పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, నవంబర్ 2013, శుక్రవారం

ఉర్దూ కవిత్వ నజరానా


మళ్ళీ శుక్రవారం వచ్చేసింది. పదిరోజులు సెలవు పెట్టినా, ఫైజ్ గారు సెలవిచ్చేలా లేరు. కాబట్టి, యథావిథిగా శుక్రవారం ఫైజ్ కవితలను మరోసారి తిరగేద్దాం.
ఫైజ్ వామపక్ష భావాలతో ప్రభావితుడయ్యారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఫైజ్ అహ్మద్ ఫైజ్ జన్మదిన వేడుకలు జరపడానికి చాలా మంది ఉత్సాహం చూపడం ఇటీవల కాలంలో కనబడుతుంది. విచిత్రమేమంటే, పాకిస్తాన్ లో వివిధ ప్రభుత్వాలు ఆయన్ను వేధించాయి. జైళ్ళలో పెట్టాయి. కాని ఆయన మరణించిన తర్వాత ఆయన గొప్పదనాన్ని అందరూ కీర్తిస్తున్నారు. ఒకవేళ ఆయనే బతికి ఉంటే, ఇప్పటి పరిస్థితులపై ఆయన ప్రతిస్పందిస్తే, వీళ్ళంతా దానికి ఎలా స్పందించేవారు?
జబ్ జుల్మ్ ఓ సితమ్ కి కోహ్ యే గిరాం, రూయీ కి తరాహ్ ఉడ్ జాయేంగే, హమ్ మహ్కుమోంకే పాంవ్ తలే, యే థర్తీ థర్ థర్ థర్కేగీ, ఔర్ అహ్లే హకామ్ కే సిర్ ఊపర్, జబ్ బిజిలీ కర్ కర్ కర్కేగి, హమ్ దేఖేంగే ...
దౌర్జన్యాలు అణిచివేతల కొండలన్నీ, దూదిపింజల్లా ఎగిరిపోయినప్పుడు, పాలితులు బాధితుల కాళ్ళ కింద, ఈ నేల గుండెలా కొట్టుకుంటుంది, పాలకుల తలలపై, పిడుగులు వర్షిస్తాయి, అప్పుడు మేం చూస్తాం ... అంటూ పాలకుల వైఖరిపై ప్రత్యక్షదాడికి దిగిన కవి ఫైజ్.
ఈ కవితను ఇక్బాల్ బానూ శాశ్వతంగా ప్రజల మనోమస్తిష్కాలపై ముద్రించేలా పాడారు. పాకిస్తాన్ లో అనేక ఉద్యమాల్లో ఈ కవిత ప్రేరకశక్తిగా నిలిచింది. ఈ కవితల ద్వారా ఫైజ్ వర్గరహిత సమాజం కోసం కలలు కన్నాడు. వామపక్ష సిద్దాంతాలు కోరేది ఇదే. ఈ కవిత ఏదో ఒక ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు. ఆయన అణిచివేతలు, అన్యాయాలు లేని సమాజం కోసం కలలు కన్నాడు. ఆయన రాతలు ఆ కలల నుంచి వచ్చినవే. ఆయన నమ్మిన సిద్దాంతం వేరు. ఆయన ఎవరిపైన పోరాడారో, ఎవరు ఆయన్ను వేధించారో, వారే నేడు ఆయనను పొగుడుతూ, ఆయన కవితలను కోట్ చేస్తూ కనబడడం విచిత్రం. చెగువెరా విషయంలోను ఇదే జరిగింది. చెగువెరా నమ్మింది వామపక్ష సిద్దాంతాన్ని. ఏ కార్పోరేట్ వ్యవస్థను చేగువెరా నిరసించాడో, వ్యతిరేకించాడో ఆ వ్యవస్థ ఇప్పుడు చెగువెరా చిహ్నాలను వాడుకుంటుంది. నైక్ సంస్థ చెగువెరా బొమ్మను వాడుకోడాన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి.
ఫైజ్ నమ్మిన సిద్దాంతం నేటి కాలంలో వర్తిస్తుందా లేదా అన్నది కాదు ప్రశ్న. ఆయన నమ్మిన సిద్దాంతానికి ఆయన్ను ప్రతినిధిగా గుర్తించాలి. ఆయన కవితలను ఆ నేపథ్యంలోనే చూడాలి.
హమ్ దేఖేంగే అంటూ ఆయన రాసిన కవిత జియావుల్ హక్, జనరల్ ముషర్రఫ్ వంటి సైనిక పాలకులను కూడా వెర్రెత్తించింది. జనరల్ అయ్యూబ్ ఖాన్ పాకిస్తాన్ పాలకుడిగా ఉన్నప్పుడే ఫైజ్ కుట్ర కేసులో జైలు పాలయ్యింది. ఫైజ్ ను నిర్బంధించినప్పటికీ జనరల్ అయ్యూబ్ ఖాన్ ఒక గొప్ప కవిగా ఫైజ్ ను పొగిడేవాడు. కాని ఫైజ్ సిద్దాంతం అయ్యూబ్ ఖాన్ కు ఏమాత్రం గిట్టదు. తన అయిష్టాన్ని ఆయన దాచుకోలేదు. కనీసం ఈ పాటి నిజాయితి నేడు కనబడడం లేదు. ఒక జాతీయవాద కావిగా రాయడం వేరు, జాతీయ కవిగా రాయడం వేరు. ఫైజ్ ఎన్నడూ జాతీయ కవి కాదు. ఆయన బడుగువర్గాల కోసమే రాశాడు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి రాశాడు. కావాలని కూర్చుని ఒక సిద్దాంతం కోసం రాసేది కవిత్వమవుతుందా? అన్న ప్రశ్న ఫైజ్ వంటి వారికి వర్తించదు. ఆయన సామ్యవాద సిద్దాంతం పట్ల ఆకర్షితుడు కాకముందే మంచి కవిగా గుర్తింపు పొందాడు. యువకుడిగా ఉన్నప్పుడు సహజంగా తనలో ఉండే భావాలను ప్రేమకవితలుగా మార్చాడు. సామ్యవాద సిద్దాంతాల ప్రభావంతో తనలో జనించిన భావాలను అలాగే కవితలుగా వ్యక్తీకరించాడు. ఆయన ఏదో ఒక దేశానికి పరిమితమై రాయలేదు. అమెరికాలో జూలియస్, ఎథెన్ రోసెన్ బర్గ్ లను కమ్యునిస్టు గూఢచారులుగా ఆరోపించి మరణశిక్ష విధించినప్పుడు ఆయన తన దు:ఖాన్ని కవిత్వంగా రాసుకున్నాడు. వియత్నాం రైతుల బాధలకు స్పందించాడు. నజీమ్ హిక్మత్ ను అనువదించాడు. కొంతకాలం బీరుట్ తన దేశంగా మార్చుకున్నాడు.
ఈజిప్టు తహ్రీర్ స్క్వేర్ లో జరిగిన ప్రదర్శనలను ఫైజ్ చూసి ఉన్నట్లయితే, ఈజిప్టు పరిణామాలపై తప్పక ప్రతిస్పందించి ఉండేవాడు, అంతేకాదు, అలాంటివి రావల్పిండిలో కూడా జరగాలని కోరుకుని ఉండేవాడు. తాను కలలు కన్న సమాజం ఉనికిలోకి వస్తుందని బలంగా నమ్మిన కవి ఫైజ్.

దిల్ నా ఉమ్మీద్ తో నహీం
నా కామ్ హీతో హై
లంబీ హై గమ్ కీ షామ్
మగర్ షామ్ హీతో హై

మనసులో నిరాశ లేదు
వైఫల్యం మాత్రమే కదా
విషాదాల రాత్రి చాలా పెద్దదిగా ఉంది
అయినా, రాత్రే కదా...(రాత్రి అంతరించి తెల్లవారడం ఖాయం కదా)

ఆయన ఆశావాది. ఎప్పటికైనా వర్గరహిత సమాజం ఏర్పడుతుందని నమ్మిన కవి. ఇప్పుడు ఆయన కవితలు కొన్ని చూద్దాం.
ఒక కవిత కాదు, ఓ నాలుగు కవితల స్పెషల్ నజరానా...నాలుగు రోజులుగా సెలవులో ఉన్నందుకు...
ఈ రోజు మొదటి కవిత ఒక గజల్. గజల్ నిబంధనలను పాటిస్తూ అనువదించాలనుకోవడం ఒక పెద్ద సాహసమే అవుతుంది. అయినా ఫైజ్ రాసిన ఈ గజల్ ను సాధ్యమైనంత వరకు గజల్ ప్రక్రియలోనే అనువదించడానికి ప్రయత్నించాను. గజల్ లోని శబ్ధమాధుర్యం కూడా భావానికి బలాన్నిస్తుంది.

కష్టాలకు వివరణలూ లేనేలేవు కదా
మనోవ్యధకు సాంత్వనలు లేనే లేవు కదా

మరోసారి వాగ్దానం నిలబడనే లేదు
మరోసారి మాట నిజం కానేలేదు కదా

అమరత్వపు అనుమతులు పురుగులకూ లేవు
దీపాలకు ఒక్కరాత్రి రానేలేదు కదా

మత్తు రుచికి ముందే మనసు ఎగసిపడుతోంది
పరాకాష్ఠ ఈ గోష్ఠిలొ పలకనె లేదు కదా

తపిస్తున్న కళ్లముందు ఒక్కచూపు మెరిసి
కలవలేని రాత్రి గడిచి పోనేలేదు కదా

వ్యాజ్యాల ద్వారాలూ మూతపడే వేళ
మొత్తుకోళ్ళ నోళ్ళు మూత పడనె లేదు కదా

ప్రతిరోజూ ఫైజ్ నీకు కాళరాత్రి కదా
ఒక్కసారి పరిహారం దొరకనె లేదు కదా

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

షరహ్ బేదర్దీ హాలాత్ న హోనే పాయీ
అబ్ కే భీ దిల్ కీ ముదారాత్ న హోనే పాయీ

ఫిర్ వహీ వాదా జో ఇక్రార్ న బన్ నే పాయా
ఫిర్ వహీ బాత్ జో అస్ బాత్ న హోనే పాయీ

ఫిర్ వో పర్వానే జిన్హే ఇజ్నే షహాదత్ న మిలా
ఫిర్ వో షమేం కె జిన్హే రాత్ న హోనే పాయీ

ఫిర్ వహీ జాం బల్బీ లజ్జత్ మై సు పహలే
ఫిర్ ఓ మహ్ఫిల్ జో ఖరాబాత్ న హోనే పాయీ

ఫిర్ దమ్ దీద్ రహే చష్మ్ ఓ నజర్ దీద్ తలబ్
ఫిర్ షబ్ వసల్ ములాఖాత్ న హోనే పాయీ

ఫిర్ వహాం బాబ్ అసర్ జానియే కబ్ బంద్ హో
ఫిర్ యహాం ఖతమ్ మనాజాత్ న హోనే పాయీ

ఫైజ్ సర్ పర్ జో హర్ ఇక్ రోజ్ ఖయామత్ గుజరీ
ఎక్ భీ రోజ్ మకాఫాత్ న హోనే పాయీ

మరో కవిత:

ప్రపంచబాధలో మనసు మునిగిపోయింది
ప్రతి శ్వాస తపిస్తున్న బాధ అయిపోయింది

అంతరంగ గోష్టి కూడా నిర్జనమైపోయింది
జతగా ఉన్న దు:ఖమూ ఎక్కడికో పోయింది.

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

దిల్ రాహియే గమె జహాం హై ఆజ్
హర్ నఫ్స్ తష్నాయే ఫుఘాన్ హై ఆజ్

సఖ్త్ వీరాం హై మహ్ఫిలె హస్తీ
యే గమే దోస్త్ తూ కహాం హై ఆజ్

ఇంకో కవిత:

సోదరా, ఇదేంటి ఇలా చేశావు
వెళ్తూ వెళ్తూ నా జీవిత పుస్తకాన్ని పట్టుకుపోయావు
అందులో చాలా విలువైన బొమ్మలున్నాయి.

అందులో నా బాల్యం ఉంది, నా యవ్వనం ఉంది
దానికి బదులుగా నువ్వు వెళ్తూ వెళ్తూ ఏమిచ్చావ్
భగ్గుమంటున్న నీ బాధల నెత్తుటి గులాబీ

నన్నేం చేయమంటావ్, ఈ ఆదరాన్ని నేనెందుకు తొడగాలి?
నా దుస్తుల లెక్కలన్నీ తీసుకో
చివరిసారిగా, ఈ ఒక్కప్రశ్నకు ఒప్పుకో
నువ్వెప్పుడు నన్ను జవాబివ్వకుండా పంపలేదు

వచ్చి నీ భగ్గుమంటున్న ఈ పువ్వు తీసుకుపో
నాకు నా గతజీవిత పుస్తకాన్ని ఇచ్చిపో

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

ముఝ్కో షిక్వా హై మేరే భాయీ కె తుమ్ జాతే జాతే
లేగయే సాథ్ మేరే ఉమ్ర్ గుజిష్తా కి కితాబ్
ఇస్మేం తో మేరీ బహుత్ కీమతీ తస్వీరేం థీం

ఇస్మేం బచ్పన్ థా మేరా ఔర్ మేరా అహదె షబాబ్
ఇస్కే బదలే దేగయే ముఝే తుమ్ జాతే జాతే
అప్నే గమ్ కా యే దహెక్తా హువా యే ఖూరంగ్ గులాబ్

క్యా కరూం భాయ్ యే ఐజాజ్ మైం క్యోం కర్ పహనూం
ముఝ్ సే లేలో మేరీ సబ్ చాక్ కమీజోంకా హిసాబ్
ఆఖ్రీ బార్ అబ్ లో మాన్ లో ఏక్ యహ్ భీ సవాల్
ఆజ్ తక్ తుమ్ సే మైం లౌటా నహీ మాయూసె జవాబ్

ఆకే లే జావో తుమ్ అప్నా యే దహెక్తా హువా ఫూల్
ముఝ్ కో లౌటా దో మేరీ ఉమ్ర్ గుజిష్తా కీ కితాబ్

చివరి కవిత :

ప్రతిరాత్రి మనసు వెర్రిగా వెదుకుతోంది
ప్రతి పిలుపు లోను నీ మధురస్వర అలికిడి

ప్రతి పొద్దు తరచూ కలుస్తాయి చూపులు
ప్రకాశించే వదనంలో మల్లె మందారాల రంగులు

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

తమామ్ షబ్ దిల్ వహషీ తలాష్ కర్తా హై
హర్ ఏక్ సదా మేం తేరే హర్ఫ్ యే లుత్ఫ్ కా ఆహంగ్

హర్ ఏక్ సుబా మిల్తీ హై బార్ బార్ నజర్
తేరే దహన్ సే లాలా ఓ గులాబ్ కా రంగ్

మళ్ళీ శుక్రవారం కలుద్దాం.. అంతవరకు అస్సలాము అలైకుమ్
                                                                                                                                 - అబ్దుల్ వాహెద్