానికో నంబరుతో సహా

తరువాత జరిగే లావాదేవీలన్ని ఆనంబరుతోనేశరీరాన్ని పరీక్షించేందుకు అప్పటివరకు తొడుక్కున్న వస్త్రాలన్నీ విప్పబడతాయి

ఆసుపత్రి ట్రేడ్ మార్కుఅంగీ తొడగబడుతుంది

అప్పుడప్పుడే జీవితాన్ని ప్రారంభిస్తూ అనుభవంకోసం చేరిన యవ్వనపిల్లలు నర్సులై సేవచేస్తుంటారు

నా పిల్లలవయసున్న వీళ్ళతో సేవచేయించుకుంటున్నందుకు

వాళ్ళను సిస్టర్ అని ఎలాపిలవాలోననే సందిగ్దంతో

అంతరాత్మ క్షోభిస్తూవుంటుంది

కాని ఏం చేయగలం ఆ సేవలకూ బిల్లుంటుందిపరీక్షల పర్వం

రక్తపరీక్షలకోసం ప్రతివుదయం నిద్రలేపి

సూదినొప్పి తెలియకుండానే రక్తం తీయబడుతుంది

ఎక్స్‌రేలు, ఇసిజీ, స్కానింగు, సిటిస్కానింగు, గుండెకు టుడి ఎకో ఇలా ఎవోవో గదులమధ్య నడవలేమన్నట్లు స్ట్రెశ్చర్‌పైనో, వీల్‌చైర్‌లోనో తిప్పుతుంటారు

వాటికి చార్జిచేయబడుతుందని చివరివరకూ తెలియదురక్తపోటును అనుక్షణం చూపేందుకు

శ్వాసను నియంత్రించేందుకు

నియమితసమయమంతో నరాలలోనికి మందునుపంపే పరికరాలు అమర్చబడతాయిడాక్టర్లు

ఎవరి విభాగం వారిదే

ఎవరి కన్సెల్టెన్సీ వారిదే

ఏవేవో చూచనలు చార్టు/కేస్ షీట్‌లో

రాయబడతాయి

అమలుచెయ్యడం నర్సులవంతు

భరించేది మాత్రం ఒకే శరీరంఎమర్జెన్సీ వార్దు బోర్డుతో

అయినవాళ్ళనెవరినీ అన్నివేళల అనుమతించరుఆరోగ్యశ్రీలు, కార్మికభీమాలు, మరేదైనా భీమాలు

కావలసినంత పిండుకోవడంకోసం

ప్యాకేజీ రోజుల నియమాలు వర్తిస్తాయిఒకవేళ లేచి తిరుగుతున్న దేహమైనా

ప్యాకేజీ పూర్తయ్యేవరకు అనుమతే దొరకదు

బయటికి పోవడానికి

అంతా సెక్యూరిటీ పహారామత్తుకమ్మిన దేహానికి

ఎప్పుడో చదివిన ఆసుపత్రి గీతం

లీలగా మెదులుతుందిమళ్ళీ ఎవరైనా కార్పొరేట్ ఆసుపత్రి గీతాన్ని ఆలపించాలేమో!!

*13-08-2012

బూర్ట వెంకటేశ్వర్లు || నువ్వూ-నేనూ-ప్రేమా ||

నువ్వు మొదటిసారిగా నా కళ్ళలో కదలాడావు
లేత రావిఆకు గుర్తొచ్చింది
దిరిసెన పూవు చెంపను తాకినట్టనిపించింది

నేల యెదమీద వరిపొలం ఒయ్యారంగా ఊగినట్టుగా
సన్న జాజితీగ అల్లుకున్నట్టుగా
గడ్డిపూవుమీద సీతాకోక వాలినట్టుగా
నల్లమబ్బులనుండి వెన్నెల వాగు దూకినట్టుగా
నువ్వు మొదటిసారి నా మనసులో రూపు కట్టావు
నువ్వు మొదటిసారిగా నా హృదయాన్ని
ఎగిరే పక్షిని చేశావు

నా పూరిపాక
బంగారు కాంతితో మెరిసిపోతోంది
పిల్లబాట
జలతారు నదిలా సాగిపోతోంది
ఊరపిచ్చుక
వరిగొలకను కంఠాభరణం చేసుకుంటోంది
రాజహంసొకటి
నా హృదయంతో కలిసి ఎగురుతోంది
నువ్వు మొదటిసారి నన్నొక ప్రేమికుణ్ణి చేశావ్.

*13-08-2012

డా.పులిపాటి గురుస్వామి || నీకు తోచని నీ ప్రపంచం ||


నను చూడగానే
నీకు కొన్ని ప్రశ్నలు పుడతాయి

నాతో మాటలు కలిపే సమయానికి
అవి నిన్ను అడుగుకు తొక్కి
పైన తేలతాయి

నా ప్రమేయ మేమీ లేని
నా గురించిన ప్రశ్నలు
ఊపిరాడకుండా చేసి నీ చేతనే
సమాధానాలు ఊహింప చేస్తాయి

ఇప్పుడు ప్రశ్నలు నీవే
సమాధానాలు నీవే
అన్నీ మల్టిపుల్ ఆన్సర్స్
నీకు తోచిన రచనలే

చివరికి ''అన్నీ కరెక్టే ''అనే
వెకిలి హాసాన్ని కలుపుతావు

ఉండేదొకటి
నిన్ను నీలో ఉండనివ్వనిదొకటి*13-08-2012

అనిల్ డాని // యదార్ధ నాటకం //యాభై ఏళ్ల కిందటి ఒక భయానక దృశ్యం
వళ్ళు గగుర్పొడిచే జీవితపు యదార్థ నాటక
సన్నివేశం సరి దిద్దలేని శాపం అదే నా జీవితం

జీవితం తెలియని రోజులు
అమ్మ చేతి ముద్దలు
చింతగింజ ఆటలు,గుజ్జనగుళ్ళు
అమాయకపు చూపులు
పన్నెండేళ్ళ వయసు
పాలుగారే బుగ్గలు
బడి కి వెళుతూ పాఠాలను .
వల్లెవేయడమే తెలుసు అదే
నా బాల్యపు తీపి గురుతు

ఓ రోజు ఆ రోజు అమావాస్య ! ఏమో నాకూ తెలీదు
ప్రకృతి కూడా పసిగట్టలేదు, నాకు పట్టబోయే ఖర్మ
రోజుకూసే కోడి కూయలేదు, పూచే మందారం కొమ్మ
పూయలేదు అప్పుడే శంకించాను ఆనాటి అనర్ధం
మా ఇంటికి వచ్చిందో అనర్ధం ముసలాడి రూపం లో

పిల్ల బెషుగ్గావుంది,నీ అప్పులన్నీ ఎగిరిపోతాయి
నాన్న కళ్ళలో ఆశ,ఆశపడ్డ అందలం ఎదురైనట్టు
ముహూర్తాలతో పనిలేదు పిల్లనీదే
పొద్దున్నే కూసే కోడి కూర ఐయింది
నా పాలబుగ్గపై చిటికపడింది ఆశ గా

ఆశల తరాజులో నా జీవితం లెక్క తెలిపోయిందో రోజు
ముస్తాబు చేసి టౌను గౌను వేసి , పౌడేరూ కాటుకా పెట్టి
పట్టీలు పెట్టి ఎత్తుమడాల చెప్పులేసి ఘల్లు ఘల్లున
సాగింది నా పయనం నా కు తెలియకుండానే నరకానికి
పెద్ద ఇంటి పెత్తనానికి బయలు దేరింది నేను అనేపిచ్చి పిల్ల

బాగా ఎరిగిన మొహమే మా ఇంట్లో కోడి కూర తిన్న తాతే గా
ఏమి కాదు నాన్న సర్దుబాటు , అమ్మ మొహం లో తత్తర పాటు
ఎప్పుడు వెళ్తాం ఇంటికి అమ్మకి నా ప్రశ్న?ఇది నీ ఇల్లే నాన్న జవాబు
అర్ధం కాలేదు చిన్న పిల్లగా హ హ హ హ హ అని నవ్వులు బోసి తాత వి

ఒంటరిని సాయంకాలానికి పెద్ద మేడ లో దీపపు కాంతి లో
చెమటే వుంది నాతొ పాటు నా వంటికి అతుక్కుని
భయం చేతులు కాళ్ళు వణికించింది చలికాలం కాకపోయినా
పెద్ద మంచం ఎక్కలేకపోయా తనే ఎక్కించాడు
నిద్ర లో పెద్ద మెలకువ ఏదో జరుగుతుంది
పెద్ద గొడ్డలితో చిన్న పండును నరికిన అనుభవం
ఇంక ఎప్పటికి నిద్ర పట్టలేదు రాత్రి ఒక నరకం ఎప్పటికి

పట్టు చీర వంటి కి బరువైంది తను ఉన్నంత కాలం
తాళాల గుత్తి నా నడుముని వంచేసింది తనులేని కాలం
చూపుల అర్ధాలను జీవిత నిఘంటువులో వెతుక్కుంటూ
ముప్పైల నిండు యవ్వనం లో తెల్లటి చీర వైధవ్యాన్ని వెక్కిరిస్తూ అద్దం
వోడలేక ,ఆడలేక ఆట మద్యలో మానలేక
లేని రాని పెద్దరికం నటిస్తూ, మనసు చచ్చినా
విధవ దేహంతో బతుకుతూ జీవిస్తున్నా జీవచ్చవంలా

యాభై ఏళ్ల కిందటి చిన్నారి పెళ్ళికూతురిని.

