పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

జ్యోతిర్మయి మల్ల - కవిత

పుత్రోత్సాహం


" చూడవే మనబాబు ఎంతముద్దొస్తున్నాడో ! "
పట్టలేనంత ఆనందం
పసికందుని చూసినపుడు

"వీడెంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూసావూ?"
అత్తా తాతా తొలిపలుకులే
వేదాల్లా వినపడినపుడు
"అరె, నా దిష్టే తగిలేలా ఉందే !
తోటిపిల్లలతో పోలిస్తే వీడే అందంగా ఉన్నాడు కదూ! "
తన ఉత్సాహాన్ని
భార్యతో పంచుకుంటున్నపుడు

"మావాడికి బ్రహ్మాండమైన ర్యాంకు వచ్చింది"
తొణికిసలాడే గర్వంతో
ఆఫీసులో స్వీట్లు పంచిపెడుతూ
"ఎంత టీవి, ఏమి దర్జా. మగవాడంటే ఇతడే కదా"
పట్టలేని సంతోషం
అతన్ని ఉద్యోగస్తుడిగా చూస్తూ

"మనవాడు పెళ్ళికొడుకుగా ఎంత బాగున్నాడో కదూ !
ఇంత ముచ్చటగా మునుపెవర్నైనా చూసామా?"
"నా కన్నతండ్రి అప్పుడే ఇద్దరు పిల్లలకు తండ్రయాడా ?
ఎంత హుందాతనం తండ్రిహోదాలో!"
"మనవాడు కాబట్టి ఇంత గొప్పగా కట్టించగలిగాడు
ఇంత అందమైన ఇల్లు దరిదాపుల్లో ఉందా?"

ఇలా...
ఒకటేమిటి? అడుగడుగునా సంభ్రమమే
నాకు వాడి ప్రతి కదలికా సంబరమే
మొన్నటివరకూ..
ఇప్పుడిక మురిసిపోవడానికి ఇక్కడేమీ లేదు
కలిసి నెమరేసుకోడానికి ఆమె కూడా లేదు
నాచుట్టూ నాలాంటి నాన్నలే
వాళ్ళకొడుకులూ మావాడిలాగానే

అమెరికాలోనో..ఆస్ట్రేలియాలోనో.. !
*5.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి