పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, అక్టోబర్ 2012, బుధవారం

మురళి// విస్మయము//


చంద్రుని చూస్తే కలువలు వికసిస్తాయి అంటారు
మరి చంద్రునిలోనే కలువలు వికసించాయేమిటి?

నీటి లో చేపలు విహరిస్తూవుంటాయంటారు
కానీ చేపలలోనే నీరు ఉంది ఎందుకు?

కలువలపై తుమ్మెదలు వాలుతాయంటారు
మరి కలువలే తుమ్మెదలైనాయేమిటీ?

సంపంగి దక్కరకు తుమ్మెదలు రావు అంటారు?
ఐనా సంపంగి ఇరువంకలా తుమ్మెదలున్నాయి!?

చంద్రునిలో చంద్రులు ఉదయిస్తాయా ఎప్పుడైనా?
చంద్రునిలో పలువరుసచంద్రికలు వెన్నెలలు కాసాయి

గిరిశృంగముల పై పయోధరములుంటాయి గానీ
పయోధరముల పై గిరిశృంగములున్నాయేమిటి?

జలధరంబుల దాటి చంద్రబింబముండు కానీ
చంద్రబింబము పైన జలధరంబులున్నవేమి?

ఇట్లు చూపరులకు విస్మయము కల్గునట్లుగా
కనులు,ముఖము,ముక్కు,పలువరుసలు,
కురులు,పయోధరములు అమరియున్నవి.
తే 12/10/12దీ 8.45 రాత్రి

మురళి//ఆరాటము//మధుమాసపు వెన్నెలలో
మరుమల్లెల జల్లులలో
మదిని దోచిన చిన్నది
ఎచట దాగి యున్నది
ఎదుట రాకయున్నది

నీ బుగ్గమీది నిగ్గు చూచి
అరవిరిసిన గులాబి మొగ్గ
సిగ్గులతో తలదాచుకున్నది
నా చెంపకెంత చెలగాటమో
నీ బుగ్గపైన నిగ్గులన్నినిమరాలని

నీ పెదవులపై మధువుజూచి
తనివితీర తాగాలని తుమ్మెద
సంపంగి ముక్కు జూసి వెళ్ళి పోయె
నా పెదవులకెంత పరితాపమో
నీఅధరసుధామధురసాన్ని గ్రోలాలనీ

నీ మోము కాంతి మెరుపు చూసి
చందమామ సిగ్గుతో మంచు దుప్పటి
తీసి ముఖముపై కప్పుకున్నది
నా కన్నులకెంత ఉబలాటమో
నీకన్నులతో బాసలు చేయాలని

నీ మేని చాయ మెరుపు చూసి
విరబూసిన చిరుచామంతి
సిగ్గుతో ముఖము చాటువేసింది
నా యెడదకు యెంత ఆరాటమో
నీయెద పైన పదిలంగా వాలాలని


తేదీ 14/10/12 రాత్రి 9.00

కె.కె.//గుప్పెడు మల్లెలు-18//


1.
సొమ్ములున్న అత్తకి,
అమ్మప్రేమ తాకట్టు...

ఇల్లరికం
2.
ఆనందానికి
కొలమానం,
మరో ఆనందం
3.
అక్కడక్కడే తిరుగుతుంది కాలం...
గడియారంలో,
అయినా ఆపలేం
4.
"పాపం మంచోడే"అంటారు,
మంచోడు కన్నా ముందే
పాపం
5.
చావు గెలుపు కోసం పరుగు,
గెలిచాడని
పక్కోళ్ళంతా ఏడుపు
6.
ఉప్పునీళ్ళు పుక్కిళిస్తోంది
దశాబ్దాలుగా
సముద్రానికి నోటిపూతేమో,
7.
తప్పించుకోలేము,
తప్పుకోనూలేమూ,
సంసారం
8.
పక్కా ప్లానింగ్ తో
తప్పు చేసేది
మనిషొక్కడే
9.
దుర్మార్గుణ్ణి
సుఖంగా ఉండనీ...
సన్మార్గుడు బ్రతికేస్తాడు
10.
రాక, పోకల మద్య
వారధి
జీవితం...

Date: 24-10-2012

కర్లపాలెం హనుమంత రావు॥ప్రపంచీకరణ పంచ నుంచీ…॥

1
వర్తమానం జ్ఞానంగా ఘనీభవించక ముందే
కాలం చరిత్రలోకి జారుకుంటుంది

నాటకమని తెలిసీ
పాత్రల్లో లీనమైపోయే రసబలహీనత మనసుది
చప్పట్ల సంబరంలో మూతివిరుపుల సందేశం
పట్టించుకోటం వెంగళాయితనం!
విజయవంతమైన ప్రతి ప్రదర్శన వెనకా
హృదయశల్యమైన కథలనేకం కద్దు
జీవితం నాటకమని తెలిసీ
నటన్నే జీవితంలా ప్రేమిస్తే
ఆఖరి సీనులో అమాయకత్వానికి
పట్టే గతేమిటో
చరిత్ర చర్విత చరణంగా చెపుతూనే ఉంది

2
రావణసంహరణ కైకమ్మకోర్కెల మధ్య కార్యకారణ సంబధమేంటి?
కృష్ణ రాయబారసారం సత్యప్రమాణకంగా ధర్మసంస్థాపనార్ధమేనా!
శకుని పాచికలఎత్తులసలు లోతులెంతెంత?
కళింగయుద్ధంనాటి ఎన్ని యోధకుటుంబాల కన్నీళ్ళు
బాటలకిరువైపులా నాటిన అశొకుడి చెట్లనీడలయినట్లు?
విజాయానికి జేజేలు పలికే లోకానికి
జీవితంమ్యాచి వెనక జరిగే ఫిక్సింగు తతంగం
తోలు వలిచి తినిపించినా గొంతుదిగని అరటిపండు !
చెప్పటం వరకే చరిత్ర పాత్ర
చెవి మెలిపెట్టేంత ప్రేమ ఎందుకుంటుంది!

3
శృంఖలాలే కంకణాలాయ
గాటక్కట్టిన మోకు వ్యాసార్థపరిధికే
సర్వపురుషార్థసారమూ సమర్పితమాయ
ముక్కవాసనకే కుక్కముక్కు తోకూగిపోతుందాయ
వేగుచుక్కలు పైనెంత ప్రజ్వలిస్తేనేమి
మనిషి మోరెత్తి చూడలేని మకురు వరాహమైనాక!
నిప్పును కనిపెట్టిన అనాది నిశితత్వం
అంగారకందాకా మానవపాదాన్నెగరేస్తుండచ్చు
మరో వంక నీరోల ఫిడేలు రాగాలకి
మనిషిక్కడ చంకలెగరేస్తున్నాడే!
రోములా తగలబడతావురా మొర్రో అనెంత మొత్తుకున్నా
హత్తుకొనే మెదళ్లేవీ!

4
క్లోజుకొచ్చిందాకా సీజరుకి
బ్రూటస్ బాకు కంటపడనేలేదు
ఏకలవ్యుడి మూఢగురుదక్షిణ విలువ కుడిబొటనవేలు
దుష్టసాన్నిధ్యం దానకర్ణుడికి తెచ్చిపెట్టింది హీనకీర్తినే
తవ్వినకొద్దీ గతమంతా
ఎవరో ఎవరెవరివెనకో తవ్విపోసిన గోతులూ గుంతలే!
కళ్ళగంతలతోనే కుప్పిగంతులేస్తున్న మనిషీ
మెరిసేదంతా బంగారమేనని మురస్తే
మరి మెరుపుల షాకు?

5
ఏమి పండాలో
ఎలా వండాలో
ఎంత మింగాలో
ఎవరు మిగిలుండాలో
ఎజెండా ఎవడిదో
ఆ జెండాను మోసే భుజం మాత్రం నీదా!

6
సంస్కరణలంటే
సంస్కృతిని పరాయీకరణల పాలుచేయడమా!
అభివృద్దికర్థం
రూపాయి డాలరుబాబుగోరికి చేసే ఊడిగమా!
ఆర్థికస్వావలంబనం
ఆహాహా...ఎంతదమైన సంస్కృతమోసమో
మెడమీద ఎవడిదో కాడి
మన కాళ్ళమీద మనమే గాడిదై పరుగెత్తాలి!
సరళీకరణసారం
వాడి గరళాన్ని వేళకింత కొని
రసగుళికల్లా గుట్టుగా మింగేయటనమనే బేరమేగా!