*13-08-2012

బాలు || జ్ఞాపకాలు ||


కాలేజీలో అమ్మాయిల కాళ్ళ గజ్జలు చపుడు మధ్య
వయారాలు ఒలకపోస్తూ నడిచే హంస నడకల మధ్య
తలతిప్పుకోలేని అందమైన ముద్దుగుమ్మల మధ్య
రయ్ రయ్ మంటూ నూటమూడు స్పీడ్లో చకర్లు

క్లాసులో చెప్పే పాఠాల కంటే
క్లాసులో వేసే కామెంట్సే ఎక్కువ
గుసగుసమంటూ చెవులు కొరుక్కోవటాలు
ఆహా.. ఆహా.. అంటూ నవ్వటాలు

ఒకడి బాక్స్ మరొకడికి తెలియకుండా తినడం
అమ్మయిల జెడ క్లిప్స్ పీకటం
కాలేజీ బంక్ కొట్టి
సినిమా ధియేటర్లో విసిల్స్, డాన్సులు

సాయంత్రం అయితే
గర్ల్స్ హాస్టల్స్ ముందు
పిట్ట గోడల మీద
ఫ్లటింగ్ కార్యక్రమాలు

బ్యాచ్ బ్యాచులుగా విడిపోయి
మరొక బ్యాచ్ పై పోట్లాటలు
తిరిగి సెండ్ఆఫ్ డే రోజున ఏడ్పులు
వారేవా ఎంలైఫ్, కాలేజీలైఫ్
ఎన్నటికి మర్చిపోలేని జ్ఞాపకాలు

*13-08-2012

రియాజ్ || దృశ్యాలు ||

చినుకుల చుంబనం ఆగలేదు
సిగ్గూ ఆగలేదు
మెలికలు తిరుగుతూ చెట్టు

ఎదురుగ పెరిగిన పెట్రొల్ ధర బోర్డు
నిశ్చేష్టగా ఆటోవాలా
నవ్వందుకున్న ఆటో!

శక్తిమేర చేతులు చాపుతోంది
వెళ్ళిపోతున్నాయ్ అందనంత దూరంలో
రాలిపోయిన జ్ఞాపకాలు
తిరిగిరావని తెలియదు ఆ చెట్టుకు

కిటికీలోంచి తొంగిచూస్తోంది
టీవీలో నయా హేడ్ అండ్ షౌల్డర్ హెయిర్ కంట్రోల్ యాడ్
మొక్కకు తెలియదు
ఎందుకు జుట్టు రాలుతోందో!!!!

నగర దేహం ఆగిపోయింది
అంతర్జాలం అంతర్గతంగా ఉండిపోయింది
ఇళయరాజ ఇలియానా డబ్బా బయటకు రాలేదు
రైతు కంటి మోటార్ తడి ఆరిపోయింది
కట్ కట్ బట్ నాట్ ఇన్ పంజాబ్ మహారాష్ట్రా
ఓన్లీ ఇన్ ఆంధ్రా...!!!
This is Great achievement of Andhraa power PoliTricks !!

*13-08-2012

పెరుగు సుజనారాం || రేపటి బానిసలు ||

బతుకు చివరి క్షణం వరకూ తెలీదు
బానిసత్వపు సంకెళ్ళు
తెంపే దాకా తెలీదు
తెగింపు నిప్పు పుల్ల కొనలా
భగ్గుమంతుందనీ ....
విషాదాల్ని మొగిన్చినంతకాలం
తెలీనే లేదు
మనసు వేడెక్కినప్పుడు
కరచాలనం సైతం
ఇంత తీక్షణంగా ఉంటుందనీ ...
మా జాతి ఏక శక్తిగా పిడికెల్లెత్తితే
మీ అహంకారపు జాతి మొత్తం
అక్వేరియంలో
చేప పిల్లలై తిరుగుతాయనీ
మీ అత్యాచారాల
పై శాచిక నృత్యం ఆపేందుకు
ఆది శక్తిలా విరుచుకు పడితే
పిల్లి పిల్లలై మీరు నక్కి దాక్కుంటారు.
వయ్యారాలై మేము నడుస్తుంటే
మా కాలి మువ్వల దగ్గరే
మీరు వేలాడుతుంటారు.
మీకింకా తెలీదేమో
ఎగిసిపడే ఈ శక్తి తరంగం ముందు
రేపటి బానిసలంతా మీరేనని ?*13-08-2012

ఉషారాణి కందాళ ॥ నిద్రలో నా నగరం ॥

నల్లటి, చల్లటి రాత్రి దుప్పటి కప్పుకున్న
నగరం నిద్రపోతుంది అనుకుంటే పొరపాటే!
అప్పుడే లేస్తాయి అనేకానేక గమ్మత్తులు!
పెద్ద పెద్ద కంపెనీ లో కంప్యూటర్ల ముందు
ఎందరో మేలుకుని చాకిరీ చేస్తుంటారు!
నైట్ షిఫ్ట్ డ్యూటీలలో ఫ్యాక్టరీలేబర్లు,
ఆన్ డ్యూటీ లో ఉండే డాక్టర్స్, నర్సులు,
కూలీ కోసం నిద్రను రూపాయలక్రింద తొక్కిపెట్టే గుంపు
కనబడే రోడ్ల పనులు, నిర్మాణాలు,తారు మిషన్లు.
కల్లు కాంపవుండ్ల లో వినబడే కూనిరాగాలు,
బార్లలో సందండించే డాన్సులు, కేరింతలు..
ఉన్నవాళ్ళ పార్టీలు, ఉడుకు వయసు కోలాటాలు,
నిద్రపట్టని వృద్ధ్హుల గదుల్లో టి వి రొదలు,
పగలంతా తీరిక దొరకని ఆలూమగల చర్చలు,
చదువు బరువు క్రింద నలుగుతూ పుస్తకాలు
నమిలేసే కెరీర్ వోరియెంటెడ్ స్టూడెంట్ల కుస్తీలు,
ప్రేమ దోమ కుట్టి మనసుకు డెంగ్యూ జబ్బొచ్చి
ములుగుతున్న పడుచు కబుర్లు మోసే సెల్లుల సెగలు,
బ్రతుకు తెరువుకు వేరే దారిలేక బురద
పన్నీరు చల్లుకుని నవ్వులద్దుకున్న మోహాలమొహాలు,
చాలా చాలా కలగలిసి కరిగే రాత్రులలో
నల్లటి, చల్లటి రాత్రి దుప్పటి కప్పుకున్న
నగరం నిద్రపోతుంది అనుకుంటే పొరపాటే!

*13-08-2012

పెరుగు రామకృష్ణ // కొత్త సిలబస్సు ..//ఏడ్చినా నవ్వినట్టే ఏడ్వు
కన్నీటికి కరిగే గుండెల్లేని ఎడారిలో
కోకిల పాటకి శ్రోత వుండడు..

మాట్లాడినా ,మాట్లాడనట్టే..మాట్లాడు
వంచానాలంకారమే
ముఖార విందమైన అద్దం ముందు
స్వచ్చత కి ప్రతిబింబం వుండదు..

రెండు పెగ్గుల ఆలింగానాల మధ్య
కరచాలనం చేస్తూ,
పెదవులు పూలు పూయటం
స్నేహ రుతువుకు సంకేతం కాదు..

అనివార్యాల ఒడంబడిక మాత్రమే
జీవితం వ్యాపారమై పోయిన వ్యవస్థ లో
రోజూ మరణించడం,
మళ్ళీ రోజూ బ్రతకటం
స్నానమయ్యాక గుడ్డలు తొడిగి నట్టే ..

ఇప్పుడు నీతి వాక్యాలు,
వచన ప్రవచనాలు కాదు కావాల్సింది,
ప్రమాదం అంచుల్లో చిక్కుకోక తప్పించుకుంటూ
బ్రతకడం నేర్పే కొత్త సిలబస్సు...!!

*13-08-2012

మెర్సి మార్గరెట్ ll సగం కాలిన చిత్తు కాగితంll


అక్కడేదో
సగం కాలిన చిత్తు కాగితం
తీసి చూస్తే
చివరిగా మిగిలిఉన్న
అక్షరాలు

-"నిన్ను మరువలేక
నాలో నిన్ను అస్తమిస్తుంటే
చూడలేక
చాలిస్తున్నా .....తనువు--
నీకైవస్తున్నా నీ వెన--
నా ప్రి--"

సగం కాలిన అక్షరాల్లాగే
ఎవరిదో దేహం
ఇప్పుడిప్పుడే
ఆ కట్టెలపై కాలబెట్టినట్టున్నారు

కాలుతున్న పొగల్లోంచి

ఆ దేహం
తనలో నింపుకున్న
జ్ఞాపకాలు
తెరలు తెరలుగా
అనంతాల్లోకి
రోదిస్తూ
చుట్టుపక్కల వారికి
అర్ధమయ్యేలా కళ్ళకి
మంట పెట్టి మరీ
కన్నీళ్ళను ఒంపుకుని
తడిసి పోతున్నాయి

ఆ ప్రక్కన
తండ్రి మూగ రోదన
ఏ కలెక్టరో అవుతుందని
ఆశపడి ఇంటికి
దూరంగా పెట్టి చదివిస్తుంటే
ఆశలపల్లకిని కాదని
చావు పల్లకినెక్కి
ఇన్నేళ్ళ ప్రేమకన్నా
ఆర్నెల్ల ప్రేమలో
తమ ప్రేమనే గడ్డిపరకగా
చూసేంత కొలతలెలా
కొలిచావమ్మా

చిన్నప్పుడు గుండెలపై తన్నిన
తన్నులే
ఇప్పుడు నా గురుతులై
పోవాలని
నీ దృష్టిలో
గొప్పదైన ప్రేమ
మాకు
ఆజన్మాంతపు
నరకపు శోకం మిగిలేలా
జీవితకాల శిక్ష వేసెలా

నిన్ను ఒప్పింప చేసిన
గొప్ప ప్రేమ
మేము
నీపై చూపిన ప్రేమనే
లోకం చులకనగా చూసేలా
మాకు నరకం ఇచ్చి
నీ స్వర్గం వెతుకుంటూ
వెళ్ళావా ?

