పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

ఎ.నాగరాజు || సభ్య లోకం ||


కొంత మంది ఎలా వస్తారో తెలియదు (దుర్మార్గంగా)
ముతకగా అభిరుచి అంటూ ఏమీ లేకుండా
(తూ...యాక్) వచ్చి పడతారు సభ్యలోకంలోకి

తన్మయత్మపు మైకమేమీ లేక (ఆర్టంటే ఏమిటో తెలిసి చస్తే కదా)
ఏదో పెనుగాలికి కొట్టుకొచ్చిన అపరిచిత జీవుల్లా
ఉద్యమాల్లోకీ.సాహిత్యంలోకీ గుత్తగా దఖలు పరుచుకున్న రంగుల కలలచిత్రాలలోకి
ఎందుకో(చాలా చాలా దుర్మార్గంగా)

ఉంటారా వీళ్ళు ఉండగలరా వీళ్ళు

సరదాగా మాటాడుకుందాం తూనిక వేసి పడిగట్టు పదాలతో తూగలేని వీళ్ళని
కోల్పోయి తమను నత్తులు కొడుతూ
మాటలలో హింసల కుప్పగా కూరుకొని చివరకు గాలిలో ధూళిలా కలగలసి పోయి (హిహిహి)-

చెరగని చిరకాల ముద్ర (మనదే మనదే)
ఉంటుందని ఒకటి
తెలియక వస్తారు( పాపం) వీళ్ళు నిరక్షర కుక్షుల గర్భశోకాలలోంచీ పొలోమంటూ (పాపం పాపం)

(హుష్) ఎవరు గరపగలరు విద్యను వీళ్ళకు మనం కాక ?
భుజస్కందాలపై (కాచిన కాయలు ఎన్నో!)
చరిత్ర మోపిన మరో భారం

మంచి ముడి సరుకు కదా
ఇక ఈ రోజుకు కథో కవిత్వమో -
(నుదుటి పై పొటమరించిన చెమట చుక్కలు ఎన్నో చూడు)

11-09-12

చింతం ప్రవీణ్ || ఏది కవిత్వం ||


ఎన్నాళ్ళీ నియమాల నిచ్చెనమెట్లు
ఇక ధ్వంసం చేద్దాం_

ఈ రంధ్రాన్వేషణలకు
ఈ శిల్పాన్వేషణలకు
ఇక ముగింపు పలుకుదాం_

జనాలకోసం రాస్తున్నప్పుడు
జనాలకు అర్ధంకాకపోతే
అదేం కవిత్వం?

పదాల్ని శిల్పాల్లా సానబెట్టీ
సర్ఫులో నానబెట్టీ
ఉతికి ఆరేసేదే కవిత్వమా?

అర్దంకాకుండా పోయెదే కవిత్వమైతే
అర్దమయ్యేదేంటీ?

విమర్షకుల ఇనుపకచ్చడాల
చట్రాల కిందపడి_
పరిశీలకుల పాముకాటుకు గురై
నురగలు కక్కుతూ
చచ్చీ చెడీ
బతికి బట్టకట్టేదే పదమా
అ పదాలసమూహమే కవిత్వమా?

కవిత్వానికి కులముంటుందా?
కవిత్వానికి మతముంటుందా?

ఎవరు ప్రయోగిస్తే పదం
ఎవరు సాగదీస్తే వాక్యం
ఇంకెవరు ఇరగదీస్తే కవిత్వం?

మంత్ర నగరిలో మృగాళ్ళకు బలైనా అబల స్థితిని
నడిబజారులో నెత్తురోడుతున్న అమరుని త్యాగాన్ని
ఏ శిల్పం ఎవరి సాంప్రదాయ చట్రంలో ఇమడ్చగలం

అందమే ముఖ్యమన్నోళ్ళకు
విషయం ముఖ్యం కాదేమో?
మేళాలు తాళాలే ముఖ్యమన్నోళ్ళకు
తండ్లాట ముఖ్యం కాదేమో?

జనాలు పట్టని
జనాలు లేని కవిత్వానికి
బలముండదు
విలువుండదు
చరిత్ర ఉండదు_

ఎన్నాళ్ళీ నియమాల నిచ్చెనమెట్లు
రండి! ఇక ధ్వంసం చేద్దాం_

12.09.2012

"నేనే ఇమ్రాన్ శాస్త్రి"


నేను:అస్సలామాలేకుం
?: వాలేకుం అస్సలాం..నాం క్యా హే బేటా
నేను:ఇమ్రాన్ శాస్త్రి
?:ఏ క్యా హే.... ఇమ్రాన్ ....శాస్త్రి ..ఐసా నహి బోల్నా బేటా బోహుత్ గునా హే అల్లాః ఆప్కో భలా నహి కరేగా......................సో అండ్ సో
మరి ఇక ఇమ్రాన్ శాస్త్రి ఊరుకుంటాడా........!

ఆయువంటూ లేని కుల మతాల్ని అక్కున చేర్చుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నా పెద్దరికమా
నేనడిగే ఒక్క ప్రశ్నకైనా నీ దగ్గర బదులంటూ ఉంటె సెలవీయుమా
!

జగతిలో ప్రప్రథమంగా జన్మించింది ఏ జాతి వాడు?
మొదటి మట్టిబోమ్మకి ప్రాణం పోసింది ఏ దేవుడు?
నువ్వు కడుపులో ఉన్నపుడు నీ కన్న తల్లికి
పురుడు పోసిన చేతులు మొక్కేది ఎవరికీ?

పుట్టిన పసి కందు ఏ జాతి అని అడిగే ప్రశ్నకి
ఎవరైనా చెప్పే బదులు ఆడ,మగ అనే కదా ఎప్పటికి!
ఉన్నాడంటే ఉన్నాడు నిజమే, ఎక్కడో ఆ పై వాడు
చూడగలిగారా బతికున్న వాళ్లెవరైనా
చూడాలనుకుంటే మిగలరే ఇలపై ఒకరైనా
పండే పంటకు లేదు కులం
పొంగే గంగకు లేదు మతం
వీచే గాలికి లేదు వర్గం
ఇవి లేక క్షణమైనా బతకలేని నీకెందుకు వాటిపై మోహం
మనిషికున్న పేరుని కాదు వాడు బతికే తీరుని చూడు
ప్రతి తల్లి కడుపు గుడిలో వెలిగే చిరు దీపానికుండే వెలుగొకటే
ప్రతి మనిషి కన్ను మూసాక కాలే కట్టెల గుండె మాటున మంట ఒకటే
జగతి ఇంటికి పైకప్పులా ఉన్న ఆకాశం ఒకటే
చివరి నిద్రకి పానుపు వేసిన నేలమ్మ ఒకటే
నువ్వు,నేను ఎవరైనా చూసే చూపు ఒకటే
నీకు ,నాకు ఎవరికైనా చూపించే చేతన ఒకటే
హాయి కలిగితే పాడే పన్నీటి జయగీతం ఒకటే
బాధ కలిగితే పారే కన్నీటి జలపాతం ఒకటే
గుండె ఒకటే,దాన్ని పలికించే ఊపిరి ఒకటే
పలికే మాట ఒకటే,బతికే బాట ఒకటే
పిలిచే పేరు ఒకటే,నడిచే తీరు ఒకటే
స్పందన ఒకటే ,పొంతన ఒకటే
ఆకలి ఒకటే ,దాహం ఒకటే
దేహం ఒకటే,దైవం ఒకటే
అన్నీ ఒకటే,అంతా ఒకటే
ఒక ఒకటి ఒకటే

కాదనగలవా నే చెప్పిన ఈ సత్యాన్ని
కనులు తెరుచుకో వదిలేసి స్వప్నాన్ని

"ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరోయ్"అన్నాడు శ్రీ శ్రీ
"మన వెనక పుట్టిన మతం కాదోయ్ మనిషిలోని గుణం చూడవోయ్ "అంటున్నాడు ఈ ఇమ్రాన్ శాస్త్రి!

స్వర్నలత || పరిచయం ||


నీ పరిచయం
ఓ అందమైన ప్రమదావనం
ప్రతి ఉషొదయం అరుణిమ వర్నంతో
...
ఆరంభమై కనపడుతుంది............

కానీ నా జీవనయానం లో
ఉషస్సులనేవి మిగల్లేదు
పక్షుల కూజితాలతో శ్రావ్యంగా గానం చేసే
కోయిలతో ఆరంభమవదు

నీ సాంగత్యం లో నేను ఆద్యంతాలు లేని
ఓ తరంగిని లా ప్రవహిస్తుంది......
కనీ ఇప్పుడు నీ ప్రేమ
ఆకు పై జారే నీటి బిందువు
..........
ఎందుకు నా పై ఇంత కక్ష్య
నీవు లేని నెను
నిషీధమైంది నా జీవితం
...............
నీ తలపు నన్ను సమీపించగనే
ఎర్రెర్రెని సిగ్గు తెరలు ముంచుకొచె
మరుక్షణమే అవి దటం గా
కమ్ముకున్ని వచె
......అది ఓ దుస్స్వప్నం...........

కర్లపాలెం హనుమంత రావు ॥ అగ్గిపుల్లలు ॥


1
లేటెస్ట్ వంటకం
____________
ఓ లీటరు ప్రేమకు
రెండు లోటాలు అనురాగం, అనుమానం కలగలిపి
చెంచాడు శృంగారంతో
సెంటిమెంట్ల సెగన సన్నగ్గా ఉడకనిచ్చి
ఆనక అపార్థాల పోపు పెట్టి
చల్లారకముందే
కాసిన్ని త్యాగాలు
కడివెడు కన్నీళ్ళు కలిపి
గ్రైండర్లో రుబ్బేస్తే
టీవీ సీరియల్..అంతే!2
కేపిటలిష్ట్
--------------------
సంపాదించిందంతా
స్టీలేజి సేఫుల్లో కుక్కి
ఎవరికీ అందకుండా
ఎత్తుగా దాచుకుందామనుకుంటే
తలకాయలు తెగ్గొట్టి
మరీ పట్టుకుపోతారని
తెలీని
కేపిటలిస్టు
కొబ్బరిచెట్టు3
కవిగారి సేవ
---------------
బహుకాలం శ్రమకోర్చి
బహుగ్రంథ పఠనమొనర్చి
పాపం
రాశారుట కవిగారు
పురాణాలసారాన్ని
బృహత్తర గ్రంథంగా
ప్రయోజనం లేదనకండు
పనికొచ్చును అది భలే తలదిండు
4
నాదేశం
---------
ఆకాశం నిండా తారలే
ఐనా వెలుగు లేదు
నా దేశం నిండా మేథావులే
ఐనా భావి చేదు5
ఆపేక్ష సిద్ధాంతం
-------------------
బోయవాడికి పావురాయి
మీద ఎంత ఆపేక్షో!
నూకలు చల్లుతున్నాడు
నాయకుడికి
ప్రజల మీదా
అంత ఆపేక్ష
రూకలు చల్లుతున్నాడు6
భలే బడి
-----------
ఈ దేశంబళ్ళో
చదువేందిలా ఉంది సారూ!
ఎన్నేళ్ళు గడిచినా
ఎవళ్ళ తరగతుల్లో
వాళ్ళే వున్నారు!7
చాయిస్
---------
న్యాయం
ధర్మం
చట్టం అంటూ
లేని వాడి వైపున్నావా
సెంట్రల్ జైల్లో
అరదండాలే
అన్యాయం
అధర్మం
దౌర్జన్యం
ఐనా
ఉన్నవాడివైపున్నావా
సెంట్రల్ పార్లమెంటులో
పూలదండలే!

(నా 'అగ్గిపుల్లలు' మినీకవితల సంకలనం నుంచి కొన్ని.మొదటిది మినహాయింపు.
-రచనా కాలం/1980-అప్పటి ఆంధ్రజ్యొతిలో ప్రచురితం)

శ్రీ రామ్ // జ్ఞానానుభవం //


మూడు పగళ్ళు – మూడు రాత్రులు
ఏకధాటిగా పనిచేసినప్పుడు
పగలూ రాత్రీ వేరు కాదని తెలుసుకున్నాను
కాల స్వరూపంలో విభజనలేని స్థితిని అనుభవించాను

ఏడు పగళ్ళు – ఏడు రాత్రులు
జ్వరపీడిత గాఢ సుషుప్తిలో
గడిపినప్పుడు
మానవ చేతనను అతి పలుచనిదిగా, అతి బలహీనమయినదిగా గుర్తించాను
జీవితం మరణం ఒకటేనని గ్రహించాను

పౌర్ణమి వెన్నెలలో వెండి సముద్రపు అనంత సౌందర్యంలో
కాలాతీతమైన దానిని క్షణమాత్రంగా దర్శించినప్పుడు
సృష్టికి అభేదంగా నా ఉనికి కరిగిపోవడాన్ని గమనించాను

కాని
ప్రతి జ్ఞాన శకలం తామరాకు మీది నీటి బిందువులా
హృదయానికి అంటకుండా ఎందుకు జారిపోయిందో
ఎంత ఆలోచించినా తెలుసుకోలేకపోయాను

చాలా ఏళ్ళు గడిచాకా, వృద్ధాప్యంలో ఒక రోజు
నాలో జ్ఞానపు ముసుగులో రహస్యంగా దాగివున్న అజ్ఞానిని చూసాను
అతన్ని తొలిసారిగా నగ్నంగా చూసాను
నిస్సిగ్గుగా దాక్కొని ఉన్న అతన్ని చూసాను
అతన్ని చూడకుండా జీవితాన్నంతా జ్ఞాన శోధన అని నేను భావించిన దాని కోసం
ఎలా వ్యర్ధం చేసుకున్నానో తెలుసుకొని విలపించాను

ఇదే నా తొలి జ్ఞానానుభవం

11-09-2012

చంద్రశేఖర్ వేములపల్లి || సహజీవనం ||


అక్షరాల్నీ పదాల్ని వెదుక్కుంటున్నా
గుండె నరాల స్పందనకు రూపం ఇవ్వాలని
నీ అడుగుల అద్దుల్లో పువ్వునవ్వాలనుకుంటున్నా
నీతో మాధుర్యం నిండిన పదాల్లో చెప్పాలనికానీ ...

మాధుర్యంలేని మోటు పదాల్నే మేదడు ప్రసవిస్తుంది
ప్రియనేస్తమా! నువ్వంటే నాకిష్టం
నిన్నే మనసారా ప్రేమిస్తున్నా అనిమరణశయ్యమీద నేనున్నప్పుడు
నా పక్కన నిన్నే చూడాలని
నాకు నేనిచ్చుకునే బహుమానం నీతో సహజీవనమేనని
జీవించేప్పుడూ ... జీవి శరీరాన్నొదిలి వెళ్ళినప్పుడూ


దేవుడు కరుణించిన వరానివి
నా జీవన వర్తమానానినివి ... నా ఆశల భవిష్యానివి
చిక్కని చీకటి ... అగమ్యగోచరం
జీవనావస్థలో వెలుగు కిరణానివి నీవే అని


అందమైన చిరునవ్వు ను స్వాగతిస్తూ
నేను నిద్రలేపే నా ఉదయరాగానివి ... హృదయభావానివి అని చెప్పే
అక్షరాల్నీ పదాల్ని ... వెదుక్కుంటున్నా
గుండె నరాల స్పందనకు అక్షర రూపం ఇవ్వాలని

శ్రీనివాస్ ఎల్లాప్రగడ "కలాంతం"


కలగను..కలగను
ఇంకెన్నాళ్ళులే..
మెలకువకు వేళయ్యింది
చైతన్య కిరణాలకు
భూమంతా ప్రకాశించే
వేళ దగ్గరకొచ్చిందిలే..

కలగను..కలగను
ఇంకెన్నాళ్ళులే..
ఙ్ఞాన వర్ష తాకిడికి
అరిష్డ్వర్గ పొరలు చీల్చుకుని
సత్యం చిగురించే రోజెంతో దూరం లేదులే..

కలగను..కలగను
ఇంకెన్నాళ్ళులే..
బ్రహ్మానంద పవనాల తాకిడికి
మనసు దుప్పటి ఎగిరి పడి
జన్మజన్మల వాసన బధ్ధాకాల్ని
విదిలించి పారేసి
ఉషస్సు వైపు పరుగులెత్తే
సమయం ఆసన్నమయ్యందిలే

ఇంకెన్నాళ్ళు?
ఇదే సరి అనుకుని
ముందుకెళ్ళడం మరచి
ఉన్నచోటే పాతుకు పోయి
నీకు కదిలే శక్తిచ్చాడని మరిచి
నువ్వు కంటున్న కలలు..
కలగను..కలగను
ఇంకెన్నాళ్ళులే.. 10SEP12