క్రాంతి శ్రీనివాసరావు ||లాకప్ డెత్ ||


జాగ్రత్త
చల్లగా హాయుగా వున్న బుజాలపై
మనపక్కన చెరిన వాడు

మెల్లగా బుజకీర్తులు తగిలిస్తాడు

మోయ లేక
దించడం వల్లకాక
మనసుకు మోకాళ్ళ నొప్పులొస్తాయు

తరువాత
నిన్ను నీ నుండి వెళ్ళగొట్టి
వాడి తొత్తును
నీ హ్రుదయ సిం హాసనం పై
అదిస్టింప చేస్తాడు

వాని భావాలను
మోసుకుతిరిగే
గాడిదలా మార్చుకొంటాడు

అందుకే
కళ్ళకే కాదు
ఇప్పుడు
చెవులకూ జోళ్ళు తొడగాలి

అయునా కూడా

మనసు పొరల్లో దాచిన
రహస్యాన్ని
మనకు తెలియకుండానే
దొంగిలిస్తారట

'మనసులు ' దాచుకొనే
కొత్త లాకర్లు
కనుగొనే దెప్పుడో

మునుముందు జరగబోయే
మనసు లాకప్ డెత్తులు ఆగేదెలాగో

కర్లపాలెం హనుమంత రావు॥వెలుగు బొట్లు॥1
నీలాకాశాన్నలా దులుపుతావెందుకు?

నాలుగు వెలుగు బొట్లు నేల రాల్తాయేమో తాగి పోవాలని.
ఆడి ఆడి అలసిపోయాను
గాయాలకు మందు కావాలి

2
నది దాటాలంటే వంతెనే ఉండాలా
మడుగు అడుగున కాల్దారీ ఉంటుంది
వేగుచుక్కలు పైన వెలుగుతూనే ఉంటాయి
బాటసారికి మోరెత్తి చూడాలనే మనసు కలగాలి
క్షణం పాటు పీల్చి వదిలే ప్రాణవాయువును
ఎన్ని పైరుపచ్చల నుంచీ మూటకట్టుకుని
పడుతూ లేస్తూ వస్తుందో పిచ్చి గాలి!
కంటికి నిద్ర ఊహ రాకముందే
రెప్పలు కలల పొత్తిళ్ళు సిద్దంచేస్తాయి
గోపురాలు కందకాలు రహదారులు రహస్యస్థావరాలు
ఇలాతలాన్ని నువ్వివాళిలా యుద్ధరంగ చేసావు గానీ
ఓంప్రథమంగా పునాది రాయి పడింది ఆటలమైదానానికే
ఏడుస్తూ వచ్చిన వాడివి…
ఎలాగూ ఏడుస్తూనే పోతావని తెలుసు
ఇక్కడున్నఈ నాలుగు రోజులూ
నిన్ను నవ్వుల పూలతోటల వెంట తిప్పాలని కదూ
ఈ ఆటలూ పాటలు ప్రేమ మాటలు
కలల మీదా పెత్తనం కావాలి
అందుకే నీకీ అలసట

3
రేపటి సంగతి మరచి
నేటి గెలుపుకి పరుగు…అలుపు!

4
ఆటంటూ ముగిసాక
గెలుపోటములు ఆటల్లో అరటిపండు
చీకటి ముసిరితే ఎవరైనా ఇంటిదారే పట్టాలి
ఎక్కణ్నుంచొచ్చామో ఎక్కడెక్కడికి పోవాలో
ఇక్కడున్నన్ని రోజులూ ఎంచక్కా ఆడుకో
చక్కని మైదానం
ఆటవస్తువులు
తోటిదోస్తులు
అలుపు మరుపుకే కదా ఈ ఆటా పాట
గెలుపు కోసం అలుపు వృథా అవునా కాదా!

5
నీలాకాశాన్నలా దులపడమెందుకు
ధారగా రాలుతునే ఉన్నాయిగా వెలుగు బొట్లు
హాయిగా తాగేయ్ రేపటికి మాగబెట్టక!
మనిషి బుద్ధి చూపెట్టక!