ఆ తండ్రి రోదన చూస్తూ
పొగల్లోంచి
సుడులు సుడులుగా వచ్చి
ఆ కన్నీళ్ళు
తుడుస్తూ
చివరి సారిగా తన చెంపను
ముట్టుకుందామనుకుందా

అంతే
వర్షం ఆ అవకాశం తను
తీసుకొని
ఇకెన్నట్టికి తన వాళ్ళని
చూసుకోలేనంత
దూర తీరాలకి కర్కషంగా
లాక్కెల్లింది
మరి పొందాలనుకున్న
ప్రేమ ఏమయ్యింది ?

*13-08-2012

శ్రీకాంత్ || నీకు. 2 ||


మాట్లాడే వాళ్లు ఎవరూ లేక అందరితో మాట్లాడతావు నువ్వు

కప్పిపుచ్చుకోలేవు లోపల నిండుకున్న
అంతంలేని నలుపు లోయలని
కళ్ళ కింద వ్యాపిస్తోన్న నీడల ఛాయలనీ
గబ్బిలాలైన చూపులనీ ఎడారులనీ:

మాట్లాడేవాళ్లు ఎవరూ లేక ఆహ్వానిస్తావు అందరినీ నువ్వు

నిన్ను చూసి తప్పించుకునేవాళ్ళనీ

నిన్ను చూసి పరిహసించే వాళ్ళనీ
నిన్ను ఓదార్చి వాడుకునే వాళ్ళనీ
నిన్ను వాడుకుని విసిరేసే వాళ్ళనీ

నీలోని ఆ నిశ్శబ్ధాన్ని భరించలేక
నీలోని ఆ నిశ్శబ్ధాన్ని పూరించలేక
అంతిమంగా అందరూ ఒంటరే అని తెలిసీ తప్పించుకోలేక

వాళ్ళనే, నిన్ను శబ్ధంగా మార్చిన వాళ్ళనే
నిన్ను బోలు వాచకంగా మార్చిన వాళ్ళనే
వాళ్ళనే ఆహ్వానిస్తావు నీ ఏకాంతపు తోటలోకి
వాళ్ళ కత్తులతో వాళ్ళ హింసలతో

వాళ్ళనే ఆహ్వానించి దీవిస్తావు నీ
ఆ పరిపూర్ణ వేదనతో నివేదనలతో:

చీకటి చెట్ల మధ్య నుంచి ఈ శీతల రాత్రిలో
రాలిపడుతొందోక రామచిలుక
నలుపు వలయపు నీటిలో తెగిపడుతొందొక
నీలి నింగిలో నివ్వెరపోయిన నెలవంక
ఆగి, ఆగీ ఆగీ వీస్తోందోక తనువును తహ
తహలాడించే ఒక పురాతన స్మృతి గీతిక

తెలియదా నీకైనా సునయినా
నెత్తురు రుచి మరిగిన నరలోహపు లోకమే ఇది అని
దేహపు రుచి మరిగిన లోహమానవ కాలమే ఇది అని
తెలియదా నీకైనా సునయినా
వదన వ్యసనాలలో, యంత్రనగరిలో మంత్ర తెరలలో
ఒకరినొకరు కడతేర్చుకుని చిట్లే అద్దాల చిత్తరువిదని?

అందుకే/నా నీకు సునయినా, నీ నల్లటి నయనాల నిండా

ఊరికే కొంత పిచ్చి నవ్వు. ఊరికే కొన్ని దిగంతాల
శరీరం ఎక్కిళ్ళు పెట్టె ఏడుపు. ఎందుకు వచ్చామో
ఎందుకు పోతామో తెలియని మహా కాంతి లోకాల
సప్తరంగుల అనామక దిగులూ, మృత్యువూ?

అందుకే, మాట్లాడే వాళ్లు ఎవరూ లేనందుకే ఎవరూ
ఎటూ ఎలాగూ రానందుకే
మాట్లాడుకుంటావు నీలో నువ్వు, నాతో నువ్వు=

ఇంతకూ, నువ్వు లేని రాత్రిలో నీకై తిరిగి తిరిగి
నువ్విచ్చే పాలకై వెదికి వెదికి
గదిలో ఒక మూల తెగిపడిన
ఆ బూడిద రంగు పిల్లి కూనను చూసావా నువ్వు

నా అనంత నిర్యాణాల నా అనంత పునర్జన్మల
పురాకృత పురాస్మృతుల
మల్లెమొగ్గల జాడల వెన్నెల అలలైన సునయినా?

*13-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || పాత బడి? ||


గ్లో సైను బోర్డులు
మీ పిల్లల్ని అందరికంటే ముందుంచుతామని
గుస గుస లాడుతున్నప్పుదు
నిస్సిగ్గుగా గోలచేస్తున్నప్పుడు

జ్ఞాపకాల పలుగుతో
నన్ను నేను నలభైఐదేళ్ళ లోతు తవ్వుకొని
మా బట్రాజు పంతులు గారి బడికెళ్ళా

నీడ గడియారం కొట్టిన
నిశ్సబ్దపు గంటల మోత నాకింకా వినిపిస్తూనే వుంది
నీడకు కొట్టిన గీతలే మాకు
ఫస్టు బెల్లు పాసుబెల్లు ఇంటికివెళ్ళే బెల్లు

అప్పుడు నాకు విరోచనాల మందిచ్చిందాయనే
వివేచనను మదికందించిదీ ఆయనే

అక్షరాల తోపాటూ అంకెలేకాదు
ఆటలాడే కొరకూ
తాటి ముంజల బండి తాటాకు ఫ్యాను
ఈనెపుల్లల వీణ కొబ్బరాకుల బూర
కాగితం పడవలు గాలి పతంగులు
మట్టి గణపతులను చేసిపెట్టేవారు

మాకు పాట గాడాయనే
తోటి ఆటగాడాయనే

వేమన్న శతకాన్ని వల్లెవేయుంచి
మనిషి మనుగడ జాడ మనసు పట్టించి

భూమికొలతలు నేర్పి ఋతువు క్రమములు చెప్పి
తాడు పేనుట నేర్పి మొక్క ఎదుగుట చూపి

ఎందేళ్ళ లోపులో వందేళ్ళ బతుకుకు
సరిపడే చూపును కుండెడు గింజలకే వండి పెట్టేసారు
నా బ్రతుకు బొమ్మకు రంగు లద్దిపెట్టేసారు


ఈటెక్కు హైటేక్కు కాన్సెప్ట్ ఒలంపియాడ్ ,ఇంటర్నేషనల్ ,కర్పోరేట్ తరహా ఏ స్కూలయునా ఒకటే మాట
మా లక్ష్యం మీ పిల్లల్ని
మార్కుల సంపాయుంచే మిషన్లుగా మార్చడమేనని


విద్యాబుద్దులు చెప్పాల్సిన చోట
జీవితాన్ని నేర్చుకోవడమెలాగో నేర్పేచోట

మార్కుల ముసుగేసి
ర్యాంకుల లాఠీలతో కొడుతూ
మానవత్వం లూఠీచేయబడుతుందక్కడ
తప్పెవరిది ???????????

వాళ్ళుచేసేది వ్యాపారం
నీవడిగిందే ఇస్తారక్కడ నువు కోరిందే చేస్తారక్కడ

మా తాతెన్నడు మా మాస్టారు దగ్గర
మార్కుల ముచ్చట తేలేదు
మా సీనుబాబు బుద్దిగనే వుంటుండా? బాగా చదువొస్తుందా?

ఇప్పుడు మనమడిగే ప్రశ్న ర్యాంకెంతొస్తుంది మావాడికి?

మనం మన ప్రశ్ననూ పిల్లల కొసం కనే కలలకన్నునూ మార్చుకొంటే
ఇప్పటి పిల్లలు అప్పటికంటే
వేల రెట్ల జ్ఞానసూర్యుళ్ళై వెలుగుతారు.
*13-08-2012

రేణుక అయోల // వాడితో నా ప్రయాణం//


బుజంమీద ముడితో జోలెలా అనిపించే
మెత్తటి చీరముక్క ఊయలని-
ఆమె జోలె అంటుంది
నేను వాడిని మోస్తూ నాలోకి ఒదగనిస్తూ
వాడి అనుభావాలకి మూగ పల్లకీనవుతాను

పొద్దునే నాలోకి జారుకుంటాడు లేతభానుడిలా
,అక్కడనూంచి మాఇద్దరి ప్రయాణం.

నిద్రవీడని లేతకళ్ళు వాహనాల రోదకి ఉలికిపడతాయి
వాలిపోతున్న మెడకి ఆసరాగా చేతులు కానిచేతులు
నాచీర అంచులతొ అడ్డుకుంటాను..

అకొసనూంచీ ఈ కొసకి పరుగులు పెట్టే తల్లినిచూస్తూ నవ్వుతాడు
వాడి లేతచిరునవ్వు నాకే వినిపిస్తుంది
వాడి ఊసులని వింటాను, ఏడుపుకి భయపడతాను.

అమ్మ ముఖంకోసం తలఎత్తీ చూడలనుకుంటాడు
ఎండ చుర్రుమని రెప్పలని వాల్చేస్తుంది.
ఎవరెవరో కనిపిస్తారు,వాళ్ళనే చూసి నవ్వుతాడు

వెలుతురు కొమ్మమీద వాలిన చీకటి వాడిని
అమ్మఒడిలోకి చేర్చింది-
నన్ను దులిపి పక్కగాచేసి వాడిని పడుక్కోపెట్టగానే
మెత్తటి తివాచినవనందుకు నన్ను నేను తిట్టుకుంటాను
కనీసం మెత్తటి దుప్పటి నవుదామని నన్నునేను కుదించుకుని
వాడిని హత్తుకుంటాను.

బోర్లాపడతాడు నన్ను దాగ్గరగాతీసుకుని
చేతి వేళ్ళతో లాగుతూ గుర్తుపట్టడాని ప్రయత్నిస్తాడు
ఆటలన్నీ కొద్ది క్షాణాలే..
మళ్ళీ అమ్మకోసం ఏడుస్తాడు

వస్తుంది విసుగుతో కసురుకుంటూ
”క్రిష్ణుడ్ని చెట్టుకి కట్టేసినట్లే మమ్మల్ని కొమ్మకి
తగిలించేసి వెళ్ళిపోతుంది.

ఊయలగా నేను జొరుగాఊగి-
వాడి దుఖాఃన్ని చెరిపే కొమ్మమీద పిట్టకోసం ఎదురు చూస్తాను
వాడి కావలసింది అమ్మ.
అమ్మకి కావాలి ఆకలితీర్చే ఆదాయం.
జీవితం ట్ర్రాఫిక్ సిగ్న్ ల్ దగ్గర ఆగి పోయింది

వాడు నిద్రపోయాకే వచ్చింది ”ఉడుత" తోంగి చూసి వెళ్ళి పోయింది
చుక్కలపరదాలు దించుకున్న ఆకాశంలోకి వెన్నెల అద్దం పట్టుకొని వచ్చింది రాత్రి

వాడి కలలరెప్పలమీద నవ్వు అంచుల్లో నేను తోడుగా మిగిలిపోయాను
అనుక్షణం అమ్మకి దగ్గరగావుంటూ
అమ్మని తీరిగ్గాచూడలేనంతదూరంగా వున్న వాడి
అనుభావాన్ని వింటూండగానే తూరుపు రేఖలు విచ్చుకున్నాయి....


*13-08-2012

నరేష్ కుమార్ //నిష్కామం//


అబ్బ...!
మనస్సు నిండా
ఎన్ని శ్వాసల శవాలో....!
దుర్ఘంధాన్ని
విసిరేస్తూ.....
కాలపు
స్వేద రంద్రాల
నుండి
పొంగి అట్టలు కట్టిన స్మృతులు....

వైతరణీ నది
చీము,నెత్తురుల
స్పర్ష
నీ చేతి వెచ్చదనాన్ని
ఞప్తికి తెస్తూ...

నువ్వో కౌగిలివైనప్పటి
అనుభూతి
జిగటగా
వొల్లంతా
తడిమే చీకటితో
కలిసి పోయాక

"నరకానికి దారి"
సైన్ బోర్డు
దాటుతుంటే.....
ఏయ్..! దొంగా...!
నీ
చిలిపి కన్నుల
ఆహ్వానం
ఇక్కడ్నుంచే కాపి కొట్టావ్ కదూ...!?

వచ్చేస్తున్నా
మిలియన్ల కొద్ది
శకలాలుగా...
నన్ను నేను చీల్చుకొని

సిద్దపడు ఆలిగా ఇవ్వని ప్రేమని
అమ్మగా ఇచ్చేందుకు...


*13-08-2012

భవాని ఫణి ||స్వాతంత్ర్యానికి జన్మదినం ||

మన స్వాతంత్ర్యానికి పుట్టినరోజు ....
అరవయ్యిదేళ్ళు నిండిన పసిపాప పాపం !!
పుట్టినప్పటి నుండి
ఏడుస్తూనే ఉంది

ముద్దు ముద్దుగా తనగురించి
చెప్పాలనుకుంటుంది
తన ఉనికి భాష ఎవరికీ
అర్ధమే కాక దిక్కుతోచక ఏడుస్తుంది

అందరి కన్నీటి ప్రవాహలకి
తన చిట్టి చేతుల్ని అడ్డం పెట్టి ఆపాలనుకుంటుంది
ఆపలేని ఆశక్తతకి
తానే వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది

నిజాయితీ తినేసి, ఐకమత్యం తాగేసి
తొందరగా పెద్దయి పోవాలనుకుంటుంది
పెట్టలేని అమ్మ పేదరికాన్ని అర్ధం చేసుకోలేక
ఉక్రోషంతో మళ్ళీ ఏడుస్తుంది

చిన్ని చిన్ని అడుగులు వేసి
అభివృద్ది తలుపులు తీసుకుని
అనంత లోకాల్లో
విహరించాలనుకుంటుంది

అవినీతి రొచ్చులో
కూరుకుపోయిన
కాళ్ళని కదపలేక
మరింత ఏడుస్తుంది

తోటి పిల్లలతో కలిసి
స్నేహ గీతాలు పాడాలనుకుంటుంది
గొంతు నులుముతున్న
స్వార్ధం పట్టు వదిలించుకోలేక
ఊపిరాడక ఏడుస్తుంది

ఎప్పుడైనా అప్పుడప్పుడు నవ్వుతుంది...
నిద్దట్లో, గాంధీ తాత గుర్తొచ్చినపుడు

ఎప్పుడైనా అప్పుడప్పుడు నవ్వుతుంది ...
గతజన్మ జ్ఞాపకాలు పలకరించినపుడు

ఎప్పుడైనా ఆపుడప్పుడు నవ్వుతుంది
ఇలా తన పుట్టినరోజునాడు
అందరూ తనకి శుభాకాంక్షలు చెప్పినపుడు !!

*13-08-2012

"నీ" ||"చిట్లిన పెదవి కార్చే నెత్తురు" (స్మృతి కవిత)||

నాక్కొంచెం సహకరించండ

నేను "నది"ని హత్యచేయాలి!