జగద్ధాత్రి || మృత్యు భాష ||

యుగాలుగా నన్ను అనుభూతిస్తూనే ఉన్నారు
పంచేంద్రి యాలతోనూ
జ్ఞానేంద్రియం తో నూ
నన్ను మీ ప్రతి భావనలోనూ
రంగరిస్తూనే ఉన్నారు
మీ కోపాలు , తాపాలు
మీ ప్రియతముల విరహాలు
మీ దుఖాలు ,సంసారాలూ
అన్నిటికీ నన్నో ఉపమానంగా
ఉత్ప్రేక్షగా, అలంకారంగా
అభివ్యక్తీ కరిస్తూనే ఉన్నారు
మీరు అక్షర జ్ఞానులు రాయగలరు
నన్ను పదాలలో , పద్య పాదాలలో ఇమడ్చ గలరు
ప్రతీకగా ప్రయోగాత్మకంగా ప్రయోజనాత్మకంగా ఉపయోగించ గలరు
నాలోని రేగే బడబాగ్నులు నాలో రేగే ఆనందాలను
ఏవీ చెప్పలేని నేను నా అలల ఘోష లో
మీ పాదాలు స్పృశిస్తే ..నా భావోద్విగ్నత మీకు పట్టదు
మీ ప్రేయసి చిరు నవ్వితే నేను ఆనందంగా కనిపిస్తాను
అపురూపంగా వర్ణిస్తారుమీకు దిగులేస్తే
నాలోనూ మీకు మీ దిగులే అగుపిస్తుంది
మీ కన్నీళ్ళను,మీ ఆశలను,ఆనందాలను
అనాదిగా అర్ధంచేసుకుంటూనే ఉన్నా
నిరక్ష్య రాసురాలిని మరి
ఎన్నెన్ని సార్లో
నా భావాలని
నా ఆకాంక్షలని
నా ఆవేదనని
మీతో ఒక్కసారైనా పంచుకోవాలనే
తపనతో ఏమి చెయ్యాలో
ఎలా వ్యక్తీకరించాలో
ఎరుగక ఒక్కసారి గా
ఎగిసెగిసి పడి
ఉవ్వెత్తున ఎగిరి ...
మీ దరి చేరాలని
ఉత్సాహంతో ...
ఉరకలు పరుగులు గా వస్తానా............
కానీ మీరందరూ నన్ను
తిడతారు , వంచకి నంటారు
నా గర్భంలో ని నిధి నిక్షేపాలను
కొల్లగోట్ట్టినా అడగని నేను
మీ మాలిన్యాలను మోస్తున్న నేను
ఏ ఒక్కసారీ మిమ్మల్ని ప్రశ్నించని నేను
నా ఒక్కగానొక్క భావాన్నో
ఉద్వేగాన్నో , ఉల్లాసాన్నో
చాటాలని ప్రయత్నిస్తే
అందరు అప్రమత్తమై
నేనేదో ప్రమాద కారిణి లా
భయ పడి దూరం మరింత దూరంగా
పారిపోతారు ....
నిజమే నాకు తెలుసు
నా ఆనందమూ ,నా ఆవేదనా
రెండూ మీకు మృత్యువే
అయినా వ్యక్తీకరించక ఆగలేని తనం
మీకేనా .........
నాకు మాత్రం భావ స్వాతంత్ర్యం ఉండొద్దూ ...
అని పిస్తుంది ఎన్నో సార్లు
మీ ప్రేయసీ విరహాలుగా
మీ ఆనంద ఆహ్లాదాలుగా
మీ ప్రియుని ఎడబాటుగా
కష్టాలకు ఉపమానంగా
మృత్యువుకు ప్రతీకగా
చివరికి నా వడిలోనే తనువు చాలించే
మీలో ...మీతో
నేను మృత్యువును కానని
నాలోనూ అమ్మతనం ఉందని
ప్రేమార్నవ నా వర్ణాలను
బహు నీలాల రంగుల్లో
మీకు చూపిద్దామనుకుంటా...
నన్ను నేను మీతో ....
ఏ అరమరికలూ లేక ....
నన్ను నేను ఆవిష్కరించుకుందామని
నన్నపార్ధం చేసుకోవద్దనీ
చెప్పాలనుకుంటా....
నాకు వచ్చిన భాష ఒక్కటే
మరి ఏ భావానికైనా
ఉవ్వెత్తున పొంగడం
నా భాష మీ పట్ల మృత్యు భాష
కావడం నా దురదృష్టం.....
విమోచన లేని శాపం ..!!!

శోభ || జ్ఞాపకాల జడివాన జోరు తగ్గేదెలా.....!! ||


నా మది గదిలోనూ
ఇంటిగది బయటా
భోరున, జోరున ఒకటే వాన
జ్ఞాపకాల వాన
చినుకులుగా మొదలై.. జడివానై
అంతకంతకూ పెరిగిపోతూ
మదిగదిని ఉక్కిరిబిక్కిరిచేస్తూ
వరదలా ముంచెత్తుతోంది

పసితనపు వాన...
ఇంటి బయట చూరుకింద
ధారలు కట్టిన కాలువల్లో
అమాయకత్వపు పడవలు
హైలెస్సా అంటూ సాగుతుంటే
అల్లరి ఆనందాల కేరింతల వాన...

చినుకు చినుకు చిత్రంగా
అరచేతిలో నాట్యం చేస్తూ
అంతలోనే వేళ్ల సందుల్లోంచి
సుతారంగా జారుతుంటే
సందడిచేసే సంగీతపు వాన...

చూపులు, చేతులు కలిసి
ఒకటి రెండో భుజానికి ఆసరాగా
ఇరు మనసుల కలబోతలో
అంతేలేని మాటల జల్లులై కురిసేవేళ
ముసిముసి నవ్వుల ప్రేమవాన...