23-10-2012

కామేశ్వరరావు.డి //స్వప్న వాస్తవ దత్త//


1.
ఊరంతా నల్లని ఊసులాడే క్షణం

పొగ మంచులో ఓ అస్పష్ట రేఖ
రెప్పల చాటు నవోన్మేష స్వప్నం..

ఆకాశప్పొద మీద
కొత్త యవ్వన పరిమళంలా
మల్లెమొగ్గల కాంతి

ఒంటరి పక్క మీద
అస్తిత్వపు సంఘర్షణలో
అస్తిమిత హృదయారాటం

ఎవరికీ తెలియని లోకంలో
చిక్కని రంగులు నేసిన సీతాకోక చిలుకల
రెక్కల చప్పుళ్ళు...
ఆదమరుపు తీరంలో ఏకాంత కెరటంలా నేను
ఒరుసుకొంటూ ఎగసిన ఊహలతో....

అప్పటిదాకా నిద్రపోయిన సంగతులన్నీ
గుప్పుమన్న పరవశం
ఎటు చూసినా రంగుల పుప్పొడి తడి
ఎటు చూసినా పొంగిన తేనెల అలికిడి

ఇప్పుడు
నేనొక స్వేచ్చా బంధాన్ని
వాంఛా మకరందాన్ని
ఆనంద మేఘాన్ని....


2.
నిశ్శబ్దం భళ్ళున బద్దలైన శబ్దం
తూర్పు పక్షి రెక్కల సంగీతం
తోటంతా ప్రవహించిన అందాల జలపాతం...
ఊరంతా పసుపు కుంకుమల నిగారింపు
పొగమంచుగా కరుగుతున్న అస్పష్ట రేఖ
రెప్పల చాటు కరిగిన కోయిల గీతం...


3.
ఉదయం పొత్తిళ్ళలో
ఓ జ్ఞాపకం మొదటి ఏడుపు....
ఓ నిట్టూర్పు....

కాశిరాజు ||పోలిస్||On the eve of “police martyrs commemoration day “, I dedicate this poem to all the policemen who sacrificed their lives for the betterment of society and safeguarding it.

చిన్నపుడు బళ్ళో
నువ్వేమవుతావ్ రా ? అని అడిగితే
“పోలీస్ “ అన్న నీ శపధం నీకింకా గుర్తుండి
గర్వంగా ఉంది కదూ !
అమ్మా నాన్నల్ని వదిలి
ఆత్మీయతల్ని వదులుకొని
యవ్వనంలోనే యముడికి ఎదురెళ్తానని బయల్దేరావ్
కాళ్ళనిండా పుల్లూ ,ఒళ్ళన్నీ దెబ్బలూ
ఎన్ని ఓర్చుకున్నావో
పోలిస్ అవతారమెత్తడానికి.
నీకదో కుటుంబం
నీకో అమ్మ ,నాన్న ,అన్నాతమ్ముడూ అందరూ దొరికారక్కడ
అవసరాల్ని పక్కనపడేసి
ఆత్మాభిమానాన్ని చంపుకోలేక
అమ్మనూ ,ఆలిని పట్టించుకోకుండా
అన్యాయాన్నే ఎదురించావ్ !
అందుకేనేమో
అన్యాయాన్ని ఆపాలన్న

నీ గుప్పెడు గుండె దైర్యాన్ని ఎరిగీ
తనకెక్కడ అడ్డుతగుల్తావో అని
ఆ దేవుడు నిన్ను మా నుండి లాక్కెళ్లిపోయాడు
ఇప్పుడు మేమింకా మనుసులుగానే ఉన్నాం
నువ్విప్పుడు దేవుడైపోయావు.
నేరుగా చెబితే నీకినిపిస్తుందో లేదోనని
ఆ దేవున్ని రాయబారిచేసి
నీ ఆత్మకు శాంతి చేకూరేటట్టు
అక్షర అశ్రువులు నింపుకున్న
మా మాటలన్నీ మూటకట్టి పంపుతున్నాం
“నీ ఆత్మకు శాంతి చేకూరాలని “