ఎలాగైనా...

ప్రవాహానికి సంకెళ్లువేసి పగను బయటపెట్టుకోవాలి

హృదయానికి అంటుకున్న అగ్గిని కన్నీళ్ళతో ఆర్పుకోవాలి


దాని..

విషపు నవ్వుల కఠిన కంఠాన్ని సమస్త నరనారాలతో ఉరితియ్యాలి

నీ విషణ్ణ వదనాన్ని "మిత్రుడు" చితి పై ఆన్చి భోరుమనాలి


నాక్కొంచెం సహకరించండి

నేను నదిని హత్యచేయాలి !


గుండెలపై ఆడించి, నవ్వించి..

నీళ్ళ అడుగున దాచింది ,

గుండెల్ని ఆపింది..మోసం చేసింది,

దీని కడుపులో ఎన్ని కత్తులు,

ప్రవాహా జగత్తులో ఎన్ని చిక్కులు

ఒక నవ్వుని కన్నీరు చేసిన ఘనత దీనిది,

ఎంత ఘాతుకం ఇది...!!


"పాతికేళ్ళ ప్రాణమిత్రుడి ఊపిరితిత్తుల్లో ఇసుక దాసుకున్న కాసాయిది

ఇన్నాళ్ళ గుండెల తలపాన్పుల్ని మాకు దూరంచేసిన ఉన్మాది"
ఎంతెత్తు మనిషిని ,

ఎన్నినవ్వుల్ని మింగింది !


నాక్కొంచెం సహకరించండి

నేనిప్పుడు నదిని హత్యచేయాలి !
ఒక మరణం ఎన్నిప్రాణాల్ని మెలిపెట్టింది

ఒక నిష్క్రమణ ఎన్ని మరీచిక మైదానాల్ని ముఖాన విసిరింది

ఇప్పుడు..

కలిసి నడిచిన దార్లన్నీ కన్నీటి మడుగులవుతున్నాయి

హృదయం ఆసాంతం పగిలిన లాంతరయ్యింది !


"తీరం వెంటున్న శిధిలమైన పడవలు కంట తడిపెట్టి

జరిగిన ఘోరాన్ని అంచనావేస్తున్నాయి..!"నాక్కొంచెం సహకరించండి

నేనిప్పుడు ఎలాగైనా నదిని హత్యచేయాలి !!నామిత్రుడు శవాన్ని ఆరేవు దాటించండి

"చిట్లిన పెదవి కార్చే నెత్తుర్ని

నా చర్మం వొలుచుకెల్లి తుడిచిరండి!"


నవ్వుకుంటెళ్ళిన నామిత్రుడు

శవమై తిరిగొస్తున్నాడు

మీరందరూ ఎదురెళ్ళండి..

అలసిన నా దేహపు అంపశయ్య పై నెమ్మదిగా దించి నిద్రపుచ్చండి

నన్నేవైనా మాటల మత్తుమందులిచ్చి మాయపుచ్చండి !
నాక్కొంచెం సహకరించండిఒక "కత్తి పడవ" తెచ్చి

నది దేహాన్ని రాజమండ్రి నుంచి భద్రాచలం దాకా కోసుకెళ్లండి

ఆనకట్టల గేట్లు ఎత్తండి,

గట్లకు గండి కొట్టండి,

వంతెనలు కూల్చండి,
ఏదేమైనా చేసి నాక్కొంచెం సహకరించండి..నా మిత్రుడిని హత్యచేసేందుకు

"ప్రకృతి చీర కట్టి వెన్నెల్లో విహరించే వేశ్యగోదావరిని నేనిప్పుడు హత్యచేయాలి !


.........."నీ"

(ప్రాణానికిప్రాణమైన గొపాల్ గోదావరిలో పడి చనిపోయిన విషాదాన్ని కళ్ళలోంచి రాల్చుకుంటూ..గోదావరిని జీవితాంతం ద్వేషిస్తూ)
*13-08-2012

కాసి రాజు || అంతా ఉత్తిదే ||

నువ్వునాకు బందువా?

బామ్మర్దివా?

అయినా సెప్తాను!

నీ నిజరూపం తెలిసినపుడు

నవ్వుపులుముకొచ్చి

పల్లుబైటెట్టి

నొచ్చుకుంటూ మెచ్చుకుంటారు నిన్ను

సన్మానానికి తీస్కెళ్ళి

సాలువాకప్పి సాగనంపేత్తే సరిపోద్దేటి నీకు?

సిగ్గులేదూ!

నీ సరుకెంతో నీకూ తెలుసు

పోనీలే ఇదంతా ఎందుగ్గానీ

ఎవడిపిచ్చాడిది

ఎవడీడు ఎదవగోలేడుతున్నాడనుకోకు

నిన్ను నువ్వు తడిమి సూడు

నా తడేదో తగలక పోదు

మనిసికెలాగా తప్పదు

మనసుకు ముసుకెందుకని సెప్తున్నాను

వింటే విను

లేపోతే అంతా ఉత్తిదే

*10-08-2012