ప్రేమబంధం మాంగల్య బంధమై
మరుజన్మ ఎత్తితే
ఏకాంతపు లోగిలిలో
అనురాగపు ఆనందాల వెల్లువలో
సిగ్గుల మొగ్గ సింధూరపు వాన...

ముద్దు ముద్దు మాటలు
మురిపాల మూటలై
అమ్మానాన్నలని చేసిన
బుడి బుడి అడుగుల చప్పుడు
చిటపట చినుకుల నాట్యమైనప్పుడు
గుండెనిండా వాత్సల్యపు వాన...

రెక్కలొచ్చి ఎగురనేర్చి
గూడును, కన్నవారినొదిలి
కాలమనే కారుమబ్బులై
తుఫానులా తీరం చేర్చితే
జీవితపు మలిసంధ్య వాన...

మది గదిలో వాన...
చినుకులుగా మొదలై...
జడివానై, తుఫానై అలా తీరం చేర్చింది
వాన వెలసిన ఆకాశం స్వచ్ఛంగా
ఇంధ్రధనుస్సు వెలుగుల్ని విరజిమ్ముతోంది...

నీ ||"రానిక నీకోసం"||


"సరిగ్గా ఏడాదిక్రితం..
ఒంటరితనం నామీద అమాంతం దూకినగుర్తు..!

అప్పుడు

నా డైరీ పేజీల మడతల్లో
అట్టకట్టిన నీ నవ్వులు

ఇప్పుడు

కళ్ళనే జీవనదుల్లో..
సుళ్ళుతిరిగే కన్నీళ్ళు

ఎన్ని ఆత్మహత్యలపరిచయాల్లో అద్రుశ్యమయ్యావ్..!

కొన్ని..

కవిత్వం నిండిన కాగితాలు
బస్సులో నాపక్కన ఖాళీసీటు
అవుటాఫ్-సర్వీస్ సెల్ల్ నంబరు
నా దేహపు పొరల్నిచీల్చుకున్నా
లోపలలోపల తొవ్వుకున్నా
అవే అవే జ్ఞాపకాలు.

ఎన్ని నవ్వుల్ని కన్నీళ్ళుగా అనువదించావ్..!!

గుర్తు..

కారిడార్లో ఆరేసిన నీ తెల్లటి చుడీదార్,
"నే తొలిసారిగా కలగన్నది నన్నేకదా"
అబద్దాలకోరు డయలర్ టొన్
నన్నుకవిని చేసిన నీ మాటలు,
నేను బతికుండే తడిక్షణాలు.

ఎన్నింటిని దూరంచేస్తూ "దూరం"గా మిగిలావ్!
సమస్తం అనుకున్నవి ఇక అస్తమించాయి!

"జీవితపు ఖాళీగదిలో నాతోపాటు
కవిత్వం నిండిన కాగితాలు కొట్టుకుంటున్నాయి!"

........................."నీ"

("నిత్యగాయాల నది" జీవితంలో
ప్రతిగాయం నుంచి కాస్త కవిత్వాన్ని వొంపుకుంటూ...)

కన్నా రాజేష్ || జై మూల్ నివాసి ||


నువ్వు
పచ్చని వనాలు ఎన్ని కబలించినా-వసంతాన్ని
ఎన్ని కాల రాత్రులై పరుచుకున్నా - వుశోదయాన్ని
ఎంత అమావాస్య నిశివైనా - చంద్రోదయాన్ని
పిడికిట్లో పట్టి దాచేస్తే దాగని సత్యాలు
ఆకురాలినంత మాత్రానా
చెట్టు మోడై నట్టు కాదు
రాలిన ఆకులు చరిత్ర సాక్షాలు
వాటికింద చరిత్ర ఎపుడు
తడి తడిగా తగుల్తూనే వుంటుంది
మొడులు మల్లీ చిగురిస్తై
ఎప్పటికీ.... ఇంకా పచ్చగా....
11-9 -2012

కపిల రాం కుమార్ // ఎదురు చూపు //


చివురుకొమ్మల లేజివుళ్ళే - కోకిలమ్మకు పుట్టినిళ్ళు
లేగదూడల కాలె అందెలె పల్లె సీమకు ఆనవాళు!

కథలలోన కవితలోన అందమైన ఊహలోన
పల్లె చిత్రపు రంగులన్ని వెల్లి విరిసినరోజులేవి?

ఏవి తల్లీ నీళ్ళు నిండిన చెరువు కుంటలు
ఏవి తండ్రి పొంగి పొర్లిన పాడిపంటలు

వన్నె తప్పిన పంటకాల్వలు
చిన్న బోయిన చెరుకు తోటలు
కళలు తప్పిన జనపదం
నేటి పల్లెకు నిలువుటద్దం!

నిద్రలేచిన పల్లె గుర్తుకు ఆవలించే జాడలేవి?
ఇంటికోడలి చేతి గాజుల వెన్న చిలికే సవ్వడేది?

పాలనురగల పిడతలిడగ దాలిమండగ పిడకలేవీ
జడలుచుట్టిన గాదె నిండక కడుపు నింపే కూడుయేది?
అట్ల తద్దికి ఆట లేవి ?
చెట్టుకొమ్మన వూయలేది?
ఏరువాకకు పాటు లేవి?
గంగిరెద్దు గంతులేవి?

చిల్లుకుండలు వెక్కిరిస్తే విరిగిపోయిన మట్టిచక్రం!
వల్లకాటిలో కాలుతూ మూగవోయిన సాలెమగ్గం!
రాజకీయం రాకముందు ఏక చత్రపు గూండె ది్టవు
(నేటి) రంగురంగుల రాక్షసానికి చిద్రమైనది నిండుకొలువు!

సప్త పుత్రుల కధలు చెప్పి నిద్ర పుచ్చే తల్లి వేదన
తప్త హృదయపు వెతలు తొలగె స్వచ్చమైన బతుకు శోధన!
ఆత్మ హత్యల తోరణాలతో పర్వదినపు తర్పణాలను
పాటలోన రాయలేను శిరసునింక వంచలేను!

శాంతి శూన్యం జాతి దైన్యం రూపుమాపే రోజుకోసం !!
తిరుగుబాటు ఆదునుకోసం ఏదురు చూచె పల్లె వాసం!!!

11-9-2012.

శ్రీ |||||| గన్నేరుకు పుట్టిన వగరు...||||||


ఎప్పుడు నన్నేనా
ఆత్మహత్యకు సిద్ధమైనప్పుడు
ఆడపిల్ల పుట్టినప్పుడు
ఎవరినైనా హతమార్చేటప్పుడు
నిజమే నా గుణం విషమే
నిజమే నా మనుగడ మరణమే
అది నా తప్పు కాదు నా తత్వం
అది నా పొరపాటు కాదు నా గ్రహపాటు
ప్రకౄతికి నాకూ చెడి తన గెలుపుకు
నా ఓటమిని ఇలా కాలకూటంతో బలి తీసుకుంది....

నా ప్రయోజనం ప్రాణంతకమని తెలిసినా
మీలో కొందరు ఇచ్చే ప్రోద్బలంతో
నేనింకా చావకుండా చాలా మందిని చంపుతున్నాను,
నాకూ బ్రతకాలని ఉంది కాని
పరుల ప్రాణాలను బలి తీసుకుంటూ
పాపాలను మూట కట్టుకుంటూ
బ్రతికే బ్రతుకు నాకొద్దు...
నవ ధాన్యాలు నాతో స్నేహానికి
ససేమిరా అంటున్నాయ్,
వాటిలా నాకు రుచి ఉండాలి
వాటిలా నేను ప్రతి నోటికి జిహ్వ తీర్చాలి...

గన్నేరు అనే పదానికి ప్రతిపధార్ధం
విషమే ఐతే నాకొద్దు ఈ నామం
గన్నేరును చుసి భయం అసహ్యం కలుగుతుంటే
నాకొద్దు ఈ రూపం
దయ చేసి దహనం చెయండి నన్ను,
నొప్పికి భాదపడను,
నా ఉనికి వేరొకరి ఉనికికి చేటు ఇక అవ్వబోతున్నందుకు ఆనందంగా
వెల్తాను మరో నరకానికి....

కాంటేకార్ శ్రీకాంత్ // అచ్చమైన స్వచ్ఛమైన మనిషి //


నా హృదయంలోని కొన్ని భావాలు ఒలుకుతాయి
అక్షరాలు ఒకచోట చేరి పదాలవుతాయి
నా భావాలకు ఒక రూపాన్నిస్తాయి
నన్ను స్వచ్ఛంగా చూపే ప్రయత్నం
ముసుగు తొలగించి
గజిబిజి జీవిత పరుగులాపీ కొన్ని క్షణాలు మీతో పంచుకునే తాపత్రయం
కాగితంపై చేరిన అక్షరాల్లో లీలామాత్రంగా నైనా నేను అచ్చం నాలాగే ఉంటాననే ఆశ
అందుకే ఈ అక్షరాలను పోగేసి
నన్ను ప్రదర్శనకు పెట్టాను
యద లోలోపల ఏదో మూలకు భయం భయంగా నక్కిన నన్నులేపి మీముందు నిలిపాను
సమాజ పరిమితులు.. ఎవరో విధించిన కట్టుబాట్లు
పెరిగిన వాతావరణం నేర్పిన సంకుచిత భావజాలం
డౌట్ లేదు.. ఈ సమాజం తనకు అనువుగా మలుచుకున్న తోలుబొమ్మను నేను
కొన్ని పరిమితులకు లోబడి స్పందిస్తాను
అందరిలాగే నేనూ నటిస్తాను
అందరినీ అనుకరిస్తూ
కొందరిపై గౌరవం నటిస్తూ
ఇంకొందరి నుంచి తప్పుకుంటూ
ఎందరెందరికో దూరంగా ఉంటూ
ఏమీ పట్టనట్టు
తెలిసీతెలియనట్టు
ఉండీ లేనట్టు
నా మానాన నన్ను బతకమంటూ
నా నరనరాల్లో నూరిపోస్తోంది ఈ సమాజం
కులాల రొచ్చులోనో
మతాల ఉచ్చులోనో
బతుకు వెళ్లదీయమంటోంది
అడుగడుగునా హద్దులు
దాటిరావద్దనే సంకెళ్లు
కొన్ని బలవంతపు నవ్వులు
మరికొన్ని నాటకాలు..
అన్నింటినీ అధిగమించు
అక్షరాల్లో దూరినప్పుడు
నేను కనిపిస్తాను
లీలామాత్రంగా అయినా మనిషిలాగా
ఈ మహా జనారణ్యంలో ి మనసుతో పోల్చుకుంటే ఎప్పడోసారి ఎదురయ్యే అచ్చమైన స్వచ్ఛమైన మనిషిలాగా
www.naachittiprapancham.blogspot.in/2012/09/blog-post_10.html?m=1

పీచు శ్రీనివాస్ రెడ్డి || నాకింకా యాదుంది ||


నాకింకా యాదుంది
కీసలో దాచుకున్న
అమ్మ ఇచ్చిన బెల్లం ప్యాలాల లడ్డు తీపి 

***

నాకింకా యాదుంది
నా లాగు రెండు తూట్లతో
దునియా చూస్తుంటే నవ్వినా కండ్లేవో 

***

నాకింకా యాదుంది
గుడ్డి దీపం సాక్షిగా
గావురంగా నాయినమ్మ ఇచ్చిన మామిడి పండు
యెంత ప్రేమగా పండిందో .

***

నాకింకా యాదుంది
పెరుగు గట్క పెట్టిన దోస్తు
పొద్దుగాల వయసుకే పోద్దీకుతే
నా కండ్లల్ల కదిలిన దుక్కం 

***

నాకింకా యాదుంది
ఇస్కూల్ల నా యాసనెక్కిరించిన
టీచరమ్మ నవ్వు 

***

నాకింకా యాదుంది
దొడ్డికాడ
బాగా సదువుకున్న బందూకు పట్టుకున్న గడ్డ పోడి ముఖం 

***

నాకింకా యాదుంది
పొలంకాడ
పాలేరు తిన్న తొక్కు మెతుకుల వాసన

***

నాకింకా యాదుంది
తాతెంబటి పోతుంటే
కులం తోకను చూసి
పక్కకు జరిగి తల దించుకున్న మనుషుల చూపు 

***

నాకింకా యాదుంది
తుమ్మ చెట్టుకు కారిన బంక
తియ్యంగ చప్పరించింది
గందుకేనేమో గురుతులన్నీ అతుకున్నై గుండెల్లో

11-09-2012

క్రాంతి శ్రీనివాసరావు || మధ్య పర్వం ||


మధ్య తరగతి మనుషులం మేం
రెండు విసుర్రాళ్ళ మధ్య
పెసర గింజల్లా పగిలిపోతుంటాం
విధి లేక క్రింది రాయు పక్కనే వొరిగిపోతుంటాం


తాత తాతెవరో తెలియకున్నా
వంశ వైభవాన్ని వర్ణిస్తుంటాం

వంటినిండా పులుముకున్న
ఇంటి పేరును
ఏపలుకుబడి వున్నోడితోనో
అంటుగట్టి ్
ఆశల చిగురులు తొడుక్కుంటాం

మూడడుగులే వున్నా
తాత పొడవు ఆరడుగులంటాం
తప్పులేమన్నా వుంటే
తల్లిగారింటికి తగిలిస్తుంటాం

పరువూ ప్రాణం తూకం వేసి
పరువే బరువై
ప్రాణాలు వదిలేస్తుంటాం

కస్టాలన్నీ మామీదే కురుస్తుంటాయు
కన్నీళ్ళ చిరహ్ పుంజీ గా
కాపురాలు సాగిస్తుంటాం

కిందకు దిగలేక
పైకి ఎగరాలని ప్రయత్నిస్తుంటాం
ఎగసిన ప్రతీసారీ
కడలి కెరటాల్లా
కూలిపడుతూనేవుంటాం

గతం లో ఈదులాడుతూ
భవిశ్యత్తును దర్పణం లో చూస్తుంటే
వర్తమానం పరావర్తనమై
ఆర్తనాదాలను ఆశ్రయుస్తుంటాం

గ్లోబల్ గుహలో
రెక్కలు విరిగిన పక్షులమై
రాలి పడుతున్నాం
మధ్య తరగతి ఇప్పుడు
మిథ్యా తరగతిగా మార్పు చెందుతోంది

చింతం ప్రవీణ్ || ఆమె ||

ఉదయం ఐతే కొందరికి
సంతోషం ఉదయిస్తుందేమో!
రాత్రి ఐతే ఇంకొందరికి
బాధలు అస్తమిస్తాయేమో!

పగలు రాత్రి తేడాలేదు
ఆమె ప్రతీక్షణం అస్తమిస్తూనే ఉంటుంది

ఋతువులెన్ని మారినా
ఆమెలో మార్పుండదు
జీవితమంతా ఆమెకు ఆకురాల్చు ఋతువే

ఆమె నవ్వు ఆమెకోసం కాదు
ఆమె అందం ఆమెకోసం కాదు
నిజానికి
ఆమె ఆమె కోసం కాదు

ఆమె పంచుతున్నసుఖానికిలాగే
ఆమె స్వేదానికి
ఆమె కన్నీళ్ళకు గురుతుళ్ళేవ్

విలువలు లేని మనుషులు
వలువలు లేని మాటలతో
ఆమెను అంగడిబొమ్మంటు గేలిచేస్తారు...

సృష్టి ఆమెను బహిష్కరించిందో
ఆమెనే సృష్టిని బహిష్కరించిందో ఏమోగాని
రహస్యశృంగారపు బంధితజీవన్మరణ క్రీడలో
ఆమె ఎప్పటికప్పుడు దేహాన్ని విసర్జిస్తూనే ఉంటుంది
ఆమెది కోల్పోవడం అనివార్యమైన జీవితం

పచ్చనినోట్లతో పచ్చిగా ఆమెను తడమగలమేమో గాని
ఎన్ని రాసులుపొసి ఆమె మనసును తాకగలం

స్వేదం కన్నీళ్ళు నెత్తురు ఆవేదనే ఆమె నేస్తాలు
ఆమెకు కలలు లేవు కన్నీళ్ళే
అరే! ఎందరికి తెలుసు ఆమె మనసు?

ఆమె కడుపు కోసం పడుపైంది గాని
పడుపు కోసమే కడుపు గడప దాటలేదు

ఎందరు వెంబడిస్తారో
ఇంకెందరు నిష్క్రమిస్తారో
ఎన్ని వసంతాలు కరిగిపొతాయో
ఎన్ని కనీళ్ళు నదులై పారతాయో
ఎన్ని స్వప్నాలు ఆత్మహత్య చేసుకుంటాయో
దీపం వెలుగుతున్నంత కాలం
ఆమె ఓ ఆరిపోని దీపం

ఆమె ఊరిడ్సినా
ఆమెను ఊరిడ్సిపెట్టదు
ఆశగా ఆమెవైపే చూస్తుంటుంది...

10.09.2012

Prav Veen // గాయం... //

ఎన్నని చెప్పాలే ఏమని చెప్పాలే.ఒక గాయమైతే మరచిపోవచ్చు.కండ్లుతెరిచిన గడియనుండి రోజు నిష్క్ర్రమించేదాక గాయాల మీద గాయాలు.నిలువెల్లా గాయాలే దేహమౌతున్నవాణ్ణి.ఒకటా రెండా విరిగిన లాఠీలు ఎక్కిదిగిన ఠాణాల మెట్లు లెక్కేలెవ్వు.అయినా నాకు ఇబ్బందేంలేదు.గాయలదేముంది.ఓ వైపు ప్రాణాలకు ప్రాణాలే అవలీలగా ఉద్యమానికిచ్చిన నాతోటి విద్యార్థులు జనాలు.వీళ్ళ త్యాగాల ముందు నాకైన ఈ గాయాలేపాటివి.నేనేనా గాయపడింది.తెలంగాణకు తెలంగాణానే ఓ మానని గాయం.ఒడవని దుఃఖం.ఐతే గాయాలు మాకు కొత్తేం కాదు.సూర్యుడు రోజు ఉదయించడం వింతేం కాదు కనిపించకపోతే కదా వింత అమావాస్యా!నాకు ఐన ఈ గాయాలు ఎంత. నిజంగా గాయాల వల్ల నేను గాయపడలేదు.బిడ్డా ఒళ్ళంత నెత్తురుముద్ద చేసుకుంటివి ఎట్ల ఉండేటోనివి బిడ్డా!తెలంగాణ తెలంగాణ అంటివి అని అమ్మ ఏడ్చినప్పుడు నిజంగా గాయపడుతున్నా.గాయాలను త్యాగాలను కుప్పగా పోసి డబ్బులసంచుల్ని ప్రాజెక్టుల్ని మోసుకొచ్చిన సోకాల్డ్ రాజకీయ ఉద్యమకారులను చూసి మళ్ళీ మళ్ళీ గాయపడుతున్నా.నేనే కాదు 60ఏండ్లసంది త్యాగాలే వారసత్వంగా తీసుకుంటున్న నాలాంటివాళ్ళను చూసి తల్లీ తెలంగాణం నెత్తురు స్రవిస్తోంది కన్నీళ్ళకు బదులుగా.ఐతే గాయమెప్పుడు గాయంలా ఉండదు.గాయం పోరాటానికి సమాయత్తం చేసే ఓ సిగ్నల్.ఓ మెసేజ్.ఇప్పటిదాకా నేను ఓడిపోవచ్చు కాని నా గాయం ఎప్పుడూ నన్ను సిద్దం చేస్తుంటుంది విజయం కోసం పోరాడమని.గాయం ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే కాదు...కొత్త బతుక్కు దారి చూపించే ఓ దిక్సూచి...

వంశీ // మోడస్ ఒపెరాండి //

నాకు ఏ బాదా, నొప్పి ఉండదెందుకో
తెల్లటి పావురాల తలలు తెంచి రక్తం పారిస్తుంటే,
నాకు ఏ దుఃఖం, వేదనా అనిపించవేమిటో
ఓ మనిషో మనసో నలిగినా విరిగినా
ఓ తరువో గిరులో కాలినా కూలినా,
నాకేం కానంతవరకు,
నాదేమీ పోనంతవరకూ,

నాకే కోపమూ అసహ్యమూ రాదేమిటో
వ్యభిచారులూ అరాజకీయులన్నా
తాగుబోతులూ మోసగాళ్ళూ ఐనా,
ఎంతకష్టమో నిజంగా
సమాజం ఒప్పని పనులు చేస్తూ
జనాలు మెచ్చని కలల్ని చూస్తూ

విలువలూ ఆచారాలూ
ఒడ్డునుండి కడుపునిండినోడికే,
తెప్ప దొరకక కొట్టుకుపోయేవాడి
ఆకలి ఆశలు ఆరాటం పోరాటం
వాడిదైన ప్రపంచాన్ని బ్రతికించుకుని
వాడివవని ప్రమాణాలతోనిత్యం ప్రయాణించడానికేగా..

నాకే ఆవేశమూ ఆలోచనా కలగవెందుకో
కవులు జీవితాన్ని రాయక ఊహల్లో తేలితే,
రాసినట్టు జీవించక వైరాగ్యంలో మునిగితే,
అవునూ, కవీ నాలాంటి మనిషేగా

నాకే అపరాధభావనా, ప్రాయశ్చిత్తపు
పరిహారాలమీదా నమ్మకం రాదెందుకో
రజస్వలించిన చీకట్లో ఇంద్రియాల్ని సంతృప్తీకరించి,
కామరూపుడినై కలుషితాలోచనలతో స్థలకాలాలనోడించి
ఐదో పరిమాణపు నీడల చిరుగుల్లోంచి
ఆత్మనొదిలిన శరీరాల చెమటతో తడిసిన
అంగాలు స్పృశించి అమరుణ్ణవుతుంటే,

నాకే భయమూ బంధాల బడలికా ఉన్నట్టనిపించవు
రేపే మరణిస్తానన్నా,
లోకపు చూపే మారిపోతుందన్నా,

నేను నిర్దేశించుకున్న, నాకు మాత్రమే తెలిసిన
గమ్యం చేరే వడిలో
నేను ఉద్దేశించుకున్న, ఎప్పటికైనా అధిరోహించే
శూన్యం కనిపించేవరకు
నేనిలాగే ఉంటాను
నన్నలాగే అనుకోమంటాను

9.11.12 ( తాలిబన్లు కూల్చిన W.T.C లో, చనిపోతామని తెలిసాక ఆ మనుషుల మానసిక స్థితి గుర్తొచ్చి)